Afghan Press Meet Controversy: మా పాత్ర ఏమీ లేదు.. అప్ఘాన్ ప్రెస్ మీట్‌పై కేంద్రం వివరణ
ABN , Publish Date - Oct 11 , 2025 | 04:35 PM
అప్ఘాన్ మంత్రి ప్రెస్ నిర్వహణలో తమ పాత్ర లేదని భారత విదేశాంగ శాఖ వివరణ ఇచ్చింది. ప్రెస్ మీట్‌లో మహిళా జర్నలిస్టులు లేకపోవడంపై విమర్శలు తలెత్తిన నేపథ్యంలో విదేశాంగ శాఖ ఈ ప్రకటన చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: అప్ఘానిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి ముత్తకీ పాల్గొన్న ప్రెస్ మీట్‌కు మహిళా జర్నలిస్టులను అనుమతించకపోవడంపై వివాదం రేగుతోంది. ఈ వివాదంపై తాజాగా కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈ పత్రికాసమావేశం నిర్వహణలో తమ పాత్ర ఏమీ లేదని స్పష్టం చేసింది.
ఈ పత్రికా సమావేశానికి సంబంధించి అహ్వానాలు ముంబైలోని అప్ఘాన్ కాన్సుల్ జనరల్‌లో గల కొందరు ఎంపిక చేసిన జర్నలిస్టులకు అందాయని విదేశాంగ శాఖ తెలిపింది. ఎంబసీ పరిసరాలు భారత ప్రభుత్వ పరిధిలోకి రావని కూడా స్పష్టం చేసింది (MEA on Afghan Press Meet Controversy).
అప్ఘాన్ మంత్రి ప్రెస్ మీట్‌లో మహిళా జర్నలిస్టులు ఎవరూ కానరాలేదు. పత్రికా సమావేశానికి వెళ్లేందుకు ప్రయత్నించిన కొందరు మహిళలను కూడా అడ్డుకున్నట్టు వార్తలు వచ్చాయి. దీంతో, సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. మహిళా జర్నలిస్టులందరూ గౌరవప్రదమైన డ్రెస్ కోడ్‌నే అనుసరించినా వివక్ష ఎందుకని కొందరు నెట్టింట ప్రశ్నించారు.
తాలిబాన్‌ల పాలనలో అప్ఘాన్ మహిళలు తీవ్ర అణచివేత ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. విద్య, ఉద్యోగం, రాజకీయ రంగంలో మహిళలపై అక్కడ తీవ్ర ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితిపై ఐక్యరాజ్య సమితి కూడా ఆందోళన వ్యక్తం చేసింది. మానవ హక్కుల ఉల్లంఘనలు సంక్షోభస్థాయికి చేరుకున్నాయని పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
భారతీయ స్టూడెంట్ రాకపోతే మన భవిష్యత్తుకు ఇబ్బందే.. అమెరికా బిలియనీర్ హెచ్చరిక
అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్యలో తగ్గుదల.. దాదాపు సగానికి పడిపోయిన వైనం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి