Illicit Liquor: కువైత్‌లో కల్తీ మద్యం తాగి 13 మంది మృతి
ABN, Publish Date - Aug 14 , 2025 | 03:29 AM
కువైత్‌లో కల్తీ మద్యం సేవించి 13 మంది మరణించారు. వారిలో నలుగురు ఆంధ్రులు ఉన్నట్టు సమాచారం..
మృతుల్లో నలుగురు ఆంధ్రులు.. 21 మందికి శాశ్వత అంధత్వం
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: కువైత్‌లో కల్తీ మద్యం సేవించి 13 మంది మరణించారు. వారిలో నలుగురు ఆంధ్రులు ఉన్నట్టు సమాచారం. జ్లీబ్‌లోని ఒక ప్రాంతంలో శనివారం కల్తీ మద్యం సేవించి 63 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 40 మంది భారతీయులు ఉన్నట్టు కువైత్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. అస్వస్థతకు గురైన వారిలో బుధవారం నాటికి 13 మంది మృతి చెందారని, 21 మంది శాశ్వతంగా చూపు కోల్పోయారని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. బాధితులు ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో చికిత్స పొందుతున్నారని, 31 మంది వెంటిలేటర్‌పై ఉన్నారని బాధితుల సంఖ్య మరింత పెరగవచ్చని పేర్కొంది. మరణించిన వారిలో నలుగురు ఆంధ్రులు ఉండగా, వారిలో ఒకరిని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మిగిలిన ముగ్గురి వివరాలు తెలియాల్సి ఉంది. భారత రాయబార కార్యాలయ అధికారులు ఆస్పత్రులకు వెళ్లి చికిత్స పొందుతున్న భారతీయుల ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. వారికి మెరుగైన చికిత్స అందేలా కువైత్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులతో చర్చించారు. కాగా.. చికిత్స పొందుతున్న భారతీయ పౌరుల కుటుంబ సభ్యులు రాయబార కార్యాలయాన్ని సంప్రదించేందుకు వీలుగా +965 65501587 నంబరుతో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు.
Updated Date - Aug 14 , 2025 | 03:29 AM