ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ ఆరోగ్యానికి రంగుపడుద్ది..

ABN, Publish Date - Jun 29 , 2025 | 11:01 AM

ప్రకృతి వర్ణ శోభితం.. మన ఆహారం కూడా అంతే వర్ణ వైవిధ్యమైనది!. ఆరోగ్యానికి రంగులు కచ్చితంగా అవసరం. అందుకే కలర్‌ఫుల్‌ ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, ఎండుఫలాలను ప్రసాదించింది మట్టితల్లి.

ప్రకృతి వర్ణ శోభితం.. మన ఆహారం కూడా అంతే వర్ణ వైవిధ్యమైనది!. ఆరోగ్యానికి రంగులు కచ్చితంగా అవసరం. అందుకే కలర్‌ఫుల్‌ ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, ఎండుఫలాలను ప్రసాదించింది మట్టితల్లి.

కానీ మనం ఆ సహజత్వాన్ని మరిచిపోయి.. కృత్రిమత్వం వైపు వెళ్లిపోయాం. ప్రకృతి ప్రసాదించిన రంగుల్ని వదిలేసి విషపూరితమైన కృత్రిమ రంగులను తిండి పదార్థాలలో కలుపుకొని తింటున్నాం. ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా కృత్రిమరంగుల వాడకం విపరీతంగా పెరిగింది... అవెంత ప్రమాదకరమో చూద్దాం..

హోటళ్ల బయట దోరగా ఎర్రగా కాల్చిన చికెన్‌ కబాబ్‌ను చూడగానే... పక్కన బైక్‌ ఆపి తినందే బండి ముందుకెళ్లదు.

శాకాహారులైతే.. మాంచి రంగు మీదున్న గోబీ మంచూరియానైతే అస్సలు వదలరు.

ఇక, సూపర్‌మార్కెట్‌లకు వెళితే చాలు.. అందంగా పేర్చిన కాటన్‌ క్యాండీలు, లాలిపాప్‌లు, జెమ్స్‌, చాకొలెట్లు, టాపీస్‌, కేకులు, పిప్పర్‌మెంట్స్‌, డోనట్స్‌, బబుల్‌గమ్స్‌, బిస్కెట్లు.. ఆ పక్కనే ఫ్రీజర్లలో నిల్వచేసిన ఐస్‌క్రీమ్‌లపైనే ఉంటుంది పిల్లల ధ్యాసంతా!.

వీధుల్లో వెళుతున్నప్పుడైతే అరకిలోమీటరు దూరం నుంచే జిలేబీ కాలుస్తున్న వాసన తరుముకొస్తుంది. నాలుకను కట్టేసుకుని ఎంత వెళ్లిపోదామనుకున్నా.. ఆ జిగేలు మనిపించే జిలేబీ రంగును చూసి పడిపోక తప్పదు. ఇలా.. ఒకటా.. రెండా! ఇంటి నుంచి బయటికొస్తే చాలు.. ప్రపంచంలోని తిండిపదార్థాలన్నీ రంగుల్లో ముంచి తీశారా.. లేదంటే కేవలం రంగులతోనే ఐటమ్స్‌ను తయారుచేశారా? అన్న సందేహం కలుగుతుంది. ఆ రంగుల తిండి అమాంతం ఆకర్షిస్తుంది. తిను తిను తిను అంటూ మెదడును ప్రేరేపిస్తుంది.

రెస్టారెంట్లలోని చికెన్‌ 65 దగ్గర నుంచి బేకరీల్లోని కేకుల వరకు ప్రతీదీ రంగులమయమే!. ఆహారం అతి పెద్ద వ్యాపారం అయిన ఈ రోజుల్లో... ఉదరానికి హాని కలిగినా సరే.. నేత్రానందం కలగాలి.. క్షణాల్లో ఆకర్షించాలి. కస్టమర్లను బుట్టలో పడేయాలి. ఎక్కువ భాగం ఆహార ఉత్పత్తి సంస్థల వ్యూహం ఇదే! ఫుడ్‌ఐటమ్‌లోని పోషక విలువల్ని చూసి కాదు.. రంగును చూసి కొనాలంతే!. అందవిహీనమైన ముఖాన్ని కూడా మేకప్‌తో అందగత్తెలా తీర్చిదిద్దినట్లు.. చెత్తను కూడా హాట్‌కేక్‌ల మాదిరి మార్చేయవచ్చు.

ఇందులో పెద్ద మ్యాజిక్‌ ఏమీ లేదు. రుచి, నాణ్యతల గురించి దిగులే అక్కర్లేదు. ఎలాంటి పదార్థమైనా సరే.. చుక్క రంగు పడితే చాలు.. చక్కనమ్మలా తయారైపోతుంది. ఇలా ఆహార పదార్థాలు, పానీయాలలో కృత్రిమ రంగుల వాడకం.. స్ట్రీట్‌ఫుడ్‌ దగ్గర నుంచి స్టార్‌హోటళ్ల వరకు అంతులేదు. ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ రంగుల వాడకం ఐదొందల శాతం పెరిగిందంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో అర్థం చేసుకుంటే.. బయటి తిండే వద్దు మొర్రో అనిపిస్తుంది.

కలర్స్‌ కలపకపోతే..

ఆహారం అమృతం. ప్రకృతి ప్రసాదించిన వరం. గుడిలో ప్రసాదాన్ని ఎంత భక్తితో కళ్లకద్దుకుని తింటామో.. రోజువారీ తిండిని కూడా అంతే శ్రద్ధతో తినాలి. ఎందుకంటే దేహమే దేవాలయం అంటుంది ఆయుర్వేద శాస్త్రం. ఎలాంటి కృత్రిమ రంగులు కలపని సహజ ఆహారమే ఆరోగ్యానికి దివ్యౌషధం. ఆ ఎరుక లేదిప్పుడు!. ఇంట్లో వండుకోవాల్సిన తిండి.. కొనుక్కోవాల్సిన రోజుల్లోకి వచ్చాం కనక.. ఆహారం వ్యాపారం అయ్యింది. దానిని ఆకర్షణీయంగా తీర్చిదిద్దితే తప్ప అమ్ముడవ్వని పరిస్థితి ఏర్పడింది. అందుకే మేకప్‌ తప్పడం లేదు. అందులో భాగంగా వచ్చినవే కృత్రిమ రంగులు.

ఇవి ఆహారపు రుచిని కానీ, పోషకవిలువలను కానీ పెంచుతాయా? ఇంకేమైనా అదనపు ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయా? అన్న ప్రశ్నలకు ఎలాంటి సమాధానం లేదు. రంగులు ఎంత ప్రభావితం చేస్తాయంటే - ముందుగా మిలమిలా మెరిసే ఆహారపదార్థం మన కళ్లను ఆకర్షిస్తుంది. విద్యుత్‌ ప్రవాహంలా మెదడుకు సంకేతాలు వెళతాయి. ఆకలి లేకున్నా వెంటనే తినాలన్న కాంక్షను రగిలిస్తుందీ మెదడు. తినాలా వద్దా అన్న సంఘర్షణ మొదలవుతుంది. తిండియావ ముందు నిగ్రహం ఓడిపోతుంది.

కారణం.. కళ్లను కనికట్టు చేసే ఆ రంగుల ఆహారపు ఆకర్షణ. రంగులకు అంత శక్తి ఉంది మరి!. ఫుడ్‌ఐటమ్స్‌ను సహజపద్ధతుల్లో తయారుచేస్తే రుచిగా ఉంటాయి తప్పిస్తే.. ఆకర్షణీయంగా కనిపించవు. ఉదాహరణకు జిలేబీ, కేకులు, క్యాండీలు, కబాబ్‌లు, మిఠాయిలు, డిజర్ట్‌లు, శీతల పానీయాలు, బేకరీ ఐటమ్స్‌ వంటివన్నీ ఎలాంటి రంగులు కలపకుండా తయారుచేశారనుకోండి. వాటివైపు అస్సలు కన్నెత్తి చూడలేరు. ఒక్కరూ కొనరు. అందుకనే తిండి పదార్థాలు, పానీయాలకు ఆకర్షణ పెంచి, కొనేలా చేసే గుణం రంగులకు ఉంది.

నియంత్రణ లేదా..?

వ్యాపారులు ఫుడ్‌ఐటమ్స్‌ను విక్రయించాలంటే కృత్రిమరంగులను కలపడం తప్పనిసరి. ఇవన్నీ ఆహార నియంత్రణ సంస్థల మార్గదర్శకాలు, నిబంధనలకు లోబడి వాడితే పర్వాలేదు.. కానీ మోతాదును మించి వాడినప్పుడే ఆరోగ్యానికి ముప్పు ఏర్పడుతుంది. కృత్రిమ రంగులను ఆర్టిఫిషియల్‌ డైస్‌ అంటారు. వీటిని ప్రపంచ వ్యాప్తంగా ఒక్కో దేశంలో ఒక్కో రకంగా వాడుతున్నారు. నిబంధనలు కూడా అలాగే ఉన్నాయి. మన దేశంలోని ‘ద ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా’ కృత్రిమ రంగులు (ఫుడ్‌ కలర్‌ డైస్‌) వాడకంపై కొన్ని నిబంధనలను పెట్టింది.

అయినా సరే రెస్టారెంట్లు, హోటళ్లు, వీధి వ్యాపారులు వాటిని సరిగా పాటించడం లేదు. తనిఖీలు, పర్యవేక్షణకు అవసరమైనంత మంది అధికారులు లేరు. అందుకే కృత్రిమ రంగుల వాడకం మితిమీరిందని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రజల్లో ఆహారభద్రత, చైతన్యం తీసుకొచ్చేందుకు పరిమితసంఖ్యలో కార్యక్రమాలు చేస్తున్నా.. అవి కూడా ప్రజలకు చేరడం లేదు. ఇక, అమెరికాలోని ఫుడ్‌ అండ్‌ డ్రగ్స్‌ అడ్మినిస్ట్రేషన్‌, ఐరోపాకు చెందిన యూరోపియన్‌ ఫుడ్‌సేఫ్టీ అఽథారిటీ సైతం ఫుడ్‌ కలర్స్‌ వాడకంపై అత్యంత కఠిన నిబంధనలు పెట్టాయి. కొన్ని రంగుల్ని నిషేధించాయి కూడా.!. అయినా సరే .. ఆ దేశాల్లోనూ ఇదే పరిస్థితి.

మితిమీరిన వాడకం...

ప్రపంచవ్యాప్తంగా ఫుడ్‌కలర్స్‌, ఫుడ్‌డైస్‌ పరిమితంగా ఉన్నాసరే.. వాడకం మాత్రం అపరిమితమనే చెప్పొచ్చు. ప్రస్తుతం ‘రెడ్‌ 40’, ‘రెడ్‌ 3’, ‘ఎల్లో 5’, ‘ఎల్లో 6’, ‘బ్లూ 1, ‘బ్లూ 2’, ‘కారమిల్‌’ వంటి ఫుడ్‌డైస్‌, ఫుడ్‌కలర్స్‌ను ఎక్కువగా వాడుతున్నారు. తయారుచేసే ఆహారపదార్థాలను బట్టి వీటి ఎంపిక ఉంటుంది. జిలేబీకి మంచి ఎరుపు రంగు పులమాలి కాబట్టి సన్‌సెట్‌ ఎల్లో ఎఫ్‌సిఎఫ్‌ను కలుపుతారు. దీనిని ఇటీవల అమెరికా నిషేధించింది. ఎందుకంటే.. అక్కడి పిల్లలు ఎక్కువగా తినే క్యాండీలలో సన్‌సెట్‌ఎల్లోను వాడుతున్నారు. దీనివల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని కొన్ని అధ్యయనాలు చెప్పాయి.

ఈ రంగుల్లో ప్రమాదకరమైన సింథటిక్‌ కెమికల్స్‌ ఎక్కువ. గత ఏడాది కర్ణాటక ప్రభుత్వం కూడా ఇలాంటి కొన్ని ఫుడ్‌ కలర్స్‌ను నిషేధించింది. దుస్తుల తయారీలో వాడే ఆర్టిఫిషియల్‌ డైస్‌ను గోబీ మంచూరియా, కాటన్‌ క్యాండీలలో వాడుతున్నట్లు తేలింది. తమిళనాడు ప్రభుత్వం కూడా కోర్టులో ఓ కేసు వేసింది. ఆహార పదార్థాల వినియోగం, రంగుల ముప్పును బట్టి ఆయా దేశాలు నిర్ణయం తీసుకుంటున్నాయి. అమెరికాలో ఎక్కువగా రెడ్‌ 40, ఎల్లో 5, ఎల్లో 6 ... ఈ మూడు కృత్రిమ రంగులే తొంభై శాతం వాడుతున్నారు. కొన్ని ఫుడ్‌ డైస్‌లను కొన్ని దేశాలు నిషేధిస్తే.. కొన్ని అనుమతిచ్చాయి.

గ్రీన్‌ నెంబర్‌ 3 (దీనినే ఫాస్ట్‌గ్రీన్‌ అంటారు) అమెరికాకు చెందిన ఎఫ్‌డిఎ అనుమతించింది... కానీ యూరప్‌ నిషేధించింది. శీతలపానీయాలు, బేకరీ, డిజర్ట్స్‌, ఐస్‌క్రీమ్‌, మిఠాయిలలో ఎక్కువగా వాడే క్వినోలిన్‌ ఎల్లోను యూరోపియన్‌ యూనియన్‌ దేశాల్లో అనుమతించారు. వీటిని అమెరికా నిషేధించింది. క్యాండీ, డిజర్ట్‌లలో ప్రకాశవంతమైన ఎరుపు కోసం కార్మొయిసిన్‌ అనే రంగును వాడుతున్నారు. సాస్‌లు, సోపులు, ఆవాలు, సుగంధ ద్రవ్యాలను మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేసేందుకు పోన్సీయు (అల్యూరా రెడ్‌)ను కలుపుతున్నారు.

దీనివల్ల పిల్లల్లో, గర్భిణుల్లో, పెద్దల్లో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు పదే పదే హెచ్చరిస్తున్నాయి అధ్యయనాలు. 1973లో పిల్లల వైద్యులు చేపట్టిన పరిశోధనలో ఈ విషయమే వెల్లడైంది. కృత్రిమ రంగులు వాడిన ఆహార పదార్థాల్ని పదే పదే తింటున్న పిల్లల్లో హైపర్‌యాక్టివిటీ, లర్నింగ్‌ ప్రాబ్లమ్స్‌ వంటి సమస్యలు వచ్చినట్లు ఆ పరిశోధన పేర్కొంది. అప్పట్లో ఆ హెచ్చరికను ప్రపంచం పట్టించుకోలేదు. ఆ తర్వాత ‘అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపర్‌ యాక్టివిటీ డిజార్డర్‌’ (ఎడిహెచ్‌డి)తో బాధపడే పిల్లలు కృత్రిమరంగుల ఆహారపదార్థాలను తగ్గించమని వైద్యులు సూచించడం ప్రారంభించారు. టారా్ట్రజన్‌ (ఎల్లో 5) కలిపిన ఆహారపదార్థాలను అధికంగా తినే పిల్లల్లో చిరాకు, కుంగుబాటు, నిద్రలేమి, అలసట వంటి లక్షణాలు కనిపించినట్లు మరో అధ్యయనం ద్వారా తెలిసింది.

2004లో కృత్రిమరంగులపై ఏకంగా 15 అధ్యయనాలు జరిగాయి. ఫుడ్‌కలర్స్‌ అనేవి పిల్లల్లో హైపర్‌ యాక్టివిటీని పెంచుతున్నట్లు నిర్ధారించారు అధ్యయనకారులు. ఆ తర్వాత జరిగిన పరిశోధనల్లో ఫుడ్‌కలర్స్‌ క్యాన్సర్‌ కారకాలనీ తేలింది. రెడ్‌ 3 కలిపిన ఆహారాన్ని ఎలుకలకు పెట్టగా... వాటిలో క్యాన్సర్‌ ముప్పు పెరిగినట్లు ఒక పరిశోధన పేర్కొంది. ఇక, అప్పటి నుంచి ప్రపంచం అప్రమత్తమైంది. ఫుడ్‌కలర్స్‌పైన నిబంధనలు, నిషేధాలు, నియంత్రణ, తనిఖీలు వంటివి ఊపందుకున్నాయి. బ్రిటన్‌ ప్రభుత్వం కూడా ఫుడ్‌డైస్‌కు ప్రత్యామ్నాయంగా సహజరంగుల వాడకాన్ని ప్రోత్సహించింది. ఫుడ్‌ ప్యాకెట్లపైన కూడా ఎలాంటి రంగులు వాడారో తెలియజేయాలన్న నిబంధన విధించింది. ఇలా ఫుడ్‌కలర్స్‌పై కొంత చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది.

ఎలా తయారవుతున్నాయ్‌..?

ఈ రోజుల్లో మనం ఏం తిన్నా సరే.. అందులో కృత్రిమరంగులు తప్పక కలిసుంటాయి. కాబట్టి మనకు తెలిసో తెలియకో నిత్యం ఆ విషతుల్య రసాయనాలను మన లోపలికి పంపిస్తున్నాం. కొన్ని అంతర్జాతీయ ఆహార పరిశోధన, నియంత్రణ సంస్థలు కృత్రిమరంగులపై పరస్పర విరుద్ధ అభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ.. ముప్పు మాత్రం ఉందని ఆధునిక వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ రంగులు ఎలా తయారవుతున్నాయో తెలుసుకుంటే ఎంత ప్రమాదమో అర్థమవుతుంది.

ఆర్టిఫిషియల్‌ కలర్స్‌, ఫుడ్‌ డైస్‌ వంటివన్నీ పెట్రోలియం ఉప ఉత్పత్తులు. భూమి లోపలున్న పురాతన శిలాజాల నుంచి క్రూడ్‌ఆయిల్‌ను వెలికి తీసే ప్రక్రియ మనకు తెలిసిందే!. ఆ ముడిచమురును శుద్ధి చేసినప్పుడు - పెట్రోలు, డీజిల్‌, గ్రీజు, లూబ్రికెంట్స్‌, ప్లాస్టిక్‌, నాప్తలిన్‌, వాక్స్‌, పెయింటింగ్‌, పెట్రోలియం జెల్లీ, రబ్బరు, ఫర్టిలైజర్స్‌, కెమికల్స్‌ వంటివన్నీ తయారవుతాయి. ఈ ప్రక్రియలో భాగంగానే ఫుడ్‌డైస్‌ అనే కృత్రిమ రంగులు కూడా ఉత్పత్తి అవుతాయి.

అంటే ఫుడ్‌కలర్స్‌ అన్నీ పెట్రోలియం ఉప ఉత్పత్తులన్న మాట. రెడ్‌ 40, ఎల్లో 5, ఎల్లో 6 వంటివన్నీ ఇలా తయారైనవే! వీటినే ఎందుకు వాడాలి? సాధారణ రంగు పిండిని వాడొచ్చు కదా? అనే సందేహం కలగొచ్చు. అలా వాడలేరు. ఫుడ్‌ఐటమ్స్‌లో పూర్తిస్థాయిలో కలిసిపోయి.. ఒక సహజవర్ణ భావన కలిగించలేవు. అదే పెట్రోలియం ఉప ఉత్పత్తులైన ఫుడ్‌డైస్‌ అయితే ఫుడ్‌ఐటమ్స్‌లో మిళితమై.. నాచురల్‌ కలర్‌లా కనికట్టు చేయగలవు. అందుకే వీటిని వాడుతున్నారు.

అనారోగ్యం ‘కొని’తెచ్చుకున్నట్లే..

కృత్రిమరంగుల వాడకంపై తనిఖీలు, నియంత్రణ లేకపోవడం వల్లే సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. కొందరు వీధివ్యాపారులైతే రకరకాల హానికారక రంగుల్ని ఆహారంలో ఎడాపెడా వాడిపడేస్తున్నారు. మన దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఏకంగా వస్త్రతయారీ పరిశ్రమలో వాడే రంగుల్ని సైతం ఆహార తయారీలో కలిపేస్తున్నట్లు ఇటీవల జరిగిన ఒక పరిశోధనలో రుజువైంది. ఇలా కల్తీ జరిగిన పదార్థాలను పిల్లలు తింటే ఎంత ప్రమాదమో ఊహించవచ్చు. ఈ విధమైన కృత్రిమ రంగులున్న ఫుడ్‌ఐటమ్స్‌ను ఎక్కువగా తింటే.. రకరకాల శారీరక, మానసిక సమస్యలు రావడం ఖాయం. ముఖ్యంగా తరచూ జంక్‌ఫుడ్‌, స్ట్రీట్‌ఫుడ్‌, ప్యాకేజ్డ్‌ఫుడ్‌, ఫ్రోజెన్‌ఫుడ్‌ తినే వాళ్లలో ఉదర, శ్వాసకోశ సమస్యలతో పాటు అలర్జీలు వస్తున్నాయి.

ఇంకొందరిలో క్యాన్సర్‌ ముప్పు పెరిగే ప్రమాదం ఉందంటున్నారు వైద్యులు. ‘‘ఫుడ్‌కలర్స్‌ అనేవి ఆహార పదార్థాల రూపాన్ని మెరుగుపరచడానికి పనికొచ్చే రసాయన పదార్థాలు. వీటిని మనం శతాబ్దాలుగా వాడుతున్నాం. అప్పట్లో కొంత సహజపద్ధతులు ఉండేవి. ఇప్పుడు వాడుతున్న కృత్రిమ రంగులైతే మాత్రం పెట్రోలియం తరహా ఉత్పత్తులే!. ఇవి ప్రమాదకర ప్లాస్టిక్‌, సింథటిక్‌ గుణాలు కలిగి ఉంటాయి. కొన్నేళ్ల నుంచి ఇంకా ఎన్నో రకాల ఫుడ్‌కలర్స్‌ పుట్టుకొచ్చాయి. వీటిలో ఎక్కువ భాగం విషతుల్యం.

ఈ రోజుల్లో ఏది ఆరోగ్యకరం? ఏది అనారోగ్యకరం? అనేది తేల్చలేం. అందుకే నాణ్యత, శుభ్రత కలిగిన ఆహారపదార్థాలనే తీసుకోవాలి. అప్పుడే ప్రమాదం నుంచి కొంత వరకు తప్పించుకోవచ్చు. ముఖ్యంగా పిల్లలు తరచూ తినే బేకరీ ఉత్పత్తులు, ఐస్‌క్రీమ్స్‌, కబాబ్స్‌ వంటివి బాగా తగ్గించాలి. ఒకవేళ తినాల్సి వస్తే.. సహజరంగులు వాడిన పదార్థాలకు ప్రాధాన్యం ఇవ్వొచ్చు. ప్యాకేజ్డ్‌ఫుడ్‌ అయితే ఏ రంగులు వాడిందీ ప్యాకెట్లపైన ముద్రిస్తారు. అవి చదివి కొనడం పిల్లలకు అలవాటు చేయాలి..’’ అన్నారు ముంబయిలోని ఒక ఆహార పరిశోధనా సంస్థలో పనిచేసే శాస్త్రవేత్త ముఖర్జీ.

ఇదిలా ఉంటే.. మనం ఇళ్లలో తయారుచేసుకునే ఆహారపదార్థాల్లో కృత్రిమ రంగుల వాడకాన్ని తగ్గించుకునే అవకాశం ఉంది. బీట్‌రూట్‌, దానిమ్మ, మల్బరీ, కాన్‌బెర్రీ జ్యూస్‌లతో రంగుల్ని తయారుచేసుకోవచ్చు. ఈ ప్రక్రియ కొంత క్లిష్టమైనది కాబట్టి.. మార్కెట్‌లో దొరికే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లతో తయారైన రంగుల పొడులను వాడుకోవచ్చు. వీటితో ఎలాంటి ఇబ్బందీ లేదంటున్నారు పోషకాహార నిపుణులు. కాబట్టి కృత్రిమ రంగుల వినియోగాన్ని తగ్గించి.. సహజ వర్ణాలవైపు మళ్లితే ఆరోగ్యం బాగుంటుంది.

- సండే డెస్క్‌

Updated Date - Jun 29 , 2025 | 11:01 AM