Human Body Heat: శరీరంలో టెంపరేచర్‌కు ఓ లిమిట్.. ఈ లక్ష్మణ రేఖ దాటితే..
ABN, Publish Date - Jun 20 , 2025 | 02:38 PM
శరీరంలోని వేడి 40 డిగ్రీలు దాటినప్పుడు అవయవాలు విఫలమవడం ప్రారంభమవుతాయని వైద్యులు చెబుతున్నారు. ఇదే సమయంలో చల్లబరిచే వ్యవస్థలు సరిగా పనిచేయకపోతే మరణం సంభవిస్తుందని హెచ్చరిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: వడదెబ్బ తగిలి జనాలు ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనల గురించి మనందరం వినే ఉంటాం. సాధారణంగా ఎండా కాలంలో వాతావరణంలో ఉష్ణోగ్రత 40 డిగ్రీల నుంచి 50 డిగ్రీల వరకూ ఉంటుంది. ఇక వేడి 45 డిగ్రీలు దాటిందంటే ప్రమాదం మొదలైనట్టే అని నిపుణులు చెబుతున్నారు. ఈ ఉష్ణోగ్రతల వద్ద శరీరంలో (Human Body Heat) వేడి ప్రమాదకర స్థాయికి చేరుకుంటుంది.
శరీరంలోని ఉష్ణోగ్రత.. లిమిట్ ఇదీ
వైద్యులు చెప్పే దాని ప్రకారం, ఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రతలు నేరుగా మరణాలకు కారణం కాదు. శరీరాన్ని చల్లబరిచే వ్యవస్థలు విఫలమైన సందర్భంలో ఒంట్లో ఉష్ణోగ్రత 40 డిగ్రీల మార్కు దాటిపోతుంది. చివరకు బాధితులు వడదెబ్బ బారిన పడి కన్నుమూస్తారు
శరీరంలో తేమ శాతం, వేడిని నియంత్రించే వ్యవస్థలు సక్రమంగా పని చేస్తుంటే బయటి వేడి 50 డిగ్రీలకు చేరుకున్నా ఏమీ కాదని వైద్యులు అంటున్నారు. సాధారణంగా శరీరం లోపలి వేడి 36.5 డిగ్రీల నుంచి 37.5 డిగ్రీలు ఉన్నంత వరకూ వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేస్తుంటాయి. ఇది 40 డిగ్రీలు దాటితే మాత్రం అవయవాల పనితీరుపై ప్రభావం పడుతుంది. మెదడు పనితీరు కూడా దెబ్బతింటుంది.
ఇక వాతావరణంలో ఉష్ణోగ్రతలు 55 డిగ్రీలు దాటితే శరీరంలో వేడిపై నియంత్రణ తప్పిపోతుందని వైద్యులు చెబుతున్నారు. లోపలి ఉష్ణోగ్రత 40 దాటిన తరువాత అవయవాలు పనిచేయడం ఆగిపోతుంది. మరణం ముప్పు పెరుగుతుంది. ఇలాంటి సమయంలో గాల్లో తేమ శాతం ఎక్కువగా ఉంటే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుంది. గాల్లో తేమ ఎక్కువగా ఉన్న సమయంలో శరీరం స్వేదం ద్వారా లోపలి వేడిని బయటకు వదిలిపెట్టలేదు. ఇలాంటి పరిస్థితులు ఊహించని ప్రమాదాలకు దారి తీస్తాయి.
వడదెబ్బ తగలకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పగటి వేళల్లో వీలైనంతగా నీరు తాగాలి. దీంతో, డీహైడ్రేషన్ దరి చేరదు. శరీరాన్ని డీహైడ్రేషన్‌కు గురి చేసే షుగరీ డ్రింక్స్, కెఫీన్, ఆల్కహాల్ వంటి వాటి జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిది. ఇక ఎండలో బయటకు వేళ్లేటప్పుడు లేత రంగుల్లో వదులుగా ఉండే దుస్తులు ధరించి వెళితే గాలి ఆడి ఇబ్బందులు తగ్గుతాయి. ఇక మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 మధ్యలో బయటకు వెళ్లకుండా ఉంటేనే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
మంచి కొలెస్టరాల్, చెడు కొలెస్టెరాల్ మధ్య తేడా ఇదే
హైబీపీతో కంటి సమస్యలు.. వైద్యుల సలహా ఏంటంటే..
Updated Date - Jun 20 , 2025 | 02:48 PM