Share News

Cholesterol Effects: మంచి కొలెస్టరాల్, చెడు కొలెస్టెరాల్ మధ్య తేడా ఇదే

ABN , Publish Date - Jun 16 , 2025 | 07:08 AM

మంచి కొలెస్టరాల్, చెడు కొలెస్టరాల్ మధ్య ఎంతో తేడా ఉందని వైద్యులు చెబుతున్నారు. మరి ఈ తేడాలు ఏంటో, ఇవి అనారోగ్యాలకు ఎలా కారణమవుతాయో ఈ కథనంలో తెలుసుకుందాం.

Cholesterol Effects: మంచి కొలెస్టరాల్, చెడు కొలెస్టెరాల్ మధ్య తేడా ఇదే
good vs. bad cholesterol,

ఇంటర్నెట్ డెస్క్: కొలెస్టరాల్.. ఈ పేరు చెబితే చాలు జనాలు వణికిపోతారు. అనారోగ్యానికి హేతువని అనుకుంటారు. అయితే, కొలెస్టరాల్‌ శరీరానికి ఎంతో అవసరమని వైద్యులు చెబుతున్నారు. కణజాలం తయారీకి, హార్మోన్‌ల ఉత్పత్తికి ఇది అవసరం. అయితే, కొలెస్టరాల్ స్థాయి హద్దులు దాటి పెరిగినప్పుడే గుండె పోటు మొదలు రకరకాల సమస్యలు మొదలవుతాయి.

నిపుణులు చెప్పేదాని ప్రకారం, శరీరంలో మంచి కొలెస్టరాల్, చెడు కొలెస్టరాల్ స్థాయిల మధ్య అసమతౌల్యం తలెత్తినప్పుడే అనారోగ్యం మొదలవుతుంది. రక్తనాళాల్లో అడ్డంకులు పేరుకుని చివరకు హార్ట్ డిసీజ్, స్ట్రోక్ వంటి తీవ్ర అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుంది.


మంచి చెడు కొలెస్టరాల్ మధ్య తేడా ఇదే

మంచి కొలెస్టరాల్‌ను హైడెన్సిటీ లిపోప్రొటీన్ (హెచ్‌డీఎల్) అని కూడా అంటారు. శరీరంలో అధికంగా ఉన్న కొవ్వులను తొలగించేందుకు హెచ్‌డీఎల్ ఉపయోగపడుతుంది. అధికంగా ఉన్న కొవ్వులు రక్తం ద్వారా లివర్‌లోకి చేరతాయి. అక్కడి నుంచి విసర్జితమవుతాయి. గుండె సంబంధిత సమస్యలు రాకుండా హెచ్‌డీఎల్ ఓ రక్షణ కవచంలా వ్యవహరిస్తుందని వైద్యులు వివరిస్తున్నారు.

చెడు కొలెస్టరాల్‌ను లో డెన్సిటీ లిపో ప్రొటీన్ (ఎల్‌డీఎల్) అని పిలుస్తారు. ఇది రక్తనాళాల్లో పేరుకుపోయి ప్లాక్‌లు (అడ్డంకులు) ఏర్పడేలా చేస్తుంది. ఎల్‌డీఎల్ స్థాయిలు అధికంగా ఉన్నప్పుడు రక్తనాళాల్లో ఇన్‌ఫ్లమేషన్ మొదలవుతుంది. ఇది ఎథెరోస్క్లెరోసిస్‌కు దారి తీస్తుంది. చివరకు బాధితులు హార్ట్ ఎటాక్, స్ట్రోక్ బారిన పడతారు.


మంచి, చెడు కొలెస్టరాల్‌ల మధ్య అసమతౌల్యం తొలగించాలంటే కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి. పండ్లు, కూరగాయలు, వివిధ రకాల పప్పు దినుసులు, పీచు పదార్థం అధికంగా ఉన్న ఆహారాలు ఎక్కువగా తినాలి. దీంతో పాటు క్రమం తప్పకుండా కసరత్తులు చేస్తే శరీరంలో హెచ్‌డీఎల్ స్థాయిలు పెరిగి ఎల్‌డీఎల్ స్థాయిలు తగ్గుతాయి. రోజూ కనీసం 150 నిమిషాల పాటు కసరత్తులు చేయాలి. మద్యపానం, ధూమపానం అలవాట్లను వదిలించుకోవాలి. బరువు నియంత్రణలో ఉంచుకోవాలి. ఈ జాగ్రత్తలతో చెడు కొలెస్టరాల్ ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

అపాన వాయువుకు వేగంగా చెక్ పెట్టే పరిష్కారాలు

హైబీపీతో కంటి సమస్యలు.. వైద్యుల సలహా ఏంటంటే..

Read Latest and Health News

Updated Date - Jun 16 , 2025 | 07:16 AM