Plastic Water Bottles: అదే పనిగా ప్లాస్టిక్ బాటిల్‌లో నీళ్లు తాగుతున్నారా.. అయితే తప్పక తెలుసుకోండి..
ABN, Publish Date - Jan 03 , 2025 | 07:17 AM
ప్లాస్టిక్ అనేది ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న పెద్ద సమస్య. ప్లాస్టిక్ వస్తువులు భూమిలో త్వరగా కలిసిపోకుండా వందల సంవత్సరాలు ఉంటాయి. దీని వల్ల పర్యావరణ కాలుష్యం జరిగి అన్ని జీవరాశులకు పెద్ద ప్రమాదం పొంచి ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: నీళ్లు తాగడం మనిషికి ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. మన శరీరంలో దాదాపు 70శాతం వరకూ నీరే ఉంటుంది. అందుకే ప్రతి రోజూ కనీసం 4 నుంచి 5 లీటర్ల మేర మంచినీళ్లు తాగాలని వైద్యులు చెబుతుంటారు. అయితే నీరు తాగేందుకు చాలా మంది వివిధ రకాల వస్తువులను ఎంచుకుంటారు. ఇంట్లో ఉన్నప్పుడు గ్లాసులు, రాగి చెంబులు, బాటిల్స్ వంటివి వాడతారు. మరికొంతమంది బయటకు వెళ్లినా, ఆఫీసు, ఇల్లు లేదా ఇతర ప్రాంతాల్లోనూ ప్లాస్టిక్ బాటిల్స్‌నే వాడుతుంటారు. అయితే ఇలాంటి వారు చాలా ప్రమాదంలో ఉన్నారని వైద్యులు చెబుతున్నారు. ఈ అలవాటు మానుకోకపోతే ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లే అవుతుందని హెచ్చరిస్తున్నారు.
ప్లాస్టిక్ అనేది ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న పెద్ద సమస్య. ప్లాస్టిక్ వస్తువులు భూమిలో త్వరగా కలిసిపోకుండా వందల సంవత్సరాలు ఉంటాయి. దీని వల్ల పర్యావరణ కాలుష్యం జరిగి అన్ని జీవరాశులకు పెద్ద ప్రమాదం పొంచి ఉంది. భూమి, సముద్రం ఎక్కడ చూసినా ప్లాస్టిక్‌తో చేసిన వస్తువులు కుప్పలు కుప్పలుగా కనిపిస్తుంటాయి. వాటిని నాశనం చేయడం శాస్త్రవేత్తలకు పెద్ద సవాల్‌గా మారింది. వాటిని కాల్చివేస్తే ప్రమాదకరమైన రసాయనాలు వాతావరణంలో కలిసే ప్రమాదం ఉంటుంది. అందుకే శాస్త్రవేత్తలు సైతం వీటిని త్వరగా భూమిలో కలిపేందుకు తలలు పట్టుకుంటున్నారు. అనేక ప్రయోగాలు చేస్తూ బిజీబిజీగా ఉన్నారు.
ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు తాగితే ఏం జరుగుతుంది?
ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు తాగొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలా ఎందుకు చెప్తారో, తాగితే జరిగే అనర్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్లాస్టిక్ బాటిళ్లలో బీపీఏ (Bisphenol A), థాలేట్స్ (Phthalates), సీసం (Lead), కాడ్మియం (Cadmium), పాదరసం (Mercury) వంటి అనేక హానికర రసాయనాలు ఉంటాయి. ఈ వాటర్ బాటిళ్లు వేడి ప్రదేశంలో ఉన్నప్పుడు ముఖ్యంగా ఎండలో పెట్టినప్పుడు బాటిల్ నుంచి ఈ ప్రమాదకర రసాయనాలు నీటిలో కలుస్తాయి. ఇలాంటి నీటిని మనం తాగితే హార్మోర్ల అసమతుల్యత ఏర్పడుతుంది. మన ప్రవర్తన సహా ఆరోగ్యం మెుత్తం హార్మోన్లపైనే ఆధారపడి ఉంటుంది. అలాంటి హార్మోన్లలో తేడా ఏర్పడితే చాలా అనర్థాలు జరుగుతాయి.
ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌లో నానోప్లాస్టిక్స్ అనే అతి సూక్ష్మ కణాలు ఉంటాయి. మనం నీళ్లు తాగినప్పుడు ఇవి నేరుగా రక్తంలో కలిసి శరీర భాగాలకు చేరుతాయి. వీటి వల్ల కూడా అనేక అనర్థాలు జరిగే ప్రమాదం పొంచి ఉంది. కాలక్రమేణా ప్లాస్టిక్ బాటిల్ అనేది చిన్నచిన్న కణాలుగా విచ్ఛినం అవుతుంది. కణాలుగా విడిపోయినప్పుడు వీటిలో మైక్రోప్లాస్టిక్స్, నానోప్లాస్టిక్స్ అనేవి ఉంటాయి. నానోప్లాస్టిక్స్ అనేవి మైక్రోప్లాస్టిక్స్ కంటే చాలా చిన్నగా ఉంటాయి. ఇవి రెండూ శరీరంలోకి ప్రవేశించినా నానోప్లాస్టిక్స్ మాత్రం నేరుగా రక్తంలోకి చేరుతాయి. అయితే వీటి ప్రభావం ఏమేర ఉంటుందనే విషయంపై ఇంకా అధ్యయనాలు కొనసాగుతున్నాయి.
ఏదేమైనా ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు తాగకపోవడమే ఉత్తమమని పలువురు వైద్యులు సూచిస్తున్నారు. రాగి, స్టీల్ చెంబులు లేదా బాటిల్స్ వంటివి ఉపయోగించడం మంచిదని చెబుతున్నారు.
Updated Date - Jan 03 , 2025 | 07:17 AM