Biscuits Health Risks: చాయ్‌తో పాటు బిస్కెట్లు తింటారా.. మరి ఈ విషయాల గురించి తెలుసా
ABN, Publish Date - Jul 18 , 2025 | 02:36 PM
రోజూ టీతో పాటు తీసుకునే బిస్కెట్స్‌తో అనారోగ్యం తలెత్తొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రిఫైన్డ్ ఫ్లోర్, చక్కెరలు, ప్రాసెస్డ్ కొవ్వులతో చేసే వీటితో జీవక్రియలపై ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు. వీలున్నంత వరకూ ఆరోగ్యకరమైన పదార్థాలతో చేసే బిస్కెట్స్‌నే ఎంచుకోవాలని సూచిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: టీతో పాటు బిస్కెట్లు తినకుండా భారతీయులు ఉండలేరు. ఈ అలవాటు ఉన్న వారు రకరకాల బిస్కెట్లను ఆరగిస్తుంటారు. తీపి, ఉప్పు, క్రీమ్ ఇలా ఒక్కొక్కరిదీ ఒక్కో అభిరుచి. మార్కెట్‌లో లైట్, డైట్ బిస్కెట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. వివిధ రకాల తృణధాన్యాలు, ఓట్స్ ఆధారిత బిస్కెట్‌లు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. అయితే, అధికశాతం బిస్కెట్లను రిఫైన్డ్ ఫ్లోర్, చక్కెరలు, ప్రాసెస్డ్ కొవ్వులతో చేస్తారు. ఫలితంగా ఇవి ఆరోగ్యంపై ప్రభావం కచ్చితంగా చూపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
టీ తాగేటప్పుడు అధిక శాతం మంది తినే బిస్కెట్‌లలో రిఫైన్డ్ ఫ్లోర్, చక్కెరలు, ప్రాసెస్డ్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. వీటిల్లో ఉత్త కెలొరీలు మినహా ఎలాంటి పోషకాలు ఉండవు. కాబట్టి వీటిని రోజూ అస్సలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇక క్రీమ్ బిస్కెట్‌లతో పోలిస్తే సాధారణ బిస్కెట్‌లు మెరుగైనవన్న అభిప్రాయం కూడా జనాల్లో ఉంది. కానీ, ఈ రెండూ దీర్ఘకాలంలో అనారోగ్యాలకు దారితీస్తాయి. రక్తంలో చక్కెరలు, కొలెస్టెరాల్, బీపీ, కొవ్వులను సరిగా నియంత్రించుకోలేని పరిస్థితి వస్తుంది.
ఇలాంటి బిస్కెట్‌లను రోజూ తింటే కచ్చితంగా బరువు పెరుగుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బిస్కెట్స్ తినే వారి మెటబాలిక్ హెల్త్ కచ్చితంగా దెబ్బ తింటుందనేది నిపుణులు చెప్పే మాట. అధిక కొలెస్టెరాల్, షుగర్ వ్యాధి వంటి వాటి బారిన పడే ముప్పు పెరుగుతుంది. కాబట్టి, అందుబాటులో ఉన్న బిస్కెట్‌లలో మంచివి ఎంచుకునేందుకు వాటి ప్యాకేజీలపై ఉన్న లేబుల్స్‌ను జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోవాలి.
ఉదాహరణకు.. బిస్కెట్ లేబుల్స్‌పై రిఫైన్డ్ ఫ్లోర్, హైడ్రోజినేటెడ్ ఫ్యాట్స్, చక్కెరలు ఉన్నాయని రాసుంటే వాటి జోలికి వెళ్లకుండా ఉండటమే మంచిది. హై ఫైబర్, మిల్లెట్స్, షుగర్ లేకుండా చేసిన వాటినే కొనుగోలు చేయాలి. చాయ్‌తో పాటు తీసుకునే అన్ని బిస్కెట్లు అనారోగ్యానికి దారి తీయకపోయినప్పటికీ వీటి విషయంలో వీలైనంత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
ఫ్యాటీ లివర్‌తో బాధపడే వారు తప్పక తినాల్సిన ఫుడ్స్ ఇవే
మంచి కొలెస్టరాల్, చెడు కొలెస్టెరాల్ మధ్య తేడా ఇదే
Updated Date - Jul 19 , 2025 | 08:32 AM