Health Tips : బ్లాక్ కాఫీ తాగుతుంటే.. ఈ విషయం మర్చిపోవద్దు..
ABN, Publish Date - Jan 06 , 2025 | 12:40 PM
బ్లాక్ కాఫీ అంటే మీకిష్టమా. త్వరగా బరువు తగ్గాలని రోజూ బ్లాక్ కాఫీ తాగుతున్నారా. అయితే, ఆరోగ్యానికి మేలు చేసే బ్లాక్ కాఫీని ఇలా చేసుకుని తాగితే పూర్తిగా నష్టపోతారు.
రోజూ ఉదయాన్నే ఒక కప్పు బ్లాక్ కాఫీ తాగితే మంచిదని అంటుంటారు డైటీషియన్స్. త్వరగా బరువు తగ్గడానికి, అలసిన శరీరం వెంటనే శక్తి పుంజుకునేందుకు బ్లాక్ కాఫీ ది బెస్ట్ ఆప్షన్ అని సూచిస్తుంటారు. ఇక ఆరోగ్యప్రయోజనాలతో పాటు రుచికరంగా ఉంటుందనే ఉద్దేశంతో చాలామంది బ్లాక్ కాఫీ తాగేందుకు ఇష్టం చూపిస్తుంటారు. క్యాలరీలు తక్కువగా ఉంటాయని ఫ్రెండ్స్‌తో కలిసి కాఫీ షాప్‌కు వెళ్లినపుడు బ్లాక్ కాఫీకే ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. ఏదైనా పరిమితంగా తీసుకున్నపుడే ఆరోగ్యానికి మంచిదనే సంగతి గుర్తుంచుకోవాలి. ఎందుకంటే, ఎక్కువగా తింటే తీపి కూడా చేదే మిగులుస్తుంది. వైద్యులు చెపుతున్నారు కదా బ్లాక్ కాఫీ రోజూ అధికంగా వినియోగిస్తే వచ్చే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ఇలాంటి వారైతే బ్లాక్ కాఫీకి ఎంత దూరంగా ఉంటే అంత మేలు.
బ్లాక్ కాఫీలో యాంటియాక్సిడెంట్లు అధికం. మెరుగైన దృష్టిని, తక్షణ శక్తిని ప్రసాదించే ఈ పానీయాన్ని ఎలా తయారుచేసుకుని తాగుతున్నామన్నది చాలా ముఖ్యం. ఆరోగ్యానికి మంచిదని అధికంగా తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలతో పాటు అనేక సమస్యలు తెచ్చిపెడుతుంది.
జీర్ణ సమస్యలు ఉంటే..
బ్లాక్ కాఫీలో ఉండే ఆమ్ల స్వభావం కడుపు లైనింగ్‌ను చికాకుపెట్టి జీర్ణ సమస్యలు కలిగిస్తుంది. ఖాళీ కడుపుతో దీన్ని తాగితే యాసిడ్ రిఫ్లెక్షన్ వల్ల గుండెల్లో మంట లేదా అజీర్ణం సంభవించవచ్చు.
నిద్రపై ప్రభావం
కాఫీలో సహజంగానే కెఫీన్ శాతం ఎక్కువ. పనిలో ఉత్సాహంగా ఉండాలని అధికంగా వినియోగిస్తే అడ్రినలిన్ విడుదలై స్లీపింగ్ సైకిల్ దెబ్బతిని నిద్రలేమి సమస్యకు దారితీస్తుంది.
ఆందోళనలకు కారణం
అధిక మోతాదులో బ్లాక్ కాఫీ తాగే వ్యక్తులలో తీవ్రమైన ఆందోళన, మూడ్ స్వింగ్స్ ఉంటాయి. అప్పటికే మానసిక రుగ్మతలతో బాధపడేవారు బ్లాక్ కాఫీకి దూరంగా ఉంటే మేలు.
ఎముకల ఆరోగ్యం
ఎక్కువ బ్లాక్ కాఫీ తాగడం వల్ల కాల్షియం శోషణ తగ్గుతుంది. ఇది కాలక్రమేణా ఎముక సాంద్రత తగ్గడానికి కారణమై బోలు ఎముకల వ్యాధికి దోహదపడుతుంది, ముఖ్యంగా రుతుక్రమం ఆగిపోయిన స్త్రీలలో ఈ సమస్య అధికం.
గుండె దడ
బ్లాక్ కాఫీలోని కెఫిన్ కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుంది, ఇది హృదయ స్పందన రేటు పెరుగుదలకు దారితీయవచ్చు. గుండె సమస్యలు ఉన్న వ్యక్తులు బ్లాక్ కాఫీని ఎక్కువగా తీసుకోవడం ప్రమాదకరం.
డీహైడ్రేట్ చేస్తుంది
బ్లాక్ కాఫీ మూత్ర ఉత్పత్తిని పెంచుతుంది. కాబట్టి, అధికంగా తీసుకుంటే డీహైడ్రేషన్‌కు గురవుతారు. అందుకే పరిమితంగా తీసుకోవటం మంచిది.
చక్కని బ్లాక్ కాఫీ తయరీ విధానం:
రుచికరమైన, ఆరోగ్యకరమైన బ్లాక్ కాఫీ తయారీ కోసం ముందుగా నాణ్యమైన కాఫీ గింజలు లేదా పొడిని ఎంచుకోవాలి. నీటిని బాగా మరిగించి కాస్త చల్లార్చండి. మీ అభిరుచికి అనుగుణంగా ఒక కప్పులో కాఫీ పొడిని తీసుకుని అందులో మరిగించిన నీటిని పోయండి. కాఫీ స్వచ్ఛమైన రుచిని ఆస్వాదించాలి అనుకుంటే చక్కెర లేదా క్రీమ్ యాడ్ చేయకపోవడమే ఉత్తమం.
Updated Date - Jan 06 , 2025 | 12:40 PM