Liver Cancer: గ్యాస్ట్రోఎంటిరాలజిస్టులు చెబుతున్న సూచనలు.. లివర్ క్యాన్సర్ ముప్పు తగ్గాలంటే..
ABN, Publish Date - Jun 15 , 2025 | 03:17 PM
లివర్ క్యాన్సర్ ముప్పు తగ్గించుకోవాలంటే కొన్ని అలవాట్లు అస్సలు ఉండకూడదని గ్యాస్ట్రోఎంటిరాలజిస్టులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తున్న అనారోగ్యాల్లో లివర్ క్యాన్సర్ ఒకటి. జీవనశైలి మార్పులు, పర్యావరణ అంశాలు ప్రధానంగా లివర్ క్యాన్సర్‌కు కారణమవుతున్నాయి. అయితే, కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఈ ముప్పును చాలా వరకూ తగ్గించుకోవచ్చని గ్యాస్ట్రో ఎంటిరాలజిస్టులు చెబుతున్నారు. ముఖ్యంగా లివర్ ఆరోగ్యాన్ని కాపాడుకోదలిచిన వారు ఎన్నడూ చేయకూడని తప్పులు కొన్ని ఉన్నాయని అంటున్నారు. మరి అవేంటో ఈ కథనంలో సవివరంగా తెలుసుకుందాం.
ప్రాసెస్డ్ మాంసాహారం జోలికి అస్సలు వెళ్లకూడదనేది వైద్యులు చేసే ప్రధాన సూచన. హాట్ డాగ్స్, బేకన్స్, సాసేజస్ వంటి ప్రాసెస్డ్ ఆహారాల్లోని నైట్రేట్స్ అనే రసాయనాలు, ఇతర ప్రిజర్వేటివ్‌లు క్రమక్రమంగా లివర్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. క్యాన్సర్ ముప్పును పెంచుతాయి.
మద్యం ఓ మోస్తరుగా సేవించినా కూడా లివర్‌పై తీవ్ర ప్రభావం పడుతుంది. సిర్రోసిస్ వంటి వ్యాధుల రిస్క్ అమితంగా పెరుగుతుంది. అదీ ఇదీ అనే తేడాలు లేకుండా ఆల్కహాల్ ఏదైనా ప్రమాదమేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రెడ్ వైన్‌తో హాని లేదనే తప్పుడు భావనలను వదిలిపెట్టాలని కూడా చెబుతున్నారు. మద్యపానానికి దూరంగా ఉంటేనే లివర్ ఆరోగ్యాన్ని పది కాలాల పాటు కాపాడుకోవచ్చని చెబుతున్నారు.
చక్కెరలు అధికంగా ఉన్న పానీయాలు కూడా లివర్‌కు చేటు చేస్తాయి. అధిక చక్కెరలతో లివర్‌పై బర్డెన్ పెరుగుతుంది. చివరకు ఇది ఫ్యాటీ లివర్ వ్యాధికి దారి తీస్తుంది. ఫ్యాటీ లివర్ ఉన్న వారికి క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది.
ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రైడ్ చికెన్ వంటి బాగా వేయించిన ఆహారాలకు కూడా దూరంగా ఉండాలి. ఈ ఫుడ్స్ లివర్‌లో దీర్ఘకాలిక ఇన్‌ఫ్లమేషన్‌కు దారి తీస్తాయి. కాలం గడిచే కొద్దీ ఇది క్యాన్సర్ ముప్పును పెంచుతుంది. కాబట్టి, ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని జీవనశైలి ఆహారపు అలవాట్లలో తగిన మార్పులు చేసుకుంటే లివర్ క్యాన్సర్ ముప్పును చాలా వరకూ తగ్గించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
హైబీపీతో కంటి సమస్యలు.. వైద్యుల సలహా ఏంటంటే..
రాత్రి డిన్నర్ ఎన్ని గంటలకు చేయాలో తెలుసా
Updated Date - Jun 15 , 2025 | 03:23 PM