Dinner Time: రాత్రి డిన్నర్ ఎన్ని గంటలకు చేయాలో తెలుసా
ABN , Publish Date - Jun 09 , 2025 | 08:39 PM
రాత్రి ఎన్ని గంటలకు భోజనం చేయాలనేదానిపై కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇంటర్నెట్ డెస్క్: రాత్రి డిన్నర్ ఎప్పుడు చేస్తే ఆరోగ్యానికి మంచిది అనే సందేహం ఎప్పుడైనా వచ్చిందా? కొందరు రాత్రి 9 లోపు తినాలని చెబుతుంటారు. మరికొందరు రాత్రి 7 గంటలకే భోజనం పూర్తి చేయాలని అంటారు. మరి నిపుణులు ఏం చెబుతున్నారో ఈ కథనంలో తెలుసుకుందాం.
రాత్రి ఏ సమయంలో భోజనం చేశామనే దాన్ని బట్టి శరీరం ఆహారాన్ని ఎలా ప్రాసెస్ చేస్తుందనేది ఆధారపడుతుందని నిపుణులు చెబుతున్నారు. శరీరం ఓ షెడ్యూల్ ప్రకారం తన పనులు చేసుకుంటుంది. దీన్నే జీవ గడియారం అని కూడా అంటారు. రాత్రి పొద్దు పోయాక కడుపునిండా భోజనం చేస్తే శరీరాన్ని ఓవర్ టైం పని చేయమని ఒత్తిడి చేసినట్టే. ఇది చివరకు జీవక్రియలపై ప్రభావం చూపుతుంది. అంతిమంగా బరువు పెరిగేలా చేస్తుంది.
రాత్రి 7 గంటలకే భోజనం చేస్తే అనేక ఉపయోగాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ అలవాటుతో జీర్ణ క్రియ మెరుగవుతుంది. రాత్రిళ్లు చక్కటి నిద్ర పడుతుంది. బరువు నియంత్రణ కూడా సులువవుతుంది. ఇక రాత్రి 9 గంటలు దాటాక భోజనం చేస్తే బ్లడ్ షుగర్ లెవెల్స్‌పై ప్రతికూల ప్రభావం పడుతుంది. శరీరం కొవ్వును వినియోగించుకుంటున్న తీరులో కూడా మార్పు వస్తుంది. ఆహారాన్ని శరీరం సరైన తీరులో వినియోగించడంలో జీవ గడియారం పాత్ర కీలకం. రాత్రిళ్లు లేటుగా తింటే శరీరం ఏర్పాటు చేసుకున్న షెడ్యూల్ మొత్తం దెబ్బతిని అనారోగ్యాల బారిన పడాల్సి ఉంటుంది.
అదే రాత్రిళ్లు ఏడు లోపు తినేస్తే కడుపుబ్బరం బెడద ఉండదు. మంచి నిద్ర పడుతుంది. రాత్రంతా శరీరంలో కొవ్వు కరిగి బరువు నియంత్రణలో ఉంటుంది. ఇలా కాకుండా రాత్రిళ్లు ఆలస్యంగా భోజనం చేస్తే ఆకలి పెరిగి అతిగా తినడం ప్రారంభిస్తారు. అనారోగ్యకర ఆహారాలకు అలవాటు పడి చివరకు జీవన శైలి వ్యాధుల బారిన పడతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఇక తప్పనిసరి పరిస్థితుల్లో రాత్రిళ్లు పొద్దు పోయాక తినాల్సి వస్తే శాకాహారం స్వల్ప మొత్తంలో తీసుకోవాలని సూచిస్తున్నారు. తిన్న తరువాత కాసేపు యాక్టివ్‌గా ఉంటే మరింత ప్రయోజనం కలుగుతుందని చెబుతున్నారు. రోజూ ఒకే సమయంలో భోజనం చేయడం ద్వారా బరువు త్వరగా నియంత్రణలోకి వస్తుందని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
స్మార్ట్ ఫోన్‌తో బీపీ చెక్ చేసుకునే అవకాశం ఉందా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే..
40 ఏళ్లు దాటిన పురుషులు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన పరీక్షలు ఇవే