A Cultural Reflection: జొహ్రాన్.. మీరా.. మమ్దానీ.. సంస్కృతీ మథనం
ABN, Publish Date - Nov 04 , 2025 | 04:27 AM
సంస్కృతి అనే పదాన్ని నేను విన్నప్పుడు నా పిస్టల్‌ను పేల్చటానికి సిద్ధంచేస్తాను ఒక నాజీ రచయిత రాసిన నాటకంలో ఒక సైనికుడు అన్న మాటలవి...
‘‘సంస్కృతి అనే పదాన్ని నేను విన్నప్పుడు నా పిస్టల్‌ను పేల్చటానికి సిద్ధంచేస్తాను’’ ఒక నాజీ రచయిత రాసిన నాటకంలో ఒక సైనికుడు అన్న మాటలవి. 1930ల నాటి జర్మనీలో నెలకొంటున్న పరిస్థితులను ఆ మాటలు కళ్లకుకడతాయి. సంస్కృతి అంటే సంప్రదాయాలూ, విశ్వాసాలూ అలవాట్లూ, పండుగలూ, నోములూ, ధర్మాధర్మ ఆలోచనలూ, ఇహలోక–పరలోక చింతనలుగా ఆ రచయిత భావించలేదు. అసలు అట్లాంటి సంస్కృతితో నాజీలకు ఎలాంటి ఇబ్బందీ లేదు. కానీ 1930ల నాటికి సంస్కృతికి ఆ అర్థం మారింది. పరిధి విస్తృతమైంది. భిన్నభావాలు సంఘర్షించే క్షేత్రంగా, హేతుబద్ధ ఆలోచనలకు వేదికగా, ప్రజాస్వామ్య చింతనకు కేంద్రంగా, సమానత్వ భావనకు స్ఫూర్తినిచ్చే ఇంధనంగా సంస్కృతి ఉండాలనే భావన ఆలోచనాపరుల్లో అప్పటికే బలపడింది. అట్లాంటి సంస్కృతి గురించి మాట్లాడినా, కోరుకున్నా వేళ్లు పిస్టల్ ట్రిగ్గర్ మీదకు వెళ్లే విధంగా నాజీలు పాలించారు. ఇప్పుడు అటువంటి భయానక పరిస్థితుల్లేవు. కానీ వాటి ఛాయలూ, ధోరణులూ చాలా చోట్ల కనపడుతున్నాయి. భావప్రకటనా స్వేచ్ఛకు తిరుగులేదనుకునే అమెరికా కూడా వీటి ప్రభావానికి లోనవుతోంది. విశ్వవిద్యాలయాల్లో భావాలపై నిఘాలు పెరుగుతున్నాయి. సోషల్‌మీడియాలో భిన్నాభిప్రాయాలు ప్రకటించే వారి జాబితాలు తయారవుతున్నాయి. ఇజ్రాయెల్ విమర్శకులకు విద్యాలయాల్లో సీట్లు ఇవ్వకూడదనే ఆదేశాలు వెలువడుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతను కట్టడిచేయలేని విద్యాసంస్థలకు నిధులు నిలిపేసే చర్యలూ మొదలయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకాస్త ముందుకు వెళ్లి తనతో తీవ్రంగా విభేదించే వారందరినీ వామపక్షవాద పిచ్చివాళ్లుగా ముద్రవేస్తున్నారు. న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థిగా పోటీచేస్తున్న భారత సంతతికి చెందిన జొహ్రాన్ మమ్దానీకీ ఈ శాపనార్థాలు తప్పలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 34 ఏళ్ల జొహ్రాన్ న్యూయార్క్ ఎన్నికల్లో గెలిస్తే అమెరికాలో అదొక మేలిమలుపు అవుతుంది! మరికొన్ని గంటల్లో అక్కడ పోలింగ్ మొదలవుతుంది. ఫలితం ఎలా ఉన్నా జొహ్రాన్ మాత్రం ట్రంప్ బెదిరింపులకు లొంగకుండా ఎదురొడ్డి నిలబడ్డారు. తమ శ్రమతో, నైపుణ్యంతో, ఆలోచనలతో అమెరికా గడ్డను సుసంపన్నంచేసే వారందరికీ సమానావకాశాలు ఉండాలనీ, సమానహక్కులు దక్కాలనీ, సంపద వికేంద్రీకరణ జరగాలన్న వాదనతో ప్రచారం చేశారు. డెమొక్రాటిక్ సోషలిస్టుగా చెప్పుకొనే జొహ్రాన్ ఎన్నడూ తన భావాలనూ దాచుకోలేదు. బహుశా తల్లిదండ్రుల ప్రభావం జొహ్రాన్ మీద గాఢంగా ఉండివుండొచ్చు.
ప్రముఖ దర్శకురాలు మీరానాయర్, ప్రొఫెసర్ మహమూద్ మమ్దానీ.. జొహ్రాన్‌కు తల్లిదండ్రులు. సలాంబాంబే, మిసిసిపి మసాలా, కామసూత్ర, మాన్‌సూన్ వెడ్డింగ్ లాంటి సినిమాలకు మీరా దర్శకత్వం వహించారు. భారతీయ సినిమాకు అంతర్జాతీయ గుర్తింపును తీసుకుని రావటంలో మీరా పాత్రను విస్మరించలేం. మనల్ని మానవసంబంధాల లోతుల్లోకి తీసుకువెళ్లటమే కాదు.. భిన్న సంస్కృతుల కలయికనూ, దుర్భర పరిస్థితుల్లోనూ మనుషుల్లో తన్నుకుని వచ్చే ఆత్మస్థైర్యాన్నీ, సంప్రదాయ, పాశ్చాత్య ప్రభావాల పరస్పర రాపిడిలో ఎదురయ్యే జీవన సంఘర్షణలనూ మీరానాయర్ అద్భుతంగా చిత్రీకరించారు. మనుషుల జీవితాల్లోని వ్యక్తావ్యక్త అంశాలపై, అనుభూతులపై, ఆకాంక్షలపై, ఆరాటాలపై, అమానవీయాలపై, అసాంఘిక ప్రవృత్తులపై, పథభ్రష్టత్వాలపై ఎంతోకొంత వెలుతురు ప్రసరింపచేసి, మనలో సహానుభూతినీ, సానుభూతినీ, విశాలతనూ, విచారాన్నీ, అంతర్గత మథనాన్నీ పెంచటమే కళ పరమార్థం అనుకుంటే దానికి మీరానాయర్ ఖచ్చితంగా తోడ్పడ్డారు. ఇక మహమూద్ మమ్దానీ అయితే మనం ప్రపంచ రాజకీయాలను చూసే తీరుని మార్చివేయటంలో కీలకపాత్రను పోషించారు. బిన్‌లాడెన్ నేతృత్వంలోని ఇస్లామిక్ తీవ్రవాదులు న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ భవనాలను విమానాలతో ఢీకొట్టించి (11–09–2001) వేలమందిని చంపివేసిన తర్వాత.. అమెరికా నుంచి ఆరంభమైన ఉధృత ప్రచారం సంస్కృతులూ, మతాల మధ్య అసంబద్ధ చీలికను తెచ్చింది. ఇస్లాం సంస్కృతిలోనే తీవ్రవాదాన్నీ, నిరంకుశత్వాన్నీ పెంచిపోషించే తత్వం ఉందనీ.. ఆధునిక జీవనాన్నీ, ప్రజాస్వామ్యాన్నీ పరిరక్షించుకోటానికి ఆ సంస్కృతితో యుద్ధంచేయక తప్పదనే భావాలకు విపరీత ప్రాచుర్యం లభిస్తున్న నేపథ్యంలో మహమూద్ మమ్దానీ 2005లో ప్రభావవంతమైన పుస్తకాన్ని రాశారు. దాని పేరు మంచి ముస్లిం–చెడ్డ ముస్లిం (గుడ్ ముస్లిం, బ్యాడ్ ముస్లిం). ఆ పుస్తకం కలగచేసిన ప్రభావం అంతా ఇంతా కాదు. అమెరికా ప్రయోజనాలను సమర్థించే వారిని మంచి ముస్లింలు గానూ, వ్యతిరేకించే వారందరినీ చెడ్డ ముస్లింలు గానూ వర్గీకరించటంలో ఉన్న ప్రమాదాన్ని ఎత్తిచూపటంతోపాటు అసలు ఇస్లామిక్ టెర్రరిజాన్ని పాలుపోసి పెంచింది అమెరికానేనని గట్టి ఆధారాలతో మమ్దానీ విశ్లేషించారు.
మనిషిలోని బలహీనతలను అధిగమించి అధ్యాత్మిక ఔన్నత్యాన్ని సాధించటానికి నిరంతర పోరాటం చేయాలని చెప్పే జిహాద్ మూల భావనను పెద్దఎత్తున రాజకీయాలకు అన్వయించి, రాజకీయ లక్ష్యాల సాధనకు ఉపయోగించటం ప్రచ్ఛన్నయుద్ధకాలంలో (కోల్డ్‌వార్) మొదలైందనీ, అందుకు కావాల్సిన సాధన సంపత్తిని సమకూర్చటంతోపాటు, అవసరమైన ప్రచారమూ అమెరికా సారథ్యంలోనే సాగిందనీ మమ్దానీ వివరించారు. ఏ దేశంలోనైనా ప్రభుత్వానికి కమ్యూనిజం పట్ల ఎంతోకొంత అనుకూలత ఉందన్న నిర్ధారణకు అమెరికాకు వస్తే.. అక్కడ సోవియట్ రష్యా ప్రభావం పెరిగే ప్రమాదం ఉందని అనిపిస్తే మతవాద శక్తులనూ, తెగల మధ్య ఉండే విభేదాలనూ రెచ్చగొట్టటం అనేక సందర్భాల్లో జరిగింది. లక్షల మంది ఆ చర్యలకు బలి అయ్యారు. వియత్నాం యుద్ధంలో (1975) అమెరికా ఓడిపోయిన తర్వాత ఆఫ్రికా, అమెరికా, ఆసియా ఖండాల్లో సాగించిన పరోక్ష యుద్ధాల్లో మతాన్నీ, తెగలనూ ఉసిగొల్పటం ఒక విధానంలా సాగింది. ఇరాన్‌లో 1953లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని సీఐఏ కూలగొట్టింది. ఈజిప్టు, సిరియా, ఇరాక్, అల్జీరియాల్లో లౌకిక, జాతీయవాద, సోషలిస్టు శక్తులు 1950–60ల్లో బలంగా ఉండేవి. వాటిని బలహీనపర్చటానికి ఇస్లామిక్ ఛాందస వర్గాలకు చేదోడుగా నిలిచింది. 1979లో ఇరాన్‌లో వచ్చిన విప్లవంతో నిర్ఘాంతపోయిన అమెరికా షియాల నుంచి సున్నీలకు ప్రమాదం ఉందనే ప్రచారాన్ని చాపకింద నీరులా వ్యాపింపచేసింది. నియంతృత్వ, వంశపారంపర్య ప్రభుత్వాలున్న సున్నీ దేశాల్లో ఇరాన్ విప్లవాన్ని బూచీగా చూపించి మతశక్తులు బలోపేతం కావటానికి తోడ్పడింది. ఇక ఆఫ్ఘనిస్తాన్‌లో రష్యా సేనల ప్రవేశంతో ఇస్లాం ప్రమాదంలో పడిందన్న నినాదంతో ‘పవిత్రయుద్ధం’ కోసమంటూ 40 ముస్లిందేశాల నుంచి దాదాపుగా లక్షమందికి పైగా ముజాహిద్‌లను సమీకరించింది. వందల సంఖ్యలో మదర్సాలు ఏర్పాటు చేసింది. ప్రజాస్వామ్య స్థాపన నినాదంతో, బహుళపార్టీ రాజకీయ వ్యవస్థ ఏర్పాటు లక్ష్యంతో జనాలను సమీకరించటం అమెరికాకు ఇష్టంలేదు. అలాంటి భావజాలం బలపడితే ముస్లిందేశాల్లో తిరుగుబాట్లు వస్తాయి. ప్రజాప్రాతినిధ్యంలేని సర్కార్లు కూలిపోతాయి. అమెరికా ఆధిపత్యానికి సవాళ్లు ఎదురవుతాయి. అందుకే తన రాజకీయ లక్ష్యాల కోసం మతశక్తులనూ సంకుచిత ప్రయోజనాలను కాంక్షించే తెగలనూ ప్రోత్సహించింది. మత్తుపదార్ధాల కారిడార్లను ఏర్పరిచి టెర్రరిస్టు కార్యకలాపాల కోసం సీఐఏ నిధులు ఎలా సమీకరించిదన్న సమాచారాన్ని కూడా మమ్దానీ ఉదాహరణలతో పేర్కొన్నారు. 1985లో ముజాహిద్‌లలో కొందరిని ఏకంగా శ్వేతసౌధానికి ఆహ్వానించారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్‌రీగన్ చేసిన వ్యాఖ్యలను చూస్తే ముజాహిదీన్ పట్ల ఎలాంటి అభిప్రాయం ఉండేదో స్పష్టంగా తెలుస్తుంది. అమెరికా రాజ్య స్థాపక పితామహులకు ఉన్న నైతిక ఔన్నత్యం ముజాహిద్‌లకు ఉందని రీగన్ వ్యాఖ్యానించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో రష్యా వ్యతిరేక పోరాటానికి నాయకత్వం వహించాల్సిందిగా మొదట సౌదీ పాలక కుటుంబాన్నే అమెరికా కోరింది. దాన్ని తిరస్కరించినప్పటికీ సౌదీ పాలకులూ సీఐఏ కలిసి సంయుక్తంగానే బిన్‌లాడెన్‌ను ఆఫ్ఘన్ పోరాటానికి ఎంపిక చేశాయి. మరోవైపు ముజాహిదీన్ శిక్షణా కేంద్రంగా మారిన పాకిస్తాన్‌లో ఐఎస్‌ఐ ఆధిపత్యం ప్రభుత్వంపై పెరిగిపోయింది. మతశక్తుల పట్టు పాక్ సమాజంపై ఎక్కువైంది. ఆఫ్ఘనిస్తాన్‌లో విజయం సాధించిన ముజాహిద్‌లు కశ్మీర్‌లో కూడా దాన్ని పునరావృతం చేయగలమన్న భరోసాతో అక్కడా కార్యకలాపాలను మొదలుపెట్టారు. 40దేశాల నుంచి ఆఫ్ఘాన్‌కు వచ్చిన ముజాహిద్‌లు తిరిగి తమ దేశాలకు వెళ్లి అలజడులు ఆరంభించారు. ఆయుధాలను ఇచ్చి, సంకుచితత్వంలో తర్ఫీదులిచ్చి, పవిత్రయుద్ధాలకు డాలర్లను పంచి.. ఆ తర్వాత అమెరికా చేతులు దులుపుకున్నా తీవ్రవాదం హఠాత్తుగా మాయమైపోలేదు. 1990ల తర్వాత జరిగిన పరిణామాలన్నీ దాన్నే చాటిచెబుతున్నాయి. తాను సృష్టించిన శక్తులే తనమాట వినని పరిస్థితి అమెరికాకు వచ్చింది. విధ్వంసక శక్తిగా లాడెన్ మారటమే అందుకు నిదర్శనం.
ఇస్లాంపేరిట మతతత్వాన్ని నరనరాన ఎక్కించటం వెనుక రాజకీయం ఉంది. ఆధిపత్యాన్ని నిలుపుకోవాలన్న వ్యూహం ఉంది. ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాలను పడగొట్టటం వెనుకా, లౌకిక లక్ష్యాలున్న రాజకీయ పార్టీలను బలహీనపరచటం వెనుకా సుదీర్ఘ చరిత్ర ఉంది. అందుకే రాజకీయ ప్రమేయాలూ ప్రసక్తీ లేకుండా ఒక మతమంతా, ఒక సంస్కృతి అంతా నిరంకుశానికి అనుకూలమనీ, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమనీ, ఆధునిక జీవితానికి అడ్డంకి అనీ సూత్రీకరణలు చేయటం నిర్హేతుకం. సంస్కృతుల మధ్య సంఘర్షణగా రాజకీయాలనూ, రాజ్యవ్యవస్థలనూ చూడటం అవివేకం అవుతుంది. సంస్కృతిని జడపదార్థంగా పరిగణించటమూ, అవసరాలకు అనుగుణంగా మారలేని అశక్తతలోకి ఒక మతం కూరుకుపోయిందని భావించటమూ మనుషుల మధ్యా, సమూహాల మధ్యా పూడ్చలేని అగాధాన్నే సృష్టిస్తుంది. అదే ఈనాటి అసలైన ముప్పు. 2005లో మమ్దానీ చేసిన హెచ్చరిక ఈనాటి భారతావనికి నూటికి నూరుపాళ్లూ వర్తించే విధంగా మన రాజకీయాలు మారిపోతున్నాయి. ఇక్కడా సంస్కృతుల మధ్య అగాధాల సృష్టికి ప్రయత్నాలు తీవ్రంగా సాగుతున్నాయి. సంస్కృతుల మధ్య విభజన రేఖలను పెంచటమే కొందరికి పనిగా మారింది. ఘాతుకాలకు పాల్పడినవారూ, విష భావజాలాలను సృష్టించినవారూ చరిత్రను మరచిపోవాలని అనుకుంటారు. భవిష్యత్తులో ఇవి జరగకూడదని కోరుకునే వారే చరిత్రను నిరంతరం గుర్తు చేసుకుంటూ మానవీయ సమాజం కోసం తపనచెందుతారు. అమెరికా పాలకులకు చరిత్రమరపు ఎక్కువవ్వటంతోనే గతంలోని పాపాలపై ప్రాయశ్చిత్తం లేకుండా వ్యవహరిస్తున్నారన్నదే మమ్దానీ ఆవేదన!
-రాహుల్ కుమార్
Updated Date - Nov 04 , 2025 | 04:27 AM