Winter Session Heats Up: చలికాలంలో వేడి
ABN, Publish Date - Dec 02 , 2025 | 03:58 AM
దేశచరిత్రలోనే అతి తక్కువకాలం కొనసాగిన శీతాకాల సమావేశాలుగా రికార్డులకెక్కడం మాట అటుంచితే, కనీసం ఈ పదిహేనురోజుల పాటూ అవి సవ్యంగా సాగితే చాలునని సగటు...
దేశచరిత్రలోనే అతి తక్కువకాలం కొనసాగిన శీతాకాల సమావేశాలుగా రికార్డులకెక్కడం మాట అటుంచితే, కనీసం ఈ పదిహేనురోజుల పాటూ అవి సవ్యంగా సాగితే చాలునని సగటు పౌరుడి ఆశ. పార్లమెంట్ సమావేశాలకు ముందు ప్రధాని చేసిన వ్యాఖ్యలు సభ అలా జరిగేందుకు తోడ్పడేట్టు లేదు. బిహార్ ఎన్నికల్లో విపక్షాల ఘోరపరాజయాన్ని గుర్తుచేసి, ఆ అవమానభారంతో, అక్కసుతో సభను అడ్డుకోవద్దని విజ్ఞప్తిచేయడం ద్వారా కాంగ్రెస్‌ను రెచ్చగొట్టారాయన. మంచివాగ్ధాటి ఉన్న మోదీ నోటి నుంచి వెలువడిన టిప్స్ వంటి మాటలు అభిమానులు మెచ్చవచ్చును కానీ, విపక్షాలను మరింత రెచ్చగొట్టడమే అవుతుంది. బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే విజయం అద్భుతమైనది. దానిని ప్రజలకు గుర్తుచేసుకోవచ్చు, మహిళా ఓటర్ల భాగస్వామ్యాన్ని ప్రశంసించి, అదే అసలుసిసలు ప్రజాస్వామ్య విజయంగా అభివర్ణించుకోవచ్చు. కానీ, సభలో విపక్షాలు ప్రస్తావించబోయే అంశాలనూ, వాటి వ్యవహారశైలిని డ్రామాగా తీసిపారేసినట్టు కనిపించడం, ప్రతిపక్షాలు ఎలా పనిచేయాలో సలహా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానంటున్న ప్రధానికి ఏ మాత్రం తగదు. నిస్తేజంగా, దూరదూరంగా ఉన్న విపక్షాన్ని ఏకతాటిమీదకు రప్పించడానికి ఇటువంటి వ్యాఖ్యలు ఉపకరిస్తాయి.
సభలో మంచి చర్చ జరగాలన్న ప్రధాని అభీష్టం నెరవేరాలంటే అడుగులు వేయాల్సింది అధికారపక్షమే. ఎర్రకోట పేలుళ్ళ ఘటన దేశాన్ని భయోత్పాతంలో ముంచేసిన నేపథ్యంలో దేశభద్రత మీద చర్చ జరగాలని విపక్షం కోరడం సహజం. బిహార్ ఎన్నిక రెండోదశ ముందురోజున జరిగిన ఈ ఘటనలో భద్రతాపరమైన లోపాలు అనేకం కనిపిస్తున్నాయి. వేలాది కేజీల పేలుడు పదార్థాన్ని దట్టించిన వాహనం ఎంతోదూరం ప్రయాణించి, అన్ని గంటలు స్వేచ్ఛగా సంచరించడమే కాక, అప్పటికే ఉగ్రమూలాలను ఛేదించినా కూడా ఈ దారుణాన్ని నిఘావర్గాలు నిలువరించలేకపోవడం ఆశ్చర్యం. చర్చ పేరిట విపక్షాలు తనను ఇరకాటంలోకి నెట్టేందుకు ప్రయత్నిస్తాయన్న ఏకైక కారణంతో దేశప్రజలకు తెలియాల్సిన కీలకమైన అంశాలను ప్రభుత్వం గుప్పిట మూసివుంచడం సరికాదు. ప్రజలకు ఈ ఘటనపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై మిగిలివుంది. ఇక, అత్యంత శక్తిమంతమైన సంస్కరణ అంటూ 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్‌కోడ్స్‌కు కుదించి, దేశం మీదకు వదిలిన నేపథ్యంలో వాటిపై లోతైన చర్చ, విస్తృతమైన అవగాహన అత్యవశ్యం. కార్మికులకు, సంఘాలకు ఈ కోడ్స్ మీద శతకోటి అనుమానాలూ భయాలూ ఉన్నమాట నిజం.
ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (సర్) మీద చర్చ జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పార్లమెంటరీ వ్యవహారాలమంత్రి కిరణ్ రిజిజు ఓ మాటన్నందుకు సంతోషం. సోమవారం ఉభయ సభల్లోనూ ‘సర్’ మీద చర్చకు విపక్షాలు అదేపనిగా పట్టుబట్టడం, సభ అనేకసార్లు వాయిదాపడటం చూశాం. తక్షణమే చర్చ సాధ్యం కాదంటున్న ప్రభుత్వం, త్వరితంగా అందుకు సిద్ధపడితే ఈ రచ్చ తగ్గి సభ గాడినపడే అవకాశం ఉంటుంది. తొమ్మిది రాష్ట్రాల్లో, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ‘సర్’ అనుకున్నంత సవ్యంగా సాగడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఉన్నతాధికారుల ఒత్తిళ్ళను తట్టుకోలేక, గడువును అందుకోలేక ఇప్పటివరకూ పదిహేనుమందికి పైగా బూత్ లెవల్ ఆఫీసర్స్ (బీఎల్‌ఓ)లు ఆత్మహత్య చేసుకున్నారు. విధినిర్వహణలో ఉన్న సిబ్బంది కన్నీటిపర్యంతం అవుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో అనేకం దర్శనమిస్తున్నాయి. విపక్షాలు అదేపనిగా ఈ పరిస్థితిని ప్రశ్నిస్తున్న నేపథ్యంలో, ఎన్నికల సంఘం ఎట్టకేలకు ‘సర్’ వివిధ దశల గడువును మరోవారం హెచ్చించింది. ఈ అంశం మీద సభలో చర్చను చేపట్టకుండా ఎన్నికల సంఘం పక్షాన అధికారపక్షం వకాల్తాపుచ్చుకున్నదన్న భావన ప్రజలకు కలిగించడం అనవసరం. తాము ప్రస్తావించబోయే ప్రజాసమస్యలను తెరమరుగుచేసేందుకే ఏకంగా పదిగంటలపాటు ‘వందేమాతరం’ చర్చకు ప్రభుత్వం సిద్ధపడుతోందని కూడా విపక్షాలు అంటున్నాయి. మూడోమారు అధికారంలోకి వచ్చి కూడా తాము ఇప్పటివరకూ ఉద్ధరించిందేమిటో చెప్పుకోవడం కన్నా, అదేపనిగా గతాన్ని తవ్విపోసి, వర్తమానంలో దేశం ఎదుర్కొంటున్న సమస్యలకూ, బాధలకూ కాంగ్రెస్, నెహ్రూలే కారణమంటూ ఎదురుదాడిచేయడం అధికారపక్షానికి అలవాటుగా మారింది. రాబోయే పదిహేను రోజుల్లో సభ బయటకంటే లోపలే కాలుష్యం అధికమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, రాజ్యసభాధిపతిగా దర్శనమిస్తున్న కొత్త ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఎంత ఉదాత్తంగా, ఉన్నతంగా వ్యవహరిస్తారో చూడాలని ప్రజల కోరిక.
Updated Date - Dec 02 , 2025 | 03:58 AM