ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Opposition Heed Modi Advice: మోదీ సలహా విపక్షాలు పాటిస్తాయా

ABN, Publish Date - Dec 03 , 2025 | 02:48 AM

ఇక్కడ శీతాకాలానిదే విజయం. అధికార సోపానాల మంచు సామ్రాజ్యాలకోసం పోటీపడాలంటే ఇక్కడ రక్తం చల్లపడాలి..’ అని ఒక కవి రాసినట్లు బిహార్ ఎన్నికల తర్వాత ప్రారంభమైన పార్లమెంటు సమావేశాలు చాలా స్తబ్దంగా జరుగుతున్నాయి......

‘ఇక్కడ శీతాకాలానిదే విజయం. అధికార సోపానాల మంచు సామ్రాజ్యాలకోసం పోటీపడాలంటే ఇక్కడ రక్తం చల్లపడాలి..’ అని ఒక కవి రాసినట్లు బిహార్ ఎన్నికల తర్వాత ప్రారంభమైన పార్లమెంటు సమావేశాలు చాలా స్తబ్దంగా జరుగుతున్నాయి. ఇదే సమయంలో దేశ రాజధానిని, పొరుగు ప్రదేశాలను గజగజా వణికిస్తున్న చలి గాడ్పులు తీవ్రమవుతున్నాయి. మరోవైపు చలితో పోటీపడుతున్న వాయు కాలుష్యం మరింత దట్టమై ఊపిరితిత్తుల్లోకి దూసుకుపోయి శ్వాసించడాన్ని దుర్భరంగా మారుస్తోంది. కళ్ల ముందు పొగమంచు కమ్ముకుని ఉదయాలూ, సాయంత్రాలూ కారుమబ్బుల మధ్య ప్రయాణిస్తున్నట్టు అనిపించే వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఊపిరి పీల్చడానికి కష్టపడుతూనే కళ్లు మండుతున్నా ఢిల్లీ వాసులు తమ ప్రయాణాలు సాగిస్తున్నారు. ‘కాలుష్య నివారణకు మీరేం చేస్తున్నారో చెప్పండి..’ అని సుప్రీంకోర్టు కేంద్రంపై మరోసారి మండిపడింది! చాలా మంది మనుషుల మాదిరే సుప్రీంకోర్టుకూ జ్ఞాపకశక్తి తక్కువేనేమో? గత ఏడాది సరిగ్గా ఇవే రోజుల్లో వాయు కాలుష్యం నివారణ విషయమై కేంద్రాన్ని సుప్రీంకోర్టు గట్టిగా నిలదీసింది. న్యాయమూర్తులు మారుతున్నారు కాని ప్రజలకు న్యాయం మాత్రం గగన కుసుమంగా మారింది సుమా!

ఈ ఏడాది పార్లమెంట్ శీతాకాల సమావేశాలూ ప్రభుత్వ, ప్రతిపక్షాల తీరుతెన్నుల్లో మార్పేమీ లేదన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. గత ఏడాది శీతాకాల సమావేశాల్లో ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాల సమయం దాదాపు పూర్తిగా స్తంభించిపోయింది. మణిపూర్‌లో అల్లర్లు తదితర అంశాలపై చర్చకు అనుమతించలేదంటూ అప్పటి రాజ్యసభ చైర్మన్ దన్‌ఖడ్‌ను తొలగించేందుకు ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని సైతం ప్రవేశపెట్టాయి. ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానాన్ని అధికార పక్షం తిరస్కరించింది. అయితే ఆ తర్వాతి రోజుల్లో అదే చైర్మన్‌పై ప్రభుత్వమే విశ్వాసాన్ని కోల్పోయి ఆయనను ఇంటికి పంపిస్తుందని కానీ, ఈ ఏడాది శీతాకాల సమావేశాలు కొత్త చైర్మన్ ఆధ్వర్యంలో జరుగుతాయని కాని నాడు ఎవరూ ఊహించలేదు. గత ఏడాది హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం తర్వాత సమధికోత్సాహంతో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షాలను పూచికపుల్లల్లా పరిగణించింది. ఈ ఏడాది కూడా బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కనీవినీ ఎరుగని విజయం తర్వాత జరుగుతున్న ఈ శీతాకాల సమావేశాల్లో పాలకపక్షం సహజంగానే విజయోత్సాహంతో ఉన్నది. మరి మరింత బలహీనపడిన ప్రతిపక్షాలను బీజేపీ లెక్కచేస్తుందని మాత్రం ఎవరనుకుంటారు? ఎన్నికల్లో విజయాలు, చట్టసభల్లో సంఖ్యాబలం మాత్రమే ఒక పార్టీ జయాపజయాలకు కొలమానం కదా.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ శీతాకాల సమావేశాల తొలిరోజే విపక్షాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘బిహార్ ఎన్నికలకు ముందు దేశంలో తమకు అనుకూల వాతావరణాన్ని సృష్టించుకునేందుకు ప్రతిపక్షాలు వర్షాకాల సమావేశాలను ఉపయోగించుకోవాలని అనుకున్నాయని, ఇప్పుడు ఓటమి తర్వాత తమ నిరాశా నిస్పృహలను వ్యక్తం చేసేందుకు శీతాకాల సమావేశాలను ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాయని’ ఆయన వ్యంగ్యంగా విమర్శించారు. ప్రతిపక్షాలు తమ వ్యూహాన్ని, వైఖరిని మార్చుకోవాలని, కావాలంటే తాను అవి తమ పనితీరు మెరుగుపరుచుకునేందుకు వాటికి సలహాలు ఇస్తానని కూడా ఆయన అన్నారు. డ్రామాలు, నినాదాలకు పార్లమెంటు వెలుపల అనేక వేదికలు ఉన్నాయని, పార్లమెంట్ను ఎట్టి పరిస్థితులలోను వాటికి వేదికగా చేసుకోకూడదని ఆయన హితవు చెప్పారు.

నిజానికి ఆపరేషన్ సిందూర్ విషయంలో ఇంటా బయటా అనేక ఒత్తిళ్లను ఎదుర్కొన్న మోదీ సర్కార్‌ను గత వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షాలు నిర్దాక్షిణ్యంగా నిలదీశాయి. బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)పై కూడా అవి గందరగోళం సృష్టించాయి. ప్రతిరోజూ పార్లమెంట్ ఆవరణలోనూ, ఉభయ సభల్లోనూ ప్లకార్డుల ప్రదర్శన, నినాదాలు చేయడం ద్వారా మోదీ సర్కార్‌ను ఆత్మరక్షణలో పడవేసినట్లు ప్రతిపక్షాలు భావించాయి. కేవలం ఆపరేషన్ సిందూర్‌పై మాత్రమే రెండున్నర రోజులు చర్చించిన ఆ సమావేశాలు అంతకు మించి ఒక్క రోజు కూడా సాగకపోయినప్పటికీ ప్రభుత్వం ఉభయ సభల్లోనూ 15 ముఖ్యమైన బిల్లులను గందరగోళం మధ్యే ఆమోదించుకోగలిగింది.

వర్షాకాల సమావేశాల తర్వాత జరిగిన బిహార్ ఎన్నికల్లో ప్రతిపక్షాలు విజయం సాధించలేకపోవడం ఆశ్చర్యకరమైన విషయమే. ఆపరేషన్ సిందూర్‌ను ఆకస్మికంగా నిలిపివేయడంపై విపక్షాల విమర్శలను బిహార్ ప్రజలు పట్టించుకోలేదా? పెద్ద ఎత్తున ఓటర్లను తొలగించేందుకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను చేపట్టారని తీవ్ర రభస చేసిన విపక్షాలను ఓటర్లు ఎందుకు విస్మరించారు? పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలు ప్రజలపై ప్రభావం చూపించడం లేదా? పార్లమెంట్ లోపలే కాదు, బయట కూడా ‘సర్‌’పై విపక్షాలు నిరసన యాత్రలు, సభలు నిర్వహించాయి. అయినా ఎన్నికల ఫలితాలు మాత్రం వారు ఊహించని విధంగా వచ్చాయి.

అయినప్పటికీ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజు నుంచే ‘సర్‌’పై విపక్షాలు ఉభయ సభలను స్తంభింపచేయడం మొదలుపెట్టాయి. ఢిల్లీలో ఎర్రకోట వద్ద బాంబు పేలుళ్లపై చర్చ జరగాలని డిమాండ్ చేశాయి పార్లమెంట్ ఆవరణలో సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంకతో సహా ప్రతిపక్ష నేతలు అందరూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. మోదీ సర్కార్‌ వీటన్నింటినీ మాత్రం లెక్కచేయకుండా మొదటి రోజునుంచే గందరగోళం మధ్య బిల్లులను ఆమోదింపచేసుకోవడం మొదలుపెట్టింది. చివరకు ‘సర్‌’పై నిర్దిష్టంగా కాకపోయినా స్థూలంగా ఎన్నికల సంస్కరణలపై వచ్చే వారం చర్చకు ప్రభుత్వం అంగీకరించింది. చర్చించినంత మాత్రాన ఏమి జరుగుతుంది? సవరణ పేరుతో దళితులు, ఓబీసీలు, అణగారిన వర్గాల ఓటర్లను తొలగిస్తున్నారని విపక్ష నేతలు చేసే ఆరోపణలను ప్రభుత్వం అంగీకరిస్తుందా? ఎన్నికల సంఘం ప్రధానాధికారి జ్ఞానేశ్ కుమార్ బీజేపీ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారన్న విపక్షాల విమర్శలకు ప్రభుత్వం ఏ విధంగా ప్రతిస్పందిస్తుంది? ఓటర్ల జాబితా సవరణను వేగవంతం చేయడంతో భయాందోళనలను, పని ఒత్తిళ్లను ఎదుర్కోలేక ఒక్క బెంగాల్‌లోనే నలుగురు బీఎల్ఓలతో సహా దాదాపు 39 మంది మరణించారని ప్రతిపక్షాలు చెప్పిన విషయాల్లో వాస్తవాలు ఉన్నాయని కేంద్రం ఏకీభవిస్తుందా?

సర్‌పై చర్చకు ముందు ప్రభుత్వం ఈ నెల 8, 9 తేదీల్లో వందేమాతరం లిఖించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పార్లమెంట్‌లో చర్చను నిర్వహించడం ఈ శీతాకాల సమావేశాల్లో చెప్పుకోదగ్గ విశేషం. బంకించంద్ర ఛటర్జీ రచించిన ఈ గీతాన్ని రవీంంద్రుడు తొలుత కాంగ్రెస్ సదస్సులో ఆలపించారు. తదాది ఆ గీతం భారత స్వాతంత్ర్య పోరాట చైతన్య గీతమై పల్లవించింది. వందేమాతరం ఆలపించినందుకే నిజాం ప్రభుత్వం పీవీ నరసింహారావుతో సహా పలువురు విద్యార్థులను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బహిష్కరించింది. నిజానికి స్వాతంత్ర్య పోరాటం నిర్వహించిన చరిత్ర తమకు ఉన్నదని చెప్పుకుంటున్న కాంగ్రెస్ వందేమాతరం శతాబ్దిన్నర ఉత్సవాలను తానే ఘనంగా నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్లాల్సిన విలువైన సందర్భమది. కానీ కాంగ్రెస్‌కు దక్కాల్సిన ఘనతను బీజేపీయే ఇప్పుడు దక్కించుకోవడమే కాక జాతీయవాద భావాలను పురికొల్పి తన రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకునేందుకు పెద్ద ఎత్తున సంకల్పించింది. పైగా మతశక్తులను బుజ్జగించేందుకు వందేమాతరంలో కొన్ని చరణాలను తొలగించడం ద్వారా దేశ విభజన బీజాలను కాంగ్రెస్‌ నాటిందని మోదీతో పాటు బీజేపీ నేతలు గుప్పించిన ఆరోపణలు కాంగ్రెస్‌ను మరింత ఆత్మరక్షణలో పడవేశాయి. ఏ చారిత్రక సందర్భంలో తాము అలా చేయవలసి వచ్చిందో, రాజ్యాంగ సభ దాన్ని ఎలా ఆమోదించిందో కాంగ్రెస్ సమర్థంగా సమర్థంగా వివరించలేకపోతున్నదా అన్న భావన కలుగుతోంది. ఇప్పుడు వందేమాతరంపై జరిగే చర్చను కూడా బీజేపీ పార్లమెంట్లో తమకే పూర్తిగా అనుకూలంగా, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మార్చేందుకు కచ్చితంగా ప్రయత్నిస్తుంది. ఇలాంటి విషయాల్లో కాంగ్రెస్‌కు కాలం అనుకూలంగా లేదన్న వాస్తవాన్ని ఆ పార్టీ నేతలు అంగీకరించలేకపోతున్నారు. పార్లమెంట్ సమావేశాల సమయంలోనే డిసెంబర్ 4, 5 తేదీల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్‌లో రెండు రోజులు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రష్యాతో కీలకమైన సైనిక, వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేయడం మోదీ సర్కార్‌కు మరింత ఆత్మస్థైర్యం కలిగించే విషయం. రష్యాతో సంబంధాలను తగ్గించుకోవాలని అమెరికా తీవ్ర ఒత్తిడి చేస్తున్న సమయంలో ఆ దేశంతో ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంపొందించుకునేందుకు భారత్ నిర్ణయించుకోవడం ఒక కీలక పరిణామం, సందేహం లేదు. పుతిన్‌ పర్యటననూ మోదీ తన ప్రతిష్ఠను పెంచుకునేందుకు ఆయన సద్వినియోగం చేసుకుంటారనడంలో సందేహం లేదు.

ఈ మొత్తం పరిణామాల క్రమంలో కాంగ్రెస్, ప్రతిపక్షాలు తమ భావి కార్యాచరణను ఏ విధంగా నిర్ణయించుకోవాలన్న విషయమై అయోమయంలో ఉన్నాయని చెప్పక తప్పదు. పార్లమెంటులో నినాదాలు చేస్తూ నిరసనలు వ్యక్తం చేయడం వల్ల సాధించేదేమీ ఉండదు. విపక్షాలను ఉద్దేశించి మోదీ చేసిన వ్యాఖ్యలను సలహాలుగా అవి ఎందుకు పాటించకూడదు? అందులో తప్పేమీలేదు. ప్రతిపక్షాలే కాదు, మన ప్రజాస్వామ్యం సుస్థిరంగా, క్షేమంగా ఉండాలని, ప్రజలు చైతన్యవంతులు కావాలని కోరుకునేవారంతా తమ పోరాట రూపాల్ని మరోసారి సమీక్షించుకోవాల్సిన అవసరం ఉన్నదేమో!

-ఎ. కృష్ణారావు

Updated Date - Dec 03 , 2025 | 02:49 AM