Local Needs Over Big Promises: ఊరు వాడ ఇక్కట్లు తీర్చరా
ABN, Publish Date - Sep 19 , 2025 | 01:28 AM
స్వతంత్ర భారతావనిలో గడిచిన 78 ఏళ్లుగా లెక్కలేనన్ని సంక్షేమ పథకాల తర్వాత క్రమంగా ‘కేవలం సంక్షేమ పథకాలు, బడా ప్రాజెక్టులు మాత్రమే ఓట్ల వర్షం కురిపిస్తాయి’ అన్న నమ్మకం పాలకుల్లో బలపడిపోయింది. ఆ నమ్మకం దెబ్బతిని ఎన్నికల్లో...
స్వతంత్ర భారతావనిలో గడిచిన 78 ఏళ్లుగా లెక్కలేనన్ని సంక్షేమ పథకాల తర్వాత క్రమంగా ‘కేవలం సంక్షేమ పథకాలు, బడా ప్రాజెక్టులు మాత్రమే ఓట్ల వర్షం కురిపిస్తాయి’ అన్న నమ్మకం పాలకుల్లో బలపడిపోయింది. ఆ నమ్మకం దెబ్బతిని ఎన్నికల్లో ఓటమిపాలైన ప్రతిసారీ సరికొత్త పథకాల కోసం వెతుకుతున్నారే తప్ప ఆ నమ్మకం నుంచి మాత్రం బయటపడటం లేదు.
సంక్షేమ పథకాలకు భారీగా శ్రీకారం చుట్టిన ఎన్టీఆర్ 1989 ఎన్నికల్లో ఓడిపోయారు. వాటిని పతాక స్థాయికి తీసుకెళ్లిన వై.ఎస్. రాజశేఖరరెడ్డి 2009 ఎన్నికల్లో బొటాబొటి మెజార్టీతో గట్టెక్కారు. 2019–2024 మధ్య దాదాపు రెండున్నర లక్షల కోట్లు సంక్షేమ పథకాలపై ఖర్చుపెట్టిన వైసీపీ అధినేత జగన్ ఏపీలో కేవలం 11 సీట్లకే పరిమితమయ్యారు. 2014–19 మధ్య చంద్రబాబు సంక్షేమానికి పెద్దపీట వేసి రెండు లక్షల కోట్ల రూపాయల పైచిలుకు పథకాలు ఇచ్చినా కేవలం 23 సీట్లే దక్కాయి. తెలంగాణలో పదేళ్లలో కేసీఆర్ సర్కార్ ఎన్నో సంక్షేమ పథకాల్ని ప్రవేశపెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటివి చేపట్టినా ఫలితం దక్కలేదు.
ఇన్ని ఉదాహరణలు కనిపిస్తున్నా ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు, భారీ ప్రాజెక్టులకు కేటాయిస్తున్న నిధుల్లో పదోవంతు కూడా స్థానిక సమస్యల మీద ఖర్చు పెట్టడం లేదు. నియోజకవర్గ పరిధిలో వివిధ అంశాల్లో ప్రాథమిక అవసరాలు తీర్చడానికి సదరు ఎమ్మెల్యేకి ఏడాదికి రూ.25కోట్లు ఇచ్చినా తెలంగాణలో ఐదేళ్ళకు అయ్యే ఖర్చు రూ.14,875కోట్లు. ఐదేళ్ళకు రూ.14లక్షల కోట్లకు పైగా బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఈ రాష్ట్రంలో రూ.14,875 కోట్లు అనేది కేవలం ఒక్క శాతమే. కానీ దీనివల్ల విద్య, ఆరోగ్యం, తాగునీరు వంటి ప్రాథమిక అంశాల విషయంలో ఏళ్లకొద్దీ ఎదురు చూపులు తప్పుతాయి. దీనివల్ల అవినీతికి ఆస్కారముందని భావించవచ్చు. కానీ ఎంపీ నిధుల అంశాన్ని తీసుకుందాం. ఈ దేశంలో జరుగుతున్న అవినీతితో పోల్చుకుంటే ఎంపీ లాడ్స్ అంశంలో అతితక్కువ దుర్వినియోగం జరుగుతోంది. కిందిస్థాయి నుంచి పై స్థాయి దాకా అధికారులకు ఇచ్చే నజరానాలు మిగులుతాయి. ఏ గ్రామంలో పనులు ఆ గ్రామస్తులతో చేయిస్తే స్థానికంగా ఉపాధి కూడా దొరుకుతుంది. సంక్షేమంతో పాటు స్థానిక అవసరాలకు ప్రభుత్వాలు పెద్దపీట వేయకుంటే ప్రజల్లో అసంతృప్తి పెరుగుతూనే ఉంటుంది.
సామాన్యులు వివిధ అంశాలపై ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగడం స్వతంత్ర భారతావనిలో సర్వసాధారణ దృశ్యం. ఇదే దృశ్యంలో సామాన్యుడికి బదులుగా ఒక ఎమ్మెల్యేని ఊహించుకోండి. మనస్కరించడం లేదు కదా! కానీ జరుగుతున్న చరిత్ర ఇదే. ఎమ్మెల్యే బయటకు వచ్చాడంటే చుట్టూ జనమే. తమ కష్టాలు తీరుస్తారన్న నమ్మకంతో వచ్చేవాళ్ళే వారిలో చాలా మంది. ఆయన ఏ ఊరికైనా వెళ్తే చిన్నపాటి రోడ్డు, కాలవ, బడి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మొదలుకొని ఎన్నో సదుపాయాల విషయంలో సమస్యలు తీరతాయని పేద బడుగు బలహీనవర్గాల ప్రజలు తండోపతండాలుగా వస్తారు. నిజాయితీగా చెప్పాలంటే ఎమ్మెల్యే అందులో చాలా సమస్యల్ని తమ విచక్షణాధికారంతో పరిష్కరించే అవకాశముంటుంది. కానీ 90శాతం సమస్యలు ఆర్థిక అనుమతులతో ముడిపడి ఉండేవి. నియమనిబంధనల సుడిగుండంలో చిక్కుకొని అల్లాడేవి మరికొన్ని. దీంతో ప్రజా బాహుళ్యం నుంచి నాయకుడిగా ఎమ్మెల్యే స్థానంలోకి వచ్చిన ఆ మనిషి యథావిధిగా అధికార గణం, ప్రభుత్వ కార్యాలయాల వైపు చూడాల్సిందే. ఇందులో తప్పులేదు కూడా. కానీ ఆశ్చర్యం ఏమిటంటే– ప్రభుత్వ కార్యాలయాల్లో వివిధ స్థాయిల అధికారుల నుంచి సామాన్యులకు ఎదురయ్యే సమాధానాలే, సదరు ఎమ్మెల్యేకి కూడా ఎదురవుతున్నాయి. కాకపోతే కాస్త గౌరవంగా వస్తాయి అంతే. అంతకుమించి పనుల వేగంలోను, అనుమతుల విషయంలోను పెద్దగా వచ్చే మార్పేమీ ఉండదు. దీంతో నిజంగా ప్రజలకు ఏదైనా చేద్దామన్న తపనతో ముందుకు వచ్చే ఎమ్మెల్యేలు సైతం ఇలాంటి అనుభవాలతో కొన్నేళ్లకే తమ వైఖరి మార్చుకుంటున్నారు. అధికారుల్ని గట్టిగా ప్రశ్నిస్తే దాన్ని రాజకీయ కోణంలో చూస్తారన్న సందేహం ఒకటి ప్రజాప్రతినిధుల్ని దూకుడుగా ముందడుగు వేయకుండా ఆపుతోంది. దీంతో సద్భావన ఉన్న ఎమ్మెల్యేలు సైతం కొన్నేళ్ళకి స్తబ్ధుగా మారుతున్నారు. దీంతో ప్రజలు కూడా ఎమ్మెల్యేలు తమ ఇంటిలో జరిగే శుభకార్యాలకు వస్తే చాలనుకుంటున్నారు. ఈ మాటలు చెప్పడానికి కాస్త ఇబ్బందిగా అనిపించినా క్షేత్రస్థాయిలో దేశమంతటా ఇదే వాతావరణం నెలకొని ఉన్నది.
దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో చూసినా ప్రభుత్వాలు పలు సంక్షేమ కార్యక్రమాలు, బడా ప్రాజెక్టులకు మాత్రమే రూపకల్పన చేస్తున్నాయి. కానీ అదే స్థాయిలో ప్రజల చేత ఎన్నికైన ఎమ్మెల్యేలకు చిన్న చిన్న పనుల విషయంలో విచక్షణాధికారం ఉండేలా చూస్తే మంచిది. ఇందులో తప్పొప్పులు దొర్లకుండా చూసేందుకు అవసరమైన నియంత్రణ ఉంచి ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఒక్కో నియోజకవర్గ స్థాయిలో ఏటా రూ.25 కోట్ల పనులు జరిగేలా చూస్తే మంచిది. బడా ప్రాజెక్టులు, సంక్షేమ కార్యక్రమాలతో పోలిస్తే రాజకీయంగా కూడా ఇలాంటి పనులు ఎక్కువ ప్రయోజనాన్ని కలిగిస్తాయని ఇప్పటికే ఎన్నోసార్లు రుజువైంది. దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ఈ దిశగా ఆలోచించాల్సిన సమయం వచ్చింది.
బడా ప్రాజెక్టులు, బడా ఈవెంట్లు, వందల కోట్ల ప్రకటనలు... వీటి కంటే– ప్రజల అసలు అవసరం సీసీ రోడ్లు, డ్రయినేజీలు, స్వచ్ఛమైన తాగునీరు, పిల్లల వ్యాధులకు గ్రామంలోనే మందులు దొరకడం, స్కూలు కాంపౌండ్ వాల్, మరుగుదొడ్లు... ఇలాంటివి! వీటికి పెద్ద బడ్జెట్లు అవసరం ఉండదు. ప్రతి నియోజకవర్గానికి ఏటా రూ.25కోట్లు నేరుగా ఎమ్మెల్యే విచక్షణ అధికారంతో ఇస్తే– ఒక్కో ఊరిలో దశాబ్దాలుగా నిలిచిపోయిన వేలాది పనులు కొన్నేళ్లలోనే పూర్తవుతాయి. ఇకనైనా రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు స్థానిక సమస్యలకు ప్రాముఖ్యతను ఇచ్చి తగినంత ఖర్చుపెట్టకపోతే ప్రజాస్వామ్యం దాని అర్థాన్ని కోల్పోతుంది.
మెజార్టీ ప్రభుత్వాలు సంక్షేమ పథకాల్ని వల్లె వేస్తున్నాయి. ప్రతిపక్షాలు అధికారం కోసం ఆ డోసు పెంచుతామని వాగ్దానం చేస్తున్నాయి. ఇదో విషవలయంలా మారుతున్నది. ఏది మంచీ ఏది చెడూ అన్న ఆత్మశోధన లేకుండా పోయింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వాస్తవ పరిస్థితిని ప్రజలకు వివరించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే అధికారమే పరమావధిగా కొన్ని ప్రతిపక్షాలు ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్నాయి. ప్రజలు కూడా ఆ మాయలో పడితే మిగులు బడ్జెట్‌తో మొదలైన తెలంగాణ మరికొద్ది ఏళ్లలోనే పేద రాష్ట్రంగా మిగిలిపోతుంది.
యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Sep 19 , 2025 | 01:28 AM