ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వెంగళరావును పొగిడినందుకే శ్రీశ్రీ సస్పెన్షన్‌

ABN, Publish Date - Jun 25 , 2025 | 06:08 AM

ఏపీ ఆర్‌ఎస్‌యూ మొదటి అధ్యక్షుడు వెంకటరమణి ఇంటర్వ్యూలో... ఆయనకు జ్ఞాపకశక్తి సమస్య వల్ల కావచ్చు, ‘విరసం’కు సంబంధించిన కొన్ని అవాస్తవాలు దొర్లాయి (24.06.2025 ఆంధ్రజ్యోతి). మా విరసం కార్యవర్గ సభ్యుడు పరిటాల శ్రీరాములు ధర్మవరం, అనంతపురం జిల్లా ప్రాంతంలో...

ఏపీ ఆర్‌ఎస్‌యూ మొదటి అధ్యక్షుడు వెంకటరమణి ఇంటర్వ్యూలో... ఆయనకు జ్ఞాపకశక్తి సమస్య వల్ల కావచ్చు, ‘విరసం’కు సంబంధించిన కొన్ని అవాస్తవాలు దొర్లాయి (24.06.2025 ఆంధ్రజ్యోతి). మా విరసం కార్యవర్గ సభ్యుడు పరిటాల శ్రీరాములు ధర్మవరం, అనంతపురం జిల్లా ప్రాంతంలో బస్సులో ప్రయాణం చేస్తుండగా అతడిని భూస్వామ్య గూండాలు 1975 మే 29న హత్య చేసారు. ఆయన సంస్మరణలో ‘సృజన’ జూలై సంచిక ‘సాహితీమిత్రులు’ తయారు చేస్తుండగానే ఆ ఏడాది జూన్‌ 26న నన్ను అరెస్టుచేసి వరంగల్‌ జైల్లో ఎమర్జెన్సీ మీసా చట్టం కింద డిటెన్యూగా పెట్టారు. (ఆ సంచిక ఎమర్జెన్సీ ఎత్తివేసాక ఆగస్టు 1977లో వెలువడింది.) వెంకటరమణి తన ఇంటర్వ్యూలో ప్రస్తావించిన శ్రీరాములు ఈయన కాదు; బహుశా యూసీసీఆర్‌ఐ ఎంఎల్‌ శ్రీరాములు (రేపల్లె ప్రాంతం) అయి ఉంటాడు. ఎమర్జెన్సీ మొదటి సంవత్సరం ముగుస్తుండగా వరంగల్‌ జైలు నుంచి నన్ను, నెల్లూరు జైలు నుంచి కేవీఆర్‌ను, హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలుకు మార్చారు. అప్పటికే రమణితో పాటు విరసం సభ్యులు చెరబండరాజు, ఎంటి ఖాన్‌, బొజ్జా తారకం, బి.రామిరెడ్డి వంటి విరసం సభ్యులు ఆ జైల్లో ఉన్నారు. ఆ బ్లాక్‌లోనే ఆరెస్సెస్‌ దేశ్‌ముఖ్‌, బీజేపీ బంగారు లక్ష్మణ్‌, నరేంద్ర వంటి వాళ్లు ఉన్నారు. దత్తాత్రేయ తర్వాత అరెస్టయి వచ్చారు. 1976 జులై 28న ఉస్మానియా ఆసుపత్రిలో తరిమెల నాగిరెడ్డి మరణించారని తెలిసాక, దేశ్‌ముఖ్‌ మా ముందు ఒక ప్రతిపాదన పెట్టారు. ‘నేను అనంతపురంలో పనిచేసినపుడు నాకు నాగిరెడ్డిగారితో మంచి స్నేహమైంది. రాజకీయాభిప్రాయాలతో ఏ మాత్రం రాజీపడకుండానే ఆయన స్నేహంగా ఉండేవాడు. మేము ఈ ఆగస్టు 15న అరవిందఘోష్‌ శతజయంతితో పాటు,

నేను వ్యక్తిగతంగా నాగిరెడ్డిగారి జ్ఞాపకాలు చెప్పడానికి సమావేశం పెట్టుకుంటున్నాం, మీకు అభ్యంతరం లేకపోతే మనం కలిసి సమావేశం పెట్టుకుందాం, మీరూ నాగిరెడ్డి గురించి మాట్లాడవచ్చు’ అని దేశ్‌ముఖ్‌ అన్నాడు. మేం అంగీకరించాం. సమావేశం సజావుగా సాగింది. ముగించేముందు చెరబండరాజు ‘వందేమాతరమ్‌’ కవిత చదివి, బయటకు వెళ్లారు. ఆయన వెనుకనే ఆలె నరేంద్ర పోవడం మేం గమనించలేదు. కాసేపటికి చెరబండరాజు ‘అమ్మా’ అన్న కేక వినిపించింది. సభ చెదిరిపోయింది. బయట బ్యాడ్మింటన్‌, వాలీబాల్‌ వంటి ఆటల కోసం నెట్‌ కట్టే వెదురుబొంగు తీసుకొని చెరబండరాజు తలపై నరేంద్ర కొట్టాడు. జైలు పోలీసులు వచ్చి మమ్ములను మా వేర్వేరు బ్లాకులలో (ఆవరణ ఒకటే) లాక్‌ చేసారు. కిచెన్‌ ఒకటే అయినా మెస్‌లు, వంటలు వేరు. మేం సాయంత్రం వంటపాత్రలు ఇచ్చే దగ్గర గుర్రం విజయకుమార్‌ నాయకత్వంలో నరేంద్రపై ప్రతిదాడి చేయగలిగాం. దానితో సైరన్‌ మోగి బయటి పోలీసులు కూడా వచ్చి జైలర్‌ రామారావు (మిలిటరీలో వాలంటరీ రిటైర్‌మెంట్‌ తీసుకొని వచ్చాడు) పర్యవేక్షణలో మమ్ములను మసీదు ఉన్న ఆవరణలోని బ్లాకుకు మార్చాడు. అక్కడికి విరసం, ఎంఎల్‌ పార్టీల డిటెన్యూలతో పాటు సోషలిస్టు పార్టీ వాళ్లలో నాయిని నర్సింహారెడ్డి ఒక్కరే వచ్చారు. శ్రీశ్రీ ఎమర్జెన్సీని లెఫ్ట్‌ డిక్టేటర్‌షిప్‌ అన్నాడు. 20 సూత్రాల పథకంపై ఒక సినిమాకు పాట రాసాడు. ఆ విషయం మాలో నలుగుతున్నది. మేం ఎమర్జెన్సీ ప్రారంభ కాలంలోనే హైకోర్టులో రిట్‌ పిటిషన్స్‌ వేసి అన్ని జైళ్లల్లో ఉన్నవాళ్లం ముప్పైమంది దాకా ముషీరాబాద్‌ (సికింద్రాబాదు) జైల్లో కలిసినపుడు విరసంగా వ్యవహరించి లిఖిత పత్రిక కూడా నిర్వహించాం. ఇందులో భాగంగా శ్రీశ్రీకి కేవీఆర్‌ అభిశంసన కూడా రాసాడు.

తర్వాత వెంగళరావు మద్రాసు వెళ్లినపుడు శ్రీశ్రీ ఆయనను సమర్థుడైన పాలకుడని అన్నట్లు పత్రికలో చదివిన కేవీఆర్‌ అప్పుడు తానుఉన్న చంచల్‌గూడ జైలు నుంచే శ్రీశ్రీని సస్పెండ్‌ చేస్తూ ఒక ఉత్తరాన్ని రాసాడు. అంతేగానీ అల్లూరి సీతారామరాజులో ‘తెలుగువీర లేవరా’ పాటకు జాతీయ అవార్డు విషయం కాదు. ‘ఖడ్గసృష్టి’కి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తీసుకున్న 1970ల నుంచీ మాకు శ్రీశ్రీపట్ల అభ్యంతరాలు ఉంటూనే ఉన్నాయి. వాటిని ఆయన ఉల్లంఘిస్తూనే ఉన్నాడు. వెంగళరావు మీద అంత తీవ్రమైన పాట–భూమయ్య కిష్టాగౌడ్‌ల ఉరిశిక్ష సందర్భంగా, సికింద్రాబాదు కుట్రకేసు సందర్భంగా రాసినా–శ్రీశ్రీ అరెస్టు ఎమర్జెన్సీలో మద్రాసులో ఉండడం వల్ల (అక్కడి డీఎంకే పాలన వల్ల) తప్పిపోయింది. కనుక ప్రధాని ఇందిరాగాంధీనైనా, ముఖ్యమంత్రి జలగం వెంగళరావునయినా ప్రశంసించడం అవకాశవాదం, పిరికితనం అవుతుందని భావించాం. కేవీఆర్‌ డిటెన్యూ డైరీలో, కేవీఆర్‌ లేఖలులో, సృజన సంచికలలో ఈ విషయాలన్నిటికీ మీకు ఆధారాలు దొరుకుతాయి.

వరవరరావు

ఇవీ చదవండి:

హార్ముజ్ జలసంధి మూసివేస్తే.. భారత్‌ తట్టుకోగలదా

మరోసారి మైక్రోసాఫ్ట్‌లో లేఆఫ్స్.. వేలల్లో తొలగింపులు ఉంటాయంటూ కథనాలు వైరల్

మరిన్ని బిజినెస్అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 25 , 2025 | 06:08 AM