Share News

Strait Of Hormuz: హార్ముజ్ జలసంధి మూసివేస్తే.. భారత్‌ తట్టుకోగలదా

ABN , Publish Date - Jun 23 , 2025 | 12:00 PM

మధ్యప్రాచ్యం నుంచి చమురు దిగుమతులు తగ్గితే భారత్‌ ముందు అనేక ప్రత్యామ్నాయాలు ఉన్నాయని ఇంధన రంగ నిపుణులు చెబుతున్నారు. రష్యా, బ్రెజిల్ వంటి దేశాల నుంచి ముడి చమురు దిగుమతులు పెంచుకునే వీలుందని అంటున్నారు.

Strait Of Hormuz: హార్ముజ్ జలసంధి మూసివేస్తే.. భారత్‌ తట్టుకోగలదా
india oil imports 2025

ఇంటర్నెట్ డెస్క్: హార్ముజ్ జలసంధి మూసేస్తారన్న ఆందోళనల నడుమ ముడి చమురు ధరలకు రెక్కలొచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్‌లు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. అసలు హార్ముజ్ జలసంధి మూసేస్తారా.. ఆ పరిస్థితి తలెత్తితే భారత్‌పై ప్రభావమెంత అనే ప్రశ్నలకు విశ్లేషకులు కీలక విషయాలు వెల్లడించారు.

ఇంధన రంగ నిపుణులు, పరిశీలకులు చెప్పిన దాని ప్రకారం, భారత్ ప్రస్తుతం మధ్య ప్రాచ్యం నుంచే కాకుండా రష్యా, యూఎస్, బ్రెజిల్ నుంచి కూడా చమురును దిగుమతి చేసుకుంటోంది. అనుకోని అవాంతరాలు తలెత్తిన సందర్భాల్లో ఈ దేశాల దిగుమతులతో చమురు లోటును భర్తీ చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంది. ప్రస్తుతం ప్రపంచంలో చమురు దిగుమతి, వినియోగంలో భారత్ మూడోస్థానంలో ఉంది. భారత ఇంధన అవసరాల్లో 90 శాతం దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. ఇందులో 40 శాతం మధ్య ప్రాచ్య దేశాల నుంచే అందుతోంది. ఇదంతా హార్ముజ్ జలసంధి మీదుగా భారత్‌కు చేరుతోంది. దిగుమతి చేసుకునే 5.1 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును భారత్ స్వదేశీ రిఫైనరీల్లో పెట్రోల్, డీజిల్‌గా శుద్ధి చేసి ప్రజలకు పంపిణీ చేస్తోంది.


ఇక మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మొదలైన నేపథ్యంలో భారత్ రష్యా నుంచి చమురు దిగుమతులను పెంచింది. సౌదీ, ఇరాక్‌ నుంచి వస్తున్న దిగుమతులతో సమానంగా రష్యా నుంచి ముడి చమురు తెచ్చుకుంటోంది. ప్రస్తుతం రోజుకు 2.1 నుంచి 2.2 మిలియన్ బ్యారెళ్ల రష్యా చమురు భారత్‌కు వస్తోంది. మొత్తం చమురు దిగుమతుల్లో ఇది 35 శాతం.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలుకాక మునుపు భారత్ మధ్య ప్రాచ్య దేశాల నుంచే చమురును ఎక్కువగా దిగుమతి చేసుకునేది. ఆ తరువాత దిగుమతుల్లో రష్యా వాటా పెరిగింది. అమెరికా ఆంక్షలు, ఐరోపాలో రష్యా ముడి చమురుకు డిమాండ్ తగ్గడం భారత్‌కు కలసి వచ్చింది. మార్కెట్‌లో తక్కువ ధరకే లభిస్తున్న రష్యా ముడి చమురు దిగుమతులను భారత్ క్రమంగా పెంచుకుంది. ఒకప్పుడు 1 శాతానికి కంటే తక్కువగా ఉన్న రష్యా చమురు దిగుమతులు ప్రస్తుతం దాదాపు 40 శాతానికి చేరుకున్నాయని ఇంధన రంగ నిపుణులు చెబుతున్నారు. అమెరికా చమురు దిగుమతులను కూడా భారత్ పెంచుతోంది. నెల వ్యవధిలోనే అమెరికా దిగుమతులు రోజుకు 2.80 లక్షల బ్యారెళ్ల నుంచి 4.93 లక్షల బ్యారెళ్లకు చేరుకున్నాయి.


భారత్ సహజ వాయువును ఖతర్ నుంచి అధికంగా దిగుమతి చేసుకుంటోంది. అయితే, ఇవి హార్ముజ్ మీదుగా కాకుండా మరో మార్గంలో భారత్‌కు చేరుతున్నాయి. సహజవాయువును భారత్‌కు సరఫరా చేసే ఆస్ట్రేలియా, రష్యా, యూఎస్ కూడా హార్ముజ్ మార్గాన్ని వినియోగించవు. ఇంధన కొరతను తీర్చుకునేందుకు భారత్ తన వద్ద ఉన్న వ్యూహాత్మక చమురు నిల్వలను వాడుకునే అవకాశం కూడా ఉంది. పది రోజుల దిగుమతులతో సమానమైన ఇంధన నిల్వలు ప్రస్తుతం దేశంలో ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు అమెరికా, బ్రెజిల్ వంటి దేశాల నుంచి దిగుమతులు పెంచుకునే అవకాశం కూడా ఉందని ఇంధన రంగ నిపుణులు చెబుతున్నారు.

ఇవీ చదవండి:

ఇరాన్‌లో ఉద్రిక్తతలు.. ముడి చమురు ధరలకు రెక్కలు

సేవింగ్స్ అకౌంట్‌లో మీ డబ్బు ఉందా.. అయితే మీరీ విషయాలు తప్పక తెలుసుకోవాలి

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 23 , 2025 | 02:49 PM