Share News

Savings: సేవింగ్స్ అకౌంట్‌లో మీ డబ్బు ఉందా.. అయితే మీరీ విషయాలు తప్పక తెలుసుకోవాలి

ABN , Publish Date - Jun 17 , 2025 | 10:27 PM

సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్‌లో వడ్డీ రేట్లు తక్కువగా ఉన్న నేపథ్యంలో డబ్బు విలువ తరిగిపోకుండా ఉండేందుకు మదుపర్లు పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

Savings: సేవింగ్స్ అకౌంట్‌లో మీ డబ్బు ఉందా.. అయితే మీరీ విషయాలు తప్పక తెలుసుకోవాలి
savings account interest rates

ఇంటర్నెట్ డెస్క్: చాలా మందికి బ్యాంక్ అంటే ముందుగా గుర్తొచ్చేది సేవింగ్స్ అకౌంట్‌యే. ఈ అకౌంట్‌లో జనాలు తమ డబ్బును దాచుకుంటూ ఉంటారు. అయితే, సేవింగ్స్ అకౌంట్‌పై వడ్డీ రేట్లు ఇటీవల కాలంలో తగ్గుతున్నాయి. అనేక బ్యాంకుల్లో రేట్లు 3 శాతం లోపే ఉంటున్నాయి. దీనికి తోడు ద్రవ్యోల్బణం కూడా పెరుగుతున్న నేపథ్యంలో సేవింగ్స్ ఖాతాలోని డబ్బు విలువ తరిగిపోతోంది. కాబట్టి, ఆర్థిక భద్రత కోసం జనాలు కొన్ని జాగ్రత్తలు తీసుకోకతప్పదని ఫైనాన్షియల్ ప్లానర్స్ చెబుతున్నారు.

నిపుణులు చెప్పే దాని ప్రకారం, ప్రస్తుత పరిస్థితుల్లో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్‌ను రోజువారీ ఆర్థిక కార్యకలాపాలకు మాత్రమే వినియోగించుకోవాలి. రెండు నెలల అవసరాలకు సరిపడా డబ్బును సేవింగ్స్ అకౌంట్‌లో పెట్టాలి. అదనపు డబ్బును ఇతర ఆదాయ మార్గాల్లోకి మళ్లించాలి. ఏడాది లోపు ఉపసంహరించుకునే పెట్టుబడుల కోసం లిక్విడ్ ప్లస్ ఫండ్స్, ఆర్బిట్రేజ్ ఫండ్స్‌ను ఎంచుకోవాలి. వీటిల్లో లిక్విడిటీ ఎక్కువ. సులభంగా డబ్బును వెనక్కు తీసుకోవచ్చు. ఈ ఫండ్స్ డెట్ ఇన్‌స్ట్రూమెంట్స్‌లోకి పెట్టుబడులను మళ్లిస్తాయి. ఇక స్టాక్ మార్కెట్స్‌లో ధరల మార్పుల ఆధారంగా ఆర్బిట్రేజ్ ఫండ్స్ పనిచేస్తాయి. స్థిరమైన రాబడులు, పరిమితమైన రిస్క్ ఈ ఫండ్స్‌ ప్రత్యేకతలు.


ఇక ఒకటి నుంచి మూడేళ్ల కాలానికి పెట్టుబడులు పెట్టాలనుకునే వారు కార్పొరేట్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌లు, షార్ట్ టర్మ్ డ్యూరేషన్ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు. బ్యాంకు ఎఫ్‌డీలతో పోలిస్తే కార్పొరేట్ ఎఫ్‌డీల్లో రాబడి ఎక్కువ, పెట్టుబడికి కూడా కొంత రిస్క్ ఉంటుంది. ఇక షార్ట్ డ్యూరేషన్ డెట్ ఫండ్స్.. ప్రభుత్వ బాండ్స్‌, హైక్వాలిటీ కార్పొరేట్ డెట్‌లోకి నిధులను మళ్లిస్తాయి. మార్కెట్‌ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా వీటితో స్థిరమైన రాబడులు పొందొచ్చు. మూడేళ్లకు పైబడిన కాలానికి పెట్టుబడులు పెట్టేందుకు ఈక్విటీ ఫండ్స్, హైబ్రీడ్ ఫండ్స్‌ను ఎంచుకుంటే ప్రయోజనం ఉంటుంది.


పెట్టుబడిగా మారని ప్రతి రూపాయితో నష్టం తప్పదన్న విషయం మర్చిపోకూడదు. కష్టపడి సంపాదించుకున్న సొమ్ము విలువ తరిగిపోకుండా ఉండాలంటే ద్రవ్యోల్బణానికి మించిన రాబడులు ఇచ్చే పెట్టుబడి సాధనాల్లోకి డబ్బును మళ్లించాలి. భవిష్యత్తుకు ఇదే శ్రీరామ రక్ష.

ఇవీ చదవండి:

సెకెండ్ హ్యాండ్ కారు కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. భారత్‌లో ఐఫోన్‌లు తయారు చేస్తే..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 17 , 2025 | 11:24 PM