Share News

Trump Warns Apple: మరో వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. భారత్‌లో ఐఫోన్‌లు తయారు చేస్తే..

ABN , Publish Date - May 23 , 2025 | 06:38 PM

అమెరికాలో విక్రయించే ఐఫోన్‌లను అక్కడ కాకుండా మరెక్కడ తయారు చేసినా 25 శాతం సుంకం తప్పదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరించారు.

Trump Warns Apple: మరో వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. భారత్‌లో ఐఫోన్‌లు తయారు చేస్తే..
Trump Apple tariff

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో ఐఫోన్‌ల తయారీ ప్రయత్నాలపై ట్రంప్ మరో సారి వార్నింగ్ ఇచ్చారు. అమెరికాలో తప్ప ఎక్కడ ఐఫోన్‌లు తయారు చేసినా 25 శాతం సుంకం తప్పక విధిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్‌లో ఓ పోస్టు పెట్టారు.

‘‘అమెరికన్లు కొనే ఐఫోన్‌లను అమెరికాలోనే తయారు చేయాలి. ఈ విషయాన్ని నేను టిమ్‌కుక్‌తో గతంలోనే చెప్పా. ఇండియానే కాదు.. ప్రపంచంలో ఎక్కడా వీటిని తయారు చేయకూడదు. ఇది కుదరకపోతే యాపిల్ సంస్థ కనీసం 25 సుంకాన్ని అమెరికా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ధన్యవాదాలు’’ అని సూటిగా చెప్పేశారు.

ఈ పోస్టు తరువాత యాపిల్ షేర్లు భారీ కుదుపునకు లోనయ్యాయి. ప్రీమార్కెట్ ట్రేడింగ్‌లో షేర్ల ధర 2.5 శాతం మేర తగ్గింది. యూఎస్ స్టాక్ ఫ్యూచర్స్ కూడా నష్టాల బాట పట్టాయి. ప్రత్యేకంగా ఓ కంపెనీని టార్గెట్ చేస్తూ సుంకాలు విధించే అధికారం అమెరికా అధ్యక్షుడికి ఉందా అన్న అంశంలో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ట్రంప్ వ్యాఖ్యలపై యాపిల్ ఇంకా స్పందించాల్సి ఉంటుంది.


చైనాపై ట్రంప్ భారీ సుంకాలు విధించాక యాపిల్ తన ఐఫోన్ తయారీ కార్యకలాపాలను భారత్‌లో చేపట్టేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. జూన్‌లో అమెరికాకు చేరే ఐఫోన్‌లు దాదాపుగా భారత్‌లోనే తయారవుతాయని అంతర్జాతీయ మీడియా చెబుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వివిధ రంగాలకు చెందిన తయారీ కార్యకలాపాలను అమెరికాలోనే చేపట్టాలని ట్రంప్ పట్టుబడుతున్నారు. ఈ క్రమంలోనే సుంకాల కొరడా ఝళిపిస్తున్నారు.


ఇదిలా ఉంటే.. అమెరికాలో తయారు చేసే ఐఫోన్‌ల ధరలు భారీగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత ధరకు మూడు రెట్ల మేర ఐఫోన్ ధర పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో యాపిల్ సంస్థ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారత్‌లో ఇప్పటికే ఫాక్స్‌కాన్ తన తయారీ కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. 1.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు సిద్ధమైంది. ప్రస్తుతం ఐఫోన్‌లను తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలోని యూనిట్‌లలో అసెంబుల్ చేస్తున్నారు.

Also Read:

భారీ ఖండాంతర క్షిపణిని పరీక్షించిన అమెరికా.. వీడియో వైరల్

ఎస్-400 లాంటి ఫవర్‌ఫుల్ గగనతల రక్షణ వ్యవస్థలు ఇవే..

Read Latest and Business News

Updated Date - May 23 , 2025 | 06:47 PM