ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bihar Voters Demanding: బిహార్‌ ఓటర్లు కోరుతున్న మార్పు ఏమిటి

ABN, Publish Date - Nov 06 , 2025 | 05:45 AM

‘బద్లావ్‌ తో హోనా ఛాహియే’ (ఒక మార్పు రావాలి) అని తనను తాను ‘నాయీ’గా స్వయంగా చెప్పుకున్న ఒక పెద్ద మనిషి అన్నాడు. ఆ వ్యాఖ్యకు ప్రతిస్పందనగా కర్పూరీ ఠాకూర్‌ గురించి నేను ప్రస్తావించాను

‘బద్లావ్‌ తో హోనా ఛాహియే’ (ఒక మార్పు రావాలి) అని తనను తాను ‘నాయీ’గా స్వయంగా చెప్పుకున్న ఒక పెద్ద మనిషి అన్నాడు. ఆ వ్యాఖ్యకు ప్రతిస్పందనగా కర్పూరీ ఠాకూర్‌ గురించి నేను ప్రస్తావించాను. ఆయన ముఖంలో ఆనందరేఖలు విరిశాయి. అయితే తాను, తన కుటుంబలోని 20 మంది ఓటర్లు ఓటు వేసేందుకు ప్రేరణ అయ్యే మార్పు ఏమిటో ఆయన విడమరిచి చెప్పలేదు. ‘అబ్‌ ఆప్‌ సమ్జా జాయియే’ (మీరు మీ అభిప్రాయానికి రావచ్చు) అని ఆయన నిష్కర్షగా అన్నాడు.

మార్పు ఏమిటి? ప్రభుత్వం మారడం, పాలనా వ్యవస్థలో మార్పు సంభవించడమే మార్పు అని నేను విశ్వసిస్తున్నాను. బిహార్‌కే కాదు, దేశానికీ ఇటువంటి మార్పు అత్యవసరమని, జరూరుగా జరగాలని భావిస్తున్నాను. అయితే బిహార్‌ ఓటర్లు ఆకాంక్షిస్తున్న మార్పు బహు విధాలుగా ఉండడంతో పాటు అస్పష్టంగా ఉన్నది. ఉత్తర బిహార్‌లో పక్షం రోజుల పర్యటనతో ఈ వాస్తవం నాకు తెలిసివచ్చింది. మార్పు బహుళత్వం, అస్పష్టత గురించి నా పర్యటనానుభవాలు నన్ను జాగరూకుడిని చేశాయి. సాధారణ ఓటర్ల (అత్యధికులు పురుషులే)తో మాటా మంతీ ద్వారా బిహారీలు బహుళ మార్పులు కోరుతున్నారని, అవి ఒక దానితో ఒకటి పోటీ పడడమే కాకుండా ఘర్షణపడుతున్నాయని కూడా నాకు విశదమయింది. అనేక పరివర్తనలను సాధించవలసిన బృహత్తర బాధ్యతను సున్నిత ప్రజాస్వామిక సాధనమైన ఓటు నిర్వహిస్తోంది. ఆ పరివర్తనలను సంపూర్ణంగా సాధించడంలో ఇప్పటికే చాలా జాప్యం చోటుచేసుకున్నది.

మొదటి మార్పు సామాజిక న్యాయం. అగ్ర కులాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా సాధించవలసిన సామాజిక విప్లవం. బిహార్‌ జనాభాలో 11 శాతం కంటే తక్కువగా ఉన్న అగ్ర కులాలవారు సమాజం, ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలపై సంపూర్ణ పెత్తనం చెలాయిస్తున్నారు. పేదలు, నిరుపేదలను సంఘటితపరచడం ద్వారా కుల వ్యవస్థ వెన్ను విరచడాన్ని లక్ష్యంగా చేసుకున్న మండల్‌ ఉద్యమానికి లాలూప్రసాద్‌ యాదవ్‌ నాయకత్వం వహించారు. అయితే ముఖ్యమంత్రి పదవిని ఆయన రెండు పర్యాయాలు నిర్వహించిన తరువాత ఆ సామాజిక విప్లవం నిలిచిపోయింది. పరిపాలన పట్ల అశ్రద్ధ, శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ఉదాసీనత, అధికారాన్ని ఒక కులం చుట్టూ కేంద్రీకృతం చేసి, కుటుంబ పాలన చేయడంతో లాలూ మూడో పర్యాయం పదవీ కాలం ముగించేనాటికి ప్రభుత్వం మారితీరవలసిన అనివార్యత ఏర్పడింది. సామాజికంగా వెనుకబడిన కులాల, ఆర్థికంగా వెనుకబడిన కులాల, మహా దళితుల మద్దతుతో అగ్ర కులాల ఆధిపత్యం మళ్లీ రాజ్యాధికారాన్ని సాధించుకున్నది. క్రింది స్థాయి సామాజిక శ్రేణులలో ఐక్యత యాదవ్‌– ముస్లిం సంకీర్ణంగా సంకోచించింది (ఇటీవలి కుల గణన ప్రకారం బిహార్‌ జనాభాలో యాదవులు 14.2శాతం కాగా ముస్లింలు 17.7శాతంగా ఉన్నారు). అగ్రకులాల/ వెనుకబడిన కులాల విభజన మధ్యలో నితీశ్‌ కుమార్‌ నిలబడ్డారు. తద్వారా బిహార్‌ రాజకీయాలలో ఒక కీలక నాయకుడుగా ఆయన ప్రభవించారు. సామాజిక విప్లవం తిరోగమనానికి ఆయన తోడ్పడ్డారు!

ప్రస్తుత ఎన్నికలలో ప్రతిపక్ష కూటమి మహాఘట్‌బంధన్‌ తన సామాజిక సంకీర్ణాన్ని ముస్లిం–యాదవ్‌ సమీకరణ పరిధి నుంచి విస్తృతం చేసేందుకు ప్రయత్నించింది. మల్లాహ్‌ కులస్తులకు (బిహార్‌ జనాభాలో 2.6శాతం) ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖేశ్‌ సహాని నాయకత్వంలోని వికాస్‌శీల్‌ ఇన్సాన్‌ పార్టీని; చౌరాసియా, బరాయీ, తంబోలి సామాజిక వర్గాలకు (బిహార్ జనాభాలో 1.7శాతం) ప్రాతినిధ్యం వహిస్తున్న ఐపీ గుప్తా నేతృత్వంలోని ఇండియన్‌ ఇన్‌ క్లూజివ్‌ పార్టీ (ఐఐపీ)కి మహాఘట్‌ బంధన్‌లో స్థానం కల్పించారు. బిహార్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడుగా రవిదాసి వర్గానికి (బిహార్‌ జనాభాలో 5.6 శాతం) చెందిన నాయకుడిని నియమించడం ద్వారా కోల్పోయిన దళిత్‌ ఓటర్ల మద్దతు కూడగట్టుకునేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. ముస్లిం ఓటర్లను సంఘటితపరచడం ద్వారా లబ్ధి పొందేందుకు కూడా ప్రతిపక్ష కూటమి ప్రయత్నిస్తోంది. అయితే ఈ ప్రయత్నాల ద్వారా గత లోక్‌సభ ఎన్నికలలో ఎన్డీఏకు లభించిన 8శాతం ఓట్ల ఆధిక్యాన్ని తగ్గించటం లేదా స్వాయత్తం చేసుకోవటంలో మహాఘట్‌బంధన్‌ సఫలమవుతుందా అనేది వేచి చూడాలి.

ఇక నిలిచిపోయిన రెండో పరివర్తన సుశాసన్‌ (సుపరిపాలన). అభివృద్ధి సాధనలో నాణ్యమైన ఫలితాలను సాధించవలసిన అవసరం మరే రాష్ట్రంలో కంటే బిహార్‌లోనే అత్యధికంగా ఉన్నది. నితీశ్‌కుమార్‌ మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుపరిపాలనకు శ్రీకారం చుట్టారు. పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను నిర్విఘ్నంగా అమలుపరిచారు. రహదారుల నాణ్యతలో గణనీయమైన మెరుగుదలను సాధించారు. అయితే ఆ సుపరిపాలనా వెలుగులు ఎంతో కాలం నిలవలేదు. మసకబారిపోయాయి. ప్రజల మద్దతును నిలుపుకునేందుకు నితీశ్‌ ప్రభుత్వం అనేక గిమ్మిక్‌లు చేసింది. ప్రజల మద్దతును నిలబెట్టుకోగలిగింది గానీ సుపరిపాలనను కొనసాగించడంలో విఫలమయింది. నితీశ్‌ ప్రభుత్వం పదిహేను సంవత్సరాల క్రితం మంచిరోడ్లను నిర్మించిన విషయాన్ని బిహారీలు ఇప్పటికీ గుర్తు చేసుకొంటున్నారు. నితీశ్‌ రాక ముందు అన్నీ గతుకుల రోడ్లే కదా అని ఒక వృద్ధుడు వ్యాఖ్యానించాడు. నితీశ్‌ ప్రభుత్వం మద్యపానాన్ని నిషేధించింది. అయితే దీనికి ప్రజల మద్దతు సంపూర్ణంగా లభించలేదు. కల్తీ మద్యం విక్రయాలు పెరిగిపోయాయి. ఆ కల్తీ మద్యంతో సంభవిస్తున్న మరణాల సంఖ్య పెరిగిపోతూనే ఉన్నది. దీనికి తోడు మాదకద్రవ్యాల బెడద పెచ్చరిల్లింది.

లాలూప్రసాద్‌ యాదవ్‌ పాలన ‘జంగిల్‌రాజ్‌’ అన్న అపప్రథ నితీశ్‌ పాలన కొనసాగేందుకు ఊతమిస్తోంది. అయితే ఆ జంగిల్‌రాజ్‌ అన్న నింద పాక్షికంగా మాత్రమే సత్యం. ఇంకా ఓటుహక్కుకు అర్హుడుకాని యువకుడు ఒకరు తాను పుట్టక ముందు ఉన్న పరిస్థితులను గుర్తు చేసుకుంటూ చీకటిపడిన తరువాత ఎవరూ బయటకు వెళ్లే పరిస్థితి ఉండేదికాదట అని అన్నాడు. ఇటీవలికాలంలో పట్టపగలే అనేక నేరాలు, ఘోరాలు జరుగుతున్నా ఆ జంగిల్రాజ్ అన్న అపప్రథ ప్రభావం కొనసాగుతూనే ఉన్నది. ఉద్యోగాల సృష్టి, ఉపాధి కల్పన విషయమై పలు హామీలు ఇవ్వడం ద్వారా ఓటర్ల మద్దతును సాధించుకునేందుకు మహాఘట్‌ బంధన్‌ ప్రయత్నిస్తోంది. ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన స్వల్పకాలంలో అనేక మందికి ప్రభుత్వ ఉద్యోగాల నిచ్చిన మంచి పేరు తేజస్వి యాదవ్‌కు ఉన్నది. ఇది తమకు ఈ ఎన్నికలలో తప్పక మేలు చేస్తుందని ప్రతిపక్ష కూటమి విశ్వసిస్తోంది. అయితే కొత్తగా రంగప్రవేశం చేసిన ప్రశాంత్‌ కిశోర్‌ పార్టీ జన్‌ సూరజ్‌ విద్య, వైద్యం మొదలైన అభివృద్ధి అంశాలపై ముమ్మర ప్రచారం చేస్తోంది. ప్రశాంత్‌ కిశోర్‌ గ్రామ గ్రామాన పర్యటించారు. ఆయన ప్రసంగాలు అన్ని వర్గాల వారినీ ఆకట్టుకుంటున్నాయి. ప్రజల పిచ్చా పాటీలో ఆయన వ్యాఖ్యలు పదే పదే ప్రస్తావనకు వస్తున్నాయి. అయితే ఈ ప్రభావశీలత ఎంతవరకు ఓట్లుగా పరిణమిస్తుందో వేచి చూడాలి. మహిళా ఓటర్ల మద్దతును పొందేందుకు నితీశ్‌ ప్రభుత్వం ఇప్పటికే ఒక్కో మహిళకు పదివేలరూపాయలు సంక్షేమ కానుకగా అందించింది. తాము అధికారంలోకి వస్తే వచ్చే సంక్రాంతినాటికి ఒక్కో మహిళకు రూ.30 వేలు ఇస్తామని తేజస్వి పదే పదే ప్రకటిస్తున్నాడు.

అంతిమంగా బిహార్‌ ఎన్నికలు కొన్ని బృహత్తర బాధ్యతల నిర్వహణ భారాన్ని వహిస్తున్నాయి. ఆ కర్తవ్యపాలనలు: భారత రాజ్యాంగ పరిరక్షణ, 2024 లోక్‌సభ ఎన్నికలు నిర్దేశించిన ప్రజాస్వామిక పాలన పునరుద్ధరణ దిశగా పరివర్తన మొదలైనవి. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ బాధ్యతల నిర్వహణకు దిగ్భ్రాంతికరంగా అంతరాయం కలిగించాయి. ఇప్పుడు ఆ బాధ్యతల నిర్వహణ కొనసాగింపును బిహార్‌ ఓటర్ల తీర్పు ప్రభావితం చేస్తుందనడంలో సందేహం లేదు. ఆ దృష్ట్యా బిహార్‌ ఎన్నికల ప్రచారం అనివార్యంగా ఎన్నికల నైతికతను కాపాడేందుకు లేదా ‘ఓట్‌ చోరీ’ని నిరోధించేందుకే పరిమితమయింది.

ఓటర్‌ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ సైతం ఈ ఎన్నికల పోరులో ఒక రాజకీయ అస్త్రం కాలేదు. అయినప్పటికీ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగల సామర్థ్యం ముగిసిన ఆ సవరణ ప్రక్రియకు ఉన్నది. ప్రత్యేక సమగ్ర సవరణతో బిహార్‌ ఓటర్ల జాబితా 47 లక్షల మేరకు తగ్గిపోయింది. మరింత స్పష్టంగా చెప్పాలంటే ప్రతి ఒక్క నియోజకవర్గం (మొత్తం సంఖ్య 243)లోను దాదాపు 20 వేలమంది ఓటర్లు తగ్గిపోయారు. ఓటర్‌ జాబితాలలో చోటుచేసుకోని వారిలో నాలుగింట మూడు వంతుల మంది తొలగింపు న్యాయబద్ధమైన చర్యే అని అనుకున్నా ప్రతి నియోజక వర్గంలోను ఇంచుమించు 5000 ఓట్లు మినహాయింపునకు గురయ్యాయనే వాస్తవాన్ని గుర్తించాలి. ఇది, డజన్ల కొద్దీ నియోజకవర్గాలలో ఎన్నికల ఫలితాన్ని నిర్ణయాత్మకంగా ప్రభావితం చేస్తుందనడంలో సందేహం లేదు. పల్లీల విక్రేత అయిన ఒక వృద్ధ ఓటర్‌ నిర్లిప్తంగా కనిపించాడు. ఓటర్ల జాబితాలో ఆ వృద్ధుడి పేరు ఉన్నదిగానీ ఆయన భార్య పేరు లేదు! ఆమె పేరు ఎందుకు తొలగించారో ఆయనకు తెలియదు. ‘క్యా ఫారక్‌ ఫడ్తా హై హమేన్‌?’ అని వ్యాఖ్యానించాడు. ఆ వృద్ధుడి గళంలో ఉదాసీనత ధ్వనించింది. అయితే వెన్వెంటనే ఆయన ముఖ వైఖరి మారిపోయింది. ‘లేకిన్‌ ఏక్‌ ఓట్‌ సే జీత్‌ హార్‌ మే బాదల్‌ శక్తి హై’ (ఓటమి, నష్టం మధ్య తేడాను ఒక ఓటు నిర్ణయిస్తుంది). ఆ వృద్ధ ఓటర్‌ ఉదాసీనత, దృఢ నిశ్చయం మధ్య సంభావ్య మార్పు దోబూచులాడడం లేదూ?

యోగేంద్ర యాదవ్

(వ్యాసకర్త ‘స్వరాజ్‌ ఇండియా’ అధ్యక్షుడు)

ఈ వార్తలు కూడా చదవండి:

Karthika Pournami: కార్తీక పౌర్ణమి.. శివ నామస్మరణతో మార్మోగిన దేవాలయాలు

PM with World Cup Winners: ప్రధాని మోదీని కలిసిన టీమిండియా.. ప్రపంచకప్ విజేతలకు పీఎం అభినందనలు

Updated Date - Nov 06 , 2025 | 05:45 AM