కుట్రలను తట్టుకునే బీసీ ఉద్యమం తక్షణావసరం
ABN, Publish Date - Jun 26 , 2025 | 05:01 AM
స్వాతంత్ర్యం వచ్చి ఎనిమిది దశాబ్దాలు కావస్తున్నా బీసీ కులగణన డిమాండ్‌ను దేశాన్నేలిన ఏలికలు పక్కన పెట్టారు. ఇప్పుడు తమ అస్తిత్వం కోసం పాలకులు బీసీ కులగణన అంశాన్ని ముందుకు తీసుకువచ్చారు. ఓబీసీలకు...
స్వాతంత్ర్యం వచ్చి ఎనిమిది దశాబ్దాలు కావస్తున్నా బీసీ కులగణన డిమాండ్‌ను దేశాన్నేలిన ఏలికలు పక్కన పెట్టారు. ఇప్పుడు తమ అస్తిత్వం కోసం పాలకులు బీసీ కులగణన అంశాన్ని ముందుకు తీసుకువచ్చారు. ఓబీసీలకు దక్కాల్సిన వాటాలను ఇన్నాళ్లూ దక్కకుండా చేసిన పాలకులే ఇప్పుడు తమ అధికార అస్తిత్వాల కోసం అనివార్యంగా ఓబీసీ గళం విప్పుతున్నారు.
ఆధునిక భారత నిర్మాణం పరిపూర్ణం కావాలంటే బీసీ సామాజిక వర్గాలు అన్ని రంగాల్లోనూ సమవాటాలు పొంది తీరాలి. జనతా ప్రభుత్వం 1979లో బీపీ మండల్ చైర్మన్‌గా మండల్ కమిషన్‌ను ఏర్పరిచింది. అది 1980లో నివేదిక ఇస్తే, 1990లో వీపీ సింగ్ ప్రధానిగా జనతాదళ్ ప్రభుత్వం దాని అమలుకు పూనుకుంది. 1992లో భారత రాష్ట్రపతి ఆమోదం పొందింది. కేంద్రం ఇప్పుడు ఓబీసీ కులగణన సర్వేకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా అది సక్రమంగా జరిగే విధంగా బీసీ ఉద్యమం చూడాలి.
కులసర్వే జరిగాక స్థానిక సంస్థల నుంచి చట్టసభల వరకు తమ వాటా తాము పొందేందుకు బలమైన బీసీ ఉద్యమం నిర్మించబడాలి. అన్ని పార్టీల్లో ఉన్న బీసీలను ఒక్క తాటి పైకి తెచ్చే దశకు ఉద్యమం ఎదగాలి. ఆ దిశగా నిచ్చెనమెట్ల కులవ్యవస్థలో చీలికలను జయించి బీసీ, ఎంబీసీ, విముక్త సంచార జాతులను ఒక్కటి చేయటమే ఇపుడు బీసీ ఉద్యమం ముందున్న కర్తవ్యం. బీసీ సంక్షేమ ఉద్యమాలన్నీ బీసీలను ఐక్యం చేసే సమరశీల ఉద్యమాలుగా మారాలి. బీసీ భావజాల స్ఫూర్తి, తాత్వికత లేకుండా అది సాధ్యం కాదు.
తెలంగాణలో ఓబీసీల చైతన్యం ఎక్కువ గానే ఉంది. స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న అంశంపై బీసీలు గట్టిగానే పట్టుపడుతున్నారు. ఇది చేయకుండా కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికలకు పోయేందుకు అడుగులు వేయలేకపోతోందంటే అది బీసీలలో పెరిగిన చైతన్యానికి నిదర్శనం. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణ అసెంబ్లీలో తీర్మానించి కేంద్రానికి పంపింది. కానీ పార్లమెంటులో షెడ్యూల్ 9లో చేర్చకుండా అది అమలు కాదు. ఈ విషయంలో పలు రాష్ట్రాలు పంపిన అసెంబ్లీల తీర్మానాలన్నీ కేంద్ర హోం మంత్రిత్వశాఖ పరిధిలో పెండింగులో ఉన్నాయి తప్ప అవి షెడ్యూల్ 9 దాకా పోలేదు. తమిళనాడులో పెరియార్ నేతృత్వంలో జరిగిన మహోద్యమం వల్ల మాత్రమే నెహ్రూ తొలి రాజ్యాంగ సవరణకు పూనుకున్నారు. తమిళుల అచంచల పోరాటాల వల్ల మాత్రమే విద్యా ఉద్యోగాలలో 69 శాతం రిజర్వేషన్లు పొందేందుకు షెడ్యూల్ 9లో చేర్చుకోగలిగారు.
తెలంగాణలో కులసంఘాలు బలంగా ఉన్నాయి. కానీ అవి ఏ కులానికి ఆ కులంగా విడిపోయి ఉన్నాయి. ‘మనమంతా బీసీలం’ అనే సంఘటిత చైతన్యం మరింత పెరగాలి. కులచైతన్యం నుంచి బీసీలు సంఘటిత చైతన్యంగా మారాలి. అందుకు బీసీ ఆలోచనాపరులు కృషి చేయాలి. నగరాలలో, పట్టణాలలో ప్రెస్ కాన్ఫరెన్స్‌లు, సోషల్ మీడియా మొదలుకొని గ్రామ రచ్చబండల దాకా ఉద్యమం పోవాలి. అందుకు మడమ తిప్పని నాయకత్వం కావాలి. అది జరగకపోతే ఇప్పుడు రగులుకుంటున్న బీసీ చైతన్యాన్ని రాజకీయ పార్టీలు అనివార్యంగా తమ వైపు తిప్పుకుంటాయి. బీసీ చైతన్యాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు కానీ– దాన్ని ఎవరు రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకోగలరు అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
రాజకీయ పార్టీలు బీసీలను మూడు భాగాలుగా విభజించి వాళ్ళ మధ్య విభజనలు తెచ్చే పనిని ఇప్పటికే మొదలుపెట్టాయి. ఒకపక్క బీసీలలో పెద్దకులాలను తమవైపునకు తిప్పుకునే పని చేస్తున్నాయి. మరోపక్క బీసీలు, ఎంబీసీల మధ్య ఉన్న అంతరాలను రెచ్చగొట్టి ఐక్యతను దెబ్బతీసే పని చేస్తున్నాయి. దీన్ని జాగరూకతతో పసిగట్టకపోతే బీసీలలో చీలికలు వస్తాయి.
బీసీ కులాల్లో అంతరాల మాదిరిగానే బీసీ, ఎంబీసీ, సంచార జాతులలో అంతరాలు ఉన్నాయి. బీసీలలోని పెద్ద కులాలే పెద్దన్న పాత్ర పోషిస్తూ ఎంబీసీలు, సంచారజాతులను ఒక్క తాటిపైకి తెచ్చే సంఘటిత ఉద్యమాన్ని నిర్మించాలి. కాంగ్రెస్ 2023 ఎన్నికల్లో చేసిన వాగ్దానం ‘కామారెడ్డి బీసీ డిక్లరేషన్’ను అమలు జరిపేంత వరకు అప్రమత్తంగా ఉండాలి. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు సుప్రీంకోర్టు తీర్పు దాటి ఇవ్వటం ఎట్లా సాధ్యమో చేసి చూపాలి. అది జరగకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే బీసీ ఉద్యమం ఆగదని చాటి చెప్పాలి.
‘గ్రామ స్వరాజ్యాలను ఇప్పటిదాకా తమ గుప్పిట్లో పెట్టుకున్న ఆధిపత్యవర్గాలు అంత సులువుగా పంచాయతీరాజ్ వ్యవస్థను బీసీల పరం చేస్తాయా’ అన్నది వేచి చూడాలి. రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలలో సగం పంచాయతీలు, 33 జిల్లాల్లో సగం జడ్పీ చైర్మన్లు, 569 మండలాలో సగం జడ్పీటీసీలను బీసీల చేతుల్లో పెట్టినప్పుడే కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలు చేసినట్లవుతుంది. దీని అమలుకు బీసీ ఉద్యమ నాయకత్వం మడమతిప్పని పోరాటాలు చేయాలి. బీసీలను చీల్చే కుట్రలను భగ్నం చేస్తూ బీసీల ఆత్మగౌరవ నినాదాన్ని ప్రతి ఎదలో నాటే పటుత్వంగా బీసీ ఉద్యమాన్ని నిర్మించాలి. తెలంగాణ అస్తిత్వ ఉద్యమాన్ని నిర్మించినట్లుగా బీసీ అస్తిత్వ ఉద్యమాన్ని నిర్మించుకోవాలి. మా వాటా మాకేనన్న ఉద్యమ స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవాలి.
జూలూరు గౌరీశంకర్
తెలంగాణ రాష్ట్ర తొలి బీసీ కమిషన్ సభ్యుడు
ఇవి కూడా చదవండి..
కమాండర్ అభినందన్‌ను బంధించిన పాకిస్థాన్ మేజర్ హతం
ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా దాడులు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 26 , 2025 | 05:01 AM