రణ తంత్రమూ నాదే శాంతి మంత్రమూ నాదే
ABN, Publish Date - Jun 26 , 2025 | 05:09 AM
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దొర వారి చిత్తం ఎప్పుడెలా మారుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో జరుగుతున్నది ఇదే. జూన్ 13న ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేసిన తర్వాత...
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దొర వారి చిత్తం ఎప్పుడెలా మారుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో జరుగుతున్నది ఇదే. జూన్ 13న ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేసిన తర్వాత ఇరాన్ లొంగిపోతుందనుకుంటే, ఇరాన్ ఎదురు తిరిగి ఇజ్రాయెల్‌పై ప్రతిదాడి చేసింది. ధిక్కారమున్ సైతునా! అనుకున్న ట్రంప్ అమెరికా చట్ట సభల అనుమతి లేకపోయినా ఇరాన్‌పై బాంబుల వర్షం కురిపించారు. ఆ దెబ్బకి ఇరాన్ కుదేలు అవుతుందనుకుంటే, ఇటు ఇజ్రాయెల్‌పైనా, అటు అమెరికాపైనా ఏకకాలంలో విరుచుకుపడింది. ఈ పరిణామాన్ని ఇజ్రాయెల్ గాని, అమెరికా గాని ఏ మాత్రం ఊహించలేదు.
ఒకవైపు భారత–పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని ఆపించింది తానేనని, నమ్మండీ అని నిన్న మొన్నటి వరకు నెత్తీ నోరూ బాదుకున్న ట్రంప్, ఏ మాత్రం విజ్ఞత ప్రదర్శించినా, ఈ సంక్లిష్ట సమయంలో ఇరాన్‌పై దాడికి ఆదేశాలు ఇచ్చేవారు కారు. పైగా అంతకుముందే డోనాల్డ్ ట్రంప్‌ను శాంతి దూత అని పొగుడుతూ ఆయనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని పాకిస్థాన్ సైన్యాధిపతి అసిమ్ మునీర్ బహిరంగంగానే కోరారు. విధి వైపరీత్యమదేమో గాని, ట్రంప్‌కి నోబెల్ శాంతి బహుమతి ప్రకటించాలని కోరుతూ పాకిస్థాన్ అధికారికంగా నామినేట్ చేసిన రోజే (జూన్ 21) ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా విరుచుకుపడ్డది. ఏనాటికైనా నోబెల్ శాంతి బహుమతి గ్రహీతగా చరిత్రలో నిలిచిపోవాలన్న తన చిరకాల కలలపై ట్రంప్ స్వయంగా నీళ్లు చల్లుకున్నారు.
పశ్చిమాసియా పరిణామాలతో అటు అమెరికాపైనా, ఇటు పాకిస్థాన్‌పైనా ఇంటా బయటా విమర్శల తాకిడి తీవ్రమైంది. అమెరికా చేతలు మరో ప్రపంచ యుద్ధం వైపు లాక్కుపోతున్నాయన్న భయాందోళనలు ప్రపంచవ్యాప్తంగా మొదలయ్యాయి. అప్పుడు ఒక అద్భుతమైన ఆలోచన ట్రంప్ మస్తిష్కంలో మెరిసింది. ఖతార్‌ను రంగంలోకి దించారు. ఎవరి మాటా వినని ఇరాన్ ఖతార్ మాట వింటుందని తెలుసు. ఎవరినైనా చర్చలకు కూర్చోబెట్టడంలో ఖతార్ తనకు తానే సాటి. ఒకవైపు రణతంత్రాన్ని సమర్థించుకుంటూనే, మరోవైపు శాంతి మంత్రం మొదలుపెట్టారు ట్రంప్. పరిస్థితి చేజారకుండా ముందు ఇజ్రాయెల్‌ను దాడుల విరమణకు ఒప్పించారు. దానికి ముందు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును బహిరంగంగానే బాగా తిట్టారు. పనిలో పనిగా ఇరాన్ పెద్ద ఖమీనికి కూడా శాపనార్థాలు పెట్టారు. ఇద్దరికీ బుద్ధి లేదంటూ ట్రంప్ ఖతార్ సాయం కోరారు. మధ్యవర్తిత్వానికి ఖతార్ అంగీకరించింది. ఘర్షణ మరింత పెద్దది కాకుండా ఖతార్ మాట శిరసావహించడానికి ఇరాన్ ఒప్పుకుంది. ఇంకేం! శాంతి కపోతం ఎగిరింది... ఎగిరిపోయింది!
ప్రస్తుతానికి శాంతి నివురుగప్పిన నిప్పులా ఉంది, ఏ క్షణంలో ఏమైనా జరగవచ్చు. కానీ ట్రంప్‌కి కావలసింది కావలసినట్టే జరిగింది. అవతల నెదర్లాండ్స్‌లో నాటో శిఖరాగ్ర సమావేశం ప్రారంభ క్షణాలు దగ్గర పడుతున్నాయి. ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధాన్ని తానే ఆపానని ప్రపంచానికి చాటి చెప్పడానికి ఇంతకుమించిన మంచి సమయం లేదు. పాకిస్థాన్‌కు తోడు మరికొన్ని దేశాలు, మరికొందరు ప్రపంచ నేతలూ హమ్మయ్య, పశ్చిమాసియాలో శాంతి మళ్లీ పరిఢవిల్లుతోందని సంబరపడే క్షణంలో నోబెల్ శాంతి బహుమతి ట్రంప్‌కే ఇవ్వాలని మరికొన్ని స్వరాలు కోరస్ ఇవ్వవచ్చు. ట్రంప్‌కి కావలసింది అదే!
నోబెల్ శాంతి బహుమతి ట్రంప్‌కు ఒక నిరంతర మధుర స్వప్నం! ‘జిమ్మీ కార్టర్, ఒక బరాక్ ఒబామా కంటే తీసిపోయానా... నాకూ రావాలి ఒక నోబెల్!’ అని ట్రంప్ ఎంతో కాలంగా నిరీక్షిస్తున్నారు. వర్తమాన రాజకీయ పరిస్థితులు కూడా ఆయన పేరును సిఫారసు చేయడానికి సానుకూలంగానే మారాయి. అందుకు అనుగుణంగానే పాకిస్థాన్ అధికారికంగా ట్రంప్ పేరును నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసేసింది. పాకిస్థాన్ సైన్యాధిపతి అసిమ్ మునీర్‌తో విందు ఇలా ముగిసిందో లేదో ఆ నామినేషన్ అలా వెళ్లిపోయింది. విందు నుంచి బయటకు వస్తూనే ట్రంప్ ఎవ్వరూ ఊహించని విధంగా– ‘‘యుద్ధాన్ని ఆపింది నేను కాదు, వారిద్దరే యుద్ధాన్ని ఆపేసుకున్నారు... తెలివైనవారు కదా, అందువల్ల అణుయుద్ధం రాకుండా యుద్ధాన్ని విరమించారు’’ అని ఒప్పేసుకున్నారు. ట్రంప్ ఈ విధంగా ప్రకటించడం విశ్లేషకులకు సైతం మింగుడు పడలేదు. ‘‘అణు యుద్ధం రాగల విపత్కర పరిణామాన్ని తెలివైన ఇద్దరు నాయకులు నివారించారు’’ అంటూ ట్రంప్ ఇటు ప్రధాని హోదాలో ఉన్న మోదీని, అటు సైన్యాధిపతి హోదాలో ఉన్న మునీర్‌నూ సున్నితపు త్రాసులో సమానంగా తూచి మరీ ప్రశంసించడం విచిత్రం. నిజానికి ఒక దేశాధినేతతో మాట్లాడవలసిన ద్వైపాక్షిక వాణిజ్యం వంటి విషయాలు కూడా ట్రంప్ ఒక సైన్యాధిపతి అయిన మునీర్‌తో చర్చించడం దిగ్భ్రాంతి కలిగించిన విషయం.
సరే, అసలు విషయానికి వస్తే ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి గ్రహీతగా చరిత్రలో నిలిచిపోవాలన్నది ఎప్పటి నుంచో ఉన్న కోరిక. ఆ కోరికను ఆయన ఎన్నడూ దాచిపెట్టుకోలేదు కూడా. గతంలో నోబెల్ శాంతి బహుమతులు అందుకున్నవారు తనకంటే ఎందులో గొప్ప అనే ప్రశ్నే ట్రంప్‌ను నిరంతరం తొలిచేస్తోంది.
అప్పుడెప్పుడో రూజ్‌వెల్ట్‌కు నోబెల్ లభించిందంటే సరే, అప్పట్లో రష్యా–జపాన్ యుద్ధాన్ని చర్చల ద్వారా శాంతియుతంగా ముగించాడు కాబట్టి అనుకోవచ్చు; ఆ తర్వాత ఉడ్రో విల్సన్‌కి నోబెల్ ఇచ్చారంటే మొదటి ప్రపంచ యుద్ధాన్ని ముగించి, నానా జాతి సమితి ఆవిర్భావానికి విశేష కృషి చేశాడు కాబట్టి అనుకోవచ్చు; కానీ ఇదేమిటి!– తన కళ్లముందే, అధికారంలోకి వచ్చి సంవత్సరం కూడా కాకముందే బరాక్ ఒబామాను నోబెల్ శాంతి బహుమతి వరించడం ఏమిటి! ఇది ట్రంప్‌కి కొరుకుడు పడలేదు. అంతకుముందు 2002లో జిమ్మీ కార్టర్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇస్తూ– దశాబ్దాలపాటు అంతర్జాతీయ సంఘర్షణల నివారణకు నిర్విరామంగా తన పద్ధతిలో కొన్ని ప్రయత్నాలు చేయడం వల్ల కార్టర్ నోబెల్ బహుమతికి అర్హుడని నోబెల్ కమిటీ తెలిపింది. అలాగే మానవ హక్కుల పరిరక్షణకు కూడా కార్టర్ అవిరళ కృషి చేసినట్టు కమిటీ ప్రశంసించింది. అంతవరకూ ట్రంప్‌కు పేచీ లేదు. కానీ ఒబామాకు నోబెల్ ఏమిటన్నదే ఆయన అసలు పేచీ? ఒబామా అంతర్జాతీయ దౌత్య రీతులను మార్చాడని, దేశాల మధ్య పరస్పర స్నేహ సహకారాలు ఉండాలంటూ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధం కోసమూ, వాతావరణ సమతౌల్యం కోసమూ పాటుపడ్డాడనీ అంటున్నారు; ఇవన్నీ తాను చేయలేడా, చేయడం లేదా? మరి తనకెందుకు నోబెల్ ఇవ్వరూ అన్నదే ట్రంప్ బాధ.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, సూడాన్, మొరాకో వంటి దేశాలతో ఇజ్రాయెల్‌కు సత్సంబంధాలు ఏర్పరచడంలో కీలకమైన అబ్రహాం ఒప్పందాలను కుదర్చటంలోను, వాటిని అమలు చేయించడంలోను తనదే అగ్రతాంబూలం అని ట్రంప్ బలంగా నమ్ముతున్నారు. అబ్రహాం ఒప్పందాల కారణంగా అరబ్ ప్రపంచంలో ఇజ్రాయెల్‌కు గతంలో లేని గౌరవం లభించిన మాట నిర్వివాదాంశం. ఇజ్రాయెల్‌తో మైత్రికి అరబ్ దేశాలను ముందుకు రప్పించడం ఒక్కటి చాలు తనకు నోబెల్ శాంతి పురస్కారం అందించడానికి అని ట్రంప్ బలంగా విశ్వసిస్తున్నారు. 2020లో ఈ ఒప్పందం జరిగింది మొదలు తనకు ఇంకా నోబెల్ రాలేదేమిటి చెప్మా అని ట్రంప్ చాలా సందర్భాలలో బాహాటంగానే రుసరుసలాడారు. కాంగో, రువాండాల మధ్య ఘర్షణను నివారించి శాంతి స్థాపన చేసింది కూడా తానేననీ, మరి ఇంకా నోబెల్ రాదేమనీ ట్రంప్ ఆక్రోశం.
ఒకపక్క శాంతి బహుమతిని కోరుకుంటూనే మరోపక్క ట్రంప్ తరచు నోబెల్ సంస్థపై అక్కసు కూడా వెళ్లగక్కుతుంటారు. ‘‘నాకు నోబెల్ ఇచ్చి తీరాలి; కనీసం నాలుగైదుసార్లు ఇచ్చి ఉండాల్సింది; కానీ ఇవ్వరు. వారికి లిబరల్సే కావాలి – నేను కాదు!’’ అని ఆయనే మళ్లీ ముక్తాయింపు ఇచ్చేస్తారు. ఇదో వైచిత్ర్యం! ట్రంప్ లోలోపల ఒక మహా సంఘర్షణ ఎదుర్కొంటున్నారు. ఒకవైపు శాంతి దూతగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలనీ ఉంది, మరోవైపు కత్తులు దూసే అవకాశం వచ్చినప్పుడు వెనకడుగు వేయరాదనీ ఉంది. ఒకటి ఆకాంక్ష! మరొకటి ఆరాటం! ఒక వైపు భారత–పాకిస్థాన్ యుద్ధ విరమణలో కీలకమైన పాత్ర పోషించిన ఘనకీర్తీ కావాలి, మరోవైపు ఇరాన్‌కు సకాలంలో గుణపాఠం చెప్పడానికి చట్టసభలను సైతం వెనక్కినెట్టిన ధీశాలిగా పేరూ రావాలి. ఇంతటి వైరుధ్యం శాంతి బహుమతిని శ్వేతసౌధానికి అందించగలదా?
n జగన్
సీనియర్ జర్నలిస్ట్
ఇవి కూడా చదవండి..
కమాండర్ అభినందన్‌ను బంధించిన పాకిస్థాన్ మేజర్ హతం
ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా దాడులు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 26 , 2025 | 05:09 AM