ఈ ఘోరాలకు బాధ్యులు ఎవరు?
ABN, Publish Date - Jun 21 , 2025 | 08:17 AM
ఇంతలో ఎంత ఘోరం! ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ 11 ఏళ్ల పాలన విజయోత్సవాలను భారతీయ జనతా పార్టీ ఘనంగా జరుపుకుంటున్న వేళ దిగ్భ్రాంతికరమైన దుర్ఘటన పిడుగుపాటులా సంభవించింది. ఈ నెల రెండవ వారంలో ఆ భయానక విషాద విమాన ప్రమాదంలో దాదాపు 270 మంది చనిపోయారు (1996లో మన వాయుతలంలోనే పొరపాటున ఎదురెదురుగా ప్రయాణిస్తున్న రెండు విమానాలు ఢీకొన్న అనంతరం మన దేశంలోనే ప్రప్రథమంగా చోటుచేసుకున్న పౌర విమానయాన మహా ప్రమాదమిది).
ఇంతలో ఎంత ఘోరం! ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ 11 ఏళ్ల పాలన విజయోత్సవాలను భారతీయ జనతా పార్టీ ఘనంగా జరుపుకుంటున్న వేళ దిగ్భ్రాంతికరమైన దుర్ఘటన పిడుగుపాటులా సంభవించింది. ఈ నెల రెండవ వారంలో ఆ భయానక విషాద విమాన ప్రమాదంలో దాదాపు 270 మంది చనిపోయారు (1996లో మన వాయుతలంలోనే పొరపాటున ఎదురెదురుగా ప్రయాణిస్తున్న రెండు విమానాలు ఢీకొన్న అనంతరం మన దేశంలోనే ప్రప్రథమంగా చోటుచేసుకున్న పౌర విమానయాన మహా ప్రమాదమిది). గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరం వెలుపల ఎయిర్ ఇండియా విమానం (ఫ్లైట్ 171) కూలిపోవడం దేశ ప్రజలను నిర్ఘాంతపరిచింది. ఆ ప్రమాద ప్రదేశం కేంద్ర ప్రభుత్వ అగ్ర నాయక ద్వయం రాష్ట్రం కావడంతో, ఆ విషాదం బహుశా మరింతగా హృదయవిదారకమయింది. దేశ పాలక పక్షంగా ఉన్న ఒక జాతీయ రాజకీయ పార్టీ ప్రస్థానంలోని ఒక సంతోషదాయక ఘట్టంలో పాల్గొనకపోవడమే కాకుండా ఆసేతు హిమాచలం సమస్త భారతీయులూ ఒకే మనసుతో, ఏక హృదయంతో దుఃఖగ్రస్తులయ్యారు.
ఏఐ 171 కూలిపోవడానికి దారితీసిన కారణాలు ఏమిటి? పౌర విమానయాన ‘నిపుణులు’ టీవీ స్టూడియోలలో వివిధ సిద్ధాంతాలు ప్రతిపాదిస్తున్నారు. ఊహాగానాల ప్రాతిపదికన వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఇవి తొందరపాటుతో కూడుకున్నవి కావచ్చుగానీ విమాన ప్రయాణాల భద్రతపై నిశిత చర్చలు పునః ప్రారంభమయ్యేందుకు ప్రేరణనిచ్చాయి. భారత్ పౌర విమానయాన సంస్థలు పాటిస్తున్న భద్రతా ప్రమాణాల రికార్డు అంతర్జాతీయ ప్రమాణాలకు (ఎటువంటి మినహాయింపు లేకుండా) అనుగుణంగా ఉన్నప్పటికీ ఆందోళనకు ఆస్కారమిస్తున్న కారణాలూ తగినన్ని ఉన్నాయి. వాణిజ్య విమానయాన తొలి రోజుల నుంచి ప్రతిష్ఠాత్మక చరిత్ర ఉండడమే కాకుండా ప్రయాణీకులకు పూర్తి సేవలను ప్రశస్తంగా అందించడంలో ఎయిర్ ఇండియా అప్పుడూ ఇప్పుడూ పెట్టింది పేరు. ఒక పౌర విమానయాన సంస్థను నిర్వహించడం ఒక ఉక్కు కర్మాగారాన్ని నడపడం లేదా వినియోగదారీ సరుకుల వ్యాపారం చేయడం కాదనే కఠిన వాస్తవాన్ని ఎయిర్ ఇండియా యజమాని అయిన సుప్రసిద్ధ టాటా గ్రూపు ఇంకా అర్థం చేసుకోవలసి ఉన్నది. విమానాల తయారీలో ప్రపంచ అగ్రగామి సంస్థ బోయింగ్ ఉత్పత్తుల నిర్మాణ దక్షత, నాణ్యతా ప్రమాణాలు మళ్లీ విమానయాన రంగ నిపుణుల నిశిత పరీక్షలకు లోనవుతున్నాయి. శీఘ్రగతిన విస్తరిస్తోన్న రంగంపై సంపూర్ణ పర్యవేక్షక, నియంత్రణ అధికారాలు ఉన్న పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (మోకా) పనితీరుపై మరొకసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి; అహ్మదాబాద్ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న అదానీ గ్రూప్ సైతం ఈ విమాన ప్రమాద కారణాలపై దర్యాప్తు లేవనెత్తే ప్రశ్నలకు సమాధానాలివ్వవలసి ఉంది.
ఈ సందర్భంగా ఒకటి రెండు వాస్తవాలను తప్పక ప్రస్తావించాలి : డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు మంజూరైన ఉద్యోగాలలో 53 శాతం ఖాళీగా ఉండగా, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీలో 35శాతం ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు సంబంధించిన పార్లమెంటరీ స్థాయీ సంఘం నివేదిక ఒకటి గత మార్చిలో వెల్లడించింది. దేశ వ్యాప్తంగా 120 కొత్త నగరాలు, పట్టణాల మధ్య విమానయాన సదుపాయాలు కల్పించేందుకు మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్ఠాత్మక పథకం ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్– ప్రాంతీయ సంధాయకత పథకం) బడ్జెట్‌లో 32 శాతం కోత విధించారు. గత పదేళ్లలో విమానాశ్రయాల సంఖ్య రెట్టింపు అయినప్పటికీ విమానయాన భద్రతా ప్రమాణాల నిర్వహణకు చేస్తున్న వ్యయం చాలా తక్కువగా ఉంటోంది. ఈ పరిస్థితి ఒక పెద్ద ప్రశ్నకు అనివార్యంగా తావిస్తోంది: ఏఐ 171 విమాన ప్రమాదంతో ప్రస్తావిత పరిస్థితులలో ఏదైనా మార్పు వచ్చేందుకు ఆస్కారమున్నదా? డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన అతి స్వల్ప వ్యవధిలోనే కూలిపోవడానికి దారితీసిన కారణాల ఆచూకీని బ్లాక్ బాక్స్, ఫ్లైట్ డేటా రికార్డర్ సమకూర్చవచ్చు. అయితే శక్తిమంతులైన వ్యక్తులతో ముడివడి ఉన్న ఈ ప్రమాద ఘటనపై దర్యాప్తు న్యాయంగా పారదర్శకంగా జరుగుతుందా?
ఇది ఒక కీలక ప్రశ్నను అడిగేందుకు పురిగొల్పుతోంది: సంభవించిన దుర్ఘటనకు బాధ్యత ఎవరిదో నిర్దిష్ట కాలపరిమితిలో నిర్ధారించే జవాబుదారీతనం ఏదైనా మన వ్యవస్థలో ఉన్నదా? ఇంకా పది రోజులు ఉన్న ఈ జూన్ నెలలో సంభవించిన దుర్ఘటనలను చూడండి:
జూన్ 4న ఐపీఎల్ టోర్నమెంట్ ముగిసిన మరుసటిరోజు బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ విజయోత్సవ వేడుకల సందర్భంగా సంభవించిన తొక్కిసలాటలో 11 మంది క్రికెట్ అభిమానులు చనిపోయారు. మరెంతో మంది గాయపడ్డారు. స్టార్ క్రికెటర్లను అభినందించేందుకు వెల్లువెత్తిన అభిమానగణాలను అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారు. ఒక ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలోని క్రికెట్ జట్టు విజయోత్సవ వేడుకకు ప్రజల భద్రత కంటే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దురదృష్టకర ఘటనకు తన బాధ్యతను అంగీకరించిందా? లేదు. బెంగళూరు నగర పోలీస్ కమిషనర్‌ను సస్పెండ్ చేశారు. అయితే విజేతలైన క్రీడాకారులతో కలివిడిగా తిరిగిన రాజకీయవేత్తలలో ఏ ఒక్కరినీ ఆ ఘటనకు తప్పుపట్టనేలేదు.
జూన్ 9న ముంబైకు సమీపంలో ఉన్న ముంబ్రాలో చోటుచేసుకున్న ఒక సబర్బన్ రైలు ప్రమాదంలో నలుగురు మరణించగా తొమ్మిది మంది గాయపడ్డారు. కిక్కిరిసిపోయిన రైలులో ఫుట్బోర్డ్‌లపై నుంచొని ప్రయాణిస్తున్నవారు ముంబ్రా వద్ద ఒక మలుపులో అదుపు కోల్పోయి పడిపోవడంతో ఆ విషాదం జరిగింది. ఈ దుర్ఘటనపై దర్యాప్తునకు సెంట్రల్ రైల్వే ఒక కమిటీ నేర్పాటు చేసింది. ముంబై మహానగర ప్రజారవాణా వ్యవస్థలోని అస్తవ్యస్త పరిస్థితులను చక్కదిద్దకపోవడం వల్లే ఆ సంఘటన వాటిల్లిందన్నది స్పష్టం. రోజూ లక్షలాది ప్రజలు తమ నివాసాల నుంచి పని ప్రదేశాలకు రాకపోకలు సాగించే సబర్బన్ రైళ్లలో సమస్యల గురించి ప్రయాణీకుల సంఘాలు ఎంతగా మొరపెట్టుకున్నా పాలకులు పట్టించుకోవడమే లేదు. ఎందుకని?
జూన్ 16న పూణేలో కుండపోత వర్షంలో కిక్కిరిసిపోయిన పాదచారులు, వాహనాల రద్దీ కారణంగా ఒక వంతెన కూలిపోయింది. కేవలం మూడు దశాబ్దాల క్రితం నిర్మాణమైన ఆ వంతెన ‘అభద్రమైనది’గా అధికారులూ భావించారు. స్థానికులు చాలా సంవత్సరాలుగా సంభావ్య ముప్పు గురించి హెచ్చరిస్తూనే ఉన్నారు. ఆ వంతెన కూలిపోవడానికి ఐదు రోజుల ముందు మాత్రమే కొత్త వంతెన నిర్మాణానికి అధికారిక ఆదేశాలు జారీ చేశారు. జరగవలసిన నష్టం అప్పటికే జరిగిపోయింది. గత ఏడాది కొత్త వంతెనకు రూ.8 కోట్లు మంజూరు చేశారు. ఆ నిధుల విడుదల ఆలస్యమవడంతో విషాదం అనివార్యమయింది. మహారాష్ట్రలో బీజేపీ ఆధ్వర్యంలో అధికారంలో ఉన్న కూటమి నాయకులు ఆ సంఘటనను ఖండించారు. బాధ్యులకు శిక్షపడేలా చూస్తామని హామీలు ఇచ్చారు. నెరవేర్చేది ఎప్పుడు? ప్రజలకు బాగా తెలుసు సుమా!
జూన్ 16న కేదార్‌నాథ్ ఆలయం నుంచి ఉత్తరాఖండ్‌లోని గుప్త్ కాశి దాకా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఒకటి అడవిలో కూలిపోయింది. ఆ ప్రాంతంలో అప్పటికి గత ఆరు వారాలలో అలాంటి ప్రమాద ఘటనలు ఆరు జరిగాయి. ఈ దుర్ఘటనలతో పర్వత ప్రాంతాలలో ప్రతికూల వాతావరణ పరిస్థితులలో హెలికాప్టర్ సేవల సాధ్యాసాధ్యాలపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. హెలికాప్టర్ సేవలను ప్రామాణిక పద్ధతులలో అందించేలా తగుచర్యలు చేపడతామని ముఖ్యమంత్రి పుష్కర్ ధామి హామీ ఇచ్చారు అదనపు భద్రతా ఏర్పాట్లు చేస్తామని డీజీసీఏ హామీ ఇచ్చింది. చాలా ఆలస్యంగా, చాలా తక్కువ చేయడమనేదానికి ఇంతకంటే నిదర్శనమేముంది?
ప్రతి విషాద ఘటన కాలక్రమం ఒక సుపరిచిత నమూనాను అనుసరిస్తోంది. ‘చల్తా హై’ వైఖరితో కచ్చితమైన భద్రతా ప్రమాణాలను పాటించడంపై అశ్రద్ధ చూపడం జరుగుతోంది. దైనిక పరిపాలనకు సంబంధించిన నిర్దుష్ట అంశాలపై దృష్టిపెట్టకుండా ప్రజల మద్దతు పొందే లక్ష్యంతో జనహితులుగా కనిపించే హావభావాల ప్రదర్శన, చేపట్టే చర్యల దృశ్యమానతకు ప్రాధాన్యమివ్వడం జరుగుతోంది. మరిన్ని వందేభారత్ రైళ్లను ప్రారంభిస్తున్నారు, కొత్త విమానాశ్రయాలను ఏర్పాటు చేస్తున్నారు, పర్యాటక ప్రదేశాలను సృష్టిస్తున్నారు, కన్నులపండువగా క్రీడోత్సవాలను నిర్వహిస్తున్నారు.
స్వాతంత్ర్య శతాబ్ది (2047) నాటికి వికసిత భారతదేశాన్ని నిర్మించాలని మోదీ ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకున్నది. సమున్నత లక్ష్యమే, సందేహం లేదు. అయితే ఈ సుందర స్వప్నాలు ఏవీ 140 కోట్లకు పైగా దేశ జనాభాలో అత్యధికంగా ఉన్న సామాన్య ప్రజల వాస్తవిక జీవన పరిస్థితుల మెరుగుదలకు సహాయకారిగా లేవు. బలహీనమైన వంతెన కూలిపోయిన, తొక్కిసలాటల్లో మరణాలు సంభవించిన, లేదా రైలు, విమాన ప్రమాదాలు చోటుచేసుకున్న ప్రతిసారీ అధికారంలో ఉన్నవారు ఆ విషాద ఘటనలకు తమ నైతిక బాధ్యతను నిరాకరించడం పరిపాటి అయింది. ఈ అన్ని సందర్భాలలోను తమ ప్రాణాలతో మూల్యం చెల్లిస్తోంది అనామకుడు, అందునా కాయకష్టంతో బతికే శ్రమజీవి లేదా సామాన్య ఉద్యోగి అయిన భారతీయుడే కాదూ? అన్నిటికంటే ముఖ్యంగా జవాబుదారీతనానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చే మౌలిక గుణాత్మక మార్పు మన దృక్పథంలో రానంతవరకు మనం ఒక విపత్తు నుంచి మరొక విపత్తుకు సాగిపోతూనే ఉంటాం. ఉపద్రవాలు వరుసగా మనలను వెన్నాడుతూనే ఉంటాయి. ఎందుకంటే ఒక ఒలింపిక్ పతకానికి మనం మాత్రమే సంపూర్ణంగా అర్హులమైన ఆట ఒకటి భారత్‌లో ఉన్నదంటే అది ‘బాధ్యతను మరొకరిమీదకి తోసివేయడమే’ సుమా!
(వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్)
ఈ వార్తలు కూడా చదవండి.
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
యోగాను 130 దేశాల్లో జరుపుకుంటున్నాం..పోస్టల్ స్టాంపుల విడుదల
Read Latest Telangana News and National News
Updated Date - Jun 21 , 2025 | 09:41 AM