ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Beyond Single Standards: బహుళ స్వరాల నేటి విమర్శ

ABN, Publish Date - Nov 10 , 2025 | 06:01 AM

కొంతమంది కవులు రచయితలు తాము చెప్పింది పరమ ప్రామాణికం అనే ఆలోచనతో, ఎటువంటి పరిశోధనాత్మక పద్ధతి లేకుండా, కేవలం వ్యక్తిగత అభిప్రాయాలను..

కొంతమంది కవులు/ రచయితలు తాము చెప్పింది పరమ ప్రామాణికం అనే ఆలోచనతో, ఎటువంటి పరిశోధనాత్మక పద్ధతి లేకుండా, కేవలం వ్యక్తిగత అభిప్రాయాలను, సాధారణ ప్రకటనలను సిద్ధాంతాలుగా ప్రకటిస్తున్నారు. ఇది విమర్శకు నష్టం చేస్తుంది. సుంకర గోపాలయ్య రాసిన ‘ప్రమాణాల్లేని నేటి విమర్శ’ వ్యాసం (వివిధ: 03–11–2025)

ఈ కోవలోని వ్యాసమే! ఈ వ్యాసంలో, గత పదిహేనేళ్లుగా తెలుగు విమర్శ స్తబ్ధతలో ఉందని, కొత్త సిద్ధాంతాలు లేవని, లోతైన విశ్లేషణ కొరవడిందని ఆవేదన వ్యక్తం చేశారు గోపాలయ్య. కట్టమంచి నుండి త్రిపురనేని వరకు సాగిన ‘పద్ధతైన’ విమర్శ ఆగిపోయిందని, నేటి విమర్శకులు కేవలం ‘వస్తువు, భాష, అభివ్యక్తి, శిల్పం’ అనే నాలుగు మాటల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. వ్యాసంలో వ్యక్తమైన కొన్ని ఆందోళనలలో వాస్తవం ఉన్నప్పటికీ, సమకాలీన విమర్శనా రంగాన్ని పూర్తిగా ‘ప్రమాణాలు లేనిదిగా’ కొట్టిపారేయడం పొరపాటు. వాస్తవానికి, నేటి తెలుగు విమర్శ ‘ప్రమాణాలు లేకపోవడం’తో బాధపడటం లేదు; అది ‘ఏక ప్రమాణం’ స్థానంలో ‘బహుళ ప్రమాణాల’ వైపు పరిణామం చెందింది. ఇది బలహీనత కాదు, ఆధునిక సమాజపు సంక్లిష్టతకు, సాహిత్యపు వైవిధ్యానికి అద్దం పట్టే పరిపక్వతకు సంకేతం.

మూల వ్యాసంలో ‘కొత్త సిద్ధాంతాలు లేవు’ అన్న ప్రధాన ఆరోపణ అత్యంత విస్మయపరిచే వాదన. ‘కొత్త సిద్ధాంతం’ అంటే ఆకాశం నుండి ఊడిపడదు; ప్రపంచవ్యాప్తంగా వస్తున్న నూతన తాత్విక చింతనలను, సామాజిక శాస్త్ర సిద్ధాంతాలను మన సాహిత్యానికి అన్వయించి, మనదైన విమర్శనా పద్ధతులను నిర్మించుకోవడమే. ఆ దిశగా గత పదిహేనేళ్లలో జరిగిన, జరుగుతున్న కృషిని విస్మరించలేం.

ఈ కాలంలో అస్తిత్వవాద విమర్శలు విస్తరించాయి. ఈ కోవలో దళిత, స్త్రీవాద, బీసీ, ప్రాంతీయవాద విమర్శలు కేవలం ‘వస్తు’ విమర్శగా ఆగిపోలేదు. అవి తమదైన సౌందర్య శాస్త్రాలను నిర్మించుకుంటున్నాయి. ముస్లిం సాహిత్యంపై సంగిశెట్టి శ్రీనివాస్ పుస్తకం ‘సవారు’, కొలిమి పత్రికలో కాత్యాయనీ విద్మహే ‘నీలి రాగం’ వ్యాసాలు, దత్తయ్య అట్టెం పుస్తకం ‘తెలంగాణ బి.సి. వాద సాహిత్యం’, సూర్యా ధనంజయ్ పుస్తకం ‘కాకోటి’ వంటివి ఈ కోవలోనివే. అడ్లూరు రఘురామరాజు ‘‘వాచకం, పఠనం, విమర్శ’’ అన్న కోణంలో వడ్డెర చండీదాస్ నవలలను చర్చించిన గ్రంథం ‘వడ్డెర చండీదాస్‌: దర్శనమూ సాహిత్యమూ’. జి. అరుణ కుమారి ఫ్యూచరాలజీ కోణంలో రాసిన గ్రంథం ‘తెలుగు కవిత్వం భవిష్యద్దర్శనం’. ఓల్గా మల్టీ డిసిప్లినరీ పెర్‌స్పెక్టివ్‌లో రాసిన గ్రంథం ‘సంతులిత’. యస్. రఘు డిస్క్రిప్టివ్‌ క్రిటిసిజం కోణంలో రాసిన గ్రంథం ‘సమన్వయ’... జిలుకర శ్రీనివాస్, పసునూరి రవీందర్ నవ్య దళిత వాద విమర్శ వంటి కొత్త పద్ధతులను పరిచయం చేశారు. ఇవన్నీ ‘కొత్త సిద్ధాంతాల’ అన్వయాలు, నిర్మాణాలే. కాబట్టి, ‘ఏమీ జరగడం లేదు’ అనడం కళ్లముందున్న వాస్తవాన్ని కాదనడమే.

విమర్శకుడు ‘న్యాయమూర్తి’ పాత్ర పోషించాలని మూల వ్యాసం ఆశిస్తున్నది. కానీ ఆధునిక విమర్శలో ‘న్యాయమూర్తి’ పాత్ర స్థానంలో ‘విశ్లేషకుడు’ లేదా ‘వ్యాఖ్యాత’ పాత్ర బలపడింది. ఇది పతనం కాదు, పరిణామం. గతంలో కట్టమంచి వంటి వారు ‘కవిత్వం ఇలా ఉండాలి’ అని తీర్పులు ఇచ్చారు. అది ఆ కాలపు చారిత్రక అవసరం. నేటి విమర్శ ఒక రచన ‘ఎందుకు అలా ఉంది’, ‘దాని సామాజిక – చారిత్రక సందర్భం ఏమిటి,’ ‘దాని వెనుక భావజాలం ఏమిటి’ అని విశ్లేషిస్తోంది. ‘తీర్పు’ ఇవ్వడం కంటే, ‘పాఠకుడికి ఆ రచనను బహుళ కోణాల్లో అర్థం చేసుకునే పరికరాలను అందించడం’ నేటి విమర్శ లక్ష్యం. నేటి విమర్శలో ‘కేవలం విశ్లేషణ మాత్రమే చూస్తున్నాం’ అని గోపాలయ్య నిరాశపడుతున్నారు. కానీ ఆ ‘విశ్లేషణ’లోనే ‘మూల్యాంకనం’ అంతర్భాగం.

‘వస్తువు, భాష, అభివ్యక్తి, శిల్పం’ అనే నాలుగు మాటలతో రాస్తే విమర్శ కాదని గోపాలయ్య తీసిపారేయడం సరికాదు. ఏ కాలపు విమర్శ అయినా వీటి చుట్టూనే తిరుగుతుంది. సమస్య ఆ మాటల్లో లేదు, వాటిని విశ్లేషించే పద్ధతిలో ఉంది.

ఉదాహరణకి గోపాలయ్య ప్రస్తావించిన వాటిలో మొదటిదైన ‘వస్తువు’నే తీసుకుంటే– గతంలో వలె నేటి విమర్శ రచనలో ‘వస్తువు ఏమిటి’ అనేదానికే పరిమితం కాలేదు. ‘ఆ వస్తువును ఎవరి దృక్కోణం నుంచి చూస్తున్నారు’ అనేది నేటి విమర్శ ప్రధాన ప్రశ్న. ఉదాహరణకు, ‘కుటుంబం’ అనే ఒకే వస్తువును– మార్క్సిస్టు విమర్శ ‘వర్గ’ సంబంధాల కోణంలోను; స్త్రీవాద విమర్శ ‘లింగ’ వివక్ష, ‘పితృస్వామ్య’ కోణంలోను; మనోవైజ్ఞానిక విమర్శ ‘అంతర్గత’ సంఘర్షణల కోణంలోను విశ్లేషిస్తుంది. ఇక నేటి విమర్శ రచనలోని ‘భాష’ కేవలం ‘సరళంగా ఉందా, సంక్లిష్టంగా ఉందా,’ ‘గ్రాంథికమా, వ్యావహారికమా’ అని చూడటం లేదు. భాష వెనుక ఉన్న ‘అధికార సంబంధాలను’, ‘ఆధిపత్య భావజాలాన్ని’ శోధిస్తోంది. దీన్నే Discourse Analysis అంటారు. తెలంగాణ, రాయలసీమ ప్రాంతీయ అస్తిత్వవాద విమర్శ ‘భాష’పై, ‘మాండలికాల రాజకీయం’పై చేసినంత లోతైన చర్చ గతంలో ఎన్నడూ లేదు. ప్రామాణిక భాష పేరుతో కొన్ని ప్రాంతాల, సమూహాల భాషను ఎలా అణచివేశారో విశ్లేషించడం నేటి విమర్శలో ముఖ్యమైన అంశం కాదా? ఇక ‘అభివ్యక్తి’, ‘శిల్పం’ విషయానికి వస్తే– ఆధునికోత్తరవాద పద్ధతులు వచ్చిన తర్వాత ‘శిల్పం’పై విశ్లేషణ పూర్తిగా మారింది. గతంలా ఇది అలంకారాల లెక్క, ఛందస్సుల బేరీజు కాదు. కథన పద్ధతులు, మ్యాజిక్ రియలిజం, ఇంటర్–టెక్స్‌ట్యువాలిటీ (intertextuality) వంటి కొత్త పరికరాలతో శిల్పాన్ని విశ్లేషిస్తున్నారు. పాఠకుడి పాత్ర కూడా శిల్ప విశ్లేషణలో భాగమైంది.

మూల వ్యాసకర్త బహుశా పత్రికల్లో వచ్చే ‘సమీక్ష’లను చూసి, దాన్నే సమగ్ర ‘విమర్శ’గా భ్రమపడి ఉండవచ్చు.

కట్టమంచి, రా.రా. వంటి విమర్శకులను ప్రస్తావిస్తూ గోపాలయ్య గతాన్ని ఆదర్శీకరిస్తున్నారు. వారు గొప్ప విమర్శకులే, కానీ వారి కాలపు ప్రమాణాలతో నేటి అస్తిత్వవాద (దళిత, బీసీ, గిరిజన) సాహిత్యాన్ని కొలవలేం. ‘‘సృజన ఆధారంగానే విమర్శ పరికరాలను సిద్ధం చేసుకోవాలి’’ అని వ్యాసకర్త చెప్పిన వాక్యమే ఆయన వాదనను ఖండిస్తుంది.

గత 15–20 ఏళ్లలో తెలుగు సృజనాత్మక సాహిత్యం (ప్రపంచీకరణ, తెలంగాణ ఉద్యమం, అస్తిత్వవాదాల కేంద్రంగా) పూర్తిగా మారింది. ఈ ‘కొత్త సృజన’ను అర్థం చేసుకోవడానికి విమర్శ కూడా ‘కొత్త పరికరాలను’ సిద్ధం చేసుకుంది (దళిత, స్త్రీ, బీసీ వాదాలు, బయోపాలిటిక్స్ మొదలైనవి). ఈ పరిణామాన్ని గుర్తించకుండా ‘ఏమీ జరగడం లేదు’ అని తేల్చేయడం నిరాశావాదం. సమకాలీన తెలుగు విమర్శ ‘ప్రమా ణాలు లేని’ శూన్యంలో లేదు. అది గతం కంటే భిన్నంగా, బహుళ స్వరాలతో కొనసాగుతోంది. సామాజిక మాధ్యమాల వల్ల విమర్శ ప్రజాస్వామ్యీకరించబడింది. అక్కడ ‘కువిమర్శ’ ఉన్నా, లోతైన సిద్ధాంత చర్చలూ ఉన్నాయి.

-వెంకట రామయ్య గంపా

& 99586 07789

Updated Date - Nov 10 , 2025 | 06:02 AM