Kandukkuri Sriramulu: ఆహ్వాన పత్రం చూసి సినారె సభకు రాలేదు
ABN, Publish Date - Aug 11 , 2025 | 01:33 AM
1974 లోనే అక్టోబర్ నెలలో నేనూ, నందిని సిధారెడ్డి, కర్ణాల బాలరాజు ముగ్గురమూ కలిసి ‘దివిటి’ అనే ప్రప్రథమ మినీ కవితా సంకలనాన్ని తీసుకువచ్చాం. సిద్దిపేటలో శివారెడ్డి ఆవిష్కరించారు. దేవిప్రియ అధ్యక్షత వహించారు. ఆ పుస్తకం మాకు...
నా మొదటి పుస్తకం
1974 లోనే అక్టోబర్ నెలలో నేనూ, నందిని సిధారెడ్డి, కర్ణాల బాలరాజు ముగ్గురమూ కలిసి ‘దివిటి’ అనే ప్రప్రథమ మినీ కవితా సంకలనాన్ని తీసుకువచ్చాం. సిద్దిపేటలో శివారెడ్డి ఆవిష్కరించారు. దేవిప్రియ అధ్యక్షత వహించారు. ఆ పుస్తకం మాకు ముగ్గురికీ మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత నా సొంత పుస్తకం వేయాలన్న ప్రయత్నంలో కవితలు రాస్తూనే ఉన్నాను. కానీ, నేను బీకాం తప్పటం వల్ల ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎన్నో ప్రైవేటు నౌకరీలు చేయాల్సి వచ్చింది. అలా 1974 నుండి 1979 దాకా చదువుకూ సాహిత్యానికీ దూరమయ్యాను. ఎలానో డిగ్రీ అయింది అనిపించుకుని 1979లో ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏలో చేరాను. సి. నారాయణరెడ్డి ప్రియశిష్యుణ్ణి అయ్యాను. ‘కవిత్వదాత సుఖీభవ’ అంటూ ఆయన మీద నేను రాసిన కవితను ‘మానేరు టైమ్స్’లో చూసి మెచ్చుకున్నాడు. ఒక చేతుల్లేని అబ్బాయి మీద ‘శబ్దశరీరం’ అని కవిత రాస్తే వరవరరావు ఒక నిండు సభలో ఉటంకించారు. కె. శ్రీనివాస్ నేనూ పండిత శిక్షణ ట్రెయినింగ్‌లో క్లాస్‌మేట్స్. ఇద్దరమూ కలిసి ‘లాంగ్‌మార్చ్’ అనే కవిత రాశాం. ‘ఖడ్గకంఠం’ అనే కవితను శివారెడ్డి మీద రాశాను. కవితలు రాయటం ఆపలేదు కానీ పుస్తకం ప్రచురించ లేకపోయాను. పుస్తకాలు ప్రచురించిన మిత్రులంతా సాహిత్యంలో నాకన్నా ముందు వెళ్ళిపోతున్నారు. అప్పుడు రాసు కున్న ఒక కవితలో– ‘‘నువ్వో మెట్టెక్కావనుకో/ నీ పక్కనుండి వెళ్లి వాళ్లు రెండు మెట్లెక్కుతున్నారు/ నువ్వు అలాగే నుంచున్నావనుకో/ వాళ్లు ఆకాశాన్ని ఆక్రమిస్తారు/ నువ్వు అడుగంటుతావు’’ అని బాధపడ్డాను.
ఒక సందర్భంలో విజయనగర వీధుల్లో జీపులో తిరుగుతుండగా ‘‘ఇంకెప్పుడు నీ కవితా సంకలనం?’’ అంటూ ‘‘ఎస్టాబ్లిష్డ్ కవి పక్కన కూర్చుంటే ఎస్టాబ్లిష్డ్ అవుతావయ్యా’’ అని కాసేపు పక్కన కూర్చోపెట్టుకున్నారు చేరా మాస్టారు. ఆ మాటలు విన్న కవి మిత్రులు పుస్తకం వేయమని పట్టుబట్టారు. అప్పుడుగాని శివారెడ్డి పుస్తకం వేయటానికి ఒప్పకోలేదు. ‘దివిటి’ పుస్తకం వచ్చిన ప్పటి నుండి అప్పటికి, అంటే 22 సంవత్సరాలపాటు, రాసిన కవితలన్నీ ఒక దగ్గర కుప్పపో సాను. ఆ కుప్పలోంచి ముగ్గురు న్యాయనిర్ణేతలు ‘మంచివి, మామూలువి, బాగులేనివి’ అని ‘ఏ, బీ, సీ’ కేటగిరీలు విడదీశారు. వాటిలో ‘ఏ’, ‘బీ’ మార్క్ పెట్టిన కవితలు తీసుకొని, ‘సీ’ మార్క్ కవితల్ని పక్కన పెట్టేశాను. ఈ ముగ్గురు న్యాయనిర్ణేతల్లో ఒకరైన శీలా వీర్రాజు కవితలు సెలెక్ట్ చేయడమే గాక పుస్తకానికి, ‘సముద్ర సభ’ అని పేరు కూడా పెట్టారు. అది కాస్తా శివారెడ్డి గారి చేతిలోకి వెళ్ళి ‘వయొలిన్ రాగమో వసంత మేఘమో’ అయ్యింది. ఇది 1993లో అచ్చయ్యింది.
అప్పట్లో పుస్తకం వేయటం చాలా కష్టమైన పని. ఒక దగ్గర డీటీపీ, ఒక దగ్గర కవర్ పేజీ ప్రింటింగ్, మరో దగ్గర పేజ్ మేకప్, ఇంకో దగ్గర పుస్తకం ప్రింటింగ్... ఇన్ని బాలారిష్టాలు ఎదుర్కొంటేనే గాని పుస్తకం బయటపడలేదు. ఇదంతా వాసిరెడ్డి నవీన్, తక్కిన మిత్రులూ చూసుకున్నారు. పుస్తకావిష్కరణకు సంబంధించిన ఆహ్వానపత్రం వెరైటీగా ఉండాలనుకున్నారు శీలా వీర్రాజు గారు. తన సొంత దస్తూరితో, హోదాలు అవేవీ లేకుండా, పేర్లన్నీ వరుసగా రాశారు. అజంతా, సి. నారాయణరెడ్డి, డి. వెంకట్రామయ్య, పాపినేని శివశంకర్, నందిని సిధారెడ్డి ఇలాంటి పేర్ల వరుసతో ఆహ్వాన పత్రం అచ్చయింది. అంతకు ముందు పుస్తకం ఆవిష్కరణ చేయాల్సిందిగా నేను వెళ్లి గురువు గారు సినారెను అడిగాను. ఒప్పుకున్నారు. కానీ అచ్చయిన ఈ ఆహ్వాన పత్రాన్ని ఎవరో ప్రబుద్ధులు ఆవిష్కరణ రోజు పొద్దున్నే సినారెకు చూపెట్టి, ‘‘ఇందులో నాగలి పట్టేది ఎవరు? నాగలి దున్నేదెవరు?’’ అని అనుమానం మొలకెత్తింపజేశారు. దాంతో సినారె ఆవిష్కరణకు రాలేదు. అధ్యక్షత వహించాల్సిన అజంతా పుస్తకాన్ని ఆవిష్కరించారు. కరపత్రంలో లేని శివారెడ్డి సభకు అధ్యక్షత వహించారు. హైదరాబాద్ సిటీ సెంట్రల్ లైబ్రరీలో కిక్కిరిసిన ప్రేక్షకుల సమక్షంలో అద్భుతంగా సభ ముగిసింది. అదేమంటే ఆరోజు 62 పుస్తకాలు అమ్ముడుపోయాయి అంటే నమ్మండి!
పుస్తకంలో ఎన్నో కవితలు ఉండగా– శివారెడ్డి ‘జంతువు’ కవితకు పేరడీగా నేను రాసిన ‘ఆడ జంతువు’ అన్న ఒక్క కవితనే ఎంచుకుని చందు సుబ్బారావు ఆంధ్రభూమి సాహిత్య పేజీలో అర పేజీకి తగ్గకుండా విమర్శిస్తూ రాశారు. దాన్ని ఎవరూ పట్టించుకోలేదనుకోండి. ఈ పుస్తకానికి సంవత్సరం తిరగకముందే ప్రతిష్టాత్మకమైన ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు లభించింది. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, ఎన్నో మార్పులు చేర్పులు ఒడిదుడుకుల మధ్య ఎట్టకేలకు నా మొదటి పుస్తకం దిగ్విజయ యాత్ర చేస్తూ ముందుకు సాగింది. ఆ యాత్ర కొనసాగింపు ఫలితమే ఆ తర్వాత అచ్చైన పది కథలు, పది కవితా సంపుటాలు, ఇరవైకి పైగా అవార్డులు. అయినా నా మొదటి కవిత ‘అమరుడు’ రాసినప్పుడు ఎలా మథనపడ్డానో ఇప్పటికీ అంతే మథన పడుతూ ప్రతి కవితా రాస్తాను.
కందుకూరి శ్రీరాములు
94401 19245
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిపై చర్యలకు రంగం సిద్ధం..!
ప్రాజెక్ట్‌లను నిర్వీర్యం చేసిన బీఆర్ఎస్
For More Telangana News And Telugu News
Updated Date - Aug 11 , 2025 | 01:33 AM