ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Chintakayala Pavanamurthy: భీమైక జీవనస్ఫూర్తి

ABN, Publish Date - Nov 06 , 2025 | 05:36 AM

ఒక మహావృక్షం ఒరిగిపోతూ విత్తనాల గింజల్ని వాగ్దానం చేసినట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనంతమైన ‘భీమ’ ఎరుకను కలిగించి, సామాజిక ఉద్యమ చైతన్యాన్ని రగిలించిన చింతకాయల పావనమూర్తి సెలవంటూ...

ఒక మహావృక్షం ఒరిగిపోతూ విత్తనాల గింజల్ని వాగ్దానం చేసినట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనంతమైన ‘భీమ’ ఎరుకను కలిగించి, సామాజిక ఉద్యమ చైతన్యాన్ని రగిలించిన చింతకాయల పావనమూర్తి సెలవంటూ వెళ్లిపోయాడు. మూర్తీభవించిన డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్‌ ఆశయంలా, బుద్ధుని ధమ్మపథ సూత్రంలా నడయాడిన పావనమూర్తి మాష్టారు (93) అక్టోబర్ 27 ఉదయం విశాఖపట్నంలో పరినిర్వాణం చెందాడు. తొలితరం అంబేడ్కరిస్టుగా, దళిత ఉద్యమయోధుడిగా, ప్రజాస్వామ్యవాదిగా, మేధావిగా పావనమూర్తి చెరగని ముద్రవేశాడు.

చింతకాయల పావనమూర్తి 1932 మార్చి 28న ఫ్రెంచ్‌ ప్రభుత్వ ఏలుబడిలో ఉన్న యానాం పెదమాలపల్లి (అంబేడ్కర్ నగర్)లో జన్మించాడు. యానాం, తాళ్ళరేవు పాఠశాలల్లో ప్రాథమిక విద్యను అభ్యసించాడు. కాకినాడ పి.ఆర్ కళాశాలలో ఇంటర్, విశాఖపట్నం ఏవీయన్ కళాశాలలో డిగ్రీ, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎం.ఎ చదివాడు. యానాంలో సెంట్రల్ బాయ్స్ స్కూల్‌లో ఒక సంవత్సరం ఆంగ్ల ఉపాధ్యాయుడిగా, ఏవీయన్ కళాశాలలో అధ్యాపకుడిగా, రైల్వే మెయిల్ సర్వీస్‌లో ఉద్యోగిగా కొంతకాలం సేవలు అందించాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్ర అధ్యాపకుడిగా సుదీర్ఘకాలం పాఠాలు బోధించి వందలాది మంది శిష్యుల భవితకు బాటలు వేసి 1995లో పదవీ విరమణ చేశాడు.

దీన పోషక సమాజం, బ్రహ్మ సమాజం, కోనసీమ ప్రాంతంలోని ఆది ఆంధ్ర ఉద్యమ కార్యక్రమాల వెలుగుల్లో పావనమూర్తి బాల్యం చిగురించింది. ఫ్రెంచ్‌ పాలనలో ఉన్న యానాం ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి దడాల రమణయ్య నేతృత్వంలో జరిగిన పోరాటంలో పావనమూర్తి క్రియాశీలకంగా పాల్గొన్నాడు. రైల్వే మెయిల్ సర్వీస్ మద్రాస్‌లో తన సహోద్యోగి యెండ్లూరి చిన్నయ్యతో కలిసి ఉద్యోగులను సంఘటితపరిచాడు. భారతదేశంలో అంబేడ్కర్‌ సాగించే సాంఘిక, రాజకీయ పోరాట స్ఫూర్తిని అందిపుచ్చుకొని ఆ బాటలో మడమ తిప్పకుండా పయనించాడు.

అంటరానితనం కారణంగా అంత పెద్ద విశాఖపట్నంలో ఒక చిన్న అద్దె ఇల్లు దొరక్కపోవడంతో పావనమూర్తి హృదయంలో వేదనా తుఫాన్ రగిలింది. సమాజంలో సమస్త అధిపత్యాలకు అంకురార్పణ చేసిన మనుస్మృతిని జగదాంబ సెంటర్ సాక్షిగా దహనం చేసి, వైజాగ్ గుండెల్లో సమానత్వ భావాలను పండించాడు. ఉపకులాల వర్గాల నడుమ ఉన్న వైషమ్యాలను తొలగించటానికి వారందరికీ సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసి, వారి మధ్య సయోధ్య కుదర్చడానికి బృహత్తర ప్రయత్నం చేశాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్రాన్ని బోధిస్తూనే మరోవైపు కులనిర్మూలనా చైతన్యాన్ని ప్రబోధించాడు. ఆంధ్రప్రదేశ్ అంబేడ్కర్ మిషన్ వ్యవస్థాపక అధ్యక్షునిగా, అంబేడ్కర్ మెమోరియల్ సొసైటీ కార్యదర్శిగా, భారతీయ బౌద్ధమహాసభ జిల్లా కార్యదర్శిగా, ‘భీమ్‌దళ్’ అధినేతగా పావనమూర్తి కృషి అనితర సాధ్యమైనది. అణగారిన దళిత ఉన్నతోద్యోగుల కార్యాచరణ ఏ విధంగా ఉండాలని అంబేడ్కర్ అభిలషించాడో, ఆ విధమైన కార్యాచరణతో తన జీవనశైలిని పావనమూర్తి తీర్చిదిద్దుకున్నాడు. అంబేడ్కర్‌ను శ్వాసగా, ధ్యాసగా తలచి ఆయన ప్రతిపాదించిన నవయాన బౌద్ధాన్ని స్వీకరించి తదనుగుణమైన నిబద్ధతతో జీవించాడు. పావనమూర్తిది ముక్కుసూటి వ్యక్తిత్వం, రాజీపడని తత్త్వం. పార్లమెంటు సభ్యునిగా, శాసనసభ్యునిగా పోటీ చేయాలని వివిధ రాజకీయ పార్టీలు కోరినా తిరస్కరించాడు. ఆత్మగౌరవానికి భంగం కలిగితే పెద్ద పదవినైనా వదులుకోవడానికి ఆయన వెనుకాడలేదు. భావజాలపరమైన పాలనాగతమైన అభిప్రాయభేదంతో హైదరాబాద్‌లోని అంబేడ్కర్ కళాశాల ప్రిన్సిపాల్ పదవికి సైతం రాజీనామా చేశాడు. పావనమూర్తి తన అసమాన కార్యాచరణతో మూడుతరాల నాయకులను, మేధావులను కార్యకర్తలను, రచయితలను ప్రభావితం చేశాడు. ఫాసిజం విస్తరిస్తున్న ఈనాటి సంక్లిష్ట సందర్భంలో పావనమూర్తి చాటిచెప్పిన అంబేడ్కర్‌ ఆశయాలను, తథాగతుని తత్త్వాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజాసమూహాల్లో విస్తృతంగా ప్రచారం చేయవలసిన అవసరం ఉంది.

కోయి కోటేశ్వరరావు

ఈ వార్తలు కూడా చదవండి:

Karthika Pournami: కార్తీక పౌర్ణమి.. శివ నామస్మరణతో మార్మోగిన దేవాలయాలు

PM with World Cup Winners: ప్రధాని మోదీని కలిసిన టీమిండియా.. ప్రపంచకప్ విజేతలకు పీఎం అభినందనలు

Updated Date - Nov 06 , 2025 | 05:36 AM