Educating India: అజ్ఞాన చీకటిలో.. విజ్ఞాన జ్యోతి
ABN, Publish Date - Nov 11 , 2025 | 12:47 AM
ప్రపంచంలో అణుబాంబు లాంటి శక్తిమంతమైన ఆయుధం ఏదైనా ఉందంటే అది కేవలం విద్య మాత్రమే. ప్రపంచాన్ని జయించాలన్నా, చంద్రునిపైకి ఎగరాలన్నా...
ప్రపంచంలో అణుబాంబు లాంటి శక్తిమంతమైన ఆయుధం ఏదైనా ఉందంటే అది కేవలం విద్య మాత్రమే.’ ప్రపంచాన్ని జయించాలన్నా, చంద్రునిపైకి ఎగరాలన్నా, ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడాలన్నా, దేశ జీడీపీ పెరగాలన్నా, కుటుంబ సంక్షేమం, జ్ఞాన సముపార్జన, మానవ సంబంధాలు, శాంతి స్థాపన... తదితరాలన్నిటికీ మూలం విద్య మాత్రమే. భారతదేశాన్ని విద్యావంతుల దేశంగా మార్చడానికి ఎన్నో ప్రముఖ విద్యాలయాలను నెలకొల్పిన ‘భారత విద్యా వ్యవస్థ’ సృష్టికర్త, విద్యా వైతాళికుడు, దేశ ప్రథమ విద్యామంత్రి మౌలానా అబుల్ కలాం అజాద్ జయంతినే నేడు ‘జాతీయ విద్యా దినోత్సవం’గా జరుపుకుంటున్నాం. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో మౌలానా ఆజాద్ కీలకపాత్ర పోషించారు. గాంధీజీ ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమానికి తోడుగా నిలిచారు. 1920లో భారత జాతీయ కాంగ్రెస్‌లో ప్రవేశించారు. ఖిలాఫత్ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని పదేళ్లు జైలుశిక్ష అనుభవించారు. స్వాతంత్ర్యానంతరం తొలి విద్యామంత్రిగా పదకొండేళ్లపాటు విశిష్ట సేవలందించారు. ఆజాద్ విద్యా సంస్కరణలు నేటికీ ఆదర్శనీయం. దేశంలో సంస్కృతీ సంప్రదాయాలు, కళలు, సంగీతం, సాహిత్య వికాసానికి తోడ్పడ్డారు. ప్రాథమిక, ఉన్నత విద్య కోసం 1948లో, సెకండరీ విద్య కోసం 1952లో ప్రత్యేక కమిషన్‌లు ఏర్పాటు చేసిన ఘనత కూడా ఆయనదే. బాలికల, గ్రామీణ విద్య కోసం ఎంతగానో కృషి చేశారు. వయోజన విద్య, సార్వత్రిక ప్రాథమిక విద్య కోసం అనేక విద్యాలయాలు నిర్మింపజేశారు. యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్)ను స్థాపించిన ఘనతా ఆయనదే. దేశంలోనే ప్రప్రథమంగా ఖరగ్‌పూర్‌లో ఐఐటీ నిర్మింపజేసి, సాంకేతిక విద్యకు బీజం వేశారు. ICCR, AICTE.. వంటి ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలను ప్రారంభించారు. ఢిల్లీలో ‘సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్’, సాహిత్య అకాడమి, స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ & ప్లానింగ్ వంటి సంస్థలను స్థాపించిన మహనీయుడు అబుల్ కలాం. ఆయన విద్యావేత్త, రాజనీతిజ్ఞుడు, మేధో సంపన్నుడు మాత్రమే కాదు, బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదుడు. అంతేకాదు కవి, రచయిత, తత్వవేత్త కూడా.
నేడు చదువు అంగడి సరుకుగా మారిపోయింది. ప్రైమరీ పాఠశాలల్లో ఫీజులు వేలల్లో, లక్షల్లో ఉంటున్నాయి. ఇంటర్, డిగ్రీ, మెడికల్ సీటు, ఇంజనీరింగ్ వంటి ఉన్నత విద్య సీట్లు డబ్బున్నవాళ్లే కొనగలుగుతున్నారు. పేద విద్యార్థులు విద్యా దోపిడీకి గురవుతున్నారు. ‘నూతన విద్యా విధానాల రూపకల్పన, నూతన ప్రణాళికలు, విద్య అభివృద్ధి’ వంటివాటిలో ప్రభుత్వాలు, అధికారులు కొంతమేరకు విఫలమైనట్లు కన్పిస్తోంది. విద్యా సంబంధిత విషయాలపై నేటి విద్యావేత్తలు, మేధావులు చేసే విమర్శలే దీనికి నిదర్శనం. మరోవైపు, విద్య కోసం తల్లిదండ్రులు ఫీజుల భారాన్ని మోస్తున్నప్పటికీ వారి పిల్లలకు నాణ్యమైన విద్య అందడం లేదు. కార్పొరేట్ విద్యాసంస్థల రాకతో ‘ధనవంతులకో విద్య, పేదలకో విద్య’ అన్నట్టుగా మారిపోయింది నేటి విద్యారంగం పరిస్థితి. విద్యా సంబంధిత ప్రవేశాల్లో కూడా జ్ఞానానికి ప్రాధాన్యం ఇవ్వకుండా కుల, మత రిజర్వేషన్లు ఉంటుండడంతో ఎంతోమంది చురుకైన, మేధోశక్తి గల విద్యార్థులు ఉన్నత విద్యా ప్రవేశాలకు దూరమవుతున్నారు. మరోవైపు, ప్రభుత్వ విద్యాలయాలకు అవసరమైన నిధులు లేక, సరైన మౌలిక సదుపాయాలు లేక అనేక ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు మూతపడే పరిస్థితి ఉంది. విద్యాలయాల్లో ఉపాధ్యాయుల నియామకాలు అవసరమైన మేరకు ఉండడం లేదు. 70 ఏళ్ల క్రితం మన దేశంలో మౌలానా అబుల్ కలాం అజాద్ తెచ్చిన విద్యా సంస్కరణలను నేటి ప్రభుత్వాలు, విద్యాధికారులు ఆదర్శంగా తీసుకోవాలి. మౌలానా అజాద్ లాంటి ఆలోచనాపరులు, మేధావులు మన విద్యా వ్యవస్థను చక్కదిద్దడానికి పుట్టుకురావాలని ఆశిద్దాం.
-సయ్యద్ జబీ (నేడు జాతీయ విద్యా దినోత్సవం)
Updated Date - Nov 11 , 2025 | 12:47 AM