Indian Constitution: జాతి ఆత్మ మన రాజ్యాంగం
ABN, Publish Date - Nov 26 , 2025 | 01:05 AM
భారత రాజ్యాంగం మన దేశపు ఆత్మ, అది మన ప్రజాస్వామ్యం ఇచ్చిన అమూల్యమైన వారసత్వం. రాజ్యాంగం కేవలం పరిపాలనా నియమాల పుస్తకం కాదు; అది న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం...
భారత రాజ్యాంగం మన దేశపు ఆత్మ, అది మన ప్రజాస్వామ్యం ఇచ్చిన అమూల్యమైన వారసత్వం. రాజ్యాంగం కేవలం పరిపాలనా నియమాల పుస్తకం కాదు; అది న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం వంటి విలువలకు మార్గదర్శక దీపస్తంభం. అనేక భాషలు, మతాలు, సంస్కృతులు, వర్గాలతో కూడిన మన దేశాన్ని ఒక గూటిగా నిలిపేందుకు రాజ్యాంగమే అసలైన బలసారం. వందలాది అధికరణలు, భాగాలు, షెడ్యూళ్లు, సవరణలతో కూడిన ఈ పత్రం రూపుదిద్దుకోవడానికి రాజ్యాంగ సభ నిరంతరం శ్రమించింది. రాజ్యాంగ రూపకల్పనలో కనిపించిన ఆలోచనల వైవిధ్యం, సఖ్యత, చర్చ–సమ్మతి సంస్కృతి మన ప్రజాస్వామ్య పరిపక్వతకు చిరస్మరణీయ నిదర్శనం.
రాజ్యాంగం ప్రతి పౌరునికి హక్కులను అందించడమే కాదు, బాధ్యతలను కూడా స్పష్టంగా నిర్ధారించింది. హక్కుల పట్ల ఎంత అప్రమత్తంగా ఉంటామో, అలాగే కర్తవ్యాల పట్ల జాగ్రత్తగా, నిబద్ధతతో ఉన్నపుడే ప్రజాస్వామ్యం బలపడుతుంది. స్వాతంత్ర్య సమర స్ఫూర్తితో దేశ నిర్మాణానికి బాటలు వేసిన డా. రాజేంద్ర ప్రసాద్, బాబాసాహెబ్ డా. భీమ్‌రావ్ అంబేడ్కర్ వంటి మహానుభావుల త్యాగం, దూరదృష్టి వల్లే సమాన అవకాశాల సమాజం దిశగా మన ప్రస్థానం ప్రారంభమైంది.
అయితే ఈ మహత్తర రాజ్యాంగాన్ని కాలక్రమేణా అనేక సంఘటనలు అవహేళన చేశాయి. అత్యవసర స్థితి (ఎమర్జెన్సీ) విధించడం భారత ప్రజాస్వామ్య చరిత్రలో అతి చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది. ప్రాథమిక హక్కులను తొక్కిపెట్టి, భిన్నాభిప్రాయాలకు సంకెళ్ళు వేసే పాలన ఆ కాలంలో నెలకొంది. కానీ ఎమర్జెన్సీ అనంతరం ప్రజలు తమ తీర్పుతో ఆ నిరంకుశ ధోరణికి చెక్ పెట్టారు. ఇది భారత రాజ్యాంగ బలాన్ని మరోసారి ప్రపంచానికి చాటింది. తరువాత 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇలాంటి దుర్వినియోగాలకు అడ్డుకట్ట వేయడానికి మార్పులు జరిగాయి. రాజ్యాంగానికి స్వయంగా తనను తాను సరిదిద్దుకునే శక్తిని ఉన్నదని ఇది నిరూపిస్తుంది. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో రాజ్యాంగ గౌరవం, ప్రాముఖ్యతకు కొత్త ఊపిరి లభించింది. న్యాయవ్యవస్థ స్వతంత్రతను బలోపేతం చేయడానికి తీసుకున్న చర్యలు, రాజ్యాంగ దినోత్సవాన్ని జాతీయ స్థాయిలో జరుపుకోవడం వంటి ప్రయత్నాలు రాజ్యాంగ విలువలను ప్రజల దైనందిన జీవితంతో మరింత దగ్గర చేశాయి. ఆర్థిక రంగంలో కేంద్ర–రాజ్యాల సమన్వయాన్ని బలోపేతం చేసే జీఎస్టీ వంటి సంస్కరణలు కూడా రాజ్యాంగ స్ఫూర్తితోనే అమలైనవి.
జమ్మూ కశ్మీర్‌పై అమలులో ఉన్న ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని మరో మైలురాయిగా చూడవచ్చు. తాత్కాలిక ప్రత్యేక హోదాగా ప్రవేశపెట్టిన ఆ అధికరణం కాలక్రమంలో రాష్ట్ర సమగ్ర సంలీనానికి అడ్డంకిగా మారింది. దీన్ని తొలగించడం ద్వారా జమ్మూ కశ్మీర్ ప్రజలకు ఇతర రాష్ట్రాల పౌరుల్లానే సమాన హక్కులు, సమాన అభివృద్ధి అవకాశాలు కల్పించడం రాజ్యాంగ న్యాయాన్ని, సమానత్వ ఆత్మను బలపరిచిన నిర్ణయం. తరువాత సుప్రీంకోర్టు ఈ చర్యను రాజ్యాంగబద్ధమని నిర్ధారణ చేసింది.
రాజ్యాంగం ఒక స్థిర పత్రం మాత్రమే కాదు, కాలానుగుణంగా మార్పులు, సవరణల ద్వారా సజీవంగా ఉండే జీవ గ్రంథం. సామాజిక–రాజకీయ అవసరాలు మారుతున్న కొద్దీ అనేక సవరణలు చేయబడతాయి. అయితే ఏ మార్పు చేసినా ప్రాథమిక నిర్మాణం (Basic Structure) దెబ్బతినకూడదనే భావన న్యాయవ్యవస్థ గీసిన మార్గదర్శక సూత్రం. ప్రజాస్వామ్య స్వరూపం, న్యాయపాలన, మౌలిక హక్కులు వంటి విలువలను కాపాడే ఈ సూత్రం రాజ్యాంగ స్థిరత్వానికి భరోసా ఇస్తోంది.
ఈ నేపథ్యంతో ప్రతీ ఏడాది రాజ్యాంగ దినోత్సవాన్ని కేవలం ఫార్మాలిటీగా కాకుండా, ఒక ప్రతిజ్ఞగా భావించాలని మనస్ఫూర్తిగా కోరాలి. హక్కులు మాత్రమే కాదు, కర్తవ్యాలను కూడా గౌరవించాలి. సామాజిక న్యాయం, సమానత్వం, జాతీయ ఏకత్వం దిశగా ప్రతీ రోజు ఒక్కో అడుగు వేస్తూ ఉంటేనే రాజ్యాంగ స్ఫూర్తి నిజంగా నిలుస్తుంది. పుస్తకాలలో పరిమితమై ఉన్న పత్రంగా కాకుండా, మన వ్యవహారాల్లో, పాలనలో, ప్రజా జీవితాల్లో ప్రతిబింబించే జీవశక్తిగా రాజ్యాంగాన్ని మనం చూడాలి.
రాజ్యాంగ రక్షణ మన చేతుల్లోనే ఉంది. ఈ పత్రాన్ని దేశ స్వరూపానికి ప్రతీకగా, మన ఉమ్మడి బాధ్యతకు చిహ్నంగా, ప్రజాస్వామ్య గర్వానికి నిదర్శనంగా భావించి, భవిష్యత్ తరాలకు మరింత బలమైన, న్యాయసమాజాన్ని అందించే దిశగా మనందరం కట్టుబడి పనిచేయాలి.
డా. కె.లక్ష్మణ్
రాజ్యసభ సభ్యులు,
బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు
(నేడు రాజ్యాంగ దినోత్సవం)
ఇవి కూడా చదవండి
ప్రాక్టీస్ మొదలుపెట్టిన శ్రేయస్!
లిక్కర్ స్కామ్‌లో.. జోగి రమేష్‌కు పోలీస్ కస్టడీ..
Updated Date - Nov 26 , 2025 | 09:22 AM