రైతుకూలీ రాజ్య స్వాప్నికుడు
ABN, Publish Date - Jun 26 , 2025 | 05:06 AM
సామాజిక విప్లవానికి ఆధ్యాత్మికతను మిళితం చేసిన అరుదైన అన్వేషి స్వామి సహజానంద సరస్వతి. భారతదేశంలో మొట్టమొదటిసారిగా భూమిని జాతీయం చేయాలని ఉద్యమించిన వ్యక్తి ఆయన. ఈ దేశంలో రైతుకూలీ రాజ్యం...
సామాజిక విప్లవానికి ఆధ్యాత్మికతను మిళితం చేసిన అరుదైన అన్వేషి స్వామి సహజానంద సరస్వతి. భారతదేశంలో మొట్టమొదటిసారిగా భూమిని జాతీయం చేయాలని ఉద్యమించిన వ్యక్తి ఆయన. ఈ దేశంలో ‘రైతుకూలీ రాజ్యం’ స్థాపన స్వామీజీ కన్న కల. దానిని నిజం చేయడం కోసం జీవితాంతం కృషి చేసిన ప్రజానేత సహజానంద సరస్వతి. ఉత్తర భారతంలోని దేవా అనే గ్రామంలో భూమిహార్ కులంలో జన్మించిన సహజానంద అసలు పేరు నౌరంగ్ రాయ్. ప్రాథమిక విద్యను మూడేళ్లలోనే పూర్తి చేశారు. ఆధ్యాత్మిక సత్యాన్వేషిగా మారి దేశం మొత్తం తిరిగారు. ఎందరో సాధువుల్ని కలిసారు. మత గ్రంథాలను ఔపోసన పట్టారు. ఇవేవీ ఆయనకు సంతృప్తి ఇవ్వలేదు. కళ్లముందు కదలాడుతున్న వాస్తవాల్ని గుర్తించని ప్రజ్ఞ వ్యర్థం అనుకున్నారు. సామాజిక అసమానతల్ని గుర్తించని మతం గతం అనుకున్నారు. స్వామి సహజా నంద సరస్వతిగా మారారు. క్రియాశీల సామాజిక కార్యకర్తగా రూపొందారు.
క్విట్ ఇండియా ఉద్యమంలో స్వామీజీ అరెస్టయ్యారన్న వార్తను విన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్, ప్రతి ఏటా ఏప్రిల్ 28న ‘అఖిల భారత స్వామి సహజానంద దినోత్సవం’గా జరుపుకోవాలని ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపున ప్రకటించారంటే స్వామి సహజానంద ప్రభావం ఎంతటిదో అర్థమవుతుంది. ఒక్క మహాపండిత్ రాహుల్ సాంకృత్యాయన్ జీవితం మాత్రమే సహజానంద స్వామి జీవితానికి దగ్గరగా ఉంటుంది. ఇరువురూ చాలాకాలం రైతాంగ పోరాటాలకి నాయకత్వం వహించిన సంగతి తెలిసిందే. అలాగే ప్రజా విముక్తి గొంతుకలకు స్థానం కల్పించడం కోసం హుంకార్, లోక్ సంగ్రహ వంటి విప్లవాత్మక పత్రికలు స్థాపించి నడిపారు. ‘గీతా హృదయ్’ వంటి ఎన్నో ఆధ్యాత్మిక రచనలు కూడా చేశారు. మతాన్ని పూర్తిగా వ్యక్తిగత వ్యవహారంగా ప్రకటించిన స్వామీజీ, మత ఛాందసవాదాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు.
‘ఆలిండియా కిసాన్ సభ’ మొదలుకుని ప్రధానంగా రైతాంగ పోరాటాలకు రూపాన్నిచ్చిన వ్యక్తి సహజానంద సరస్వతి. దేశంలోనే మొదటిసారి రైతు కూలీ ఉద్యమాలను మిలిటెంట్ స్థాయిలో నిర్మించారు. జమీందారీ విధానం రద్దు కోసం ఎన్నో పోరాటాలు చేశారు. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని జైళ్లలో గడిపారు. ఈ దేశంలో భూమి సమస్యను సమగ్రంగా అర్థం చేసుకోవడానికి స్వామీజీ ఎంతో కృషి, అధ్యయనం చేశారు. ‘భూమిని జాతీయం చేయాలని’ డిమాండ్ చేసిన వ్యక్తి స్వామి సహజానంద సరస్వతి. ఈ దేశంలో భూమి సమస్య కుల సమస్యతో ముడిపడి ఉందని గుర్తించారు కనుకనే సోషలిస్టు సమాజాన్ని స్థాపించడం కోసం అహర్నిశలు తపించారు. మతం ఆధారంగా కాకుండా మానవత ప్రాతిపదికగా నిరుపేదలకు, బహుజనులకు భూమిపై హక్కు ఉండాలని పోరాడారు.
నంబూద్రిపాద్ మొదలు, ఎన్.జి రంగా వరకూ ఎంతోమంది మేధావులతో కలిసి పనిచేశారు. అనేక రైతు సంఘాల్ని ప్రతి ప్రాంతంలోనూ నిర్మించారు. ఆధ్యాత్మిక, సాంఘిక రంగాల్లో స్వామి దయానంద సరస్వతి, స్వామి వివేకానంద చేసిన కృషిని రాజకీయ, సామాజిక రంగంలో సహజానంద సరస్వతి చేశారని బుద్ధిజీవుల అభిప్రాయం. ఎందుకంటే, సన్యాసి జీవితం గడుపుతూ దేశవ్యాప్తంగా రైతాంగ పోరాటాలకు నాయకత్వం వహించిన ఏకైక వ్యక్తి నాటికీ నేటికీ సహజానందా సరస్వతి ఒక్కరే. అందుకే ఈ రోజుకీ బిహార్‌లో రాజకీయాలకు అతీతంగా ప్రతి పార్టీ సహజానంద సరస్వతి జయంతి, వర్ధంతులు జరుపుతాయి.
‘మేరీ జీవన్ సంఘర్ష్’ పేరిట ఆయన రాసిన ఆత్మకథను, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ఇంగ్లీషులో 400 పుటలకు పైగా అనువదించి ‘ది స్ట్రగుల్ ఆఫ్ మై లైఫ్’ పేరిట రామచంద్ర ప్రధాన్ సంపాదకత్వంలో ప్రచురించింది. నాటి సామాజిక, రాజకీయార్థిక, సాంస్కృతిక సమస్యల్ని చిత్రించిన దృశ్య చిత్రమది. ఆయన జీవితం కోసం పరిశోధించినవారు అసంఖ్యాకంగా ఉన్నారు. పదుల సంఖ్యలో ఆయన రాసిన రచనలే కాక, ఆయన గురించి విస్తారంగా రాసినవాళ్లూ ఉన్నారు. అమెరికాలోని వర్జీనియా యూనివర్సిటీ ప్రొఫెసర్ వాల్టర్ హ్యుసర్ అప్పట్లో స్వామీజీ జీవితం, కృషి కోసం ఎంతో పరిశోధన జరిపారు. ఈ మధ్యనే ఆశ్రమం నుంచి తీసుకెళ్లిన సుమారు 200 కేజీల పరిశోధనా పత్రాలను, స్వామీజీ అముద్రిత రచనల్ని బిహార్ మంత్రుల సమక్షంలో తిరిగి అప్పగించారు.
ఆధ్యాత్మిక వాదిగా, రైతాంగ ఉద్యమ నేతగా, ప్రజాపోరాట యోధునిగా, పాత్రికేయుడిగా, విస్తృత యాత్రికుడిగా, భావజాలరంగ ప్రచారకుడిగా, లౌకికవాద తత్వవేత్తగా, ప్రజాభిప్రాయ పరిపాలకుడిగా ఎన్నో పాత్రలు పోషించారు స్వామి సహజానంద సరస్వతి. ఈ దేశంలో అసమానతలు తొలగి ప్రజలంతా కలిసి మెలిసి జీవించాలని ఆశించిన మహోన్నత ఆధ్యాత్మిక సామ్యవాది. క్రియాశీల సత్యాన్వేషి. దురదృష్టవశాత్తూ ఇంతటి గొప్ప వ్యక్తి గురించి తెలిసినవారు అత్యంత తక్కువ. కుల, మతాతీత మానవీయ విలువలను మానవాళిలో పెంపొందించడానికి చివరి వరకూ తపించి జూన్ 26, 1950న మరణించారు. దేశవ్యాప్తంగా విద్వేష గాలులు బలంగా వీస్తున్న ఈ సమయంలో ఆధ్యాత్మికత అంతఃస్సారం అందరినీ ప్రేమించడమేనని, అదే సకల మతాల సారమని ప్రబోధించిన స్వామి సహజానంద స్ఫూర్తిని పునర్నిర్మించుకోవడం ఈనాటి తక్షణ అవసరం.
గౌరవ్
సామాజిక కార్యకర్త
(నేడు సహజానంద సరస్వతి 75వ వర్ధంతి)
ఇవి కూడా చదవండి..
కమాండర్ అభినందన్‌ను బంధించిన పాకిస్థాన్ మేజర్ హతం
ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా దాడులు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 26 , 2025 | 05:06 AM