ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bhudhar Card: సర్వేయర్లు లేరు.. మరి భూధార్ ఎలా

ABN, Publish Date - Jul 08 , 2025 | 01:23 AM

ఆధార్‌ కార్డు లాగా భూమి ఉన్న ప్రతి రైతుకూ భూధార్‌ కార్డు మంజూరు చేస్తామని గత ఏడాది కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించింది.

ధార్‌ కార్డు లాగా భూమి ఉన్న ప్రతి రైతుకూ భూధార్‌ కార్డు మంజూరు చేస్తామని గత ఏడాది కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించింది. కానీ సర్వేయర్ల కొరత కారణంగా దీని సాధ్యాసాధ్యాలపై సందేహాలు తలెత్తుతున్నాయి.తెలంగాణలో భూములను సర్వే చేసి, భూ వివరాలను నవీకరిస్తామని గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రాన్ని ‘డిజిటల్ మ్యాప్ ఆఫ్ తెలంగాణ’ చేస్తామని ప్రకటించింది. కానీ, తర్వాత సర్వే అంశాన్ని పూర్తిగా విస్మరించింది. భూములతో ముడిపడి ఉన్న అవినీతి తగ్గాలంటే రికార్డుకు, భూమికి లింకు ఉండాలని రెవిన్యూ, ప్రజా సంఘాలు, న్యాయస్థానాలు, ఉన్నతాధికారులు నొక్కిచెబుతున్నారు. వాస్తవానికి ‘జాతీయ భూముల నవీకరణ పథకం’ (ఎన్‌ఎల్ఆర్ఎంపీ) ద్వారా తెలంగాణలో సమగ్ర భూ సర్వేకు 2014లోనే కేంద్రం సంకల్పించింది. ఇందుకు రూ. 400 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసి, ముందుగా రూ. 83 కోట్లు విడుదల చేసింది. కానీ పదేళ్లు గడిచినా భూముల కొలతల విషయమై ఒక్క అడుగూ ముందుకు పడలేదు. సమగ్ర భూ సర్వే కోసం.. నాటి నిజాం సర్ సాలార్‌జంగ్ తెచ్చిన ‘భూమి కొలతల చట్టం–1923’కు అదనంగా కొన్ని సవరణలు చేయాల్సి ఉంటుంది. సరైన అనుమతులు లభిస్తే రెండేళ్లలో తెలంగాణలో భూముల సర్వే పూర్తి చేస్తానని 2016లో అప్పటి సీసీఎల్‌ఏ రేమండ్ పీటర్ ప్రతిపాదించారు. కానీ అందుకు నాడు సీఎం కార్యాలయం స్పందించలేదు. రాష్ట్రంలోని భూములకు ‘సంపూర్ణ యాజమాన్య హక్కు చట్టం– కంక్లూజివ్ టైటిల్ యాక్ట్’ తెస్తామని కేంద్రం తొమ్మిదేళ్లుగా చెబుతూనే ఉన్నా అది ఆచరణసాధ్యం కావడం లేదు. ఇతర రాష్ట్రాల విషయానికొస్తే.. 2021 జనవరిలో నాటి ఏపీ ప్రభుత్వం సమగ్ర భూ సర్వేకు ముహూర్తం ఖరారు చేసినా, కొన్ని కారణాల వల్ల దాన్ని పూర్తి చేయలేకపోయింది. ఇప్పటికే గుజరాత్, త్రిపుర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పాలకులు 90 శాతం సమగ్ర భూ సర్వేలు నిర్వహించారు. బిహార్, ఉత్తరప్రదేశ్‌లోనూ భూములకు సంబంధించి కీలకమైన చట్టాలు తెచ్చారు.

పక్క రాష్ట్రమైన కర్ణాటకలో పద్నాలుగేళ్ల కిందటే ఆదర్శవంతమైన భూ రికార్డుల ప్రక్షాళన సర్వే జరిగింది. ‘భూమి–కావేరి’ పేరిట ఆ రాష్ట్రంలో ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తున్నారు. ఎవరైనా భూమి అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా క్షేత్రస్థాయి సర్వే నిర్వహిస్తారు. అభ్యంతరాలేవీ లేవని నిర్ధారించిన తర్వాత దాన్ని సరైన భూమిగా గుర్తించి వెంటనే మ్యాప్‌తో డిజిటలైజ్ చేస్తారు. ఆ తరువాత రిజిస్ట్రేషన్ చేస్తారు. ఆపై అలాంటి భూమిని ఎన్నిసార్లు ఎవరు కొన్నా, అమ్మినా వెంటనే మ్యుటేషన్ చేస్తారు. దాంతో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావడం లేదు.

మన రాష్ట్రంలో 33 జిల్లాలు, 561 మండలాలు, 78 రెవిన్యూ డివిజన్లు, 76 లక్షల కమతాలు, 18 లక్షల వరకు సర్వే నెంబర్లు ఉన్నాయి. ఈ మొత్తం భూ విస్తీర్ణం 2,45,57,758 ఎకరాలు. ఈ భూముల సర్వే పూర్తి కావాలంటే తగు సంఖ్యలో మానవ వనరులు, సర్వేయర్లు, టెక్నికల్ సిబ్బంది అవసరం. దీనికి రాష్ట్రంలోని భూ పరిపాలనా విభాగం, కొలతలకు కమిషనర్ సర్వే–సెటిల్మెంట్ విభాగం అనుబంధంగా ఉంటాయి. ప్రతి జిల్లాకు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే, ల్యాండ్ రికార్డుల అధికారి ఉంటారు. అన్ని రెవిన్యూ డివిజన్లకు సర్వే ఇన్‌స్పెక్టర్లు ఉంటారు. ఒకవేళ రైతుకు మండల సర్వేయర్ పనిపై అసంతృప్తి ఉంటే అతడు పై అధికారులను, డివిజన్, జిల్లా స్థాయి అధికారులను సంప్రదించవచ్చు. చివరగా సర్వే కమిషనర్ ఎంక్వైరీతో ఆ రైతు పని పూర్తవుతుంది.

రైతుల నుంచి వచ్చే సమస్యల్లో భూమి కొలతల సమస్యలే అధికం. ఇంతటి ప్రాధాన్యం కలిగిన ఈ రెవిన్యూ అనుబంధశాఖలో అవసరమైన దాంట్లో సగానికి కంటే తక్కువగానే శాశ్వత సిబ్బంది ఉన్నారు. రాష్ట్రంలోని అన్ని మండలాల్లో పదమూడేళ్లుగా లైసెన్స్‌డ్‌ సర్వేయర్స్ పనిచేస్తున్నారు. వీరికి సరైన జీతభత్యాలు లేవు. తమను ప్రభుత్వం ఎప్పటికైనా పర్మినెంట్‌ చేస్తుందనే ఆశతో ఉన్నారు. తమ లైసెన్సును రెన్యువల్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కొత్త చట్టం ప్రకారం అన్ని భూములు సర్వే చేయడానికి ఇటీవల ఐదు వేల మందిని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ప్రస్తుతం వారు శిక్షణ పొందుతున్నారు. వారికి ప్రభుత్వం పూర్తి స్థాయి ఉద్యోగం ఇస్తుందన్న హామీ లేదు. మరోవైపు నైపుణ్యం ఉన్న లైసెన్స్‌డ్‌ సర్వేయర్స్‌ను ప్రభుత్వం గుర్తించడం లేదు. కానీ లైసెన్స్‌డ్‌ సర్వేయర్లను నియమించామని, ఇక భూ సర్వే సమస్యలు దూరమవుతాయని రెవిన్యూ మంత్రి ఇటీవల పలు సమావేశాల్లో చెబుతున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తెచ్చింది. అందులో సెక్షన్ 9లో పొందుపరిచినట్లుగా ప్రతి పార్సెల్‌కు (ఎ)తాత్కాలిక భూధార్‌, (బి) శాశ్వత భూధార్, (సి) భూధార్ కార్డ్ ఉంటుందని తెలిపింది. భూ కమతం విస్తీర్ణంతో నిమిత్తం లేకుండా రైతులందరికీ భూధార్ కార్డు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. ఆ ప్రక్రియ ఈ ఏడాది ఆగస్టు 15నాటికి పూర్తవుతుందని తెలిపింది. కానీ ఈ ప్రక్రియలోనూ అనేక సమస్యలున్నాయి. ఉదాహరణకు.. ఒక కమతాన్ని కొలవాలంటే రైతు, ఒక సర్వే ఉద్యోగి, ఒక రెవిన్యూ ఉద్యోగి కలిసి పొలం సరిహద్దుల వెంట నడవాలి. ప్రతి భూమి పార్సెల్‌కు నాలుగు మూలలు ఉంటాయి. నాలుగుకు మించి మూలలుంటే ప్రతి మూలకు వెళ్లి రిమోట్‌ను క్లిక్ చేస్తే ఆ పొలం కోఆర్డినేట్ పాయింట్స్ (అక్షాంశాలు, రేఖాంశాలు) రికార్డు అవుతాయి. అన్ని మూలల్లో హద్దురాళ్లను బిగించాలి. ప్రతి కమతంపై ఇరుగు పొరుగు రైతుల మధ్య ఎలాంటి గట్టు పంచాయితీ లేకుండా డిజిటల్ మ్యాప్ సిద్ధం చేయాలి. అప్పుడు ప్రతి రైతు తన కమతానికి ఒక భూధార్ కార్డు పొందగలుగుతాడు. అలా ఇవ్వగలిగితే ప్రతి రైతు భరోసా పొందగలుగుతాడు. కానీ తగు సంఖ్యలో భూ కొలతల సిబ్బంది లేకుండా ఈ పని పూర్తి చేయడం అసాధ్యం. ఎలా చూసినా నైపుణ్యం ఉన్న సర్వేయర్స్ అవసరం చాలా ఉంది. ఇప్పటికే ఉన్న లైసెన్స్‌డ్‌ సర్వేయర్స్‌ను క్రమబద్ధీకరించడం గురించి ప్రభుత్వం పునరాలోచన చేయాలి. తద్వారా సిబ్బంది కొరత లేకుండా భూ భారతి చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి వీలవుతుంది.

-వి. బాలరాజు రిటైర్డ్‌ తహశీల్దారు

Updated Date - Jul 08 , 2025 | 01:23 AM