Celebrating Viswakarma Jayanti: అభినవ విశ్వకర్మ నరేంద్ర మోదీ
ABN, Publish Date - Sep 17 , 2025 | 02:46 AM
సెప్టెంబర్ 17– దేశ చరిత్రలో ప్రత్యేకమైన సందర్భం. ఇది దేశ ప్రజల ఆకాంక్షలకు సరికొత్త రూపాన్ని ఇచ్చిన విశేషమైన రోజు. మన పురాణేతిహాసాల ప్రకారం.. బ్రహ్మదేవుడి సృష్టి ఆలోచనకు అనుగుణంగా విశ్వాన్ని నిర్మించిన భగవాన్ విశ్వకర్మ జయంతి...
సెప్టెంబర్ 17– దేశ చరిత్రలో ప్రత్యేకమైన సందర్భం. ఇది దేశ ప్రజల ఆకాంక్షలకు సరికొత్త రూపాన్ని ఇచ్చిన విశేషమైన రోజు. మన పురాణేతిహాసాల ప్రకారం.. బ్రహ్మదేవుడి సృష్టి ఆలోచనకు అనుగుణంగా విశ్వాన్ని నిర్మించిన భగవాన్ విశ్వకర్మ జయంతి. భవనాలు, ఆయుధాలతో పాటుగా చేతివృత్తుల వ్యవస్థ సృష్టికర్త కూడా ఆయనే. మరోవైపు, దేశ స్వాతంత్ర్యానికి 13 నెలల తర్వాత 1948లో ఇదే రోజు హైదరాబాద్ సంస్థానానికి నిజాం నిరంకుశత్వం నుంచి రజాకార్ల క్రూరత్వం నుంచి విమోచనం లభించింది. నాటి హైదరాబాద్ సంస్థానం ప్రజల పోరాటం, భారతదేశ ప్రథమ హోంమంత్రి సర్దార్ పటేల్ చేపట్టిన ‘ఆపరేషన్ పోలో’ కారణంగా, హైదరాబాద్ డెక్కన్ ప్రాంతం స్వేచ్ఛావాయువులు పీల్చుకుంది. ఇది జరిగిన రెండేళ్ల తర్వాత 1950 సెప్టెంబర్ 17న, నరేంద్రమోదీ జన్మించారు. ఇది యాదృచ్ఛికమే. భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తర్వాత జన్మించిన తొలి ప్రధానిగా, గత 60 ఏళ్లలో వరుసగా మూడుసార్లు అద్భుతమైన ప్రజాశీర్వాదంతో ప్రధానమంత్రి పగ్గాలు చేపట్టిన ఏకైక వ్యక్తి మోదీ.
భగవాన్ విశ్వకర్మ జయంతి అయినా, ప్రధాని మోదీ జన్మదినమైనా, తెలంగాణ విమోచన దినమైనా.. ఏకైక సమన్వయ అంశం ‘సెప్టెంబర్ 17’. ఈ మూడు అంశాలకు, నరేంద్రమోదీ ఆలోచనకు బలమైన సంబంధం ఉంది. కృష్ణుడి కోరిక మేరకు భగవాన్ విశ్వకర్మ ద్వారకను నిర్మించాడు. పాండవులు, కౌరవుల కోసం హస్తినాపురాన్ని కట్టించి ఇచ్చాడు. విష్ణుమూర్తి సుదర్శన చక్రం విశ్వకర్మ కళానైపుణ్యానికి ఒక ఉదాహరణ. విశ్వకర్మ పంచముఖాల్లో ఒక్కో ముఖం ఒక్కో చేతి వృత్తి సమాజానికి ఆజ్యం పోసిందని పురాణాల్లో స్పష్టంగా ఉంది. ఇలా ఐదు ముఖాలు కమ్మరి, వడ్రంగి, ఇత్తడి పనివారు, శిల్పులు, స్వర్ణకారుల వ్యవస్థకు ఆజ్యం పోశాయి. అందుకే మన చేతివృత్తుల కళలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఒక్కసారి వర్తమానంలోకి వస్తే, 2014లో మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ కళలకు, మన భారతీయ యువతకు నైపుణ్యాభివృద్ధి కోసం ప్రత్యేకంగా స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్ మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేశారు. ఆ తర్వాత ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ.. చేతివృత్తుల రంగానికి సరైన ప్రోత్సాహాన్ని అందించేందుకు ‘ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన’ పేరుతో కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. మన కళాకారుల నైపుణ్యాన్ని పెంచడంతోపాటు మన ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ దారిని సుగమం చేసేందుకు ఈ పథకం ఎంతో తోడ్పడుతోంది. ఇది పక్కా ప్రణాళికతో.. అభినవ విశ్వకర్మ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం.
ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన 11 ఏళ్లలో దేశంలో మూలధన వ్యయంపై ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల నిర్మాణంలో 60 శాతం పెరుగుదల నమోదైంది. ఆపరేషనల్ విమానాశ్రయాలు 160కి పెరిగాయి. 1,275 రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ జరిగింది. ఇదంతా వికసిత భారత ‘విశ్మకర్మ’ అయిన మోదీ ‘ఆత్మనిర్భర భారత్’ సంకల్ప సాకారంలో ఒక భాగం. నాడు దేవతల కోరిక మేరకు విశ్వకర్మ ‘స్వర్గాన్ని’ నిర్మిస్తే.. నేడు మోదీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ‘వికసిత భారతం’ నిర్మాణంపై ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తున్నారు.
అభివృద్ధి మంత్రాన్ని జపిస్తూనే దేశంలో దశాబ్దాలుగా పేరుకుపోయిన వివిధ జాడ్యాలను తొలగించేందుకు రంగంలోకి దిగారు మోదీ. 15 ఆగస్ట్, 2022 నాడు.. దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎర్రకోట నుంచి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ‘పాంచ్ ప్రాణ్’ గురించి ప్రస్తావించారు. అవి.. అభివృద్ధి చెందిన భారతదేశం, బానిసత్వపు ఆలోచనలను తొలగించుకోవడం, మన సాంస్కృతిక–వారసత్వ మూలాల పట్ల గర్వపడటం, ఐకమత్యంతో ఉండటం, పౌరులందరూ తమ బాధ్యతను సరిగ్గా నిర్వర్తించడం. ఇంతకుముందే.. దేశాభివృద్ధి గురించి చెప్పాను. ఇందులో మనం చర్చించుకోవాల్సిన మరో అంశం.. మనలోని బానిసత్వ భావనలను తొలగించుకోవడం. దేశానికి స్వాతంత్ర్యం ఇద్దామనుకున్నప్పటి నుంచి ‘మైనారిటీల బుజ్జగింపు’ అనేది మనకు బ్రిటిషర్ల నుంచి అంటుకున్న జాడ్యం. దాదాపు 8 దశాబ్దాలైనా ఇంకా దీని నుంచి బయటపడలేదు. ఇదే విషయం హైదరాబాద్ విమోచన విషయంలోనూ, రాజకీయ పార్టీల ఆలోచనలు, వీటిని ప్రజల్లో జొప్పించేందుకు జరుగుతున్న కుట్రల్లో స్పష్టంగా కనబడుతోంది.
హైదరాబాద్ విమోచన ఉద్యమం విషయానికొస్తే– ప్రజలు ప్రాణాలకు తెగించి, రజాకార్ల అకృత్యాలను ఎదిరించి.. పటేల్ సహకారంతో స్వాతంత్ర్యాన్ని పొందితే, దీన్ని దుర్మార్గపు పాలన నుంచి విమోచనం అని చెప్పేందుకు కూడా ఈ బానిస మెదళ్లు అంగీకరించడం లేదు. భారత యూనియన్‌లో హైదరాబాద్ సంస్థానం ‘విలీనం’ అని చిన్న మాటతో.. లెక్కలేనన్ని త్యాగాలను తక్కువచేసి చూపించేందుకు ప్రయత్నించారు. మాటల్లో వివరించేందుకు, రాతలతో చెప్పేందుకు వీలుకాని.. నిజాం, రజాకార్ల క్రూరత్వాన్ని నేటితరానికి తెలియకుండా చేసేందుకు, మైనారిటీల బుజ్జగింపు విధానాన్ని నరనరానా జీర్ణించుకుని పనిచేస్తున్న కొన్ని శక్తుల కుట్ర ఇది. కానీ, మాటల్లోనే కాదు చేతల్లోనూ జాతీయవాదాన్ని ప్రదర్శించే ప్రధాని మోదీ, ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ ఉత్సవాల్లో భాగంగా అధికారంగా ‘హైదరాబాద్ విమోచన ఉత్సవాల’ను నిర్వహించాలని ఆదేశించారు. ఇందులో భాగంగానే.. 2022, సెప్టెంబర్ 17న.. అంటే.. 75 ఏళ్ల తర్వాత తెలంగాణ గడ్డపై కేంద్ర హోంశాఖ మంత్రి చేతుల మీదుగా జాతీయ జెండా ఎగిరింది.
రజాకార్ల దమనకాండకు ప్రత్యక్ష సాక్షి.. మాజీ భారత ప్రధాని, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు. వరంగల్ జిల్లాలోని రంగాపురం, లక్ష్మీపురం గ్రామాల్లో రజాకార్లు జనాలను చంపిన తీరును ‘దక్షిణ భారతదేశపు జలియన్‌వాలాబాగ్’గా ఆయన అభివర్ణించారు. కొమురం భీమ్, మర్రి చెన్నారెడ్డి, షోయబుల్లాఖాన్, వందేమాతరం రామచంద్రరావు, నారాయణరావు పవార్, స్వామి రామానందతీర్థ, గోవింద్‌భాయ్ ష్రాఫ్, విజయేంద్ర కాబ్రా, పీహెచ్ పట్వర్థన్ లాంటి ఎందరో మహనీయులు నాడు తమ ప్రాణాలు పణంగా పెట్టి పోరాడారు. తరాలు మారుతున్న క్రమంలో వీరి పోరాట స్మృతులకు పాఠ్యపుస్తకాల్లో సరైన చోటు కల్పించకపోవడం.. గత, ప్రస్తుత పాలకుల బానిసవాద ఆలోచనలకు ఒక ఉదాహరణ. కానీ, 1996 నుంచి బీజేపీ ఆధ్వర్యంలో.. తెలంగాణ విమోచన ఉత్సవాలను నిర్వహిస్తున్న కారణంగా.. గ్రామగ్రామాన వాస్తవ చరిత్రపై అవగాహన, ఆసక్తి పెరుగుతున్నాయి. 2022 నుంచి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుతున్న విమోచన వేడుకలు తెలంగాణ ప్రజల మనసుల్లో బానిసత్వ భావనలను పెంపొందించేందుకు జరిగిన కుట్రలను పటాపంచలు చేశాయి. ఇది విలీనం కాదు, ముమ్మాటికీ విమోచనమేని.. యావద్భారతం పక్షాన తెలంగాణ ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు.
అందుకే.. విశ్వకర్మ జయంతికి, అభినవ విశ్వకర్మ నరేంద్రమోదీ జన్మదినానికి, తెలంగాణ ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న అద్భుతమైన ఘట్టానికి ‘సెప్టెంబర్ 17’ ఓ ఇరుసుగా ఉంది. తెలంగాణ ప్రజలతో పాటు యావద్భారతానికి ఇది పండగ రోజు. దీనిని ఉత్సాహంగా జరుపుకుందాం. భగవాన్ విశ్వకర్మ ప్రేరణతో మన చేతివృత్తులకు సరైన ప్రోత్సాహాన్ని అందించడంతోపాటు ప్రధాని నరేంద్రమోదీ సమర్థ నాయకత్వంలో బానిసత్వపు ఆలోచనలను తొలగించుకుంటూ.. వికసిత భారత నిర్మాణంలో మనమంతా స్వచ్ఛందంగా భాగస్వాములం అవుదాం. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ నినాదంతో దేశాభివృద్ధికి పునరంకితం అవుదాం.
జి. కిషన్‌రెడ్డి
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి
ఇవి కూడా చదవండి..
ఆపరేషన్ సిందూర్‌లో మసూద్ అజార్ కుటుంబం ముక్కచెక్కలు.. వెల్లడించిన జైషే కమాండర్
భారత్‌తో మా బంధాన్ని తెంచేందుకు చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి: రష్యా విదేశాంగ శాఖ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయం
Updated Date - Sep 17 , 2025 | 02:46 AM