UN at 80 Crisis and Call for Reform: అష్టపదుల ఐరాస
ABN, Publish Date - Oct 02 , 2025 | 04:03 AM
‘మానవాళి చరిత్రలో మున్నెన్నడు లేని రీతిలో మనం ఒక ఉమ్మడి భవితవ్యం ముంగిట ఉన్నాం. మనం కలిసికట్టుగా ఉంటేనే దాన్ని శ్రేయోదాయకంగా చేసుకోగలుగుతాం. ఇందుకు...
‘మానవాళి చరిత్రలో మున్నెన్నడు లేని రీతిలో మనం ఒక ఉమ్మడి భవితవ్యం ముంగిట ఉన్నాం. మనం కలిసికట్టుగా ఉంటేనే దాన్ని శ్రేయోదాయకంగా చేసుకోగలుగుతాం. ఇందుకు తోడ్పడేందుకే మనకు ఐక్యరాజ్యసమితి ఉన్నది’ అని కోఫీ అన్నన్ పాతిక సంవత్సరాల క్రితం ఉద్ఘాటించారు. ఐరాస 80వ వార్షికోత్సవాన్ని జరుపుకోనున్న తరుణంలో ఆ ప్రపంచ సంస్థ ఏడవ ప్రధాన కార్యదర్శి మాటలు విశేష ప్రాసంగికత సంతరించుకున్నాయి. అతి భీకరమైన, అత్యంత వినాశనకరమైన ద్వితీయ ప్రపంచ యుద్ధం (1939–45)తో కుదేలయిపోయిన దేశాలు శాంతి, శ్రేయస్సులకై అలమటిస్తున్న సమయంలో అమెరికా నేతృత్వంలో విజ్ఞులు, విద్వత్‌పరులు, రాజనీతిజ్ఞుల దార్శనికతతో ఐక్యరాజ్యసమితి ఉనికిలోకి వచ్చింది. ఎనిమిది దశాబ్దాల ప్రస్థానంలో ప్రపంచ శాంతికి ఇతోధికంగా తోడ్పడడంతో పాటు, యుద్ధ బీభత్సాలు, ప్రాకృతిక విపత్తుల బాధితులకు మానవతాపూర్వక సహాయచర్యలు చేపట్టడంలోను మానవ ఆరోగ్యాన్ని హరించివేస్తున్న అంటువ్యాధులు, ప్రాణాంతక రోగాల నిరోధానికి, పర్యావరణ సమతుల్యత, మానవహక్కుల పరిరక్షణకు, సాంకేతికతల ఆదాన ప్రదానాలకు ఐరాస సార్థకమైన కృషి చేసింది. ప్రత్యేక లక్ష్యాలతో ఏర్పాటైన దాని అనుబంధ సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా వందలాది కోట్ల ప్రజలకు ప్రాణరక్షకాలుగా ఉన్నాయి. మానవాళి భవిష్యత్తుకు ఒక ఆశాజ్యోతిగాప్రభవించిన ఈ సంస్థ ఇప్పుడు కాలం పదఘట్టనల కింద నలిగిపోతోంది.
21 వ శతాబ్ది ప్రపంచ పరిస్థితులకు ఐరాస వ్యవస్థ ముఖ్యంగా భద్రతామండలి అనుగుణంగా లేకపోవడం, గాజా, ఉక్రెయిన్ యుద్ధాలు, సంస్థ వ్యవస్థాపక లక్ష్యాలను అగ్రరాజ్యాలు పూర్తిగా ఉపేక్షించడం మొదలైన ధోరణులతో అంతర్జాతీయ వ్యవహారాలలో ఐరాస ప్రభావశీలత, విశ్వసనీయత కోల్పోతోంది. ఐక్యరాజ్యసమితి ఆవిర్భావంలో కీలక పాత్ర వహించి, దశాబ్దాల పాటు దాని ప్రభావశీలతకు ప్రధాన ఆలంబనగా ఉన్న అమెరికాయే ఇప్పుడు ఈ ప్రపంచ సంస్థ మనుగడ ఇక్కట్లకు కారణమవుతోంది. ఇరవవయో శతాబ్దిలో వివిధ దేశాలలో తలయెత్తిన ఉద్యమాలు సమస్త మానవాళి సంక్షేమాన్ని కాంక్షించాయి. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడుగా ఉన్న డోనాల్ట్ ట్రంప్ వైఖరి అందుకు విరుద్ధంగా ఉన్నది. ప్రపంచ శ్రేయస్సుకు దోహదం చేసే దృక్పథాన్ని అమెరికా ఎందుకు అనుసరించాలని ఆయన ప్రశ్నిస్తున్నారు. 2017లో తొలిసారి, 2025లో మలిసారి ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ఐరాసకు అమెరికా అందించే ఆర్థిక సహాయాన్ని గణనీయంగా తగ్గించివేశారు. కీలక మైన ఐరాస ఏజెన్సీల నుంచి అమెరికాను ఉపసంహరించారు. ఒక్కమాటలో చెప్పాలంటే అమెరికా విధానాలు ఐరాస మనుగడనే దెబ్బ తీస్తున్నాయి.
ఈ విపత్కర పరిస్థితిని నివారించేందుకు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ ఈ ఏడాది మార్చిలో ‘యుఎన్ 80 ఇనీషియేటివ్’ను ప్రారంభించారు. ఐరాసను ఆధునికీకరించి దాని ప్రభావశీలత, కార్యాచరణ సామర్థ్యాన్ని ఇతోధికంగా పెంపొందించేందుకు ఉద్దేశించిన సమగ్ర సంస్కరణ ప్రయత్నమది. ఈ సంస్కరణ సంకల్పాలలో ప్రధానమైనది భద్రతా మండలి విస్తరణ. అభివృద్ధి చెందుతున్న దేశాల ఆకాంక్షలకు అనుగుణంగా మండలి విస్తరణ జరగని పక్షంలో ఐరాస తన ఉపయుక్తతను కోల్పోయే ప్రమాదమున్నది. ఇటువంటి సంభావ్యతను సైతం అమెరికా లక్ష్య పెట్టడం లేదు. భారత్ ఈ పరిస్థితుల్లో మండలిలో శాశ్వత సభ్యత్వాన్ని కోరుకోవడం మాత్రమే కాకుండా ఐరాసలో తన ప్రభావ ప్రాబల్యాలను పెంపొందించుకోవడం యుక్తంగా ఉంటుంది. సంపద్వంతమవుతున్న భారత్ తన ఆర్థిక వనరులను ఉదారంగా ఐరాసకు వినియోగించి ఆ ప్రపంచ సంస్థను నిలబెట్టడం ద్వారా భారతీయ నాగరికతా ఆదర్శం వసుధైవ కుటుంబకంను అనుష్ఠానించడం ద్వారా మానవాళి శ్రేయస్సుకు తోడ్పడాలి.
ఐరాసను ఉనికిలోకి తీసుకురావడంలో నాటి అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రుమన్ బ్రిటిష్ కవి టెన్నిసన్ అభిలషించిన ‘పార్లమెంట్ ఆఫ్ మ్యాన్’ ఆదర్శం నుంచి స్ఫూర్తి పొందారని ప్రతీతి. ప్రస్తుత ఐరాస ఆ ఆదర్శానికి ప్రతిరూపంగా లేదు. తదుపరి ప్రధాన కార్యదర్శి నియామకంలో ఒక మహిళను, మరీ ముఖ్యంగా ఆఫ్రికన్ విదుషీమణి లేదా రాజనీతిజ్ఞురాలును ఎంపిక చేయడం ‘మానవుని పార్లమెంటు’ దిశగా మొదటి అడుగు కాగలదు.
ఈ వార్తలు కూడా చదవండి..
నగదు ఇస్తానన్నా వదల్లేదు.. బాధితురాలి ఆవేదన..
For More AP News And Telugu News
Updated Date - Oct 02 , 2025 | 04:03 AM