Trumps Visa Shock After Birthday: వీసా పిడుగు
ABN, Publish Date - Sep 23 , 2025 | 12:57 AM
ప్రధాని మోదీకి 75వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అంతలోనే ఇంతపనిచేస్తారని ఎవరూ ఊహించలేదు. భారత్ చేజారిపోయిందని ఇటీవలే నాలుక కరుచుకున్నట్టుగా కనిపించిన ట్రంప్...
ప్రధాని మోదీకి 75వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అంతలోనే ఇంతపనిచేస్తారని ఎవరూ ఊహించలేదు. భారత్ చేజారిపోయిందని ఇటీవలే నాలుక కరుచుకున్నట్టుగా కనిపించిన ట్రంప్, పక్షం రోజుల క్రితమే ఉభయదేశాల సంబంధాలకు ఏ ఢోకా లేదన్నారు. భారత్–అమెరికా సహజ భాగస్వాములంటూ మోదీ కూడా స్పందించారు. పుట్టినరోజు సందర్భంగా ఇరువురు నేతల మధ్యా సాగిన చక్కని సంభాషణతో ఘర్షణవాతావరణం ఇక పూర్తిగా ఉపశమించినట్టేనని, రెండుదేశాల సత్సంబంధాలకు మార్గం సుగమమైందని అంతా అనుకున్నారు. పైగా, నిలిచిపోయిన వాణిజ్యచర్చలు తిరిగి ఆరంభమై, అవి చక్కగా, సవ్యంగా సాగాయని ఇరుదేశాలు ప్రకటించిన నాడే వీరిద్దరూ ఒకరినొకరు మిత్రమా మిత్రమా అంటూ పలుకరించుకోవడం ఉపశమనాన్ని ఇచ్చింది. రష్యా చమురు కొనుగోలు చేస్తున్నందుకు శిక్షగా భారత్‌ను రెట్టింపు సుంకాలతో ట్రంప్ బాధించిన దాదాపు నెల తరువాత నేరుగా జరిగిన సంభాషణ ఇది. ఉభయదేశాల భాగస్వామ్యాన్ని సరికొత్త ఎత్తులకు తీసుకుపోదామని నాయకులిద్దరూ సంకల్పం చెప్పుకున్న ఆ టెలిఫోన్ కాల్ ముగియగానే, హెచ్1బి వీసా ఫీజు లక్షడాలర్లకు పెంచి ట్రంప్ ఇంత దెబ్బకొడతారనుకోలేదు.
ట్రంప్‌తో సుదీర్ఘకాలం ఘర్షణ మన ఐటీరంగానికీ, సాంకేతిక నిపుణులకు ముప్పుతేవచ్చునని నిపుణులు ముందుగానే ఊహించారు, హెచ్చరించారు. ఆత్మనిర్భరతే ఈ బాధలన్నింటికీ పరిష్కారమని, కానీ, స్వాతంత్ర్యానంతరం దేశాన్ని ఏలిన కాంగ్రెస్ ఆ దిశగా ప్రయత్నించకుండా ఇంకా ఇతరదేశాలమీదే మనం ఆధారపడేట్టుగా చేసిందని సొంతగడ్డ గుజరాత్‌లో వ్యాఖ్యానించి తప్పంతా కాంగ్రెస్‌మీదకు తోసేశారు మోదీ. అన్నిరంగాల్లో దేశాన్ని సొంతకాళ్ళమీద నిలబెట్టి, ఆర్థిక సంస్కరణలతో, అత్యున్నత సాంకేతిక విద్యతో నిపుణులను తయారుచేసింది కాంగ్రెసేనని ఆ పార్టీ నాయకులు గుర్తుచేస్తున్నారు. తమ మేడిన్ ఇండియాకు, మోదీ మేకిన్ ఇండియాకు మధ్య తేడా వారు గుర్తుచేస్తున్నారు. అత్యంత ప్రతిభగలవారిని దేశంలోకి రాకుండా నిలువరించాలన్న ట్రంప్ ప్రయత్నం అమెరికన్ టెక్ కంపెనీలకు ప్రయోజనం చేకూర్చదన్న విశ్లేషణలను అటుంచితే, పుట్టినరోజు శుభాకాంక్షలు అందించిన వెంటనే ఈ నిర్ణయాన్ని కూడా ప్రకటించి నరేంద్రమోదీకి అమెరికా అధ్యక్షుడు పెద్దసవాల్ విసిరారు. కప్పం కట్టలేని స్థితిలోకి అమెరికన్ కంపెనీలను నెట్టి, వాటంతట అవే భారత సాంకేతిక నిపుణులను కాలదనేట్టు చేయాలనుకుంటున్నారు ఆయన. ఉపరితలంలో వలసల నియంత్రణగా కనిపిస్తున్న ఆర్థిక ఆంక్షలు ఇవి. వైట్ కాలర్ ఉద్యోగులను దెబ్బతీసే, భారతదేశ మధ్యతరగతి కలలను విచ్ఛిన్నం చేసే ఈ నిర్ణయం ద్వారా మోదీమీద స్వదేశంలో వ్యతిరేకత పెంచే ప్రయత్నం ఇది. రష్యా, చైనా అధ్యక్షులతో ఆప్తమిత్రుడు మోదీ చేయి కలిపి, చిరునవ్వులు చిందించిన ఆ దృశ్యం ట్రంప్‌కు బొత్తిగా నచ్చలేదు.
బీజేపీ అస్మదీయ పెట్టుబడిదారులు రష్యా క్రూడ్‌ను శుద్ధిచేసి, విదేశాలకు అమ్ముకొని వేలకోట్లు సంపాదిస్తున్నారని, ముడి చమురు అమ్మిన సొమ్ముతో ఉక్రెయిన్ మీద వ్లాదిమిర్ పుతిన్ భీకరయుద్ధం చేస్తున్నారని ట్రంప్ వాదన. చమురు కొంటున్నందుకు శిక్షగా విధించిన అదనపు పాతికశాతం సుంకం దెబ్బకు మనదేశంలోని చాలా రంగాలు కుదేలవుతున్న నేపథ్యంలో, జీఎస్టీ సంస్కరణలతో ఆ సమ్మెటపోటు నేరుగా తగలకుండా మోదీ ప్రభుత్వం లేపనం పూసే ప్రయత్నం చేసింది. కానీ, సాగుతున్న ఆ వాణిజ్యయుద్ధం సరికొత్తగా మరిన్ని రంగాలకు విస్తరిస్తూండటం ఆందోళన కలిగిస్తోంది. పొరుగుదేశాల్లో నిరుద్యోగయువత తిరుగుబాట్లకు పాల్పడుతున్న దృశ్యాలు చూస్తున్నాం. భారతదేశ ఐటీరంగం, సాంకేతిక నిపుణులు అమెరికా ఆర్థికవ్యవస్థకు ఎంత మేలు చేకూర్చుతున్నారో, ఎలా వెన్నుదన్నుగా ఉన్నారో, ఆ దేశ ఎదుగుదలలో వారి పాత్ర ఏమిటో వివరించిచెప్పాలే తప్ప ట్రంప్‌ను ఆడిపోసుకోవడంవల్ల ప్రయోజనం లేదని కొందరి సలహా. అమెరికా ఆర్థిక ప్రయోజనాల కోసం కాక, ఆ ముసుగులో తన రాజకీయ ప్రయోజనాల పరిరక్షణ లక్ష్యంగా ట్రంప్ నిర్ణయాలు చేస్తాడనీ, తదనుగుణంగా ఆయన వాదనలు, డేటా తయారవుతాయన్నది తెలిసిందే. అటువంటి వ్యక్తి చెవిలో శంఖం ఊది ప్రయోజనం లేదు. న్యాయస్థానాల్లో అమీతుమీ తేలేవరకూ ట్రంప్ సృష్టించే ఈ తరహా వివాదాలను భరించాల్సిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ మార్పులతో ముందుగానే దసరా: బీజేపీ
ఎన్టీటీపీఎస్ కాలుష్యంపై మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు
Read Latest AP News And Telugu News
Updated Date - Sep 23 , 2025 | 12:58 AM