ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Trump speech: ట్రంప్ నోట అదేమాట

ABN, Publish Date - Sep 25 , 2025 | 05:52 AM

ఐక్యరాజ్యసమితిలో అమెరికా అధ్యక్షుడి ప్రసంగం కంటున్న, వింటున్నవారికి ఎదురుగా డోనాల్డ్‌ ట్రంప్‌ కాక ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమీన్‌ నెతన్యాహూను చూస్తున్నట్టే ఉందట. పాలస్తీనా విషయంలో ట్రంప్‌ ఈ అంతర్జాతీయ వేదికమీద...

ఐక్యరాజ్యసమితిలో అమెరికా అధ్యక్షుడి ప్రసంగం కంటున్న, వింటున్నవారికి ఎదురుగా డోనాల్డ్‌ ట్రంప్‌ కాక ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమీన్‌ నెతన్యాహూను చూస్తున్నట్టే ఉందట. పాలస్తీనా విషయంలో ట్రంప్‌ ఈ అంతర్జాతీయ వేదికమీద చేసిన వ్యాఖ్యలన్నీ ఇజ్రాయెల్‌ ప్రధాని స్వహస్తాలతో రాసిచ్చినట్టుగా ఉండటంలో ఆశ్చర్యమేమీ లేదు. అమెరికా అధ్యక్షుడు కాస్తంత ఎడంగా గాజా, పాలస్తీనాల విషయంలో ఆలోచనలు చేస్తున్నారన్న భ్రమలు ఎవరికైనా ఇంకా మిగిలివుంటే ఈ దెబ్బతో తొలిగిపోయినట్టే. దౌత్యానికీ, చర్చలకు, అవగాహనకు వేదికగా నిలవాల్సిన ఐక్యరాజ్యసమితిలో ఆయన ఓ చవుకబారు రాజకీయ ప్రసంగం చేశారు. పనిలోపనిగా సమితిని ఎందుకూ కొరగానిదంటూ తీవ్రంగా అవమానించాడు. పాలస్తీనాను స్వతంత్రదేశంగా గుర్తించిన 80శాతం సభ్యదేశాలను ఉగ్రవాదుల మద్దతుదారులుగా అభివర్ణించాడు. ఇజ్రాయెల్‌, పాలస్తీనాలు ఇరుగుపొరుగుదేశాలుగా సుహృద్భావంతో కొనసాగడమనే ఆలోచనే మహాపాపమని ఆయన తేల్చేశాక, మిగతా ప్రపంచం ఎంత గొంతుచించుకున్నా ప్రయోజనం ఉండకపోవచ్చు.

గాజా పూర్తిగా నేలమట్టమై, ఆకలికీ, ఆయుధాలకు డెబ్బైవేలమంది పాలస్తీనియన్లు ప్రాణాలు వదిలేసి, లక్షలాదిమంది తరలిపోయిన తరువాత, ఇంతకాలమూ నోరుమెదపని దేశాలన్నీ ఇప్పుడు ఒక్కసారిగా స్వతంత్ర పాలస్తీనా వంటి పెద్దపెద్ద మాటలు మాట్లాడటం పాలస్తీనియన్లను అవమానించడమేనని అంటారు కొందరు. అమెరికా అధ్యక్షుడి ప్రసంగంలో గాజా ఊసులేదు, అక్కడ ఒక మారణకాండ సాగుతోందనీ, అది మరుభూమిగా మారిందన్న స్పృహే ఆయన భాషలో కనబడలేదు. నెతన్యాహూ మాదిరిగానే ట్రంప్‌ దృష్టిలో పాలస్తీనియన్లు అరాచకశక్తులు, విధ్వంసకారులు. వారి గురించి ఆలోచించడం, వారి ఉనికిని గుర్తించడమంటే ఆప్తమిత్ర ఇజ్రాయెల్‌కు ద్రోహం చేయడమే.

యూకే, ఫ్రాన్స్‌, కెనడా, ఆస్ర్టేలియా ఇత్యాది పెద్దదేశాలు సైతం ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాను అధికారికంగా గుర్తించడం వందేళ్ళ ఇజ్రాయెల్‌– పాలస్తీనా ఘర్షణలో చరిత్రాత్మకమైన మార్పుగానే చెప్పుకోవాలి. ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ సారథ్యంలో సాగుతున్న ఈ ప్రయత్నం దౌత్యం మాత్రమే హమాస్‌ మీద ఒత్తిడి పెంచుతుందని నమ్ముతోంది. గాజాలో యుద్ధం ముగించి, రెండు రాజ్యాల ఏర్పాటుతో శాంతి నెలకొంటుందని వీరి వాదన. అరబ్‌ దేశాలన్నీ హమాస్‌ నిరాయుధీకరణను, పాలస్తీనా అథారిటీకి ఆయుధాల అప్పగింతనూ గట్టిగా కోరుతున్నందున రెండేళ్ళకు పైగా సాగుతున్న యుద్ధాన్ని ఈ మార్గంలో ఆపవచ్చునని వాటి నమ్మకం. అయితే, అమెరికా మద్దతుతోనే పాలస్తీనా రాజ్యస్థాపన సాధ్యమవుతుందనీ, లేనిపక్షంలో అది పగటికలగా మిగిలిపోతుందనీ, గాజా పీడకల సజీవంగా కొనసాగుతుందని యూరప్‌ పెద్దలకు తెలియనిదేమీ కాదు. గాజా మారణకాండ అంతిమదశకు చేరుకున్న ఈ తరుణంలోనైనా అమెరికా అభీష్ఠానికి వ్యతిరేకంగా వ్యవహరించనిపక్షంలో యూరప్‌ పరువు పూర్తిగా మంటగలిసిపోతుందని వారి భయం. ఆచరణసాధ్యమేనా అన్న ప్రశ్నను అటుంచితే, రెండుదేశాల సిద్ధాంతాన్ని సజీవంగా ఉంచడానికి వీరి ప్రయత్నం ఉపకరిస్తుంది. అమెరికా మీద కాకున్నా, ఇజ్రాయెల్‌మీద ఒత్తిడి పెంచడానికి పనికొస్తుంది.

పాలస్తీనా దేశం ప్రస్తావన తెస్తే, గాజాకు పట్టిన గతే వెస్ట్‌బ్యాంక్‌ వంటి ఆక్రమిత భూభాగాలకు పడుతుందన్నది నెతన్యాహూ వ్యాఖ్యల సారాంశం. వెస్ట్‌బ్యాంక్‌ను పూర్తిగా ఆక్రమించుకొని రెండు దేశాల ఆలోచనకు పునాదిలోనే గండికొట్టేందుకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. పాలస్తీనా ఊసుని మొత్తంగా చెరిపివేయడానికి ఆ ప్రాంతాల్లో గాజా తరహా ఊచకోతలకు కూడా ఆయన వెనుకాడడు. ఆ కర్తవ్య నిర్వహణలో తన అండదండలు సంపూర్ణంగా ఉంటాయన్నది ట్రంప్‌ ప్రసంగం సారాంశం. భద్రతామండలిలో మిగతా పద్నాలుగు దేశాలూ మరోవైపు ఉన్నప్పటికీ, వీటో ప్రయోగించి ఇజ్రాయెల్‌ను ఎప్పటికప్పుడు అమెరికా రక్షించుకువస్తున్నది. ఇప్పుడు సర్వప్రతినిధి సభలోనూ స్వతంత్ర పాలస్తీనా విషయంలో అమెరికా, ఇజ్రాయెల్‌ ఏకమాటగా ఉన్నాయి. ఇజ్రాయెల్‌కు నిరంతరాయంగా సర్వశక్తులూ సమకూరుస్తూ పాలస్తీనియన్ల ఊచకోతలో తన చేయి కూడా ఉన్న అమెరికా అధ్యక్షుడు నోబెల్‌శాంతి గురించి వల్లిస్తూండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.

వార్తలు కూడా చదవండి..

కృష్ణమ్మకు వరద పోటు.. ప్రభుత్వం అలర్ట్

అసెంబ్లీలో ఆమోదం పొందనున్న పలు బిల్లులు

For More AP News And Telugu News

Updated Date - Sep 25 , 2025 | 05:52 AM