ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Trumps Double Game: టక్కరి ట్రంప్‌

ABN, Publish Date - Sep 13 , 2025 | 01:22 AM

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ట్రంప్‌కు తెలియచేశాకే ఖతార్‌మీద దాడిచేశామని ఇజ్రాయెల్‌ అంటోంది. ట్రంప్‌ దీనిని కాదనడం లేదు. అవును, ఇజ్రాయెల్‌ మాకు ముందే చెప్పింది, ఆ సమాచారం అందగానే, మీ మీద దాడిజరగబోతోందని ఖతార్‌కు వెంటనే...

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ట్రంప్‌కు తెలియచేశాకే ఖతార్‌మీద దాడిచేశామని ఇజ్రాయెల్‌ అంటోంది. ట్రంప్‌ దీనిని కాదనడం లేదు. అవును, ఇజ్రాయెల్‌ మాకు ముందే చెప్పింది, ఆ సమాచారం అందగానే, మీ మీద దాడిజరగబోతోందని ఖతార్‌కు వెంటనే తెలియచేశామని ఆయన అన్నాడు. ఈ దాడిలో తన పాత్రలేదనీ, అది తన నిర్ణయం కాదన్న ట్రంప్‌ వ్యాఖ్యలు నిజమే అనుకుందాం. దాడిచేయబోతున్నానని చెప్పిన ఇజ్రాయెల్‌ను ఆయన ఎందుకు నిలవరించలేదు, ఎందుకు హెచ్చరించలేదన్న ప్రశ్నలను కూడా పక్కనబెడదాం. ఇజ్రాయెల్‌ ఈ ఘాతుకానికి ఒడిగడుతున్న సమాచారం ఖతార్‌కు చేరివుంటే అది దాడిని ఆపగలదా లేదా అన్నది అటుంచితే, ఆత్మరక్షణ ప్రయత్నాలేవో చేసుకొనేది. మరి, అలా ఎందుకు జరగలేదు? అమెరికా అధ్యక్షుడు ఈ అరబ్‌ మిత్రదేశానికి అన్యాయం చేయదల్చుకోలేదు. మరోపక్క ఇజ్రాయెల్‌కూ ద్రోహం చేయడానికీ మనసొప్పలేదు. ఆయన తన మధ్య ఆసియా ప్రత్యేక రాయబారికి సమాచారం చేరవేత బాధ్యతని అప్పగించాడు. సున్నితమైన సమాచారం కదా, ఆయన దానిని అతిజాగ్రత్తగా, తాపీగా ఖతార్‌ చెవిలో వేశాడు. ఇజ్రాయెల్‌కు చెందిన పదిహేను యుద్ధవిమానాలు దాడులు ఆరంభించి అప్పటికే పదినిముషాలైంది. ఖతార్‌ రాజధాని నడిబొడ్డున జరిగిన ఈ దాడిలో ఆరుగురు హమాస్‌ అధికార ప్రతినిధులు మృతిచెందారు. దాడిలో తన పాత్ర లేదంటున్న ట్రంప్‌ దానిని నిలువరించలేదు కానీ, మహా గట్టిగా ఖండించారు. దాడి తప్పే కానీ, ఉగ్రవాదులు చావడం మాత్రం సరైనదేనని వైట్‌హౌస్‌ అంటోంది.

అమెరికా అధ్యక్షుడిని సంతోషపెట్టడానికి, మచ్చిక చేసుకోవడానికి తెగ ఆపసోపాలు పడుతున్న ఈ ఆయిల్‌ రిచ్‌ అరబ్‌ దేశానికి ట్రంప్‌ భలే జెల్లకొట్టారంటూ సామాజిక మాధ్యమాలు వ్యాఖ్యానిస్తున్నాయి. పశ్చిమాసియాలో అమెరికా తన అతిపెద్ద వైమానిక స్థావరాన్ని ఖతార్‌లోనే నిర్మించుకుంది. నాలుగునెలల క్రితం ట్రంప్‌ వచ్చినప్పుడు, ఎర్రతివాచీ స్వాగతాలు, వేలకోట్ల రూపాయల రక్షణ సామగ్రి కొనుగోళ్ళతో ట్రంప్‌ను ఖతార్‌ సంతోషపెట్టింది. అంతేకాదు, అత్యంతవిలాసవంతమైన, మూడున్నరవేలకోట్ల విలువైన బోయింగ్‌ విమానాన్ని ఖతార్‌ రాజు గిఫ్ట్‌గా ఇస్తే, అమెరికా అధ్యక్షుడు దానిని నిస్సిగ్గుగా స్వీకరించాడు. భారీ బహుమతి ఇచ్చిన మిత్రదేశాన్ని ట్రంప్‌ ఇప్పుడు ఈ రీతిన ఖంగుతినిపించాడు.

హమాస్‌ నాయకులను నిర్మూలించడం మంచిపని అంటోంది వైట్‌హౌస్‌. ఖతార్‌ మీద దాడిని పరోక్షంగా అనుమతించిన అమెరికా అధ్యక్షుడు ఇకపై అటువంటివి ఒప్పుకొనేది లేదంటున్నారు. శాంతియత్నాలు ఒక కొలిక్కివచ్చినప్పుడల్లా నెతన్యాహూ మోకాలడ్డుతూనే ఉంటారని ఆగ్రహం నటిస్తున్నారు. ఆయన ఖతార్‌కు మాత్రమే ద్రోహం చేయలేదు. శాంతిచర్చలకు వెన్నుపోటు పొడవడంలో తానూ భాగస్వామి అయ్యారు. గడువులోగా దారికిరావాలంటూ హమాస్‌ను ఒకపక్క హెచ్చరించి, మరోపక్క ఆ ప్రయత్నాల్లో ఉన్నవారిని ఇజ్రాయెల్‌తో హత్య చేయించారు. శాంతియత్నాలను భగ్నం చేసి, యుద్ధం నిరవధికంగా సాగించేందుకు ప్రయత్నిస్తున్న నెతన్యాహూతో కలసి కుట్రచేశారు.

తాలిబాన్‌, హమాస్‌, ఇరాన్‌ తదితర ప్రతినిధులతో అమెరికా, ఇజ్రాయెల్‌ చర్చలు జరపడానికి, ఒప్పందాలు కుదర్చుకోవడానికి ఎంతోకాలంగా ఒక వారధిగా, మధ్యవర్తిగా ఉపకరిస్తున్న ఖతార్‌మీద నేరుగా దాడికి తెగబడి ఇజ్రాయెల్‌ తీవ్ర తప్పిదం చేసింది. ఆ తప్పులో పాత్రధారి అయి, అరబ్‌ దేశాల నమ్మకాన్ని ట్రంప్‌ వమ్ముచేశారు. తమ భద్రతకు ఎటువంటి గ్యారంటీ లేదని వాటికి తెలిసొచ్చేట్టుగా చేశారు. కాల్పుల విరమణ జరిగి, హమాస్‌ చెరలో ఉన్న బందీలు విడుదలకావాలని ఇజ్రాయెల్‌ ప్రజలు ఆశిస్తుంటే, దానికి అడ్డుకట్టవేసేపనిలో నెతన్యాహూ ఉన్నారు. రెండేళ్ళుగా హమాస్‌తో యుద్ధాన్ని సాగిస్తున్న నెతన్యాహూ, దానిని విస్తరించి, పరిధులు దాటించి, నేరుగా ఇరాన్‌ మీదకు లంఘించినప్పుడు కూడా ట్రంప్‌ వారించలేదు. స్వయంగా దాడులకు తెగబడి మరీ ఇజ్రాయెల్‌కు మద్దతు ఇచ్చారు. హమాస్‌ మీద ప్రతీకారం పేరిట నెతన్యాహూ పాల్పడుతున్న ప్రతీ అక్రమాన్నీ సమర్థిస్తూ గాజాను నిర్మానుష్యం చేసే ఉమ్మడి లక్ష్యంతో పనిచేస్తున్నారు. కాల్పుల విరమణకు హమాస్‌ సిద్ధపడినా కూడా యుద్ధం ఆగకుండా జాగ్రత్తపడుతున్నారు. రెండేళ్ళుగా నెతన్యాహూ గాజాలో ఊచకోతలకు పాల్పడుతున్నా, పొరుగుదేశాలను చావగొడుతున్నా నోరువిప్పడానికి కూడా సాహసించని గల్ఫ్‌ దేశాలు ఇప్పటికైనా కాస్తంత బుద్ధితెచ్చుకొని, ఆత్మగౌరవంతో స్వతంత్రంగా వ్యవహరించడం అవసరం. అవి ఒక్కటిగా లేకపోవడం వల్లనే యుద్ధం ఆగలేదన్నది వాస్తవం.

ఇవి కూడా చదవండి..

మోదీ తల్లిపై కాంగ్రెస్ వివాదాస్పద ఏఐ వీడియో.. బీజేపీ ఫైర్

రేపటి నుంచి విజయ్‌ యాత్ర..

For More National News and Telugu News

Updated Date - Sep 13 , 2025 | 01:22 AM