ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Nobel Prize: రక్షణ కవచం

ABN, Publish Date - Oct 08 , 2025 | 01:32 AM

జీవశాస్త్రంలో విప్లవాల గురించి తర్కిస్తూ ‘ఏదైనా కొత్త విప్లవం స్వభావం ఎలా ఉంటుందని ఒకరు ముందుగా ఊహించలేరు. అయితే అవగాహన కొరవడిన శాస్త్ర అంశాలను అర్థం చేసుకోవడంలో మౌలిక మార్పు...

జీవశాస్త్రంలో విప్లవాల గురించి తర్కిస్తూ ‘ఏదైనా కొత్త విప్లవం స్వభావం ఎలా ఉంటుందని ఒకరు ముందుగా ఊహించలేరు. అయితే అవగాహన కొరవడిన శాస్త్ర అంశాలను అర్థం చేసుకోవడంలో మౌలిక మార్పు తప్పకుండా వస్తుందని ఆశించగలం’ అని 1960లో వైద్య, శరీర ధర్మ శాస్త్రాలలో నోబెల్‌ పురస్కార గ్రహీత పీటర్‌ మెడావర్ అన్నారు. 2025 నోబెల్‌ పురస్కారానికి సంయుక్తంగా ఎంపిక అయిన షిమోన్‌ సకగుచి, మేరీ బ్రంకో, ఫ్రెడ్‌ రామ్స్‌ డెల్‌ మూడు దశాబ్దాల పరిశోధన జీవశాస్త్రంలో విప్లవాన్ని కాకపోయినప్పటికీ రోగ నిరోధక వ్యవస్థను అర్థం చేసుకోవడంలో మౌలిక మార్పును తీసుకువచ్చింది.

రోగనిరోధక వ్యవస్థను జీవ పరిణామ ఉత్కృష్ట కళాకృతిగా భావిస్తారు. నిత్యం మన దేహాలను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తుండే సంఖ్యానేక వైరస్‌లు, బేక్టీరియా, ఇతర సూక్ష్మజీవుల నుంచి రోగనిరోధక వ్యవస్థ మనలను రక్షిస్తూ ఉంటుంది. జీవితం ఒక వరమైతే, మనకు దాన్ని సుసాధ్యం చేస్తోంది రోగ నిరోధక వ్యవస్థే. ఈ జైవిక వ్యవస్థ అద్భుతాలలో ఒకటి రోగకారక సూక్ష్మజీవులను, గుర్తించి, ఇతర కణాల నుంచి వాటిని వేరుచేయగల సామర్థ్యం. మన శరీరంలోకి ప్రవేశించిన సూక్ష్మజీవులు వేర్వేరు రూపాలలో ఉంటాయి. మానవ కణాలతో సాదృశ్య రూపును నిగూఢంగా సంతరించుకుంటాయి. రోగనిరోధక వ్యవస్థ వ్యాధి కారకాలపై దాడి ఎలా చేయగలుగుతుంది? అదే సమయంలో ఆరోగ్యకరమైన మన జీవకణాలను ఎలా రక్షించగలుగుతుంది? ఈ భక్షణ, రక్షణ చర్యల మధ్య సమతౌల్యత ఉండేలా వ్యవహరిస్తుంది కాబట్టే రోగనిరోధక వ్యవస్థను జీవ పరిణామం సృష్టించిన అద్భుత కళాకృతిగా అభివర్ణిస్తారు. అయితే ఈ అద్భుతం ఎలా జరుగుతుందనే విషయమై జీవశాస్త్రవేత్తలు దశాబ్దాలుగా అధ్యయనం చేస్తున్నారు. ఎట్టకేలకు ఈ పరిశోధనలను కొత్త పుంతలు తొక్కించిన ఘనత ఈ ఏడాది వైద్యశాస్త్ర నోబెల్‌ పురస్కార విజేతలకు దక్కింది.

రోగ నిరోధక వ్యవస్థలోని టి సెల్స్‌ అనబడే తెల్ల రక్తకణాలు రోగకారక క్రిముల కణాలు, ఆతిథేయి దేహ కణాల మధ్య తేడాను గుర్తించగలుగుతాయి. షిమోన్‌ సకగుచి 1995లో అంతకు ముందు ఎవరికీ తెలియని ఒక కొత్త రోగ నిరోధక కణాలను కనుగొన్నారు. ఆయన వాటిని నియంత్రిత టి కణాలుగా పిలిచారు. ఇవి, శరీరంపై దాడి చేయగలిగే రోగ నిరోధక వ్యవస్థలోని కొన్ని భాగాలను తొలగించే సంరక్షణ కణాలు. 2001లో బ్రంకో, రామ్సెడెల్‌లు వేర్వేరు ప్రయోగశాలల్లో స్వతంత్రంగా పనిచేస్తూ సకగుచి కనుగొన్న కణాలకు జన్యు ప్రాతిపదికలను ఆవిష్కరించారు. ఆ జన్యు ప్రాతిపదికలే తాను కనుగొన్న నియంత్రిత టి కణాలను నియంత్రిస్తాయని షిమోన్‌ సకగుచి నిర్ధారించారు. ఈ ముగ్గురి పరిశోధనలు రోగ నిరోధక వ్యవస్థ స్వరూపస్వభావాలను వినూత్నంగా, సమగ్రంగా అర్థం చేసుకునేందుకు విశేషంగా దోహదం చేశాయి. ఒక జీవిలోని రోగ నిరోధక కణాలు ఇతర కణాలను అన్యమైనవిగా, హానికరమైనవిగా గుర్తించకుండా, వాటితో సామరస్యంగా జీవించే ఒక సహజ ప్రక్రియ ‘పరిధీయ సహనం’ (పెరిఫెరల్‌ టాలరెన్స్‌)ను ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు వివరించారు. తద్వారా అప్పటివరకు ఒక అమూర్త ఊహగా మాత్రమే ఉన్న రోగ నిరోధక సంయమనాన్ని అణు జీవశాస్త్ర భావనగా రూపొందించారు.

వైద్య, శరీర ధర్మశాస్త్రాలలో నోబెల్‌ పురస్కారం మొదటి నుంచీ మానవ ఆరోగ్యం, జైవిక వ్యవస్థల గురించిన అవగాహనను ప్రగాఢంగా ప్రభావితం చేస్తున్న ఆవిష్కరణలకు గుర్తింపుగా కీర్తికెక్కింది. 2025 పురస్కారం కూడా ఇందుకు భిన్నమైనది కాదు. కేన్సర్‌ చికిత్సలో ఇమ్యూనో థెరపీ, టార్గెటెడ్‌ థెరపీ మొదలైన వినూత్న చికిత్సలకు సకగుచి, బ్రంకో, రామ్స్ ‌డెల్‌ పరిశోధనలు పునాదులు వేశాయి. అలాగే అవయవాల మార్పిడి ప్రక్రియలలో మార్పులకు కూడా అవి దోహదం చేశాయి. ‘విజ్ఞానశాస్త్రం ప్రపంచాన్ని వివరించడమే కాకుండా మానవ జీవితాలను మార్చివేస్తుందని 2025 నోబెల్‌ వైద్యశాస్త్ర పురస్కారం మనకు స్పష్టం చేసిందన్న ఒక విజ్ఞుని వ్యాఖ్య పూర్తి సత్యం.

ఈ వార్తలు కూడా చదవండి..

విడిచి పెట్టం.. పేర్నినానికి మంత్రి కొల్లు రవీంద్ర మాస్ వార్నింగ్

జగన్.. ఎన్ని జన్మలెత్తినా పాపాలను కడుక్కోలేరు.. సోమిరెడ్డి సెటైర్లు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 08 , 2025 | 01:32 AM