India Bangladesh Relations: మైత్రీమత్సరాలు
ABN, Publish Date - Dec 18 , 2025 | 06:03 AM
బంగ్లాదేశ్ హైకమిషనర్ రిజాజ్ హమీదుల్లాకు భారత విదేశాంగ సమన్లు జారీచేసి, పొరుగుదేశంలో భద్రతాపరిస్థితులమీద ఆందోళన వెలిబుచ్చింది. బుధవారం మధ్యాహ్నం భారత దౌత్యకార్యాలయం...
బంగ్లాదేశ్ హైకమిషనర్ రిజాజ్ హమీదుల్లాకు భారత విదేశాంగ సమన్లు జారీచేసి, పొరుగుదేశంలో భద్రతాపరిస్థితులమీద ఆందోళన వెలిబుచ్చింది. బుధవారం మధ్యాహ్నం భారత దౌత్యకార్యాలయం ముట్టడికి బంగ్లాదేశ్‌లోని ‘జూలై ఐక్య మంచ్’ పిలుపునిచ్చిన వెంటనే, హైకమిషనర్‌ను పిలిపించుకొని భారత కార్యాలయాల రక్షణకు, సిబ్బంది భద్రతకు లోటు రానివ్వవద్దని హెచ్చరించింది. బంగ్లా రాజకీయాల్లో భారత్ వేలుపెడుతోందన్న ఆరోపణతో సదరు సంస్థ ఈ ముట్టడి కార్యక్రమాన్ని ప్రకటించింది. పోలీసులు మధ్యలోనే దానిని నిలువరించి, భారత దౌత్యకార్యాలయం వరకూ పోనివ్వలేదు.
బంగ్లాదేశ్‌లో వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న ఎన్నికలు ప్రకటించిన నేపథ్యంలో, భారత్ లక్ష్యంగా అక్కడ రాజకీయం వేడెక్కింది. పలువురు విద్యార్థి నాయకులు నోటికి అడ్డూఆపూ లేకుండా మాట్లాడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ విషం ఎక్కువైంది. గతవారం అక్కడ ఎన్నికలు ప్రకటించిన కొద్దిగంటల్లోనే షరీఫ్ ఉస్మాన్ హడి అనే విద్యార్థి నాయకుడిమీద హత్యాయత్నం జరిగింది. హసీనా ప్రభుత్వాన్ని గద్దెదించిన ఉద్యమంలో ఇతనిది కీలక పాత్ర. ఆమె దేశం విడిచిపోయినప్పటికీ, ఆమె పార్టీ మళ్ళీ ఎన్నికల్లో పాల్గొనడానికి వీల్లేకుండా అవామీలీగ్ రద్దుకోసం ఇతడి ఇంక్విలాబ్ మంచా సంస్థ పట్టుబట్టి సాధించింది. ఈ దాడిలో అతను ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రిలో చేరిన వెంటనే బంగ్లాదేశ్ విదేశాంగశాఖ ఒక ప్రకటన విడుదల చేస్తూ భారత్‌ను నిందించింది. షేక్ హసీనా, అవామీలీగ్‌కు చెందిన ఇతర నాయకులు బంగ్లాదేశ్‌లో ఉగ్రదాడులకు పాల్పడుతున్నారని, ఉస్మాన్ హడి హంతకులు బంగ్లాదేశ్ దాటిపోకుండా భారత్ నిలువరించాలని అందులో పేర్కొంది. దీనిని భారత్ తీవ్రంగా ఖండించిన విషయాన్ని అటుంచితే, ఈ ప్రకటన అక్కడి రాడికల్ శక్తులకు మంచి ఉత్సాహాన్నిచ్చింది. నిన్నటివరకూ తాత్కాలిక ప్రభుత్వంలో ఉండి, రేపటి ఎన్నికల్లో పాల్గొనడం కోసం రాజీనామా చేసిన ఒక విద్యార్థినాయకుడు ఉగ్రవాదాన్ని ఎగుమతిచేస్తున్న భారత్ ఇకపై క్షేమంగా ఉండలేదని ఓ హెచ్చరిక చేశాడు. నేషనల్ సిటిజన్ పార్టీకి చెందిన హస్నత్ అబ్దుల్లా భారత్‌ను శత్రుదేశంగా ప్రకటించి, ఈశాన్యాన్ని విడగొడతామని హెచ్చరించాడు. ‘జూలై యోధుల’ ప్రాణరక్షణకోసం అవామీలీగ్ ఉగ్రవాదులను, వారికి అండగా ఉంటున్నవారినీ శిక్షించాలని ఇతడు డిమాండ్ చేస్తున్నాడు.
ఇప్పటికే దెబ్బతిన్న భారత్–బంగ్లా సంబంధాలు అక్కడ ఎన్నికల తేదీ ప్రకటన, అనంతర పరిణామాలతో మరింత దిగజారాయి. దాదాపు పన్నెండుకోట్ల డెబ్బయ్‌ఆరులక్షలమంది ఓటర్లు ఫిబ్రవరి 12న ఓటు చేయబోతున్నారు. షేక్ హసీనాపార్టీకి ఈ ఎన్నికల్లో స్థానం లేకపోవడంతో పాటు, ఆమె ప్రత్యర్థి, బీఎన్‌పీ అధినేత ఖలేదా జియా తీవ్ర అనారోగ్యంతో వెంటిలేటర్ మీద ఉన్నారు. ఖలేదా పార్టీ అత్యధికస్థానాల్లో పోటీచేస్తున్న నేపథ్యంలో, ఎన్నికలు సమీపిస్తున్నదశలో ఆమె ఆరోగ్యస్థితి కూడా ఫలితాలను ప్రభావితం చేయవచ్చు. పదిహేడు సంవత్సరాలుగా లండన్‌లో ఉంటున్న ఆమె కుమారుడు తారీఖ్ రహ్మాన్ డిసెంబరు 25న స్వదేశంలో అడుగుపెట్టబోతున్నారు. ఈ ఎన్నికల్లో బీఎన్‌పీ ఘన విజయం సాధిస్తుందని, తారిఖ్ రహ్మాన్ ప్రధాని అవుతారని విశ్లేషకులు అంచనా కడుతున్నారు. జమాత్–ఎ–ఇస్లామీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరిస్తుందట. ప్రజాభిప్రాయ సేకరణ కూడా ఈ ఎన్నికలతో పాటుగానే నిర్వహించాలన్నది సాహసోపేతమైన నిర్ణయం. జూలై తిరుగుబాటు అనంతరం అన్ని పార్టీలు ఒక్కటిగా సంకల్పించిన రాజ్యాంగ, రాజకీయ సంస్కరణలమీద ప్రజలు అదేరోజున ఓటుచేయబోతున్నారు. న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘం స్వతంత్రతలను బలోపేతం చేయడం, కార్యనిర్వాహక వ్యవస్థ అధికారాలకు కత్తెరవేయడం, శాంతిభద్రతల యంత్రాంగం దుర్వినియోగం కాకుండా చూడటం వంటి అనేక ఆదర్శాలు ఈ రెఫరెండమ్‌లో ఉన్నాయి. భారత్–బంగ్లా సంబంధాలు ప్రస్తుతానికి దిగజారినా, బంగ్లాదేశ్‌లో ఎన్నికలు సక్రమంగా జరిగి, అక్కడ ప్రభుత్వం ఏర్పడిన తరువాత తిరిగి బలోపేతమవుతాయని కొందరి ఆశ. 54వ విజయ్‌దివస్ సందర్భంగా మంగళవారం కోల్‌కోతాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొనడానికి బంగ్లాదేశ్‌నుంచి వచ్చిన మాజీ సైనికాధికారులు ఇదే హామీ ఇస్తున్నారు. హసీనా పతనం అనంతరం పొరుగుదేశంలో జరుగుతున్న పరిణామాలు నిరాశ కలిగిస్తున్నప్పటికీ, ఈ ముక్తిజోధాల మాట నిజం కావాలని కోరుకుందాం.
Also Read:
జీవితంలో ఈ విషయాలు ముందే రాసి పెట్టి ఉంటాయి
ఒక తెల్ల వెంట్రుకను పీకితే మిగిలిన వెంట్రుకలు కూడా తెల్లగా అవుతాయా?
Updated Date - Dec 18 , 2025 | 06:03 AM