Sanchar Saathi App: ప్రజా విజయం
ABN, Publish Date - Dec 04 , 2025 | 03:18 AM
సంచార్ సాథీ అప్లికేషన్ విషయంలో కేంద్రప్రభుత్వం వెనక్కుతగ్గి మంచిపనిచేసింది. కొత్తగా వచ్చే సెల్‌ఫోన్లలో సంచార్‌సాథీ యాప్‌ను ముందుగా ఇన్‌స్టాల్ చేయడం తప్పనిసరి అంటూ గతంలో...
సంచార్ సాథీ అప్లికేషన్ విషయంలో కేంద్రప్రభుత్వం వెనక్కుతగ్గి మంచిపనిచేసింది. కొత్తగా వచ్చే సెల్‌ఫోన్లలో సంచార్‌సాథీ యాప్‌ను ముందుగా ఇన్‌స్టాల్ చేయడం తప్పనిసరి అంటూ గతంలో జారీ చేసిన ఆదేశాలను టెలికాం శాఖ ఉపసంహరించుకుంది. సైబర్ నేరాలనుంచి రక్షించేపేరిట కొత్త ఫోన్లలో దీనిని తప్పనిసరి చేయడంమీద విపక్షాలు మండిపడ్డాయి, ప్రజలు ఆందోళన చెందారు. ఇది పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి ప్రభుత్వం తొంగిచూసే చర్య అని నిపుణులు అనుమానించారు. ఈ యాప్ మీ ఫోన్‌లో ఉంటే మీకు ఎంతో తోడు, తోడ్పాటు అని ప్రభుత్వం చెబుతూంటే, దానిని పడగ నీడగా, మన జేబులోనే ఉంటూ మనల్ని వెంటాడే నిఘా నేత్రంగా పౌరసమాజం భావించింది. ఈ వ్యవహారాన్ని తెగేవరకూ లాగకుండా ప్రభుత్వం ఉన్నతంగా వ్యవహరించడం ప్రశంసనీయమైనది.
నిజానికి, తన ఆదేశాల తరువాత ఈ యాప్‌ను స్వచ్ఛందంగా డౌన్‌లోడ్ చేసుకున్నవారి సంఖ్య అమాంతం పెరిగిపోయిందని ప్రభుత్వం అంటోంది. ఒక్కరోజులో ఆరులక్షల మంది యాప్‌లో రిజిస్టర్ చేసుకున్నారని, దీనిగురించి తెలియనివాళ్లకు అవగాహన కల్పించే సదుద్దేశంతోనే యాప్‌ను తప్పనిసరి చేశామని టెలికాం విభాగం అంటోంది. విపక్షాలు, నిపుణులు తప్పుబడుతున్నా, ప్రజలు తమను అనుమానించడం లేదని, నమ్ముతున్నారని చెప్పుకోవడం ఈ ప్రకటన ఉద్దేశం కావచ్చు. నిజానికి ఈ విషయంలో ఇంతటి వివాదం అవసరం లేదు. 2023 మే నెలలో ఈ యాప్‌ను ఆరంభించిన ప్రభుత్వం దాని ప్రచారాన్ని ఉధృతం చేసి, క్రమంగా వినియోగాన్ని కూడా పెంచగలిగింది. ఫోన్‌లో సంచార్‌సాథీ ఉంటే సవాలక్ష ప్రయోజనాలంటూ పౌరులకు ఇటీవలికాలంలో రోజూ టెక్ట్స్ మెసేజ్‌లు అందుతూనే ఉన్నాయి. ఒక సిమ్‌మీద ఎన్ని కనెక్షన్లు ఉన్నాయో తెలుసుకోవడం నుంచి, దొంగతనానికి గురైన మొబైల్స్‌ను కనుక్కోవడం వరకూ ఈ యాప్ ఉపకరిస్తుందన్న హామీని విశ్వసించి అత్యధికులు ఇప్పటికే ఇన్‌స్టాల్ చేసుకున్నారు కూడా. ప్రజలు ఎంతగానో నమ్ముతున్నారని చెప్పుకుంటున్న ప్రభుత్వం యాప్‌ను ఇలా తప్పనిసరి చేయడం కాక, దానిని విస్తృత వినియోగంలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తే సరిపోయేది. అప్లికేషన్‌ను నిరంతరం అభివృద్ధిపరచడం, సమర్థతనూ దాని సాంకేతిక భద్రతనూ పెంచి ప్రచారం చేయడం, దుర్వినియోగం కాబోదని హామీ ఇవ్వడం ద్వారా ప్రభుత్వం తన లక్ష్యాన్ని సునాయాసంగా సాధించగలిగేది. ఈ యాప్ ఉన్నపక్షంలో సైబర్ మోసాలను అడ్డుకోవడం, వాడుతున్న ఫోన్ మంచిచెడులు తెలుసుకోవడం, మోసపూరిత కాల్స్‌ను నిలువరించడం, ఫోన్ బ్లాక్ చేయడం సులభమని చెబుతున్నందున ప్రజలూ కాదనరు.
లక్షలకొద్దీ నకిలీ కనెక్షన్లను రద్దుచేయడం, లక్షలాది ఫోన్ల ఉనికి కనిపెట్టడం ఈ యాప్ ద్వారా సాధ్యమైందంటున్న ప్రభుత్వం ప్రజలే దానిని స్వాగతించి, వాడుకొనేట్టుగా చేస్తే, చూస్తే సరిపోయేది. కానీ, ఎప్పుడైతే ప్రభుత్వం దానిని తప్పనిసరి చేసిందో, దానిమీద ప్రశ్నలు, సందేహాలు రేగి, అనుమానాలను రేకెత్తించే పలు అంశాలు ముందుకు రావడం అత్యంత సహజం. ఎంపిక చేసుకొనే స్వేచ్ఛ ప్రజలకు లేకుండా నేరుగా కంపెనీలనే ప్రీ ఇన్‌స్టాల్ చేయమని ఆదేశించిన కారణంగా ప్రభుత్వానికి దురుద్దేశాలున్నాయన్న వాదనకు బలం చేకూరింది. సైబర్ నేరాలను నివారించడం, మోసాలను గుర్తించడం పేరుతో ఫోన్‌లో ఉన్నదంతా చదివేందుకు, తమపై ఓ కన్నేసి ఉంచేందుకు ప్రభుత్వం సిద్ధపడుతోందని ప్రజలకు అనిపించింది. పౌరులపై నిరంతర నిఘా, గోప్యతహక్కులు, డేటా భద్రత, దుర్వినియోగం ఇత్యాది ఆరోపణలు వెల్లువెత్తడంతో పాటు, పాలకులు పెగాసస్‌ను ప్రయోగించి తమకు గిట్టనివారికి వ్యతిరేకంగా సాక్ష్యాలు సృష్టించి, ఏళ్ళతరబడి వారిని వేధించిన గతమూ గుర్తుకు వచ్చింది. ఈ యాప్‌ను తొలగించుకొనే అధికారాలూ అవకాశాలమీద పాలకులే పలుమార్లు మాటమార్చారు. అసలు ఆదేశాలకూ, అనంతరం మంత్రి మాటలకూ పొంతనలేదు. ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ వంటి సంస్థలు ఈ మొత్తం వ్యవహారంలో చురుకుగా వ్యవహరించి, అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయించడానికి కూడా సిద్ధపడ్డాయి. ప్రజలను సంసిద్ధులను చేయకుండా, సమాయత్తపరచకుండా ఇటువంటి దూకుడు నిర్ణయాలు పనికిరావు. యాప్ ప్రీ ఇన్‌స్టలేషన్‌కు యాపిల్ అంగీకరించలేదని, మిగతా కంపెనీలు కూడా అభ్యంతరపెట్టవచ్చునని వార్తలు వచ్చాయి. పాలకులు ఏ కారణాల వల్ల వెనక్కుతగ్గినా, ఇది ప్రజావిజయమే.
ఇవి కూడా చదవండి
ఎంసీడీ ఉపఎన్నికల ఫలితాల్లో బీజేపీదే పైచేయి.. రెండో ప్లేస్‌లో ఆప్ః
సచిన్ రికార్డు సాధ్యమయ్యేనా.. కింగ్ కోహ్లీ అరుదైన సెంచరీ ప్రత్యేకతలివే..
Updated Date - Dec 04 , 2025 | 03:18 AM