ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pakistans Power Shift: ఎదురులేని మునీర్‌

ABN, Publish Date - Nov 12 , 2025 | 01:04 AM

పొరుగుదేశం పాకిస్థాన్‌లో నాలుగోసారి సైనికకుట్ర జరుగుతోంది. అయితే, ఇదేమీ ఓ చీకటిరాత్రిన, తుపాకీమోతల మధ్య జరగడం లేదు. స్పష్టంగా చెప్పాలంటే, రాజ్యాంగబద్ధంగా, చట్టసభ తోడ్పాటుతో, గతానికి పూర్తిభిన్నంగా కొత్తతరహాలో...

పొరుగుదేశం పాకిస్థాన్‌లో నాలుగోసారి సైనికకుట్ర జరుగుతోంది. అయితే, ఇదేమీ ఓ చీకటిరాత్రిన, తుపాకీమోతల మధ్య జరగడం లేదు. స్పష్టంగా చెప్పాలంటే, రాజ్యాంగబద్ధంగా, చట్టసభ తోడ్పాటుతో, గతానికి పూర్తిభిన్నంగా కొత్తతరహాలో కొనసాగుతోంది. పాకిస్థాన్‌లో మిగిలిన ఆ కాస్త ప్రజాస్వామ్యాన్ని కూడా మింగేసి, సైన్యమే సర్వంసహాధికారిగా అవతరించబోతోంది. ఒకే ఒక్క రాజ్యాంగసవరణతో అటు సుప్రీంకోర్టు ఔన్నత్యాన్ని కుదించి, మరోవైపు ఆర్మీచీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌కు చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ (సీడీఎఫ్‌) హోదాతో అపరిమిత అధికారాలు కట్టబెట్టేపని అతివేగంగా జరుగుతోంది.

షరీఫ్‌ సోదరుల కుట్రతో పాక్‌ రాజ్యాంగం పునాదులు కదిలిపోతాయంటూ విపక్షాలు ప్రతిపాదిత 27వ సవరణకు అడ్డుతగిలే ప్రయత్నం శక్తిమేర చేస్తున్నాయి. సెనేట్‌లో బిల్లు చక్కగా నెగ్గిన తరువాత, మంగళవారం జాతీయ అసెంబ్లీలో దీనిని న్యాయమంత్రి ప్రవేశపెట్టారు. మంగళవారం జరగాల్సిన చర్చ బుధవారానికి వాయిదాపడినప్పటికీ, అధికార కూటమి ప్రభుత్వానికి బిల్లును నెగ్గించుకోగలిగినంత సంఖ్యాబలం ఉన్నది కనుక ఇక అడ్డంకులేమీ లేవు. తనను జైల్లోకి నెట్టి, సమీపభవిష్యత్తులో సైతం బయటకురానివ్వకుండా కుట్రలు చేస్తున్న మార్షల్‌ మునీర్‌ మరింత బలపడుతున్నందుకు మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ భయపడుతున్నారు. దేశవ్యాప్త నిరసనలు జరపమని, సభలో అడ్డుపడమని తనవారిని ఆదేశించాడు కానీ, బిల్లును అడ్డుకొనేంత శక్తి విపక్షానికి లేదు. సెనేట్‌లో ఇద్దరు విపక్షసభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటుచేసిన దృశ్యం కూడా చూశాం. పాకిస్థాన్‌ వ్యవస్థాగత నిర్మాణాన్నే మార్చివేసే బిల్లు ఇది. ఇప్పటివరకూ అనధికారికంగా సైనికపెత్తనంలో ఉన్న పాకిస్థాన్‌ ఈ చట్టం సాయంతో సైనికరాజ్యంగా మారుతుంది.

షెబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం ఒకేమారు న్యాయ, సైనిక చట్టాలను ఈ బిల్లుద్వారా సవరిస్తోంది. సుప్రీంకోర్టును బలహీనపరచే లక్ష్యంతో, దాని నెత్తిన ఫెడరల్‌ కాన్స్టిట్యూషనల్‌ కోర్టు (ఎఫ్‌సీసీ) ఏర్పాటు ప్రయత్నాలు జరుగుతున్నాయని మేధావులు భయపడుతున్నారు. భవిష్యత్తులో తమకు నచ్చిన తీర్పులనూ, తీర్మానాలనూ చేయించుకొనేందుకు పాలకులకు, ముఖ్యంగా మునీర్‌కు ఇది ఉపకరించవచ్చు. ఫీల్డ్‌ మార్షల్‌ మునీర్‌ ఈ నెల 27వ తేదీ నుంచి సీడీఎఫ్‌గా త్రివిధ బలాలకూ శక్తిమంతమైన అధినాయకుడు కావడమే కాక, జీవితపర్యంతం ఆ హెదాలోనే ఉంటారు. మరణించేంతవరకూ శత్రువులెవరూ కేసులు పెట్డడానికీ, ఏ కోర్టులూ శిక్షించడానికి వీల్లేకుండా ఆయనకు అపరిమిత రక్షణలు లభిస్తాయి. అభీష్టానికి వ్యతిరేకంగా ఆయనను తొలగించడమూ అసాధ్యమంటున్నారు. ఫీల్డ్‌మార్షల్‌ హోదాకు రాజ్యాంగబద్ధతలేదన్న న్యాయవివాదం నేపథ్యంలో, ఈ చట్టసవరణ ఆయనకు ఆ హోదాను శాశ్వతం చేసి, జీవితకాల ప్రతిరోధకశక్తిని ప్రసాదిస్తోంది. అణ్వాయుధాలపై పెత్తనాన్నీ కట్టబెడుతుంది.

పాకిస్థాన్‌ రాజకీయార్థిక, సామాజిక రంగాల్లో సైన్యం ప్రభావం, పెత్తనం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. సైన్యం ఆశీస్సులు, అండదండలు లేని నాయకులు, ప్రజాబలం ఎంత ఉన్నా కూడా అనతికాలంలో కుప్పకూలవలసిందే. పరిమితిలో, పరిధుల్లో ఉండమని సైన్యానికి చెప్పినందుకు నవాజ్‌షరీఫ్‌కు, సైన్యం పెత్తనాన్ని ప్రశ్నించినందుకు ఇమ్రాన్‌ఖాన్‌కు ఏ గతిపట్టిందో తెలుసు. సుప్రీంకోర్టు అధికారాలకే కళ్ళెంవేసే ప్రయత్నం జరుగుతోంది కనుక ఇక ఇమ్రాన్‌వంటివారు వెలుగుచూడలేరు, ప్రజాస్వామ్యంమీదా, స్వేచ్ఛాయుత ఎన్నికలమీదా ఆశలన్నీ వదులుకోవాల్సిందే. సైనికనియంతలు అయూబ్‌ఖాన్‌, జియా ఉల్‌ హఖ్‌, పర్వేజ్‌ ముషార్రఫ్‌‍లు సర్వాధికారాలనూ దఖలుపరచుకోవడానికి అనుసరించిన సర్వవిధాలనూ ఈ ఒక్క సవరణలో మేళవించి మునీర్‌ వారందరినీ మించిపోబోతున్నాడు. మొత్తానికి ఆపరేషన్‌ సిందూర్‌ మనకెంత ప్రయోజనం చేకూర్చిపెట్టిందో తెలియదు కానీ, మునీర్‌ను మాత్రం మహాయోధుడిని చేసింది. అమెరికా అధ్యక్షుడు పాక్‌ ప్రధానినో, అధ్యక్షుడినో కాక, ఈ సైనికుడికి ఎర్రతివాచీ పరిచి, శ్వేతసౌధంలో పంచభక్ష్యపరమాన్నాల విందుచేశారు. అతడిని మహావీరుడుగా, తనకు అత్యంత ప్రియమైన ఫీల్డ్‌ మార్షల్‌గా కీర్తించారు. ఇకపై, పూర్తిగా మునీర్‌ ఏలుబడిలోకి పోతున్న పాకిస్థాన్‌తో రక్షణ వ్యవహారం, సహకారం ట్రంప్‌కు మరింత సులువు. దేశాలకు సైన్యాలు ఉండటం సహజం. కానీ, సైన్యం కోసం ఉన్న ఏకైక దేశం పాకిస్థాన్‌.

ఇవి కూడా చదవండి

ఢిల్లీ పేలుళ్లు.. నిధులు సమీకరణలో కీలకంగా మహిళా డాక్టర్

ఎన్డీయేదే విజయం.. 7 ఎగ్జిట్ సర్వేలు జోస్యం

Updated Date - Nov 12 , 2025 | 01:04 AM