Indian Parliament: ప్రత్యర్థులపై బ్రహ్మాస్త్రాలు
ABN, Publish Date - Aug 21 , 2025 | 05:54 AM
తీవ్రమైన నేరారోపణలతో అరెస్టయి, వరుసగా ముప్పైరోజులపాటు నిర్బంధంలో ఉంటే, మంత్రులను, ముఖ్యమంత్రులను, ఏకంగా ప్రధానిని సైతం పదవినుంచి తొలగించగల మహాశక్తివంతమైన మూడుబిల్లులను సభలో...
తీవ్రమైన నేరారోపణలతో అరెస్టయి, వరుసగా ముప్పైరోజులపాటు నిర్బంధంలో ఉంటే, మంత్రులను, ముఖ్యమంత్రులను, ఏకంగా ప్రధానిని సైతం పదవినుంచి తొలగించగల మహాశక్తివంతమైన మూడుబిల్లులను సభలో ప్రవేశపెడుతూ హోంమంత్రి చేసిన వ్యాఖ్యలు, హితవులు అమితాసక్తికరంగా, ఉత్సాహభరితంగా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అటువంటి బిల్లుల అవసరాన్ని, కారణాలను, లక్ష్యాలను ఆయన బహుచక్కగా వివరించారు. సామాన్యప్రజలు ఎంతో ఆశతో, నమ్మకంతో ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటారని, సగటు మనిషి ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని ప్రజాప్రతినిధులు రాజకీయాలకు అతీతంగా ఉన్నతమైన విలువలతో, ఆదర్శాలతో వ్యవహరించాల్సి ఉంటుందనీ, రేఖామాత్రంగా కూడా అనుమానానికి ఆస్కారం లేకుండా నడుచుకోవాల్సి ఉందని ఈ బిల్లులు ఆశిస్తున్నాయి. ప్రజల ఆశలకూ, ఆకాంక్షలకూ ప్రతీకలుగా, ప్రతినిధులుగా ఉంటున్నవారిమీద తీవ్రమైన నేరారోపణలు వచ్చి, వారు అరెస్టయినపక్షంలో, రాజ్యాంగపరంగా వారిమీద ప్రజలు ఉంచిన విశ్వసనీయత కోల్పోయినందున, సదరు ప్రజాప్రతినిధులు తమకు తాముగా పదవులనుంచి తప్పుకోవాలి, లేదా విధిగా తప్పించవలసి ఉంటుందని ఈ బిల్లులు ఘోషిస్తున్నాయి. రాజకీయం పాపపంకిలమూ అవినీతిమయమూ అయిపోయిన ఈ దేశంలో ఎంతో ఉన్నతమైన ఆశయాలూ లక్ష్యాలతో ప్రక్షాళనకు నడుంబిగిస్తున్న ఈ బిల్లులను విపక్షాలు మాత్రం కాదంటున్నాయి.
మచ్చపడితే, జైలుకెళితే ప్రధానినే దించేస్తానని శపథం చేస్తున్న బిల్లులను చూసి విపక్ష పార్టీలు, మరీముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ వొణికిపోతోంది. లోక్‌సభలో కాంగ్రెస్ వేణుగోపాల్ ఒకవైపు వాగ్బాణాలు సంధిస్తూంటే, తృణమూల్ ఎంపీలు బిల్లుప్రతులను చించి విసిరేశారు, హోంమంత్రి దగ్గరకు దూసుకొస్తున్న ప్రత్యర్థులను ఏకంగా మంత్రులే వెనక్కునెట్టవలసి వచ్చింది. సదరు బిల్లులు రాజ్యాంగ వ్యతిరేకమనీ, ఫెడరల్ వ్యవస్థకు ప్రమాదకరమనీ ప్రత్యర్థులు మొత్తుకుంటున్నా, హోంమంత్రి తాను అన్నదీ, అనుకున్నదే చేశారు. లోక్‌సభనుంచి 21 మంది, రాజ్యసభ నుంచి పదిమంది కలగలిసిన సంయుక్త పార్లమెంటరీ విచారణ సంఘానికి ఈ బిల్లులు వెడతాయి. రాజకీయాలనుంచి నేరగాళ్ళను ఏరివేసే అతి ముఖ్యమైన బిల్లులు అయినందున కాబోలు, సదరు జెపీసీకి పెద్ద సమయం కూడా ఇవ్వలేదు. నవంబరు మూడోవారంలో జరిగే శీతాకాల సమావేశాల్లోగా అది తన నివేదికను సమర్పించాల్సి ఉంది.
ఈ బిల్లులు రాజకీయాల్లో నైతికతను ప్రతిష్ఠిస్తాయని బీజేపీ నేతలు అంటున్నారు. మీ ఏలుబడిలో రాజకీయమే తప్ప నైతికత ఉన్నదా అంటూ సదరు బిల్లుల దుర్వినియోగం భవిష్యత్తులో ఎన్నిరకాలుగా, ఏయే రూపాల్లో జరగవచ్చునో విపక్షనేతలు వివరిస్తున్నారు. ‘ఏముందీ, ఆయన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్‌ను పిలుస్తాడు, కేసు కట్టమంటాడు, ప్రజలు జైకొట్టి ఘనంగా ఎన్నుకున్న ప్రజాప్రతినిధి కథ కూడా ముప్పైరోజుల్లోనే ముగిసిపోతుంది’ అని రాహుల్ బిల్లుల లోగుట్టు ఇదేనంటూ ఒక్కముక్కలో తేల్చేశారు.
బీజేపీ ప్రభుత్వం సద్బుద్ధితో ఈ బిల్లులను తేలేదని, విపక్షపార్టీల ప్రభుత్వాలను గవర్నర్ల ద్వారా వేధించుకుతింటున్న క్రమంలో, ఇప్పుడు తమకు గిట్టని ముఖ్యమంత్రుల మీద కేసులుకట్టి, 31వ రోజున ఆటోమేటిక్‌గా దించేసే ఎత్తుగడ ఇదని వారివాదన. ప్రధానమంత్రికీ, కేంద్రమంత్రులకు కూడా ఇవే నియమాలు వర్తిస్తున్నప్పటికీ, కేంద్రప్రభుత్వం అమ్ములపొదిలో ఉన్న ఈడీ, సీబీఐ ఇత్యాది ఏజెన్సీలేవీ వారికి వ్యతిరేకంగా వ్యవహరిస్తాయని ఎవరూ నమ్మరు. ఈ బ్రహ్మాస్త్రాలను ధరించిన కేంద్రం తనకు గిట్టని మంత్రులూ, ముఖ్యమంత్రుల పదవులను కేవలం నేరాభియోగంతో ఊడగొట్టవచ్చు. ఆదర్శవంతమైన రాజ్యంలో, సమస్త వ్యవస్థలూ స్వతంత్రంగా వ్యవహరించగలస్థితి ఉన్నప్పుడు ఇటువంటి బిల్లులను స్వాగతించవచ్చు. కానీ, స్వయంగా సర్వోన్నత న్యాయస్థానమే కేంద్రప్రభుత్వ ఏజెన్సీలను పక్షపాతంతో వ్యవహరిస్తున్నాయంటూ తప్పుబడుతూ, మనీలాండరింగ్ చట్టాల వంటివి రాజకీయంగా దుర్వినియోగమవుతున్నాయని ఆక్షేపిస్తున్న స్థితిలో, దోష నిర్థారణ జరగకుండా విపక్షనేతలు నెలలతరబడి జైళ్ళలో మగ్గే అవకాశాలే అధికం. వర్షాకాల సమావేశాలు ముగిసిపోతున్న ఆఖరుక్షణాల్లో, ఎజెండాలో లేని ఈ బిల్లులను హడావుడిగా సభలో ప్రవేశపెట్టడం ఆశ్చర్యమే. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, ట్రంప్ వ్యాఖ్యలు, బిహార్ సర్ సహా అనేక అంశాల్లో విపక్షాలు పాలకపక్షాన్ని ఆత్మరక్షణలోకి నెట్టేసిన నేపథ్యంలో, ఈ బిల్లులు దారిమళ్ళింపు చర్యగా ఉపకరించవచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి..
వన్ ఫ్యామిలీ.. వన్ ఎంట్రప్రెన్యూర్ మన లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఆర్జీవీ 'వ్యూహం' సినిమా నిర్మాత దాసరి కిరణ్‌ను అరెస్ట్
Read Latest AP News and National News
Updated Date - Aug 21 , 2025 | 05:55 AM