Nitish Kumar: బిహార్ భేరీ
ABN, Publish Date - Oct 07 , 2025 | 05:04 AM
నితీశ్‌కుమార్ ఎటుంటే బిహార్‌లో అధికారం అటు పరుగుదీస్తుందని ఆయన పార్టీవారు గొప్పగా చెబుతూంటారు. రెండుదశాబ్దాలుగా బిహార్‌లో జరుగుతున్నదేమిటో తెలిసిందే కనుక...
నితీశ్‌కుమార్ ఎటుంటే బిహార్‌లో అధికారం అటు పరుగుదీస్తుందని ఆయన పార్టీవారు గొప్పగా చెబుతూంటారు. రెండుదశాబ్దాలుగా బిహార్‌లో జరుగుతున్నదేమిటో తెలిసిందే కనుక, గిట్టనివారు సైతం నిజమేనని అనక తప్పడం లేదు. ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ ప్రకటించడంతో, బిహార్‌లో ఏ పార్టీ గెలుస్తుందన్న ప్రశ్నకంటే, నితీశ్ మళ్ళీ సీఎం అవుతారా? అన్న చర్చే ఎక్కువగా సాగుతోంది. మొన్న శనివారం ప్రధాని సమక్షంలో జరిగిన ఒక జాతీయస్థాయి సమావేశంలో పాట్నానుంచి వర్చువల్‌గా పాల్గొన్న నితీశ్ నిముషానికి పైగా చేతులు జోడించి నమస్కారాలు పెడుతూ, వాటిని అదేపనిగా ఊపుతూ, అర్థంలేని చూపులు చూస్తున్న దృశ్యం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమైంది. ప్రధాని మోదీని ప్రసన్నం చేసుకోవడానికి నితీశ్ మరీ సాగిలబడిపోతూ బిహారీల పరువు తీసేస్తున్నారని ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్ ఘాటుగా విమర్శించారు. నితీశ్ ఇలా వింతగా ప్రవర్తించడం కొత్తేమీ కాదంటూ, తనకు స్వాగతం పలుకుతూ ఒక మొక్కని అందించినవారి నెత్తిమీదే దానిని తిరిగి ఉంచి నితీశ్ నవ్వుతూండటం, జాతీయగీతాన్ని లక్ష్యపెట్టకుండా ఒక సీనియర్ అధికారితో ముచ్చట్లు పెట్టడం వంటి మరికొన్ని వీడియోలు కూడా ఈ ఎన్నికలవేళ ప్రచారంలోకి వస్తున్నాయి. ఈ సుశాసన్ బాబు మానసిక స్థితి సరిగా లేదనీ, 74ఏళ్ళ ఈయన ఇక బిహార్‌ను ఏలేందుకు ఎంతమాత్రం సమర్థుడుకాదని తేజస్వి అవకాశం దొరికినప్పుడల్లా ప్రచారం చేస్తూనే ఉన్నారు. అయితే, మళ్ళీ నితీశేనా? అన్న ప్రశ్న ఆయన ఆరోగ్యస్థితినుంచి పుట్టినది కాదు. బీజేపీ గతంలో లాగానే ఈమారు కూడా ఆయనపట్ల ఉదారంగా ఉంటుందా? అన్న అనుమానం వల్ల.
దేశవ్యాప్తంగా ఓటరుజాబితాల ప్రక్షాళనకు బిహార్ పునాదిగా, ప్రయోగ కేంద్రంగా ఎన్నికల సంఘానికి ఉపకరించింది. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (సర్) విపక్షాలకూ, ఎన్నికల సంఘానికీ మధ్య తీవ్రస్థాయి ఘర్షణ సృష్టించింది. రమారమి ఓ యాభైలక్షల పేర్లు తొలగిన తరువాత ఇప్పుడు తుదిజాబితాలో మిగిలిన 7. 42కోట్లమంది ఓటర్లు రాజకీయపార్టీల భవిష్యత్తును నిర్ణయించబోతున్నారు. దేశవ్యాప్తంగా అమలు చేయాలనుకుంటున్న 17 కొత్త సంస్కరణలు కూడా బిహార్‌నుంచే మొదలవుతున్నాయి. ఒక పోలింగ్ బూత్‌ను 1200మంది ఓటర్లకు మాత్రమే పరిమితం చేయడం, ఈవీఎంల మీద అభ్యర్థుల కలర్‌ఫోటోలు, ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులు, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపును ముందుకు జరిపి, తప్పనిసరి చేయడం ఇత్యాదివి ఆహ్వానించదగినవి. రాహుల్ చేసిన‘ఓట్ చోరీ’ ఆరోపణలు, యాత్రలు ఎన్నికల సంఘాన్ని ఆత్మరక్షణలోకి నెట్టినమాట నిజం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో ఈసీ కుమ్మక్కయిందని, జాబితా ప్రక్షాళన పేరుతో విపక్షాల ఓట్లను గల్లంతుచేశారని ఆ పార్టీలు ఆరోపించడం, ‘సర్’కు వ్యతిరేకంగా సర్వోన్నత న్యాయస్థానంలో పలు కేసులు దాఖలు కావడం, చివరకు కోర్టు ఆదేశాల మేరకు ఓటరు యోగ్యతాపత్రంగా ఆధార్‌ను సైతం పరిగణనలోకి తీసుకోవడానికి ఈసీ తప్పనిసరిగా అంగీకరించడం తెలిసినవే. జాబితాలో తొలగింపులు, జోడింపుల అక్రమాలు బయటపడకుండా ఉండటానికే ఎన్నికల సంఘం మెషీన్ రీడబుల్ ఫార్మేట్‌లో ఓటరు లిస్టులు అందివ్వడం లేదని కాంగ్రెస్ ఆరోపించింది. ఈవీఎం డేటా, బ్యాటరీ లాగ్స్, సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వడానికి ఈసీ నిరాకరించడం, పైపెచ్చు నలభైఐదు రోజుల్లో ఫుటేజ్‌ను నాశనం చేయాలని కలెక్టర్లను ఆదేశించడం కూడా వివాదాస్పదమైనాయి. ‘సర్’ను సవాలు చేయడంతో పాటు, ఎలక్షన్ కమిషనర్ల నియామక ప్రక్రియను కూడా తప్పుబడుతూ సుప్రీంకోర్టులో కేసులు దాఖలైనాయి. చీఫ్ జస్టిస్ స్థానంలో ప్రధాని నియమించిన ఒక మంత్రిని సెలక్షన్ ప్యానెల్‌లోకి తెచ్చి, ఎన్నికల సంఘాన్ని అధికారపక్షం హస్తగతం చేసుకుందంటూ విపక్షాలు మరోమారు విరుచుకుపడ్డాయి. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ కూడా గతానికి భిన్నంగా రాజకీయపార్టీలతో గట్టిగానే పోరాడారు.
ఐదేళ్ళక్రితం ఎన్నికల్లో మహాగడ్బంధన్ కంటే ఓ పదిహేను అసెంబ్లీ స్థానాలను అధికంగా తెచ్చుకొని ఎన్డీయే అధికారంలోకి వచ్చింది. అరవైఎనిమిది శాతం స్ట్రైక్‌రేట్‌తో 74సీట్లను నెగ్గుకొచ్చిన బీజేపీ, 37శాతం స్ట్రైక్‌రేట్‌తో 43సీట్లను మాత్రమే గెలుచుకున్న నితీశ్‌ను తమ అధినాయకత్వం ముఖ్యమంత్రి పీఠంమీద కూచోబెట్టినందుకు బిహార్ బీజేపీ నాయకులకు ఇప్పటికీ ఎంతో బాధగా ఉంది. ఈ మారు ఏమాత్రం లెక్కలో తేడా వచ్చినా, ఆ ఔదార్యం కొనసాగనివ్వకూడదని వారి వాదన, ఆవేదన.
ఇవి కూడా చదవండి..
ఈసారి ఎన్నికలు ఈ ముగ్గురికీ యాసిడ్ టెస్ట్
బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల, జూబ్లీహిల్స్ బైపోల్ కూడా..
Read Latest Telangana News and National News
Updated Date - Oct 07 , 2025 | 05:04 AM