C P Radhakrishnan Faces Uphill Task: ఉపరాష్ట్రపతికి సమున్నత బాధ్యత
ABN, Publish Date - Sep 11 , 2025 | 01:40 AM
‘మాన్యత, ఉదాత్తత, విజ్ఞత, వివేకం, ఘనత, గాంభీర్యం ఆయనతో పాటుగానే సభామందిరంలోకి పాదం పెట్టేవి’– తొలి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ సభా సారథ్యం గురించి ఆయన హయాంలో రాజ్యసభ సభ్యుడుగా...
‘మాన్యత, ఉదాత్తత, విజ్ఞత, వివేకం, ఘనత, గాంభీర్యం ఆయనతో పాటుగానే సభామందిరంలోకి పాదం పెట్టేవి’– తొలి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ సభా సారథ్యం గురించి ఆయన హయాంలో రాజ్యసభ సభ్యుడుగా ఉన్న ఈ దినపత్రిక సంస్థాపక సంపాదకుడు నార్ల వెంకటేశ్వరరావు రాసిన మాటలవి. మంగళవారం నాడు మన 15వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన చంద్రాపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ తన కొత్త విధులను ఆ దార్శనిక పథ నిర్దేశకుడి స్ఫూర్తితో నిర్వర్తించినప్పుడే, తన బిడ్డ సార్థకనామధేయుడు కావాలన్న మాతృమూర్తి జానకీ అమ్మాళ్ మనోభీష్టాన్ని నెరవేర్చినవారవుతారు.
భారత రాజ్యాంగం ఆవిష్కరించిన ఉత్తమ పాత్ర ఉపరాష్ట్రపతి పదవి. మన అధికార వ్యవస్థలో రెండో అత్యున్నత పదవి అయిన ఉపరాష్ట్రపతి భావనను అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించినప్పటికీ మన పార్లమెంటరీ పాలనా వ్యవస్థ పరిధిలో ఒక విశిష్టతను సంతరించుకున్న రాజ్యాంగ బాధ్యత అది. ఉపరాష్ట్రపతి ప్రాథమిక విధి రాజ్యసభ (పార్లమెంటు ఎగువసభ)కు అధ్యక్షత వహించడం, దాని కార్యకలాపాలకు పక్షపాత రహితంగా మార్గనిర్దేశం చేయడం. ఈ విధ్యుక్త ధర్మాన్ని నిర్వర్తించడంలో సర్వేపల్లిదే సమున్నత స్థానం. ఆయన తరువాత ఆ పదవిని అధిష్ఠించిన వారిలో ఒక్కరు మినహా తమ బాధ్యతలను ప్రశస్తంగా నిర్వహించినవారే. 14వ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ దురదృష్టవశాత్తు తన వ్యవహార సరళితో వివాదాస్పదుడై పదవీకాలం మధ్యలోనే నిష్క్రమించవలసివచ్చింది. ఆ రాజ్యాంగ పదవి మాన్యతను వివాదాల గ్రహణం నుంచి విడిపించి సమున్నతపరచవలసిన బృహత్తర బాధ్యత కొత్త ఉపరాష్ట్రపతిపై ఉన్నది.
ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకొనే లోక్‌సభ (పార్లమెంటు దిగువసభ) సభ్యులకు భిన్నంగా రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే రాజ్యసభ సభ్యులు దేశ సమస్యలు, పాలనా వ్యవహారాలు, విస్తృత సమాజ సంబంధ విషయాలపై భావావేశరహిత, విజ్ఞాన సాధికారతతో. సమగ్ర చర్చలు జరిపి ప్రభుత్వానికి సరైన విధాన నిర్దేశం చేస్తూ ప్రజాస్వామ్య పరిపూర్ణతకు దోహదం చేయగలరని మన రాజ్యాంగ నిర్మాతలు భావించారు. ఈ కారణంగానే సాధారణ రాజకీయవేత్తలకు బదులుగా వివిధ రంగాలకు చెందిన నిష్ణాతులు సాధ్యమైనంత ఎక్కువ సంఖ్యలో ఎగువ సభలో ఉండాలని ఆశించారు. అయితే ఇటీవలి కాలంలో రాజ్యసభ సమావేశాలు రాజ్యాంగ నిర్మాతల అభిమతానికి భిన్నంగా ఉంటున్నాయనేది సామాన్యులూ గ్రహించిన సత్యం. పార్లమెంటరీ చర్చలు ప్రభావదాయకంగా, ప్రయోజనకరంగా ఉండాలంటే సభాపతులు తమ విధులు నిష్పాక్షికంగా నిర్వర్తించడంతో పాటు సభా కార్యక్రమాల నిర్వహణలో పాటిస్తున్న నియమ నిబంధనల్లో మౌలిక మార్పులు తీసుకురావలసిన అవసరమున్నది. ఇప్పుడు అనుసరిస్తున్న ఈ నియమ నిబంధనలు వలసపాలకుల కాలం నాటి నిబంధనావళి నవీకరణలే. స్వాతంత్ర్యానికి పూర్వం చట్టసభలు పరిపాలకులకే అనుకూలంగా ఉండేవి. పాలనాపరమైన ఇబ్బందులు ఏర్పడకుండా పార్లమెంటరీ చర్చలను నియంత్రించడమే ఆ నియమ నిబంధనల లక్ష్యంగా ఉండేది. ఏడున్నర దశాబ్దాల స్వాతంత్ర్యంలో మన చట్టసభలు అసంకల్పితంగా వలసపాలకుల లక్ష్యపరిపూర్తికి అనుకూలమైనవిగా మారిపోవడం మన పార్లమెంటరీ ప్రజాస్వామ్య దౌర్భాగ్యం. ఈ శోచనీయ పరిస్థితిని తొలగించి, రాజ్యాంగ నిర్మాతలు ఆకాంక్షించిన విధంగా రాజ్యసభను ‘వివేచనా నిలయం’ (హౌస్ ఆఫ్ రీజన్)గా తీర్చిదిద్దాలి. ఇందుకు గౌరవనీయ సభ్యులతో సంప్రతింపులు, సమాలోచనలు జరిపి, సభా కార్యక్రమాల కొత్త నిబంధనావళి రూపకల్పనకు కొత్త ఉపరాష్ట్రపతి పూనుకోవాలి. గతం (2007–17)లో ఈ అత్యున్నత పదవిని నిర్వహించిన హమీద్ అన్సారీ తన పదవీ విరమణ చివరిరోజున ఇలా అన్నారు: ఏడు దశాబ్దాల స్వాతంత్ర్యంలో ప్రజాస్వామ్యం బాగా వేళ్లూనుకున్నది. ఓటర్లు మరింత అధిక సంఖ్యలో పోలింగ్‌లో పాల్గొంటున్నారు. రాజకీయ రంగంలో పరిణామాలపై సామాన్యులూ విశేష శ్రద్ధ చూపుతున్నారు. అయితే దేశంలో వివిధ స్థాయిలలో రాజకీయ సంస్థలు పనిచేస్తున్న తీరు ఉండవల్సిన విధంగా ఉండడం లేదు’. తన కర్తవ్య పాలనలో సీపీ రాధాకృష్ణన్ ఈ మాటలను సదా గుర్తుంచుకోవాలి.
స్వాతంత్ర్యోద్యమంలోను, ఆ తరువాత మన నాయకులు అనుసరించిన భావసమైక్యతా విధానం మరింత పరిపుష్టమయ్యేందుకు రాజ్యసభ చర్చలు దోహదం చేయాలి. గాంధీజీ ప్రాధాన్యమిచ్చిన వికేంద్రీకరణ పద్ధతులు, ఫూలే–అంబేడ్కర్‌ల సామాజిక న్యాయ దార్శనికత, గ్రామీణ ఉపాధికల్పనకు చేతివృత్తులను అభివృద్ధిపరచాలనే కమలాదేవి ఛటోపాధ్యాయ ఆలోచన, లౌకికతత్వంలో నెహ్రూ అచంచల విశ్వాసం మొదలైన భావస్రవంతులు ప్రజా జీవితంలో మరింతగా అంతర్భాగమయ్యేందుకు కృషి చేసేలా పార్లమెంటరీ పెద్దలను కొత్త ఉపరాష్ట్రపతి పురిగొల్పాలి.
ఈ వార్తలు కూడా చదవండి..
ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..
Updated Date - Sep 11 , 2025 | 01:41 AM