ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Middle East Crisis: బీభత‍్స నిర్ణయం

ABN, Publish Date - Aug 12 , 2025 | 12:34 AM

గాజాను ఆక్రమించబోవడం లేదు, హమాస్‌ నుంచి విముక్తి కలిగిస్తున్నామంతే అని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమీన్‌ నెతన్యాహూ ప్రకటించినప్పటికీ, జరగబోయేదేమిటో అందరికీ తెలుసు. గాజా నగరం స్వాధీనానికి ఇజ్రాయెల్‌...

గాజాను ఆక్రమించబోవడం లేదు, హమాస్‌ నుంచి విముక్తి కలిగిస్తున్నామంతే అని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమీన్‌ నెతన్యాహూ ప్రకటించినప్పటికీ, జరగబోయేదేమిటో అందరికీ తెలుసు. గాజా నగరం స్వాధీనానికి ఇజ్రాయెల్‌ మంత్రివర్గం తీర్మానించగానే అన్ని దేశాలూ ఆ ప్రతిపాదనమీద మండిపడ్డాయి. ఐక్యరాజ్యసమితి కూడా ఈ నిర్ణయం ప్రమాదకరమైనదంటూ అభ్యంతరం వెలిబుచ్చింది. దీంతో నెతన్యాహూ సామాజిక మాధ్యమాల్లో ఓ చిన్న వివరణ ఇస్తూ, గాజా స్వాధీనం అన్నంతమాత్రాన అది తమదగ్గరే ఉంచేసుకోబోమన్నారు. ఈ ప్రాంతానికి హమాస్‌ నుంచి స్వేచ్ఛను ప్రసాదిస్తాం, నిస్సైనికీకరణ చేస్తాం, పాలస్తీనా అథారిటీ, హమాస్‌ సహా మరే ఉగ్రవాద సంస్థ ప్రమేయం లేని శాంతియుత పౌరపాలన నెలకొల్పుతాం అని ప్రకటించారాయన. తన ఈ చర్యలతో హమాస్‌ దగ్గర ఉన్న ఇజ్రాయెలీ బందీలకు విముక్తి దొరుకుతుందని, ఇజ్రాయెల్‌కు గాజా నుంచి శాశ్వతంగా ముప్పు ఉండదని ఆయన భవిష్యత్‌ దర్శనం చేశారు. ఇంత చక్కగా చెబుతున్నా కూడా, భద్రతామండలిలో అమెరికా తప్ప, శాశ్వత సభ్యదేశాలన్నీ నెతన్యాహూ నిర్ణయాన్ని తప్పుబట్టాయి. యుద్ధం ఆగాలంటే, హమాస్‌ అంతం కావాలి, అది జరగాలంటే మొత్తం గాజాను మేము దురాక్రమించాలి అన్నది నెతన్యాహూ వ్యాఖ్యల సారాంశం.

ప్రపంచ దేశాల ఈ ఖండనమండనలు, అభ్యంతరాలు నెతన్యాహూను నిలువరించలేవన్నది నిజం. గాజాను గుప్పిట్లోకి తెచ్చుకొనే ఆ ప్రక్రియ అతి బీభత్సంగా ఉండబోతున్నది. అల్‌ షిఫా ఆస్పత్రి ప్రధానద్వారం వెలుపల మీడియాకోసం ఉద్దేశించిన టెంట్‌మీద ఇజ్రాయెల్‌ ఆదివారం రాత్రి క్షిపణులు ప్రయోగించి అల్‌జజీరా చానెల్‌కు చెందిన ఐదుగురు పాత్రికేయులను పొట్టనబెట్టుకుంది. ఈ బృందం నాయకుడు హమాస్‌ ఉగ్రవాది అని ఇజ్రాయెల్‌ ఆరోపణ. ఖతార్‌కు చెందిన ఈ మీడియా సంస్థమీద నెతన్యాహూ కక్షకట్టి, యుద్ధం ఆరంభమైనప్పటి నుంచీ దానిని అణగదొక్కేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. గత 22 నెలల్లో 200మంది జర్నలిస్టులను చంపి బాహ్యప్రపంచానికి తన నేరాలూఘోరాలూ తెలియనివ్వకుండా చేయాలని ఇజ్రాయెల్‌ ఎంతో ప్రయత్నిస్తోంది. ఇప్పుడు మరింత భీకరంగా గాజాలోకి చొరబడబోతున్న నేపథ్యంలో, మీడియాపై ఆదివారం నాటి దాడి ఒక బలమైన హెచ్చరిక. క్షేత్రస్థాయి నిజాలు వెలుగుచూడనివ్వకుండా నియంత్రించే ప్రయత్నం.

స్వతంత్ర పాలస్తీనా రాజ్యం ఏర్పాటయ్యేవరకూ ఆయుధాలు వదిలేది లేదనీ, అది ఏర్పడిన తరువాత భవిష్యత్‌ పాలస్తీనా అథారిటీకి తానే స్వయంగా ఆయుధాలు అప్పగిస్తానని హమాస్‌ అంటోంది. హమాస్‌ బాగా దెబ్బతిన్నప్పటికీ, గాజాలో చెప్పుకోదగ్గ ప్రాంతాన్ని అది ఇంకా నియంత్రించగలుగుతున్నందున దానిని ఈ స్థితిలో వదిలివేయడం తమకు ప్రమాదకరమని నెతన్యాహూ భావిస్తున్నారు. ఇటీవల అమెరికా–ఇజ్రాయెల్‌ కలిసి పన్నెండు రోజులపాటు ఇరాన్‌ను దెబ్బతీసిన కారణంగా అది హామాస్‌కు సహాయపడగల స్థితిలో లేదని ఆయన నమ్మకం. హిజ్బొల్లా వంటి సంస్థలు కూడా బలహీనపడి ఉన్న ఈ దశలోనే హమాస్‌ను సమూలంగా తుడిచేయవచ్చునన్న ఆశతో నెతన్యాహూ ఈ కొత్త దురాక్రమణలో దూకుడుగా ఉన్నారు. హమాస్‌ తన వద్ద ఉన్న ఆయుధాలను పాలస్తీనా అథారిటీకి అప్పగించి, గాజాపాలన నుంచి తప్పుకోవాలని ఇటీవల ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో న్యూయార్క్‌లో జరిగిన సదస్సులో అరబ్‌దేశాలు కూడా విజ్ఞప్తిచేసిన విషయం తెలిసిందే. అక్టోబర్‌ 7దాడిని అవి ఖండించడం కూడా ఇదే తొలిసారి. మూడు అరబ్‌దేశాలు, నాలుగు పశ్చిమదేశాలు, రెండు ముస్లిందేశాలు కలసికట్టుగా చేసిన ఈ ప్రతిపాదనలు అటు హమాస్‌కు, ఇటు ఇజ్రాయెల్‌కు కూడా కాలువెనక్కుతీసుకోవడానికి మంచి మార్గం. కానీ, రెండు స్వతంత్ర, సార్వభౌమ దేశాలుగా ఇజ్రాయెల్‌, పాలస్తీనా పక్కపక్కనే మనగలగడం నెతన్యాహూ దృష్టిలో అసాధ్యం. ఆయన అధికారంలో ఉన్నంతవరకూ పరిష్కారాలకు దూరంగా కొత్తరూపాల్లో గాజా యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. గాజాను ఆక్రమించబోవడం లేదంటూనే హమాస్‌ నుంచి దానిని వశపరచుకొనే నెతన్యాహూ కొత్త ఎత్తుగడ 22నెలల యుద్ధాన్ని మరి కొంతకాలం కొనసాగించడానికి ఉపకరిస్తుంది. హమాస్‌ ఎదురునిలవగలదా అన్నది ఇక్కడ అప్రస్తుతం. కానీ, మరిన్ని చావులు, మరింత విధ్వంసాన్ని ఈ ప్రపంచం చూడాల్సి వస్తుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

జాతీయ జెండా కేవలం వస్త్రం కాదు.. స్వాతంత్య్రానికి ప్రతీక : చంద్రబాబు

పులివెందులలో ఎన్నికల వేళ.. వైసీపీకి హైకోర్టు షాక్

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Aug 12 , 2025 | 12:34 AM