Ladakh on Fire: మండుతున్న మంచు భూమి
ABN, Publish Date - Sep 26 , 2025 | 02:23 AM
పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ మీద నాలుగు కఠినమైన కేసులు పెట్టి ఏళ్ళపాటు జైల్లోకి నెడితే లద్దాఖ్ ప్రజా ఉద్యమం నశించిపోతుందని ఈ దేశపాలకులు నిజంగానే నమ్ముతున్నారా? ఆయన అడ్డదారిలో విదేశీ విరాళాలు...
పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ మీద నాలుగు కఠినమైన కేసులు పెట్టి ఏళ్ళపాటు జైల్లోకి నెడితే లద్దాఖ్ ప్రజా ఉద్యమం నశించిపోతుందని ఈ దేశపాలకులు నిజంగానే నమ్ముతున్నారా? ఆయన అడ్డదారిలో విదేశీ విరాళాలు పోగేస్తున్నాడన్న పేరిట సీబీఐ జరపబోతున్న విచారణతో లద్దాఖ్ ప్రజలు ఆయన పట్ల విశ్వాసాన్ని కోల్పోయి, వెంటనడవడం మానేస్తారా? దేశప్రజలంతా కుట్రదారుగా, దేశద్రోహిగా చూస్తారా? లద్దాఖీలకు ఆయనేమిటో, ఏ విలువలకు, ఆశయాలకు కట్టుబడివున్నాడో తెలుసు. సృజనాత్మక విద్యావేత్త, ఇంజనీర్ కూడా అయిన వాంగ్‌చుక్ జీవితం ఆధారంగా నిర్మితమైన ‘త్రీ ఇడియట్స్’ చూసిన దేశప్రజలు కూడా ఈ రామన్‌మెగసెసే అవార్డు గ్రహీత తన మాతృభూమి పరిరక్షణ కోసం పడుతున్న ఆవేదనను గుర్తించకుండా, సహానుభూతిలేకుండా ఏమీ లేరు.
వాంగ్‌చుక్ రెచ్చగొట్టడం వల్లే మొన్నటి హింస జరిగిందని కేంద్రం అంటోంది. జెన్ జీ తరహా ఉద్యమాలను ఉదహరిస్తూ ఈయన లద్దాఖ్ కుర్రకారుని రెచ్చగొట్టాడని పాలకులు తమకు అనువైన వాదనలు చేస్తున్నారు. కానీ, యువజనం ఇలా రెచ్చిపోయేవరకూ పరిస్థితిని తెచ్చింది ఎవరు? చిన్న రాయికూడా గాలిలోకి లేవకుండా, అత్యంత శాంతియుతంగా వందలాదిమందితో వాంగ్‌చుక్ మైనస్ పదిడిగ్రీల చలిలో పలుమార్లు నిరశనదీక్షలు చేశాడు. ఆయన దీక్షకు కూర్చోవడం ఇది ఐదోసారి. ప్రతీసారీ ప్రాణాలకు తెగించి, దీక్షకాలాన్ని పెంచుతూ ఢిల్లీ పెద్దల మనసు కరగాలని కోరుకున్నాడు. తమ గొంతు లద్దాఖ్ నుంచి సరిగా వినబడదేమోనని వందలాది కిలోమీటర్లు నడిచి, దేశరాజధానిలో దీర్ఘకాలం దీక్ష చేపట్టి పాలకుల పిలుపుకోసం ఎదురుచూశాడు. అయినా ఫలితం లేకపోయింది. కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యమాన్ని ఇంత తేలికగా తీసిపారేయడానికి వాంగ్‌చుక్ అనుసరిస్తున్న శాంతిమార్గం కారణమని లద్దాఖ్ కుర్రకారు భావించేవరకూ పరిస్థితి వచ్చింది. హింసకు ఎవరు కారకులైనా శిక్షించవలసిందే. కానీ, రగులుతున్న లద్దాఖ్ ప్రజలను హింసకు ప్రేరేపించదలిస్తే వాంగ్‌చుక్ ఆ పని ఎంతో సునాయాసంగా ఎప్పుడో చేయగలిగేవాడు.
ఆయనను జైల్లోకి నెట్టడానికి ఆధారాలే అక్కరలేదు, పాలకుల దగ్గర సవాలక్ష మార్గాలు ఉంటాయి. న్యాయస్థానాలు బెయిల్ ఇవ్వడానికి కూడా జంకుతున్న, జైళ్ళలో మగ్గుతున్న ప్రజాఉద్యమకారులలో ఈయన కూడా చేరిపోవచ్చు. కానీ, ఈ చర్యలు లద్దాఖ్ ప్రజలను తమకు మరింత దూరం చేస్తాయని తెలిసి కూడా పాలకులు అణచివేత మార్గాన్ని ఎంచుకోవడం విచిత్రం.
చైనా, పాక్ సరిహద్దు, చొరబాట్లు, దేశభద్రతలతో ముడిపడివున్న కీలక ప్రాంతం కనుక, రాష్ట్ర హోదా ఇవ్వకూడదని కేంద్రం భావించడం సరైనదా కాదా అన్నది వేరే విషయం. ఐదేళ్ళక్రితం వరకూ అది రాష్ట్రమేననీ, ఆ హోదా ఢిల్లీ పాలకులకు ఎన్నడూ ఒక అడ్డంకి కాలేదన్న నిజాన్ని కూడా పక్కనబెడదాం. ఆరేళ్ళ క్రితం జమ్మూకశ్మీర్‌ను శిక్షించడంలో భాగంగా లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతంగా మారినప్పుడు, మిగతా దేశ ప్రజల మాదిరిగా ఇక్కడివారు కూడా ఏవో అద్భుతాలు జరిగిపోతాయనుకున్నారు. కానీ, ఏడాదిలోనే కలలు కరిగిపోవడం మొదలైంది. వివిధ తెగలకు నిలయమైన ఈ ప్రాంతంలో సాంప్రదాయికంగా ఉన్న హక్కులకు 370 అధికరణ రద్దుతో హామీ లేకుండా పోయింది. ఏడు దశాబ్దాలుగా లేని అభద్రత వారిని వెంటాడుతోంది. పైగా, కళ్ళముందు కశ్మీర్‌లో స్థానికతకు ఏ మాత్రం విలువలేకుండా అన్ని ద్వారాలూ తెరుచుకొని, సర్వమూ పరాయీకరణ జరుగుతున్న వేగం వారిలో కొత్తభయాలు పెంచింది. రాష్ట్ర ప్రతిపత్తిని కాదంటున్నప్పటికీ, ఆరవషెడ్యూల్ రక్షణలు, ఉద్యోగాలను స్థానికులకు రిజర్వుచేస్తూ ఓ ప్రత్యేక పబ్లిక్ సర్వీస్ కమిషన్, రెండు పార్లమెంటరీ సీట్లు ఇత్యాది డిమాండ్లను నెరవేర్చడం కేంద్రానికి కష్టం కాదు. ఆరో షెడ్యూల్‌లో చేర్చడం లద్దాఖ్ తెగల వారసత్వహక్కుల పరిరక్షణకు ఆవశ్యకమని షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్ కూడా స్పష్టంచేసింది. అలా జరిగినపక్షంలో అస్మదీయులకు భూ సంతర్పణలు, వనరుల అప్పగింత సులభం కాదు కనుక కేంద్రం ఆ ఊసెత్తడం లేదు. లద్దాఖీల ఈ డిమాండ్లన్నీ నెరవేరుస్తానని హామీ ఇస్తూ వచ్చిన బీజేపీ క్రమంగా తమపట్ల కఠినంగా వ్యవహరిస్తూండటంతో స్థానికుల్లో అనుమానాలు పెరిగిపోతున్నాయి. భూమి కార్పొరేట్లకు పోతుందనీ, ఉపాధి బయటవారు తన్నుకుపోతారనీ, కొండలు, లోయలు, పర్యావరణం దుంపనాశనమవుతాయన్న భయాలు హెచ్చుతున్నాయి. లద్దాఖీల ఆవేదనను, ఆరాటాన్ని పట్టించుకోకుండా చైనా, పాకిస్థాన్‌తో సరిహద్దులు పంచుకుంటున్న ఈ ప్రాంతంలో రాజకీయ విన్యాసాలు చేయడం శ్రేయస్కరం కాదు.
Also Read:
ఎవరైనా ఆడబిడ్డల జోలికి వచ్చారో.. సీఎం డెడ్లీ వార్నింగ్
వైసీపీ హయాంలో చిరంజీవిని అవమానించారంటూ బాలయ్య ఫైర్..
Updated Date - Sep 26 , 2025 | 02:23 AM