100 percent FDI insurance: బీమా భయాలు
ABN, Publish Date - Dec 19 , 2025 | 02:14 AM
భారత బీమా మార్కెట్ మీద పట్టుసాధించాలని విదేశీకంపెనీలు ఉత్సాహపడటమే కాదు, నానాటికీ ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలో, వాటి పూర్తిస్థాయి ప్రవేశానికి ప్రభుత్వం తలుపులు బార్లా తెరిచింది...
భారత బీమా మార్కెట్ మీద పట్టుసాధించాలని విదేశీకంపెనీలు ఉత్సాహపడటమే కాదు, నానాటికీ ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలో, వాటి పూర్తిస్థాయి ప్రవేశానికి ప్రభుత్వం తలుపులు బార్లా తెరిచింది. అందరికీ బీమా–అందరికీ రక్షణ అని అందరికీ నచ్చే, నమ్మకాన్ని ఇచ్చే ఓ చక్కని పేరు బిల్లుకు పెట్టి, 1938నాటి బీమా చట్టం మొదలు నిన్నమొన్నటి వరకూ ఉన్న పలుచట్టాలను ఇందుకోసం ప్రభుత్వం సవరించింది. నూరుశాతం విదేశీప్రత్యక్ష పెట్టుబడికి ఇలా తలుపులు పూర్తిగా తెరవడం ద్వారా ఈ దేశంలోని ప్రతీ పౌరుడికీ 2047నాటికి కచ్చితంగా బీమా కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యం సులువుగా నెరవేరుతుందట.
విదేశీ ప్రత్యక్షపెట్టుబడులకు ద్వారాలు కొద్దికొద్దిగా తెరుస్తున్నప్పుడల్లా ప్రభుత్వం కొన్ని అంశాలను బలంగా ముందుకు తెస్తుంది. జీవితబీమా, ఆరోగ్యబీమాల విస్తృతి మనదేశంలో బహుస్వల్పమని, పాతికేళ్లక్రితం వరకూ ఈ రంగం పూర్తిగా ప్రభుత్వ గుత్తాధిపత్యంలో ఉండిపోవడం వల్ల అది ఎదగాల్సినంత ఎత్తుకు ఎదగలేదన్నది వాదన. బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డిఎ) ఏర్పాటుద్వారా ఈ రంగాన్ని ప్రైవేటుకు తెరిచేవరకూ అది బలపడలేదని, ఆ తరువాత కూడా ప్రభుత్వపరంగా ఎన్ని ప్రయత్నాలు జరిగినా ప్రజల్లోకి దూకుడుగా విస్తరించలేకపోయిందని అంటారు. ఈ పేరిట, వాజపేయి హయాంలో చిన్నగా మొదలైన ఎఫ్‌డిఐ ప్రవేశాన్ని ఆ తరువాత మరో నాలుగేళ్ళకు కాంగ్రెస్ హయాంలో మరింత హెచ్చించేందుకు ఓ బలమైన ప్రయత్నం జరిగింది కానీ, యూపీఏకు వెన్నుదన్నుగా ఉన్న వామపక్షాలతో పాటు, బీజేపీ కూడా 49శాతం చేయడానికి ఒప్పుకోక ఆగిపోయింది. మంచి సంఖ్యాబలంతో అధికారంలోకి వచ్చిన నరేంద్రమోదీ ప్రభుత్వం వచ్చీరావడంతోనే ఎఫ్‌డిఐని 49శాతం చేసి, ఆ తరువాత డెబ్బయ్‌నాలుగుశాతానికీ, ఇప్పుడు ఏకంగా నూరుశాతానికీ అనుమతించడంతో పాతికేళ్ళ తర్జనభర్జనలకు పూర్తిగా తెరపడినట్టే. ఇప్పటివరకూ జీడీపీలో రమారమి మూడుశాతం వాటాకు పరిమితమైపోయిన బీమా రంగం ఇకపై అద్భుతమైన వేగంతో ఎదుగుతుందనీ, విదేశాల్లో మాదిరిగా ఆరున్నరశాతానికి తాకుతుందని పాలకుల ఆశ. ఎఫ్‌డిఐలతో బలోపేతమైన ప్రైవేటుసంస్థలు రాబోయే రోజుల్లో పెట్టుబడులతో, సరసమైన ఉత్పత్తులతో బీమాను ద్విగుళం బహుళం చేస్తాయని, పెరిగిన పోటీతో ఉద్యోగ ఉపాధి అవకాశాలూ విస్తరిస్తాయని ప్రభుత్వం అంచనాలు కడుతోంది.
సహజంగానే భయాలూ, భిన్న వాదనలూ కూడా ఉంటాయి. స్థానిక కంపెనీల్లో భాగస్వాములుగా ఉన్న విదేశీసంస్థలు తామే పూర్తిగా టేకోవర్ చేసే పరిస్థితుల్లో నియంత్రణ ఎలా అన్న ప్రశ్న ఉండనే ఉంది. బీమా కంపెనీతో బీమాయేతర కంపెనీ విలీనాన్ని అనుమతించడంపైనా ప్రశ్నలు ఉన్నాయి. చైర్మన్, ఎండి, సీఈవోలలో కనీసం ఒక్కరు భారతీయ పౌరుడు కావాలన్న నిబంధన బాగున్నప్పటికీ, కంపెనీ కష్టాల్లోకి జారుకున్నాక వీరు చేసేదీ, ప్రభుత్వం చేయగలిగేదీ ఏమిటని కొందరి ప్రశ్న. విదేశీవాటా పరిమితంగా ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఎన్ని హామీలైన ఇవ్వవచ్చు. కానీ, వందశాతం చేరికతో ఇక్కడి జనం సొమ్ము ఇక్కడ ఖర్చుకాకుండా విదేశాలకు తరలిపోతుందనో, దేశీయపొదుపు అన్యుల చేతుల్లో పడి ఆవిరైపోతుందనో భయాలు కలగడం సహజం. ఐఆర్‌డిఎకు మరిన్ని అధికారాలు కట్టబెట్టి, వినియోగదారుడు కేంద్రంగా కొత్తమార్పులు చేశామని ప్రభుత్వం చెబుతోంది కనుక, ఆయా కంపెనీల నిర్వహణ, వాటిపై నియంత్రణ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని నమ్మాలి. విదేశీ కంపెనీలు ఆర్జించిన లాభాలు సరిహద్దులు దాటిపోకుండా తిరిగి ఇక్కడే పెట్టుబడులవుతాయని ఆశించాలి.
నూరుశాతం ఎఫ్‌డిఐతో విదేశీ కంపెనీలు తక్కువ మూలధనంతో ఇకపై ఇక్కడ వ్యాపారాలు మొదలుపెట్టుకోవచ్చు, ప్రైవేటు రంగంలో విదేశీ కంపెనీలదే ఇష్టారాజ్యం కావచ్చు. భారతదేశ బీమారంగంలో అన్నీ విదేశీ కంపెనీలే ఉన్నా ఆశ్చర్యపడనక్కరలేదు. ఇప్పటివరకూ 65శాతం వాటాతో అతిబలంగా ఉన్న ప్రభుత్వరంగ ఎల్‌ఐసికి ఇది పెద్ద పరీక్ష. అమెరికా మీద ఆగ్రహం కలిగినా, చైనామీద చిరాకు వచ్చినా మన నాయకులకు తక్షణమే గుర్తుకు వచ్చే స్వదేశీ నినాదం ఇలా విదేశీపెట్టుబడులకు తలుపులు తెరుస్తున్నప్పుడు గుర్తుకురాకపోవడం ఆశ్చర్యం. స్వదేశీ ముద్దు, విదేశీ వద్దు అంటున్నవారే ఈ దేశ ప్రజలను తమ జీవితాలను, ప్రాణాలను, భద్రతను విదేశీ సంస్థల చేతుల్లో పెట్టి భద్రంగా ఉండమని భరోసా ఇస్తున్నారు.
Also Read:
జోగి రమేష్ బ్రదర్స్‌కు దక్కని ఊరట
పాలిచ్చే స్త్రీలు థైరాయిడ్ మందులు తీసుకోవచ్చా?
Updated Date - Dec 19 , 2025 | 02:15 AM