India Clinches Asia Cup Title: అద్భుత విజయం
ABN, Publish Date - Sep 30 , 2025 | 02:28 AM
అదే దృశ్యం మళ్లీ సాక్షాత్కరమైంది. సంబరం అంబరాన్నంటింది. పండుగ రెండ్రోజుల ముందే వచ్చేసింది. దేశంలోని ప్రతి క్రీడాభిమాని సగర్వంతో సంబరం చేసుకునేలా అద్భుతాన్ని ఆవిష్కృతం చేసింది భారత క్రికెట్ జట్టు...
అదే దృశ్యం మళ్లీ సాక్షాత్కరమైంది. సంబరం అంబరాన్నంటింది. పండుగ రెండ్రోజుల ముందే వచ్చేసింది. దేశంలోని ప్రతి క్రీడాభిమాని సగర్వంతో సంబరం చేసుకునేలా అద్భుతాన్ని ఆవిష్కృతం చేసింది భారత క్రికెట్ జట్టు. ప్రతిష్ఠాత్మక ఆసియా కప్ టోర్నమెంట్‌లో తొమ్మిదోసారి చాంపియన్‌గా నిలిచింది. మెగా టోర్నీల్లో విజయాలు సాధించడం మన జట్టుకు సాధారణమే అయినప్పటికీ, ఇటీవలి పరిణామాల నేపథ్యంలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తుచేసి విజేతగా నిలవడమే కోట్లాదిమంది భారతీయులకు ఆనందాన్ని పంచే విషయం.
భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ఏ స్థాయి క్రికెట్ పోటీ అయినా సరే అసంఖ్యాక క్రీడాభిమానుల్ని ఆకట్టుకుంటుంది. అందునా, ఉద్వేగం, ఉత్కంఠకు మారుపేరైన ధనాధన్ పొట్టి క్రికెట్ సమరమైతే, చెప్పేదేముంది? కానీ, ఈసారి ఆసియా కప్ ఆరంభ సమయంలో చిరకాల ప్రత్యర్థుల పోరు పట్ల ఎప్పటిలా హడావిడి లేదు. ఉత్కంఠ, భావోద్వేగాలు లేవు. పహల్గాంలో పాక్ ముష్కరుల పైశాచిక కాండను మరిచిపోయారా? పాక్‌తో భారత్ మ్యాచ్‌ను బహిష్కరించాల్సిందే అంటూ బాధిత కుటుంబాల విమర్శలు, వివిధ వర్గాల నుంచి ఎదురైన ఒత్తిడి మధ్య ఇరు జట్ల పోరు మొదలైంది. గ్రూప్ దశలో ఓసారి, సూపర్–4లో మరోసారి పాకిస్థాన్‌ను భారత్ చిత్తుచేసింది. ఈ పరిస్థితుల్లో ఈ జట్ల మధ్య పోరుపై అంతగా ఆసక్తి లేకుండా పోయింది. భారత జట్టు టోర్నీ ఆరంభం నుంచే అద్భుత ఫామ్ కనబరుస్తూ, యూఏఈ, బంగ్లాదేశ్, శ్రీలంక, పాక్, ఇలా ఎదుర్కొన్న ప్రతి జట్టునూ మట్టి కరిపించి అజేయంగా ఫైనల్ చేరితే... పడుతూ, లేస్తూ పాక్ తుది పోరుకు అర్హత సాధించింది. దాయాది జట్లు తలపడిన ఫైనల్ మాత్రం భారత్, పాక్ మధ్య పోరు ఎలా ఉండాలని సగటు క్రికెట్ అభిమాని కోరుకుంటాడో అలాగే సాగింది. మ్యాచ్ అనూహ్య మలుపులు తిరుగుతూ, ఆధిపత్యం చేతులు మారుతూ, ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించింది.
మొదట బ్యాటింగ్ చేసిన ప్రత్యర్థిని బౌలర్ కుల్దీప్ యాదవ్ మాయాజాలంతో స్వల్ప స్కోరుకే కట్టడి చేసిన సూర్యకుమార్ సేన.. ఛేదనలో మాత్రం ఓ దశలో తడబాటుకు గురైంది. ఫైనల్‌కు ముందు దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ బ్యాటుతో పరుగుల వరద పారించిన ఓపెనర్ అభిషేక్ శర్మ అసలైన పోరులో నిరాశపరిచాడు. ఓ దశలో టాప్ బ్యాటర్లంతా పెవిలియన్ చేరి విజయంపై ఆశలు అడుగంటుతున్న తరుణంలో మైదానంలోకొచ్చిన తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ సందర్భానికి తగినట్టుగా ఆడాడు. అంత ఒత్తిడిలోనూ ప్రత్యర్థి బౌలర్ల భరతం పడుతూ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతను చివరిదాకా క్రీజులో నిలిచి చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడడంతో భారత్ మరోమారు ఆసియా విజేతగా ఆవిర్భవించింది. ఐసీసీ టోర్నమెంట్లలో ఎదురైన ప్రతిసారి పాకిస్థాన్‌ను చిత్తుచేస్తున్న భారత్, ఈసారీ అదే సంప్రదాయాన్ని కొనసాగించింది. వేదిక ఏదైనా, పిచ్ ఎలాంటిదైనా, ఆటగాళ్లు మారినా, తమను ఎవరూ ఆపలేరని టీమిండియా రుజువు చేసింది. పహల్గాం ఉన్మాదంలో ప్రాణాలొదిలిన పర్యాటకులకు ఆపరేషన్ సిందూర్‌తో భారత ప్రభుత్వం, సాయుధ బలగాలు ఘనంగా నివాళి అర్పిస్తే.. యుద్ధ భూమిలోనే కాదు, క్రీడాక్షేత్రంలోనూ తమదే పైచేయి అని మన క్రికెటర్లు ఆపరేషన్ ఆసియా కప్ రూపంలో చాటి చెప్పారు. 2023 ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకపై హైదరాబాద్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ ఆరు వికెట్లతో విజృంభించి భారత్‌కు ట్రోఫీ అందిస్తే.. తాజా టోర్నమెంట్ ఫైనల్లో తిలక్ వర్మ రూపంలో మరో తెలుగు ఆటగాడే ప్రధాన భూమిక పోషించడం విశేషం.
ఆసియా కప్ సందర్భంగా పాకిస్థాన్ క్రికెటర్లలో కొందరు క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించి తమ వెకిలి బుద్ధిని చాటుకున్నారు. భారత్‌తో సూపర్–4 మ్యాచ్‌లో అర్ధ సెంచరీ చేసిన అనంతరం పాక్ ఓపెనర్ ఫర్హాన్ బ్యాట్‌ను తుపాకి తరహాలో పైకెత్తి బుల్లెట్లు పేల్చుతున్నట్టుగా పహల్గామ్ దాడిని గుర్తుచేస్తూ సంబరాలు చేసుకుంటే.. ఆపరేషన్ సిందూర్‌లో భారత్‌కు చెందిన ఆరు విమానాలను కూల్చేశామనేలా బౌలర్ హారిస్ రౌఫ్ తన ఆరు వేళ్లను ప్రేక్షకులకు చూపించాడు. పాక్ ఆటగాళ్లు ఎంత రెచ్చగొట్టేలా వ్యవహరించినా, భారత క్రికెటర్లు మాత్రం ఎక్కడా సంయమనం కోల్పోలేదు. చివరకు విజయంతోనే ప్రత్యర్థికి బుద్ధి చెప్పారు. విజేతగా ఆవిర్భవించిన భారత జట్టు ట్రోఫీని పాక్ మంత్రి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ మొహిసిన్ నక్వీ చేతులమీదుగా అందుకునేందుకు నిరాకరించింది. టోర్నీలో ప్రత్యర్థి ఆటగాళ్లతో కరచాలనం చేసేందుకు కూడా మన క్రీడాకారులు అంగీకరించలేదు.
ఇవి కూడా చదవండి..
విజయ్ పార్టీ నాయకులపై కేసులు నమోదు
ఆసియా కప్ ట్రోఫీని తీసుకునేందుకు నిరాకరించిన భారత్
Updated Date - Sep 30 , 2025 | 02:28 AM