Myanmar Elections: మయన్మార్‌లో మాయ
ABN, Publish Date - Dec 30 , 2025 | 05:09 AM
మయన్మార్‌లో ఆదివారం జరిగిన తొలిదశ ఎన్నికల్లో ఘనవిజయం సాధించినట్టు యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్‌మెంట్ పార్టీ (యుఎస్‌డిపి) ప్రకటించుకుంది....
మయన్మార్‌లో ఆదివారం జరిగిన తొలిదశ ఎన్నికల్లో ఘనవిజయం సాధించినట్టు యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్‌మెంట్ పార్టీ (యుఎస్‌డిపి) ప్రకటించుకుంది. ఎన్నికలు జరిగిన స్థానాల్లో మూడింట రెండువంతులు దీనికే దక్కాయట. ఈ సైన్యం అనుకూల పార్టీ ప్రకటనను బట్టి జనవరి 11, 28 తేదీల్లో జరగబోయే మిగతా రెండు దశల పోలింగ్‌లోనూ అదే ఘనవిజయం సాధిస్తుందని, మొత్తం ఫలితాలు ఎప్పుడు వెలువడినా అవి పరోక్షంగా జుంటాకే జై కొడతాయని అర్థం.
మయన్మార్ ఎన్నికల గురించి ఒక్కరూ మంచిమాట అనడం లేదు. ఎన్నికల పరిశీలకులను పంపడానికి ఆసియాన్ తిరస్కరిస్తే, ఓ నాలుగైదు దేశాలు మాత్రమే సరేనన్నాయి. జుంటాకు అండగా ఉంటున్న రష్యా, చైనాలు అధికారికంగానే ఎన్నికల పరిశీలకులను పంపాయి. భారత్ నుంచి కూడా పరిశీలకులు వచ్చారని ఆ దేశ సైనిక ప్రభుత్వం చెబుతూంటే, అది పూర్తి ప్రైవేటు వ్యవహారం అని మన ప్రభుత్వం తేల్చేసింది. అంతమాత్రాన భారత్ ఈ ఎన్నికలకు వ్యతిరేకమేమీ కాదు. ఎన్నికలకు అక్కడి సైనిక ప్రభుత్వం సిద్ధపడుతున్నప్పుడే ప్రజాస్వామ్యం దిశగా మయన్మార్ అడుగులు వేస్తున్నదంటూ భారత్ మెచ్చుకుంది. ఒక మాజీ సైనికాధికారి ఎన్నికల పరిశీలకుడుగా వెళ్ళడం వ్యక్తిగత హోదాలో జరిగినా, ప్రభుత్వం అనుమతి లేనిదే సాధ్యంకాదు. సైనిక ప్రభుత్వంతో సత్సంబంధాలు కోరుకుంటున్నప్పుడు ఇటువంటి విన్యాసాలు తప్పవు. ఎన్నికలు స్వేచ్ఛగా, స్వచ్ఛంగా జరుగుతాయని, ప్రజలు నచ్చినవారిని ఎన్నుకోవచ్చునని, వారు ఎన్నుకున్న వారికే పాలన అప్పగిస్తామని దేశాన్ని గత ఐదేళ్ళుగా ఏలుతున్న సైనిక పాలకుడు అదేపనిగా హామీ ఇస్తున్నాడు. అపకీర్తికి దూరంగా ఉండాలని తాము కోరుకుంటున్నామని అంటున్నాడు. దేశం అంతర్యుద్ధంలో మునిగివున్నప్పుడు, పట్టుబట్టి సైనిక ప్రభుత్వం ఈ ఎన్నికలు నిర్వహిస్తోంది. బరిలో యాభైఏడు పార్టీలు ఉన్నప్పటికీ, ప్రధాన పార్టీలు ఆరింటిలో మాజీ సైనికాధికారులతో నిండిన యుఎస్‌డిపి మాత్రమే ఘనవిజయం సాధిస్తుందని ఈ పోలింగ్‌కు ముందే అక్కడి ప్రజలకూ మిగతా ప్రపంచానికీ తెలుసు. ప్రజాస్వామ్యవాది, నోబెల్ విజేత ఆంగ్‌సాన్‌సూకీని గృహనిర్బంధంలో ఉంచి, పలు కేసుల్లో ఏళ్ళతరబడి శిక్షలు వేసి, 2023లో ఆమె పార్టీ ‘నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ’ (ఎన్‌ఎల్‌డి)ని రద్దుచేసిన సైన్యం ప్రస్తుతం ఆ పార్టీ లేకుండా ఈ ఎన్నికల తతంగం నిర్వహిస్తోంది కనుక మయన్మార్ ప్రజలకే కాదు, అంతర్జాతీయ సమాజానికి కూడా వీటిపై నమ్మకం లేదు. ఎంతో స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగాయని మిగతా ప్రపంచమంతా మెచ్చుకున్న గత ఐదేళ్ళనాటి ఎన్నికలను మయన్మార్ సైన్యం ఏడాదిలోనే తప్పుబట్టి, ఘనవిజయం సాధించిన సూకీని నిర్బంధంలోకి నెట్టింది. అప్పుడున్న పార్టీల్లో ఇప్పుడు సగం కూడా అక్కడ మిగల్లేదు.
సూకీని అధికారం నుంచి దించివేసిన తరువాత రేగిన అంతర్యుద్ధాన్ని నియంత్రించడం సైనిక ప్రభుత్వానికి సాధ్యపడటం లేదు. చైనా ఆర్థిక, ఆయుధసాయంతో ఇప్పుడిప్పుడే కాస్తంత పైచేయి సాధిస్తున్న జుంటాకు పాశ్చాత్య ప్రపంచం నుంచి కాకున్నా పొరుగుదేశాలనుంచి వస్తున్న వ్యతిరేకతను తట్టుకోవడానికి ఈ అబద్ధాల ఎన్నికలు ఉపకరిస్తాయి. సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న త్రీ బ్రదర్‌హుడ్ అలయెన్స్ (టీబీఏ) కూడా చైనా ఒత్తిడికి లొంగి, తన అధీనంలో ఉన్న ప్రాంతాలను క్రమంగా వదులుకుంటోందని వార్తలు వస్తున్నాయి. అయినా, రఖైన్, కరేన్, చిన్ తదితర రాష్ట్రాల్లో జుంటాకు ఇప్పటికీ పట్టులేదు. ఒక లెక్క ప్రకారం దేశంలో సగం మాత్రమే దాని అధీనంలో ఉన్నది. ఈ నేపథ్యంలో, ప్రజాస్వామ్యం ముసుగులో తామే మళ్ళీ అధికారంలోకి వస్తున్నందున తిరుగుబాటుదారులను అణచివేయడం సైనిక ప్రభుత్వానికి ఇకపై మరింత సులభవుతుంది. చట్టసభలో నాలుగోవంతు స్థానాలు తమ అధీనంలోనే ఉండేట్టుగా రాజ్యాంగాన్ని ఎప్పుడో తిరగరాసుకున్న సైన్యానికి తమకు వ్యతిరేకంగా తలెగరేసినవారిని గద్దెదించేయడం ఏ క్షణమైనా సాధ్యమే. ఈ ఎన్నికలు దేశంలో శాంతిని ప్రతిష్ఠించబోవని, యుద్ధాన్ని తీవ్రతరం చేస్తాయని కెఎన్‌యు వంటి సాయుధగ్రూపులు విస్పష్టంగా చెబుతున్నాయి. ఐదేళ్ళక్రితం సూకీ ఎన్నికల బరిలో ఉన్నప్పటికీ, ఇప్పటికీ ప్రజల భాగస్వామ్యంలో హస్తిమశకాంతరం కనిపిస్తూనే ఉంది. ప్రజల సహకారం లేని అబద్ధపు ఎన్నికలు మరింత విధ్వంసాన్ని, వినాశనాన్ని సృష్టించిన చరిత్ర మయన్మార్ సైనిక పాలకులకు తెలియనిదేమీ కాదు.
ఇవి కూడా చదవండి..
బట్టలు లేకుండా తాగుతూ, తూగుతూ.. బ్రిటన్‌లో వెరైటీ న్యూ ఇయర్ పార్టీ..
మీ కళ్లు పవర్‌ఫుల్ అయితే.. ఈ Qల మధ్యలో O ఎక్కడుందో 15 సెకెన్లలో కనిపెట్టండి..
Updated Date - Dec 30 , 2025 | 05:09 AM