Climate Justice: వాతావరణ న్యాయం
ABN, Publish Date - Aug 14 , 2025 | 02:53 AM
వాతావరణ మార్పును అన్ని దేశాలూ తమ శక్తి మేరకు ఎదుర్కోవాలని 15 మంది న్యాయమూర్తుల అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసిజె) ఏకగ్రీవంగా ఇటీవల సలహాపూర్వక అభిప్రాయాన్ని ప్రకటించింది. వాతావరణ మార్పు...
వాతావరణ మార్పును అన్ని దేశాలూ తమ శక్తి మేరకు ఎదుర్కోవాలని 15 మంది న్యాయమూర్తుల అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసిజె) ఏకగ్రీవంగా ఇటీవల సలహాపూర్వక అభిప్రాయాన్ని ప్రకటించింది. వాతావరణ మార్పు నిరోధక చర్య అంతర్జాతీయ న్యాయ నియమాలకు నిబద్ధమై ఉండే చట్టపరమైన విధి అని ఐసిజె స్పష్టం చేసింది. వాతావరణ మార్పు కారణాలు, ప్రభావాలను అర్థం చేసుకోవడానికి ఐపీసీసీ అంచనాలు ప్రమాణమయినట్టుగానే వాతావరణ మార్పు వైపరీత్యాలను అదుపుచేయడంలో ప్రపంచ దేశాల కార్యాచరణ లేదా క్రియాశూన్యతను అంచనా వేసేందుకు తన సలహాపూర్వక అభిప్రాయం ఒక స్పష్టమైన ప్రాతిపదిక అని ఐసిజె నిర్దేశించింది. పారిస్ ఒప్పందం ప్రకారం భూతాపాన్ని పారిశ్రామిక యుగ పూర్వ స్థాయిల కంటే 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్‌కు తగ్గించాలనే లక్ష్యం చట్ట బద్ధమైనదని అంతర్జాతీయ న్యాయస్థానం ధ్రువీకరించింది. ఈ ఏడాది తొలినాళ్లలో అమెరికా ఆ ఒప్పందం నుంచి వైదొలిగింది. అయినప్పటికీ అమెరికా తాను భాగస్వామిగా ఉన్న ఇతర అంతర్జాతీయ ఒడంబడికల ప్రకారం తమ వల్ల పర్యావరణానికి జరుగుతున్న హానికి బాధ్యత వహించాల్సిందేనని ఐసిజె స్పష్టం చేసింది. మానవ కార్యకలాపాల మూలంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, సంభవిస్తున్న విపరీత వాతావరణ సంఘటనలు జీవ వైవిధ్యాన్ని హరించివేస్తూ మానవుడితో సహా సకల జీవకోటి అస్తిత్వానికి ఎనలేని హాని కలిగిస్తున్నాయని ఐసిజె పేర్కొంది. హరిత గృహ వాయు ఉద్గారాల కారణంగా తీవ్రమవుతున్న భూతాపం నుంచి ధరిత్రి వాతావరణ వ్యవస్థలను, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు సకల దేశాల బాధ్యత అని నొక్కి చెప్పింది. వాతావరణ మార్పుపై అంతర్జాతీయ న్యాయస్థాన ఏకగ్రీవ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా విధాన నిర్ణేతలలోను, పర్యావరణ పరిరక్షణ స్ఫూర్తి ఉన్న సామాన్య విద్యావంతులలోను ప్రధాన చర్చనీయాంశమయింది.
ఐక్యరాజ్యసమితి, దాని అనుబంధ సంస్థల అభ్యర్థన మేరకు నిర్దిష్ట విషయాలపై సలహాపూర్వక అభిప్రాయాన్ని ప్రకటించడం ఐసిజెకు పరిపాటి. ఈ సలహాకు ఏ దేశమూ కట్టుబడి ఉండవల్సిన అవసరం లేదు అయితే అంతర్జాతీయ చట్టం కింద ఒక నిర్దిష్ట సమస్య పరిష్కారానికి ఎటువంటి చర్యలు చేపట్టాలనే దాన్ని ఈ సలహాపూరిత అభిప్రాయం ప్రతిబింబిస్తుంది. కట్టుబడి ఉండవల్సిన అవసరం లేనప్పటికీ ఐసిజె సలహాకు శాసనిక మాన్యత, నైతిక అధికారం ఉన్నాయనే వాస్తవం విస్మరింపలేనిది. వాతావరణ మార్పు సమస్య పరిష్కారానికి జాతీయ ప్రభుత్వాలు చట్టబద్ధంగా చేపట్టవలసిన చర్యలేమిటి? ఆ విధులను అవి నిర్వర్తించకపోతే పర్యవసానాలు ఏమిటి అని ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ నివేదించిన ప్రశ్నలకు ప్రతిస్పందనగా ఐసిజె పై సలహాపూర్వక అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ప్రతి వ్యక్తీ మానవ హక్కులను సంపూర్ణంగా పొందేందుకు నిర్మలమైన, ఆరోగ్యకరమైన, సుస్థిర పర్యావరణం తప్పనిసరి అని, ఈ దృష్ట్యా వాతావరణ వ్యవస్థలు, ఇతర పర్యావరణ విభాగాలను పరిరక్షించకుండా ప్రతి వ్యక్తికీ మానవ హక్కులు సమకూరేలా చేయడం అసాధ్యమవుతుందని ఐసిజె స్పష్టం చేసింది. పర్యావరణ వ్యవస్థలను కేవలం ‘వనరులు’గా కాకుండా వాతావరణ భాగస్వాములుగా గుర్తించాలని ఆదేశిస్తూ వాతావరణ మార్పుకు శాశ్వత, సంతృప్తికర పరిష్కారానికి మానవ సంకల్పం, విజ్ఞత అవసరమని ఐసిజె తన తీర్పును కవితాత్మకంగా ముగించింది.
మానవాళి ఉమ్మడి భవిష్యత్తుకు భద్రత సమకూర్చడానికి ఉద్దేశించిన ఈ దార్శనిక న్యాయ నిర్ణయం 2019లో పసిఫిక్ దీవి దేశమైన వనువాటులో 27 మంది న్యాయశాస్త్ర విద్యార్థులు ప్రారంభించిన ఉద్యమ విజయం. వాతావరణ మార్పు దుష్ర్పభావాలకు తీవ్రంగా ప్రభావితమవుతున్న వనువాటు విజ్ఞప్తి మేరకు ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ ఐసిజె అభిప్రాయాన్ని కోరింది. పాశ్చాత్య దేశాలు అంతకంతకూ వాతావరణ వ్యతిరేక వైఖరి వహిస్తున్న తరుణంలో వెలువడిన ఈ అభిప్రాయం ‘ధరిత్రి’ విజయంగా భావిస్తున్నారు. ‘సమస్త వాతావరణ మార్పు నిరోధక విధానాలకు పారిస్ ఒప్పందం లక్ష్యాలే ప్రాతిపాదిక కావాలన్న విషయాన్ని ఐసిజె తీర్పు ధ్రువీకరించింది. ఇది మన ధరిత్రికి, వాతావరణ న్యాయానికి, ప్రపంచ పరిస్థితులను మార్చడంలో యువజనుల శక్తి సామర్థ్యాలకు మహా విజయమని’ ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుట్టెర్స్ ప్రశంసించారు. ‘ప్రపంచం ప్రతిస్పందించాలి’ అని ఆయన పిలుపునిచ్చారు. మరి వనువాటు విద్యార్థుల ఉద్యమం మన విద్యార్తి, యువజన సంఘాలు, ముఖ్యంగా యువ న్యాయవాదులకు స్ఫూర్తి కావాలని అందరమూ కోరుకోవాలి.
ఈ వార్తలు కూడా చదవండి..
సోనియా గాంధీ లక్ష్యంగా సంచలన ఆరోపణలు..
రిమాండ్ పొడిగింపు.. కోర్టు వద్ద చెవిరెడ్డి హల్‌చల్
For More National News And Telugu News
Updated Date - Aug 14 , 2025 | 02:53 AM