విపక్షాలకు ఉప శమనం
ABN, Publish Date - Jun 25 , 2025 | 06:02 AM
సర్వసాధారణంగా అధికారంలో ఉన్న పార్టీయే ఉపఎన్నికల్లో విజయం సాధిస్తూంటుంది కనుక పోలింగ్ సరళిమీద కానీ, ఫలితాలమీద కానీ ఎవరికీ అంత పట్టింపు ఉండదు. అయితే, నాలుగు రాష్ట్రాల్లోని ఐదు అసెంబ్లీస్థానాల్లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల మీద చర్చ...
సర్వసాధారణంగా అధికారంలో ఉన్న పార్టీయే ఉపఎన్నికల్లో విజయం సాధిస్తూంటుంది కనుక పోలింగ్ సరళిమీద కానీ, ఫలితాలమీద కానీ ఎవరికీ అంత పట్టింపు ఉండదు. అయితే, నాలుగు రాష్ట్రాల్లోని ఐదు అసెంబ్లీస్థానాల్లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల మీద చర్చ జరుగుతూండటానికి కొన్ని ప్రత్యేక కారణాలున్నాయి. ఈ నెల 19న జరిగిన ఈ ఉపఎన్నికల్లో గుజరాత్‌లోని కడిస్థానాన్ని మాత్రమే అధికారపక్షమైన బీజేపీ నిలబెట్టుకుంటే, ఈ రాష్ట్రంలోని విసావదర్, పంజాబ్‌లోని పశ్చిమ లూథియానా స్థానాలను ఆమ్‌ఆద్మీపార్టీ గెలుచుకుంది. కేరళ నిలంబూర్ స్థానాన్ని అధికార ఎల్‌డిఎఫ్ నుంచి కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ సాధించుకుంది. పశ్చిమబెంగాల్‌లో కాళీగంజ్‌ను తృణమూల్ యాభైవేల పైచిలుకు ఓట్లతో నిలబెట్టుకుంది. ఈ ఏడాది చివర్లో బిహార్‌లోనూ, వచ్చే ఏడాది మొదట్లో పశ్చిమబెంగాల్, కేరళ రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో, ఈ ఉప ఎన్నికల ఫలితాలు విపక్షపార్టీలకు ఏ మాత్రం ఉత్సాహాన్నిచ్చాయన్నది ముఖ్యం. ఢిల్లీలో ఘోరంగా ఓడిన తరువాత, ఆమ్ ఆద్మీపార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు ఈ ఉపఎన్నికల్లో రెండుస్థానాలు దక్కడం విశేషం. గుజరాత్‌లో కడి నిలబెట్టుకున్నప్పటికీ, విసావదర్‌లో ఓడిపోవడం ఎంతకాదనుకున్నా బీజేపీకి అవమానకరమైన విషయమే. మోదీ రాష్ట్రంలో సాధించిన ఈ విజయం ఆప్ నైతికస్థైర్యాన్ని పెంచింది. తన బలమైన ఉనికికి ఇది ప్రబలనిదర్శనమని ఆప్ చెప్పుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 17స్థానాలు నెగ్గిన కాంగ్రెస్‌నుంచి అనంతరం ఐదుగురు బీజేపీకి తరలిపోతే, ఐదుగురు నెగ్గిన ఆప్‌నుంచి ఒక్కరు మాత్రమే జంప్ చేశారు. ఇప్పుడు ఆ స్థానాన్ని సైతం ఆప్ తిరిగి సాధించడం విశేషం. పాటిదార్ ఉద్యమంలో కీలకపాత్ర వహించిన గోపాల్ ఇటాలియా ఆప్ కు ఈ విజయాన్ని అందించారు.
గుజరాత్‌లో బీజేపీ కంచుకోటలను బద్దలుకొట్టలేకపోయినా, కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకును తనవైపు తిప్పుకుంటూ బలమైన విపక్షంగా అవతరిస్తానని నమ్ముతున్న ఆప్‌కు ఈ విజయం మహదానందకరంగా ఉంది. అధికారంలో ఉన్నది తామే అయినా, పంజాబ్‌లోని లూథియానా (పశ్చిమ) విజయం కూడా కేజ్రీవాల్ పార్టీకీ, అప్రదిష్టపాలైన మాన్ ప్రభుత్వానికీ పెద్ద ఉపశమనం. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సునీల్ జాఖడ్‌ను రాష్ట్రశాఖ శాఖ అధ్యక్షుడిగా తెచ్చిన బీజేపీ ఈ స్థానం కోసం బలంగా పోరాడినా ఫలితంలేకపోయింది. దాని మాజీ మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ నాలుగోస్థానంలో నిలవడం మరో ఆశ్చర్యం. గుజరాత్‌లో గట్టి దెబ్బతిన్న కాంగ్రెస్‌కు కేరళ నిలంబూర్‌లో ఉపశమనం దక్కింది. యూడీఎఫ్ పని అయిపోయిందన్న ప్రచారానికి ఈ ఫలితం అడ్డుకట్టవేసింది. బలమైన స్థానికనాయకత్వం లేక, అంతర్గతపోరుతో తీసుకుంటున్న కాంగ్రెస్‌కు ఈ విజయం ఉత్సాహాన్నిస్తే, వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు పోతున్న తరుణంలో ఎల్‌డీఎఫ్‌కు ఇది ఎదురుదెబ్బ. తనపాలనకు మంచిమార్కులు పడుతున్నాయని, ప్రజల్లో వ్యతిరేకత లేదంటున్న పినరయ్ విజయన్‌కు ముందస్తు పరీక్ష. ఐదుస్థానాల్లోనూ ఒక్కటి మాత్రమే గెలుచుకున్న బీజేపీ ఈ ఫలితాలను ఇప్పట్లో మరిచిపోలేదు. గుజరాత్‌లో, అదీ కంచుకోట కడిలో గెలవడం వినా, విసావదర్‌లో ౧8వేల ఓట్ల తేడాతో ఓడిపోవడం, మిగతాచోట్ల పనితీరు మరీ పేలవంగా ఉండటం గమనార్హం. పశ్చిమ లూధియానాలో మూడోస్థానంలో అదీ సుదూరంగా మిగిలిపోవడం కంటే, పశ్చిమబెంగాల్ కాళీగంజ్‌లో యాభైవేల ఓట్ల తేడాతో తృణమూల్ చేతిలో ఓడిపోవడం పెద్ద అవమానం. ఎన్నికల ఫలితాల తరువాత తృణమూల్ విజయోత్సవ ర్యాలీ హింసాయుతంగా మారడం, రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ఎంత ఉద్రిక్తంగా ఉండబోతున్నాయనడానికి సంకేతం. ఐదేళ్ళక్రితం 77స్థానాలతో ప్రధానప్రతిపక్షంగా అవతరించిన బీజేపీ ఈ మారు అధికారంలోకి రావడం ఖాయమని నమ్ముతోంది. ‘ఆట మళ్ళీ మొదలవుతోంది’ అన్న నినాదంతో ప్రతీ అంశంమీదా బలమైన బీజేపీ వ్యతిరేక పోరాటంతో ఎన్నికలకు ఏడాది ముందునుంచే ప్రచారాన్ని ప్రారంభించిన మమతకు ఈ ఫలితం పెద్ద ఉపశమనం. స్థానిక అంశాలే ఉపఎన్నికల ఫలితాలను అధికంగా ప్రభావితం చేస్తాయన్నది నిజమే అయినప్పటికీ, ఒకే ఒక్క స్థానాన్ని గెలుచుకొని, మిగతా నాలుగింటినీ ఇండియాబ్లాక్‌కు ఇచ్చినందుకు బీజేపీకి కొంతకాలం కలతనిద్ర తప్పదు.
ఈసారి ‘పరోపకార్’లో ఇండియా ఫైన్ ఆర్ట్స్ గ్యాలరీకి చెందిన చిత్రాలు, తోట వైకుంఠం, లక్ష్మణ్ ఏలే, బదరీనాథ్, శక్తి వర్మ, లక్ష్మాగౌడ్, సచిన్ జల్దారే, రమేష్ గురజాల, లాలూ ప్రసాద్ షా తదితరుల పెయింటింగ్స్‌ను ప్రదర్శించారు.
ఇవీ చదవండి:
హార్ముజ్ జలసంధి మూసివేస్తే.. భారత్ తట్టుకోగలదా
మరోసారి మైక్రోసాఫ్ట్‌లో లేఆఫ్స్.. వేలల్లో తొలగింపులు ఉంటాయంటూ కథనాలు వైరల్
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 25 , 2025 | 06:02 AM