ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bihar Elections 2025: బిహార్‌ చిత్రాలు

ABN, Publish Date - Oct 22 , 2025 | 12:20 AM

అధికారంలోకి వస్తామన్న నమ్మకం లేకనే రాష్ట్రీయ జనతాదళ్‌ అధినేత తేజస్వి యాదవ్‌ అంత భారీస్థాయి ప్రభుత్వ ఉద్యోగాలకు హామీ ఇచ్చారని బీజేపీ నాయకులు అంటున్నారు. యువత ఆశలూ, ఆందోళనలు....

అధికారంలోకి వస్తామన్న నమ్మకం లేకనే రాష్ట్రీయ జనతాదళ్‌ అధినేత తేజస్వి యాదవ్‌ అంత భారీస్థాయి ప్రభుత్వ ఉద్యోగాలకు హామీ ఇచ్చారని బీజేపీ నాయకులు అంటున్నారు. యువత ఆశలూ, ఆందోళనలు ఎన్నికల ఫలితాలను కచ్చితంగా ప్రభావితం చేస్తాయి కనుక, ఉద్యోగం, ఉపాధి గురించి ఎన్నికల వేళల్లో నాయకులు బోలెడన్ని హామీలు గుప్పించడం సహజమే. అయితే, తేజస్వి ప్రకటన సాధారణమైనది కాదు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20రోజుల్లోనే, రాష్ట్రంలోని ప్రతీ ఇంటికీ ఒక ప్రభుత్వోద్యోగం ఇస్తానని ప్రకటించాడు. ఒక్క గవర్నమెంట్‌ ఉద్యోగి కూడా లేని కుటుంబాలకు మాత్రమే ఈ హామీ వర్తిస్తుందని ఆయన పేరుకు ఓ మెలికపెట్టినప్పటికీ, మరో ఇరవైనెలల్లో రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగి లేని కుటుంబం ఒక్కటంటే ఒక్కటి కూడా ఉండబోదని ఆయన ప్రకటించాడు. బిహార్‌లో 2022–23 సర్వే ప్రకారం 2.76 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. కేంద్రప్రభుత్వ ఉద్యోగస్తులతో కలిపి, మొత్తంగా రాష్ట్రంలో 20.5 లక్షలమంది ప్రభుత్వోద్యోగులు ఉన్నారు. వీరంతా వేర్వేరు కుటుంబాలవారని లెక్కవేసుకున్నా, రేపు తేజస్వి అధికారంలోకి రాగానే ఇంకా ౨.55కోట్ల కుటుంబాలకు, అంటే ఇప్పుడున్నదానికి పదమూడురెట్లు ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటుంది. బిహార్‌ ప్రభుత్వం ఇప్పటికే తన ఉద్యోగుల వేతనాలకు ఏటా యాభైఒక్కవేల కోట్లు ఖర్చుచేస్తున్నది కనుక, తేజస్వి ప్రతీ కుటుంబానికీ ఓ సర్కారీ కొలువు ఇచ్చి, జీతాలకు ఇకపై ఏటా ఆరున్నరలక్షలకోట్ల పైచిలుకు ఖర్చుచేయాల్సి ఉంటుంది. ఇంతా చేసి, బిహార్‌ బడ్జెట్‌ ౩.16లక్షల కోట్లే. గత రెండేళ్ళలో రెండులక్షల ఉద్యోగాలు మాత్రమే ఇవ్వగలిగిన రాష్ట్రంలో తేజస్వి హామీ ఎంతమాత్రం ఆచరణ సాధ్యం కాదని నిరూపించడానికి ప్రయత్నిస్తున్నవారు ఇంకా ఏవేవో లెక్కలు విప్పుతున్నారు‍ కానీ, బిహార్‌ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇటువంటి వాగ్దానాలు, విన్యాసాలు ఇంకా ఎన్నెన్నో చూడవలసి ఉంటుంది.

రెండు విడతల్లో ఎన్నికలు జరగబోతున్న బిహార్‌లో మలిదశ నామినేషన్లు, పరిశీలనలు, తిరస్కారాలు మంగళవారం పూర్తయ్యాయి. దరఖాస్తుల ఉపసంహరణకు 48 గంటల గడువుమాత్రమే ఉన్నందున, తేలని తగవులు, పంచాయితీలతో అన్ని పార్టీలూ సతమతమవుతున్నాయి. కుటుంబపాలన, రాచరికపాలన అంటూ ప్రధాని నరేంద్రమోదీ సహా బీజేపీ పెద్దలంతా విపక్షాలను ఎగతాళి చేస్తుంటారు. విపక్షనేతలంతా ప్రజాస్వామ్య విలువల గురించి తెగ బాధపడిపోతూంటారు. కానీ, బిహార్‌లో వారూ వీరూ అని తేడాలేకుండా అన్ని పార్టీలూ పెద్దసంఖ్యలో కుటుంబీకులకే టిక్కెట్లు పంచాయి. ఈ విషయంలో కేంద్రమంత్రి, హిందుస్థానీ ఆవామీ మోర్చా అధినేత జితన్‌రామ్‌ మాంఝీ అగ్రస్థానంలో ఉన్నారట. సామాన్యుడిని అందలం ఎక్కిస్తానని, సాధారణ కార్యకర్తను మంత్రిని చేస్తానని ప్రతిజ్ఞలు చేసి, బిహార్‌ ఎన్నికల బరిలోకి దిగిన ప్రశాంత్‌ కిషోర్‌ సైతం రాజకీయకుటుంబాలనే నమ్ముకొని, వారసులకే టిక్కెట్లు పంచవలసి వచ్చిందట. పుత్రరత్నాలు, సతీమణులు, సన్నిహిత బంధువులతో బిహార్‌ ఎన్నికల క్షేత్రం కళకళలాడుతోంది.

బిహార్‌ ఎన్నికల్లో ‘మహాగడ్బంధన్‌’లో భాగంగా తనకు సీట్లు కేటాయించకుండా, ఆర్జేడీ, కాంగ్రెస్‌ కుట్రపన్నాయనీ, ప్రతీకారంగా ఆరుస్థానాల్లో తాను ఒంటరిగా పోటీచేస్తానని ప్రకటించిన జార్ఖండ్‌ ముక్తి మోర్చా చివరకు బరిలో నుంచే తప్పుకుంది. ఇది కూడా, ఫ్రెండ్లీవార్‌లో భాగమేనన్న విశ్లేషణలను అటుంచితే, విపక్ష ఇండియా కూటమిలో లుకలుకలు, సీట్ల పంపకాల్లో విభేదాలు క్షేత్రస్థాయిలో ఏ విధమైన ప్రభావం చూపుతాయో తెలియదు. కూటమి ఐక్యతను పక్కనబెట్టి, ఆర్జేడీ, కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు స్నేహపూర్వక పోటీలకు సిద్ధపడుతున్నాయి. అభ్యర్థుల జాబితాలను విడుదల చేయకుండా నేరుగా వారితో నామినేషన్లు వేయించడం వంటి విన్యాసాలకు ఆర్జేడీ పాల్పడింది. ‘ఇండియా’ కూటమిలో వైరాలు ఎన్డీయేకు ఉపకరించవచ్చునన్న విశ్లేషణలతో పాటు, ప్రశాంత్‌ కిషోర్‌ జన్‌సురాజ్‌ పార్టీ అధిక స్థానాలు నెగ్గకపోయినా, ఎన్డీయేకు అధికంగా నష్టంచేయవచ్చునన్న వ్యాఖ్యలు వినబడుతున్నాయి. ఉద్యోగ ఉపాధులు, మౌలిక సదుపాయాలు ఎన్నికల్లో ముఖ్యమే అయినప్పటికీ, కులం అంతకంటే ప్రధానంగా పనిచేయడం బిహార్‌ ప్రత్యేకత. కేవలం ఐదునెలల్లో సంక్షేమం పేరిట ముప్పైవేలకోట్ల రూపాయలు ఖర్చుచేసి, మరిన్ని వేలకోట్ల రూపాయల పథకాలు, ప్రారంభోత్సవాలు జరిపిన ఎన్డీయే ఈ మారు ఏ మేరకు లబ్ధిపొందుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

సీఎం నియోజకవర్గం నుంచి రసవత్తర పోటీ

విధ్వంసం సృష్టించిన సౌతాఫ్రికా.. పాక్ ముందు భారీ లక్ష్యం

Updated Date - Oct 22 , 2025 | 12:20 AM