విహారం విషాదం కారాదు
ABN, Publish Date - Jun 19 , 2025 | 04:23 AM
ఇటీవల కాలంలో చెరువులు, నదులలో ఈతకు దిగి పదుల సంఖ్యలో పిల్లలు చనిపోతున్నారు. గత రెండు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా చాలా మంది మరణించారు. అలాగే వాగులు, చెరువు గట్లు...
ఇటీవల కాలంలో చెరువులు, నదులలో ఈతకు దిగి పదుల సంఖ్యలో పిల్లలు చనిపోతున్నారు. గత రెండు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా చాలా మంది మరణించారు. అలాగే వాగులు, చెరువు గట్లు, సముద్ర తీరాల్లో సెల్ఫీల మోజులో పడి మృత్యువు బారిన పడుతున్నారు. చిన్న పిల్లలయితే పొరబాటున నీళ్లలోకి తెలియక వెళ్లారు అనుకోవచ్చు. కానీ 18 ఏళ్ళు దాటినవారు కూడా ప్రమాదాల బారినపడి మరణిస్తున్నారు. విహారయాత్రల్లో నదీ స్నానాలు విషాదయాత్రలుగా మారుతున్నాయి. ఇటీవల విదేశాలకు చదువు, ఉద్యోగాల నిమిత్తం వెళ్లిన తెలుగువారు కూడా అక్కడ నదుల్లో ప్రమాదాల బారినపడి మరణిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా యువకులు, చదువుకున్నవారు నీటిని చూడగానే ఉబలాటపడి... లోతు, ప్రవాహపు వడి పట్ల అంచనా లేకుండా ఈతకు దిగి మరణిస్తూ తల్లిదండ్రులకు గుండెకోత పెడుతున్నారు.
ప్రమాదం జరిగిన తరువాత ఆ ప్రాంతాల్లో అధికారులు హెచ్చరిక బోర్డులు, గస్తీ పెట్టడం లేదని, అలాగే మునిగిన వ్యక్తుల శరీరాలను త్వరగా వెలికితీయడం లేదని పిల్లల తల్లిదండ్రులు ఆగ్రహం వెలిబుచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. విహారయాత్రకి వెళ్లే పిల్లలకు చెరువులు, వాగులు, కాలువల వద్ద జాగ్రత్తగా ఉండాలని తల్లిదండ్రులు చెప్పాలి. పత్రికల్లో ఈతకు దిగి మరణించిన వార్తలు విద్యార్థులకు చూపుతూ ఉపాధ్యాయులు, లెక్చరర్లు హెచ్చరించాలి.
విహార యాత్ర ఆనందంగా చేయాలి కాని, కన్నవాళ్లకు కడుపు కోత మిగల్చకూడదని, విలువైన జీవితాన్ని కాపాడుకోవాలని సూచించాలి. ఒకవేళ ఈత వచ్చినా కొత్త ప్రాంతంలో తగిన జాగ్రత్తలు లేకుండా నీటిలోకి దిగే సాహసం చేయొద్దని హితవు చెప్పాలి. ప్రభుత్వం కూడా టీవీ, సినిమాల్లో సెలబ్రిటీలతో ప్రకటనల ద్వారా చెప్పించాలి.
మారిశెట్టి జితేంద్ర, రాజమహేంద్రవరం
ఈ వార్తలు కూడా చదవండి..
హీరో ఫిన్‌కార్ప్ రూ 260 కోట్ల సమీకరణ
మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..
For National News And Telugu News
Updated Date - Jun 19 , 2025 | 04:23 AM